నాడుల పునరుజ్జీవంతో తిరిగి నడక!

వెన్నుపాము పాక్షికంగా దెబ్బతింటే ప్రాథమికంగా ఆయా అవయవాలు చచ్చుబడతాయి. నాడులు మరమ్మతు అవుతున్నకొద్దీ తిరిగి కదలికలు వస్తాయి.

Published : 26 Sep 2023 01:14 IST

వెన్నుపాము పాక్షికంగా దెబ్బతింటే ప్రాథమికంగా ఆయా అవయవాలు చచ్చుబడతాయి. నాడులు మరమ్మతు అవుతున్నకొద్దీ తిరిగి కదలికలు వస్తాయి. అయితే వెన్నుపాము పూర్తిగా దెబ్బతింటే మాత్రం నాడులు సహజంగా మరమ్మతయ్యే ప్రక్రియ సాగదు. కోలుకోవటం అసాధ్యమవుతుంది. ఒకవేళ తీవ్ర గాయాల అనంతరం కదలికలు తిరిగి రావాలంటే నాడీ పోచలు పునరుజ్జీవమయ్యే ప్రత్యేక చికిత్సలు అవసరం. కానీ కదలికలను తిరిగి తెప్పించే ఇలాంటి పద్ధతుల గురించి అంతగా తెలియదు. ఈ నేపథ్యంలో యూసీఎల్‌ఏ, స్విస్‌ ఫెడరల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ, హార్వర్డ్‌ యూనివర్సిటీ పరిశోధకుల అధ్యయనం కొత్త ఆశలు రేపుతోంది. ఇందులో వెన్నుపాము దెబ్బతిన్న తర్వాత తిరిగి కదలికలు రావటానికి తోడ్పడే కీలకమైన అంశం బయటపడటం విశేషం. నాడీ కణాలు ఇష్టమొచ్చినట్టుగా కాకుండా ఆయా భాగాలకు చేరుకునేలా వాటిని తిరిగి వృద్ధి చేయగలిగితే మంచి ఫలితం కనిపిస్తున్నట్టు పరిశోధకులు గుర్తించారు. నాడీ కణాలకు చిన్న పోచల వంటి భాగాలు (యాక్సన్స్‌) ఉంటాయి. ఇవి నాడీ కణాల మధ్య సమాచార మార్పిడికి తోడ్పడతాయి. వీటిని తిరిగి వృద్ధి చేయగల చికిత్సను ఐదేళ్ల క్రితమే కనుగొన్నారు. దీని సాయంతో యాక్సన్స్‌ను వృద్ధి చేసినప్పటికీ తిరిగి కదలికలను తెప్పించటం మాత్రం సవాల్‌గా నిలిచింది. అందుకే తాజా అధ్యయనంలో నాడీ పోచలను వాటి సహజ లక్ష్యాల దిశగా వృద్ధి చెందించటం మీద దృష్టి సారించారు. అధునాతన జన్యు విశ్లేషణ సాయంతో నాడీ కణాలను విభజించి, నడకకు తోడ్పడే వాటిని గుర్తించారు. వీటి నుంచి నాడీ పోచలను తిరిగి వృద్ధి చేసి, వెన్నుపాములో గాయమైన చోటుకు చేర్చగలిగారు. దీంతో ఎలుకలు తిరిగి నడిచేలా చేయటంలో శాస్త్రవేత్తలు విజయం సాధించారు. ఇది మున్ముందు వెన్నుపాము దెబ్బతిని, కదలికలు కోల్పోయినవారికి కొత్త చికిత్సల రూప కల్పనకు దారితీయగలదని ఆశిస్తున్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని