కండరాలకు ప్రొటీన్‌ బలం

మగవారిలో 30 ఏళ్లు దాటాక ప్రతి పదేళ్లకు 3-5% కండరాల మోతాదు తగ్గుతూ వస్తుంది. కండర పుష్టికి తోడ్పడే టెస్టోస్టీరాన్‌ హార్మోన్‌ సైతం 40 ఏళ్లు దాటాక క్రమంగా తగ్గుముఖం పడుతుంది.

Published : 01 Mar 2022 00:41 IST

గవారిలో 30 ఏళ్లు దాటాక ప్రతి పదేళ్లకు 3-5% కండరాల మోతాదు తగ్గుతూ వస్తుంది. కండర పుష్టికి తోడ్పడే టెస్టోస్టీరాన్‌ హార్మోన్‌ సైతం 40 ఏళ్లు దాటాక క్రమంగా తగ్గుముఖం పడుతుంది. అలాగని నిరాశ పడాల్సిన పనిలేదు. బరువులు ఎత్తటం వంటి వ్యాయామాలతో ఈ సహజ కండరాల క్షీణతను నెమ్మదింపజేసుకోవచ్చు. కండరాలను క్షీణతను వెనక్కి మళ్లించుకోవచ్చు కూడా. దీనికి తగినంత ప్రొటీన్‌ లభించేలా చూసుకుంటే మరింత మంచి ఫలితం కనిపిస్తుంది. జిమ్‌లలో వ్యాయామాలు చేసేవారు ఇటీవల ప్రొటీన్‌ పొడులను ప్రత్యేకంగా తీసుకోవటం చూస్తూనే ఉన్నాం. అయితే ఎంత ఎక్కువ ప్రొటీన్‌ తీసుకోవాలనేది ఆయా వ్యక్తులను బట్టి ఉంటుంది. శారీరక శ్రమ, వ్యాయామాలు చేయనివారికి రోజుకు తమ శరీర బరువులో ఒక కిలోకు కేవలం 0.8 గ్రాముల ప్రొటీన్‌ సరిపోతుంది. అయితే కండరాలు పెంచుకోవాలనుకుంటే మాత్రం 1.2 గ్రాముల వరకు తీసుకోవాల్సి ఉంటుంది. ఉదాహరణకు- 80 కిలోల బరువుండి, బరువులు ఎత్తే వ్యాయామాలు చేసేవారు రోజుకు సుమారు 95 గ్రాముల వరకు ప్రొటీన్‌ లభించేలా చూసుకోవాల్సి ఉంటుందని చెప్పుకోవచ్చు. రోజుకు అవసరమైన దాంట్లో 20-40% ప్రొటీన్‌ను వ్యాయామాలు చేశాక గంటలోపు తీసుకోగలిగితే కండరాలు ఇంకాస్త మెరుగ్గా, త్వరగా మరమ్మతయ్యేలా చూసుకోవచ్చు. మరి ఎంత ప్రొటీన్‌ తీసుకుంటున్నామనేది తెలుసుకోవటమెలా? తినే పదార్థాలను బట్టి ఉజ్జాయింపుగా లెక్కించుకోవచ్చు. సాధారణంగా 85 గ్రాముల చికెన్‌తో 24 గ్రాములు.. 225 గ్రాముల పెరుగుతో 23 గ్రాములు.. ఉడికించిన పప్పులతో (ఒక కప్పు) 18 గ్రాములు.. 85 గ్రాముల చేపలతో 17 గ్రాములు.. ఒక గుడ్డుతో 6.5 గ్రాములు.. 28 గ్రాముల వేరుశనగలతో 7 గ్రాముల ప్రొటీన్‌ లభిస్తుంది.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని