అమ్మాయిలకు టీకా అభయం

టీకా తీసుకుంటే అసలు రాకుండానే చూసుకోవచ్చు. పరీక్షలతో ముందుగానే ఆనవాళ్లను గుర్తించొచ్చు. ఆనవాళ్లు మొదలైనా క్యాన్సర్‌గా మారకుండా చూసుకోవచ్చు. ఒకవేళ క్యాన్సర్‌గా మారినా తొలిదశలోనైతే పూర్తిగా నయం చేసుకోవచ్చు కూడా.

Updated : 06 Feb 2024 07:06 IST

టీకా తీసుకుంటే అసలు రాకుండానే చూసుకోవచ్చు. పరీక్షలతో ముందుగానే ఆనవాళ్లను గుర్తించొచ్చు. ఆనవాళ్లు మొదలైనా క్యాన్సర్‌గా మారకుండా చూసుకోవచ్చు. ఒకవేళ క్యాన్సర్‌గా మారినా తొలిదశలోనైతే పూర్తిగా నయం చేసుకోవచ్చు కూడా. అయినా ఎంతోమంది మహిళలు బలైపోతుంటే? అంతకన్నా విషాదం ఏముంటుంది? గర్భాశయ ముఖద్వార (సర్వైకల్‌) క్యాన్సర్‌ విషయంలో మనదేశంలో ఇలాంటి పరిస్థితే నెలకొంది. మనదగ్గర మహిళల్లో అతి ఎక్కువగా కనిపిస్తున్న క్యాన్సర్లలో రెండోది అయినా దీనిపై పెద్దగా అవగాహన ఉండటం లేదు. ముందస్తు పరీక్షల కోసం ఎవరూ ముందుకు రావటం లేదు. చాలామందికి అసలు ఆ విషయమే తెలియటం లేదు. ఫలితంగా జబ్బు బాగా ముదిరిన తర్వాతే బయటపడుతోంది. మరణం అంచుల వరకు తీసుకెళ్తోంది. ప్రపంచవ్యాప్తంగా గర్భాశయ ముఖద్వార క్యాన్సర్‌తో చనిపోతున్నవారిలో సుమారు పావు వంతు మంది మనదేశానికి చెందినవారే కావటం గమనార్హం.  దీన్ని దృష్టిలో పెట్టుకునే కేంద్ర ప్రభుత్వం గర్భాశయ ముఖద్వార క్యాన్సర్‌ నివారణకు తోడ్పడే టీకాలను అమ్మాయిలకు ఇప్పించే ప్రక్రియను ప్రోత్సహించాలని నిర్ణయించింది. ఈ నేపథ్యంలో సర్వైకల్‌ క్యాన్సర్‌ తీరుతెన్నులు, నివారణ, టీకా ప్రాధాన్యం, చికిత్సల గురించి వివరంగా తెలుసుకుందాం.

క్యాన్సర్లలో గర్భాశయ ముఖద్వార క్యాన్సర్‌ కాస్త ప్రత్యేకమైంది. దీన్ని ఆరంభం కావటానికి ముందే గుర్తించొచ్చు. మరే క్యాన్సర్‌కూ ఇలాంటి అవకాశం లేదు. అయినా ముందే పట్టుకోలేకపోవటం పెద్ద లోపం. తొలిదశలో లక్షణాలు, బాధలేవీ లేకపోవటం వల్ల చాలామందికిది ఉన్నట్టయినా తెలియటం లేదు. ఎందుకంటే గర్భాశయ ముఖద్వార క్యాన్సర్‌ నెమ్మదిగా ముదురుతూ వస్తుంటుంది. లక్షణాలు కనిపించేసరికే తీవ్రమై ప్రాణాల మీదికి తెస్తుంది. ఒకింత జాగ్రత్త పడితే మరణాలను పూర్తిగా ఆపేయొచ్చు. టీకా తీసుకోవటం, పొగ అలవాటుకు దూరంగా ఉండటం, సురక్షితమైన శృంగారం ద్వారా గర్భాశయ ముఖద్వార క్యాన్సర్‌ను చాలావరకు నివారించుకోవచ్చు. క్రమం తప్పకుండా పాప్‌ స్మియర్‌ పరీక్ష చేయించుకోవటం ద్వారా ఆనవాళ్లను ముందే పట్టుకోవచ్చు. తగు చికిత్సలతో ముదరకుండా చూసుకోవచ్చు.

ఎందుకు?ఎలా వస్తుంది?

గర్భాశయ ముఖద్వార క్యాన్సర్‌ ప్రధానంగా.. ఇంకా చెప్పాలంటే 99% వరకూ అత్యధిక ముప్పుతో కూడిన హెచ్‌పీవీ ఇన్‌ఫెక్షతోనే వస్తుంది. దీనికి మూలం హ్యూమన్‌ పాపిలోమా వైరస్‌ (హెచ్‌పీవీ). ఇది చాలావరకు లైంగిక సంపర్కం ద్వారానే సంక్రమిస్తుంది. శృంగార జీవితం ఆరంభించిన సుమారు 70-80% మహిళల్లో ఇది కనిపిస్తుంది. హెచ్‌పీవీలో 150కి పైగా రకాలున్నాయి. వీటిల్లో హెచ్‌పీపీ 6, 11 వైరస్‌లు అంత ప్రమాదకరం కావు. ఇవి పులిపిర్ల వంటి మామూలు సమస్యలకు దారితీస్తాయి. అదే హెచ్‌పీవీ 16, 18 వైరస్‌లైతే ప్రమాదకరం. గర్భాశయ ముఖద్వార క్యాన్సర్‌కు చాలావరకు కారణం ఇవే.

అధిక ముప్పుగలవాటితోనే..

హెచ్‌పీవీ సోకినా కూడా అందరికీ ప్రమాదం కలిగించవు. మహిళలకు 35 ఏళ్లు వచ్చేసరికి 75-80% మందిలో తక్కువ ముప్పు కలిగించే వైరస్‌లన్నీ కనుమరుగవుతాయి. కొందరిలో ప్రమాదకరమైన వైరస్‌లు అలాగే ఉండిపోతాయి. ఇవి ఉన్నా అందరికీ క్యాన్సర్‌ రావాలనేమీ లేదు. చాలామందిలో దీర్ఘకాలిక ఇన్‌ఫెక్షన్‌గా మారిపోవచ్చు. అతి తక్కువ మందికే క్యాన్సర్‌గా మారొచ్చు. వీరిలో ముందుగా గర్భాశయ ముఖద్వార కణజాలం మీద కొన్ని మార్పులు (సర్వైకల్‌ ఇంట్రాఎపిథిలియల్‌ నియోప్లేసియా) తలెత్తుతాయి. దీన్నే క్యాన్సర్‌ ముందు దశ (ప్రిక్యాన్సర్‌) అంటారు. ఇందులోనూ మొదటి గ్రేడ్‌ పూర్తిగా తగ్గిపోతుంది. రెండో గ్రేడ్‌ మార్పులు మూడో గ్రేడ్‌కు చేరుకోవచ్చు. కొందరికి అక్కడితోనే ఆగిపోవచ్చు. మూడో గ్రేడ్‌ కూడా 50% వరకు తగ్గిపోతుంది. కాకపోతే పదేళ్లలో క్యాన్సర్‌గా మారే ప్రమాదముంది. అంటే గర్భాశయ క్యాన్సర్‌ను పదేళ్ల ముందే గుర్తించే అవకాశముందన్నమాట. ఇందుకు ముందస్తు పరీక్షలు బాగా ఉపయోగపడతాయి.
1. పాప్‌ స్మియర్‌: ఇది దూదిపుల్లతో గర్భాశయ ముఖద్వారం వద్ద నుంచి స్రావాలను తీసి చేసే పరీక్ష. నెలసరి తర్వాత దీన్ని చేయించుకోవటం మంచిది. నెలసరి నిలిచినవారైతే ఎప్పుడైనా చేయించుకోవచ్చు. పరీక్షకు ముందు రోజు లైంగిక సంపర్కానికి దూరంగా ఉండాలి. 45 ఏళ్లలోపు మహిళలకు కనీసం ఒక్కసారైనా పాప్‌ స్మియర్‌ పరీక్ష చేయగలిగితే 40-50% వరకు క్యాన్సర్‌ను తగ్గించొచ్చు.
2. వీఐఏ (విజువల్‌ ఇన్‌స్పెక్షన్‌ విత్‌ అసిటిక్‌ యాసిడ్‌) పరీక్ష: ఇది తేలికైనది. దీన్ని నర్సులు కూడా చేయొచ్చు. సాధారణంగా క్యాన్సర్‌ కణాలు చాలా వేగంగా వృద్ధి చెందుతుంటాయి. వీటిల్లో ప్రొటీన్‌ ఎక్కువగా ఉంటుంది. ఇలాంటి చోట్ల 3-5% అసిటిక్‌ యాసిడ్‌ను రాస్తే ఆ భాగమంతా తెల్లగా అవుతుంది. ఇది క్యాన్సర్‌ ముందు దశకు సూచిక కావొచ్చు. ఇలాంటి మార్పులు కనిపిస్తే పెద్ద ఆసుపత్రికి వెళ్లి పాప్‌ స్మియర్‌ పరీక్ష చేయించుకోవాల్సి ఉంటుంది.
3. హైబ్రిడ్‌ క్యాప్చర్‌: ఇది అధునాతన పరీక్ష. హెచ్‌పీవీ డీఎన్‌ఏ ఆధారంగా ప్రమాదకరమైన వైరస్‌ రకాలను గుర్తించటానికి తోడ్పడుతుంది. ఇలాంటి వైరస్‌లు లేకపోతే పెద్దగా భయమేమీ అవసరం లేదు. ఒకవేళ ఇవి ఉన్నట్టయితే దీర్ఘకాలిక ఇన్‌ఫెక్షన్‌గా భావించాల్సి ఉంటుంది. ఇది మున్ముందు క్యాన్సర్‌గా మారే అవకాశముంటుంది. నియోప్లేసియా మూడో గ్రేడ్‌లో ఉన్నవారిలో ఇలాంటి వైరస్‌లున్నట్టు తేలితే క్యాన్సర్‌ ముప్పు ఎక్కువగా ఉన్నట్టే.

తొలిదశలోనైతే పూర్తిగా నయం

గర్భాశయ ముఖద్వార క్యాన్సర్‌ను తొలిదశలోనే గుర్తిస్తే పూర్తిగా నయం చేయొచ్చు. కానీ మనదగ్గర చాలామంది బాగా ముదిరిన తర్వాతే వస్తుంటారు. ఇదే పెద్ద చిక్కుగా మారుతోంది. దీని మూలంగానే మరణాలు ఎక్కువవుతున్నాయి. జబ్బు ముదురుతున్నకొద్దీ చికిత్స కష్టమవుతూ వస్తుందని తెలుసుకోవాలి. గర్భాశయ ముఖద్వార క్యాన్సర్‌ను 0 నుంచి 4 దశలుగా వర్గీకరిస్తారు. వీటిల్లోనూ ఒకటో దశ నుంచి తీవ్రతను బట్టి ఏ, బీ, సీ అని ఉప రకాలుగా విభజిస్తారు కూడా. సున్నా దశలో క్యాన్సర్‌ మార్పులున్నా కణితి ఏర్పడదు. దీన్ని పూర్తిగా నయం చేయొచ్చు. 1ఏ దశలో 95 శాతానికి పైగా నయమవుతుంది. అదే 1బీ దశకు వచ్చేసరికి నయమయ్యే అవకాశం 80-70 శాతానికి పడిపోతుంది. ఈ తొలిదశల్లో క్రయోథెరపీ, లీప్‌ వంటి తేలికైన చికిత్సలతోనే నయమవుతుంది. వీటితో ఫలితం లేకపోతే శస్త్రచికిత్స చేసి గర్భాశయ ముఖద్వారం, గర్భసంచి, లింఫ్‌ గ్రంథులను తొలగిస్తే సమస్య అక్కడితోనే అంతమవుతుంది. క్యాన్సర్‌ 2బీ దశకు చేరుకున్నప్పటి నుంచీ చికిత్స కష్టమవుతుంది. వీరికి కీమో, రేడియేషన్‌ చికిత్సలు అవసరమవుతాయి. కొన్నిసార్లు 1బీ3 దశలోనూ ఇవి అవసరం. మూడో దశలోనైతే బతికి బట్టకట్టే అవకాశం 40-50 శాతమే. వీరికి శస్త్రచికిత్సకు అవకాశముండదు. కీమో, రేడియేషన్‌ చికిత్సలే ఉపయోగపడతాయి. ఇక క్యాన్సర్‌ బాగా ముదిరి నాలుగో దశకు చేరుకుంటే పెద్దగా చేయగలిగిందేమీ ఉండదు. ఆయా లక్షణాలను బట్టి ఉపశమన చికిత్స చేయటం తప్పించి మరో మార్గం లేదు. అవసరాన్ని బట్టి పాలియేటివ్‌ రేడియేషన్‌, కీమోథెరపీ చేస్తారు. నాలుగో దశకు చేరుకున్నాక మూత్రాశయానికి రంధ్రం పడే ప్రమాదముంది. కాబట్టి ముదరకుండా చూసుకోవటం మంచిది.


టీకాలు, పరీక్షలు, చికిత్స, పరిశుభ్రత

గర్భాశయ ముఖద్వార క్యాన్సర్‌ను చాలావరకు నివారించుకోవచ్చు. ఇందుకు టీకాలు, ముందస్తు పరీక్షలు, పరిశుభ్రత, క్యాన్సర్‌ ఆనవాళ్లు మొదలైతే తగు చికిత్స ఎంతగానో ఉపయోగపడతాయి. వీటిని దృష్టిలో పెట్టుకునే సుస్థిర అభివృద్ధి లక్ష్యాల్లో 90-70-90 సూత్రాన్ని నిర్దేశించారు. అంటే గర్భాశయ ముఖద్వార క్యాన్సర్‌ను గుర్తించే పాప్‌స్మియర్‌ ముందస్తు పరీక్ష (స్క్రీనింగ్‌) 90% మంది మహిళలకు చేయాలని.. 90% మందికి హెచ్‌పీవీ టీకాలు ఇవ్వాలని.. క్యాన్సర్‌ మార్పులు తలెత్తితే 70% మందికైనా చికిత్స అందించాలనేది దీని అర్థం. వీటితోనే క్యాన్సర్‌ను, క్యాన్సర్‌ మరణాలను చాలావరకు నివారించుకోవచ్చు. హెచ్‌పీవీ టీకాలు 95.8% వరకూ క్యాన్సర్‌ను, అదే క్యాన్సర్‌ ముందస్తు మార్పులనైతే నూటికి నూరు శాతం నిలువరిస్తున్నట్టు అధ్యయనాలు చెబుతున్నాయి.

ముందస్తు పరీక్షలు

సాధారణంగా 35 ఏళ్లు దాటగానే మహిళలంతా కనీసం ఒక్కసారైనా పాప్‌స్మియర్‌ పరీక్ష చేయించుకోవాలి. పాప్‌స్మియర్‌ పరీక్ష నార్మల్‌గా ఉన్నట్టయితే మూడేళ్ల తర్వాత మరోసారి పరీక్షించుకుంటే చాలు. ఒక్కసారి పరీక్ష చేయించుకున్నా కూడా 45% క్యాన్సర్లను నివారించుకోవచ్చు. కానీ మనదేశంలో కేవలం ఒక్క శాతం మందే ఈ పరీక్ష చేయించుకుంటున్నారు. పట్టణాల్లో కాస్త మెరుగ్గా ఉన్నా అదీ తక్కువే. దక్షిణ భారత పట్టణాల్లో 25-65 ఏళ్లు వయసువారిలో కేవలం 7.1% మందే జీవితంలో ఏదో ఒక్కసారి ఈ పరీక్ష చేయించుకుంటున్నారు. జబ్బు మీద అవగాహన లేకపోవటం, ముందస్తు పరీక్షల గురించి తెలియకపోవటం, తెలిసినా దీని ప్రాధాన్యాన్ని గుర్తించలేకపోవటం, వైద్య సదుపాయాల కొరత, బిడియం, నమ్మకాలు, సామాజిక, ఆర్థిక పరిస్థితుల వంటి రకరకాల కారణాలు మహిళలను వెనకడుగు వేసేలా చేస్తున్నాయి. మహిళలు పరీక్షకు సహకరించకపోవటమూ ప్రస్తుతం ఇబ్బందిగా మారుతోంది. యోని మార్గాన్ని తెరచి ఉంచి, గర్భాశయ ముఖద్వారాన్ని చూడటానికి తోడ్పడే స్పెక్యులమ్‌ పరికరాన్ని వాడటానికి ఇప్పుడు ఎంతోమంది అంగీకరించటం లేదు. దీంతో పాప్‌స్మియర్‌ పరీక్ష కోసం నమూనా తీయటం కష్టమవుతోంది. సొంతంగా ఎవరికివారే దూది పుల్లతో నమూనా తీసివ్వటం మీదే ఆధారపడాల్సి వస్తోంది.
* పాప్‌స్మియర్‌ పరీక్షలో కణాలను విశ్లేషిస్తారు. దీనికి అన్నిచోట్లా నిపుణులు అందుబాటులో లేకపోవచ్చు. అందుకే కనీసం హెచ్‌పీవీ పరీక్ష అయినా చేయించుకోవాలని ప్రపంచ ఆరోగ్యసంస్థ చెబుతోంది. ఇది పీసీఆర్‌ పరీక్ష. అత్యధిక ముప్పును తెచ్చిపెట్టే వైరస్‌లున్నట్టు ఇందులో తేలితే ముందే జాగ్రత్త పడొచ్చు.

టీకాలు రెండు

మనదేశంలో ప్రస్తుతం రెండు రకాల టీకాలు అందుబాటులో ఉన్నాయి. ఒక టీకా 4 వైరస్‌లను అడ్డుకుంటే, మరొకటి 9 వైరస్‌లను నిలువరిస్తుంది. వీటిల్లో ఏదైనా తీసుకోవచ్చు. హెచ్‌పీవీ ఇన్‌ఫెక్షన్‌ నివారణకు ప్రపంచవ్యాప్తంగా టీకాలను ఉపయోగిస్తున్నారు. అమ్మాయిలకే కాదు.. కొన్నిదేశాల్లో అబ్బాయిలకూ హెచ్‌పీవీ టీకా ఇస్తుండటం గమనార్హం. మనదేశంలో ఇంకా దీన్ని సార్వత్రిక టీకా కార్యక్రమంలో చేర్చలేదు. కానీ అమ్మాయిలకు ఇవ్వటాన్ని ప్రోత్సహించాలని కేంద్ర ప్రభుత్వం సంకల్పించటం ముదావహం. హెచ్‌పీవీ శృంగారం ద్వారా వ్యాపిస్తుంది కాబట్టి పెళ్లికి ముందే.. అంటే లైంగిక జీవితాన్ని ఆరంభించటానికి ముందే.. 9-15 ఏళ్ల వయసులోనే బాలికలకు టీకా ఇప్పించటం ఉత్తమం. ఈ వయసులోనైతే యాంటీబాడీలు ఎక్కువగా తయారవుతాయి. అదే 18 ఏళ్ల తర్వాత అయితే అంత త్వరగా యాంటీబాడీలు తయారుకావు. 9-15 ఏళ్లవారికైతే రెండు మోతాదులు చాలు. సంభోగం మొదలు పెట్టిన తర్వాత అయితే మూడు మోతాదులు తీసుకోవాలి. తొలి మోతాదు తీసుకున్న 8 వారాల తర్వాత మరో మోతాదు.. అనంతరం 6 నెలల తర్వాత ఇంకో మోతాదు తీసుకోవాలి. ఒక్క మోతాదుతోనూ మంచి ఫలితం కనిపిస్తున్నట్టు కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి. టీకా తీసుకున్నా కూడా పాప్‌స్మియర్‌ పరీక్ష వంటి జాగ్రత్తల విషయంలో నిర్లక్ష్యం తగదు.

మార్పులు మొదలైనా..

పరీక్షల్లో ఏవైనా మార్పులు కనిపిస్తే క్రమం తప్పకుండా పరిశీలిస్తూ క్యాన్సర్‌గా మారకుండా చూసుకోవచ్చు. ఇన్‌ఫెక్షన్‌ దశలో ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవటం, క్రమం తప్పకుండా వ్యాయామం చేయటం వంటివి పాటించినా మంచి ఫలితం కనిపిస్తుంది. సంభోగం అనంతరం రక్తస్రావం, దుర్వాసనతో కూడిన తెలుపు వంటి లక్షణాలు కనిపిస్తే మాత్రం వెంటనే అప్రమత్తం కావాలి.

నివారణ మీద దృష్టి

హెచ్‌పీవీ ఇన్‌ఫెక్షన్‌ తలెత్తినా ఇతరత్రా కారకాలు తోడైనప్పుడే క్యాన్సర్‌గా మారే అవకాశముంటుంది. కాబట్టి జాగ్రత్తలు అవసరం. జననాంగ పరిశుభ్రత చాలా చాలా ముఖ్యం. నెలసరి సమయంలో, మూత్ర విసర్జన తర్వాత శుభ్రతను విస్మరించరాదు. సిగరెట్లు కాల్చొద్దు. ఇంట్లోనూ ఎవరినీ కాల్చనీయొద్దు. ఎందుకంటే వారు వదిలే పొగను పీల్చటమూ ప్రమాదకరమే. సిగరెట్లు, చుట్టలు, బీడీలు తాగే మగవారి వీర్యం ద్వారానూ నికొటిన్‌ భాగస్వాములకు సంక్రమిస్తుంది. పెళ్లికి ముందు సంభోగంలో పాల్గొనకపోవటం మంచిది. హెచ్‌పీవీతోనే కాదు.. హెర్పిస్‌ వంటి సుఖవ్యాధులతోనూ క్యాన్సర్‌ ముప్పు పెరుగుతుంది కాబట్టి విచ్చలవిడి శృంగారం తగదు. అపరిచితులతో లైంగిక చర్యలో పాల్గొంటే కండోమ్‌ వంటి సురక్షిత సాధనాలు వాడుకోవాలి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని