పుట్టగొడుగు హుషార్‌!

మూడ్‌ బాగో లేదా? దిగులుగా, విచారంగా ఉంటున్నారా? అయితే ఆహారంలో కొన్ని పుట్ట గొడుగులు చేర్చుకొని చూడండి. ఇవి ఉత్సాహం, హుషారు పెరగటానికి తోడ్పడతాయి.

Published : 19 Apr 2022 02:29 IST

మూడ్‌ బాగో లేదా? దిగులుగా, విచారంగా ఉంటున్నారా? అయితే ఆహారంలో కొన్ని పుట్ట గొడుగులు చేర్చుకొని చూడండి. ఇవి ఉత్సాహం, హుషారు పెరగటానికి తోడ్పడతాయి. పుట్ట గొడుగులు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ఇవి క్యాన్సర్‌, అకాల మరణం ముప్పులను తగ్గిస్తున్నట్టు ఇంతకుముందే బయటపడింది. తాజాగా మానసిక జబ్బులు తగ్గటానికీ పుట్ట గొడుగులు తోడ్పడుతున్నట్టు పెన్‌ స్టేట్‌ కాలేజ్‌ ఆఫ్‌ మెడిసిన్‌ అధ్యయనంలో వెల్లడైంది. సుమారు 11 ఏళ్ల పాటు 24 వేల మంది ఆహార అలవాట్లను పరిశీలించి ఈ విషయాన్ని గుర్తించారు. పుట్ట గొడుగులు తినేవారికి కుంగుబాటు (డిప్రెషన్‌) వచ్చే అవకాశం తక్కువగా ఉంటున్నట్టు తేల్చారు. పుట్ట గొడుగుల్లోని ఎర్గోథియోనీన్‌ అనే జీవక్రియ రక్షకం (యాంటీఆక్సిడెంట్‌) ప్రభావమే దీనికి కారణం కావొచ్చని భావిస్తున్నారు. ఇది మన శరీరంలో జరిగే జీవక్రియల్లో భాగంగా పుట్టుకొచ్చే విశృంఖల కణాలు (ఫ్రీ రాడికల్స్‌) విజృంభించకుండా అడ్డుకుంటుంది. పుట్టగొడుగుల్లో ఆందోళనను తగ్గించే పొటాషియం మోతాదులూ ఎక్కువే. ఇదీ మానసిక ఆరోగ్యానికి మేలు చేసేదే కావటం గమనార్హం.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని