ఆస్పర్‌టేమ్‌ క్యాన్సర్‌ కారకం!

చక్కెరకు బదులు కృత్రిమ తీపి పదార్థాలు వాడటం కొత్తేమీ కాదు. వీటిల్లో ప్రముఖంగా చెప్పుకోవాల్సింది ఆస్పర్‌టేమ్‌ గురించే. అయితే దీని వాడకం విషయంలో పునరాలోచించుకోవటం మంచిది.

Published : 04 Jul 2023 00:04 IST

చక్కెరకు బదులు కృత్రిమ తీపి పదార్థాలు వాడటం కొత్తేమీ కాదు. వీటిల్లో ప్రముఖంగా చెప్పుకోవాల్సింది ఆస్పర్‌టేమ్‌ గురించే. అయితే దీని వాడకం విషయంలో పునరాలోచించుకోవటం మంచిది. ప్రపంచ ఆరోగ్యసంస్థ వచ్చే నెలలో దీన్ని ‘క్యాన్సర్‌ కారకంగా’ ప్రకటించనుంది మరి. ఆస్పర్‌టేమ్‌ చాలా తీయగా ఉంటుంది. అలాగని ఇందులో కేలరీలు ఎక్కువేమీ ఉండవు. అందుకే చాలా పదార్థాలు, పానీయాల్లో తీపి కోసం విరివిగా వాడుతుంటారు. జేమ్స్‌ ఎం.ష్లాటర్‌ 1965లో ఆస్పర్‌టేమ్‌ను కనుగొన్నారు. సహజంగా లభ్యమయ్యే ఫినైలలనైన్‌, ఆస్పర్టిక్‌ యాసిడ్‌ అనే అమైనో ఆమ్లాలతో దీన్ని రూపొందించారు. చక్కెర రహిత ఉత్పత్తులు, డైట్‌ డ్రింకుల వంటి వాటిల్లో దీన్ని ఎక్కువగానే వాడుతుంటారు. కానీ చక్కెరకు బదులు వాడే ఇలాంటి కృత్రిమ తీపి పదార్థాలతో చిక్కులు లేకపోలేదు. ఇవి బరువు తగ్గటానికి ఉపయోగపడటం లేదని, వీటితో తీవ్ర దుష్ప్రభావాలు ముంచుకొస్తున్నాయని ప్రపంచ ఆరోగ్యసంస్థ ఈ ఏడాది మొదట్లోనే హెచ్చరించింది. ఇప్పుడు ఆస్పర్‌టేమ్‌ మీద రెండు నివేదికలు వెలువరించాలని భావిస్తోంది. మొదటి నివేదిక క్యాన్సర్‌ ముప్పునకు సంబంధించిందే కావటం గమనార్హం. ఆస్పర్‌టేమ్‌ ఆమోదయోగ్య పరిమితిని నిర్దేశిస్తూ ఐక్యరాజ్యసమితికి చెందిన ఆహార, వ్యవసాయ సంస్థ (ఎఫ్‌ఏఓ), ప్రపంచ ఆరోగ్యసంస్థ నిపుణుల కమిటీ 1981లో ఒక ప్రకటన చేసింది. ఒకరు ఒక రోజుకు తమ శరీర బరువులో ప్రతి కిలోకు 49 మి.గ్రా. కన్నా ఎక్కువ ఆస్పర్‌టేమ్‌ తీసుకోవద్దని పేర్కొంది. కానీ అలబామా యూనివర్సిటీ ప్రకారం.. 355 మి.లీ. డైట్‌ కూల్‌డ్రింకులో సుమారు 200 మి.గ్రా. ఆస్పర్‌టేమ్‌ ఉండటం గమనార్హం.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని