అనువుకాని చోటు

రెండో అంతస్తు అపార్ట్‌మెంటు ముందున్న బాల్కనీలో నిలబడి ఎదురుగా వస్తోన్న చల్లటి గాలిని తన్మయంగా కళ్ళు అరమూసి ఆస్వాదిస్తున్నట్టుగా శ్వాసించారు ..

Published : 10 Apr 2020 15:39 IST

వలివేటి నాగచంద్రావతి

రెండో అంతస్తు అపార్ట్‌మెంటు ముందున్న బాల్కనీలో నిలబడి ఎదురుగా వస్తోన్న చల్లటి గాలిని తన్మయంగా కళ్ళు అరమూసి ఆస్వాదిస్తున్నట్టుగా శ్వాసించారు పరంధామయ్యగారు.

‘ఏమయినా నా సొంతం అన్న ఊహ కలిగించే అనుభూతే వేరు’ అనుకున్నారు మనసారా.

‘‘నాన్నా, ఇక్కడున్నారా? అమ్మ హారతి ఇస్తోంది రండి’’ పిలుస్తూ వచ్చింది సుకన్య.

పరంధామయ్యగారు లోపలికి నడిచారు. హారతి కళ్ళకద్దుకున్నారు. ప్రసాదం నోట్లో వేసుకున్నారు.

‘‘పూజకి గది ప్రత్యేకంగా ఉండాలి. ఎన్నేళ్ళ కోరికో ఇది. మొత్తానికి నెరవేర్చారు’’ పూజగది గోడలకి తగిలించిన నూటొక్క దేవుళ్ళ పటాలనీ భక్తిగా చూస్తూ ప్రసన్నంగా అన్నది భార్య ఆదిలక్ష్మి.

ఆవిడ సాధారణంగానే అని ఉండొచ్చునుగానీ ‘మొత్తానికి నెరవేర్చారు’ అన్న మాటలో ఏదో శ్లేష వినిపించి నవ్వుకుంటూ ఇవతలకి వచ్చారు పరంధామయ్యగారు.

అయిదేళ్ళక్రితమే కొన్నారీ అపార్ట్‌మెంటు. ఇక్కడ ఉన్న సౌకర్యాల మీద ఇంట్లోవాళ్ళందరికీ ఆశే. తనకిమాత్రం ఆ ఇంటిమీద వచ్చే రాబడిమీద ఆశ. మరి మోసేవాడికే కదా తెలిసేది కావడి బరువు. మొత్తానికి తనచేత ‘ఊ’ అనిపించి ఆదిలక్ష్మి ఈ ఇంట్లో పాలపొంగలి పెట్టడానికి అయిదేళ్ళు పట్టింది. అందుకే ఆ చెణుకు.

‘‘నాన్నా ఇటు చూడండీ!’’

సుకన్య పిలుపు విని అటుగా చూశారు. 

ఆ హాలు పడమటి వైపున కిటికీ పక్కగా తన పడక్కుర్చీ. ఎప్పుడో తను చదువుకునే రోజుల్లో తండ్రి తనకోసం ప్రత్యేకంగా చేయించిన ఆ పడక్కుర్చీ అంటే తనకభిమానం. అద్దె ఇళ్ళల్లో దాన్ని వాల్చడానికే చోటులేదని తనెప్పుడూ విచారిస్తూ ఉండేవాడు. ఇప్పుడు దాన్నిక్కడ తెచ్చిపెట్టి ‘ఇల్లు మార్చటం వల్ల మీ కోరిక్కూడా తీరింది చూశారా’ అని తనని ఖుష్‌ చెయ్యాలని చూస్తూందీ పిచ్చిపిల్ల. సుకన్య వంక ఆపేక్షగా చూసి నవ్వారు పరంధామయ్యగారు.

భార్యా కూతురూ కలిసి తెచ్చిన సామాన్లన్నీ విప్పి సర్దుకుంటూంటే సావకాశంగా పడక్కుర్చీలో వాలి చూడసాగారు.

సెకండ్‌హ్యాండ్‌దే అయినా సిటీలో పోష్‌ లొకాలిటీలో అంత పెద్ద హైక్లాసు అపార్ట్‌మెంటు కొనటమంటే పరంధామయ్యగారిలాంటి తెలుగు మాస్టారికి తాహతుకు మించిందే. అయినా సాధ్యపడిందీ అంటే కాలమప్పుడు ఆయనకి కలిసి వచ్చిందనుకోవాల్సిందే.

అప్పట్లో ఆయనకీ అన్నగారికీ కలిపి పిత్రార్జితమైన మామిడితోట కొంత ఉండేది. అన్నగారు దీర్ఘవ్యాధితో మంచంపట్టి అప్పులపాలై ‘తోట అమ్మేద్దాం పరంధామా’ అన్నాడు. సరేననక తప్పలేదు.

అదృష్టవశాత్తూ ఆ సమయంలో అక్కడ రియల్‌ ఎస్టేట్‌వాళ్ళు ప్లాట్లు వేస్తూండటంతో తోట ధర బాగా పలికింది. తన వాటా పైకం అనుకున్నదానికంటే కొంత ఎక్కువగానే చేతికొచ్చింది.

కానీ ఏదో వెలితి. స్థిరాస్తి వెనక దన్నుగా ఉండి ధైర్యాన్నిచ్చేది. ఈ కరెన్సీ చంచలం. డబ్బు చూసేసరికి ఆదిలక్ష్మి పలకసర్లు చేయించుకుంటానంది. అబ్బాయి కంప్యూటరన్నాడు. అమ్మాయి మరేదో కోరింది. ఇలాగే కరిగిపోతుందేమో అని క్షణక్షణమూ భయమే. అలాకాకముందే ఏదో చెయ్యాలి అని తీవ్రంగా ఆలోచిస్తున్నప్పుడు తన సహ ఉపాధ్యాయుడు ఈ అపార్ట్‌మెంటు విషయం చెప్పాడు. ‘‘ఆయన నాకు మేనమామ వరస. యు.ఎస్‌.లో ఉండే కొడుకు దగ్గరికి వెళ్ళిపోతూ దీన్ని అమ్మకానికి పెట్టాడు. చాలా మంచివాడు. అత్యాశకు పోడు’’ అన్నాడు స్నేహితుడు. కానీ ఆయన ఎంత తగ్గించి ఇచ్చినా ఆ అపార్ట్‌మెంటు విలువకి తోట డబ్బు సరిపోలేదు. ధైర్యంచేసి కొంత హౌసింగ్‌ లోను తీసుకుని అపార్ట్‌మెంటు సొంతం చేసుకున్నారు పరంధామయ్యగారు.

ఆ ఫ్లాటు చూసీ ఆ ఫ్లాటందం చూసీ దాని వైశాల్యం చూసీ ఇంటిల్లిపాదీ పొంగిపోయారు.

అది తమ నివాసం కొరకు కాదనీ అమ్మేసిన తోట స్థానంలో మరో ఆర్థిక వనరు కావాలనే ప్రయత్నంలో మాత్రమే కొనటం జరిగిందనీ అంతేకాక దానిమీద బోలెడు అప్పుందనీ దాన్ని తీర్చటంకోసమైనా అద్దెకివ్వక తప్పదనీ పరంధామయ్యగారి వివరణ విన్నాక నీరుగారిపోయారు.

కానీ ఓ చిన్ని నమ్మకం వారి ఆశని పూర్తిగా అణగారిపోనివ్వలేదు. అంచేత బ్యాంకు లోను తీరటానికి అందరూ పూర్తిగా సహకరించారు.

అద్దె తక్కువని సిటీ పొలిమేరల్లో ఉన్న కాలనీలో చిన్న వాటాలోకి కాపురం మార్చారు. ఇంటి ఖర్చు ఇంతకంటే తగ్గించటం ఎవరివల్లాకాదు అన్న లెవెల్లో పొదుపు చేసేది ఆదిలక్ష్మి. కొడుకు హరి పాతిక కిలోమీటర్ల దూరంలో ఉన్న కాలేజీకి రెండు బస్సులు మారి వెళ్ళేవాడు. 

ఇక సుకన్య కాలేజీ నుంచి రాగానే చుట్టుపక్కల పిల్లలకి ట్యూషన్లు చెప్పేది. 
ఏమయితేనేం అందరి కృషీ ఫలించింది. 

ఎనిమిదేళ్ళకుగానీ తీరదనుకున్న బ్యాంకు లోను అయిదేళ్ళకే తీరిపోయింది. భూభారాన్ని దింపుకున్న ఆదిశేషుడిలా తేలికపడ్డారు పరంధామయ్యగారు. రుణబాధ తీరటమొక్కటే కాదు, అనుకున్నట్టుగా కొడుకుని ఇంజినీరింగులో చేర్పించారు. సుకన్య డిగ్రీ అయ్యాక కొన్ని కంప్యూటరు కోర్సులు చేసి ఓ ఇన్‌స్టిట్యూట్‌లో జాబ్‌ సంపాయించుకుంది.

ఇన్ని విజయాలు సంతోషపెడుతోన్న సమయంలో భార్యా పిల్లలూ ‘‘ఇంకా ఈ ఇరుకింట్లో అవస్థలు పడాలా. ఇకనైనా సొంతింట్లో సుఖపడదాం’’ అని అభ్యర్థించేసరికి కాదనలేకపోయారు.

అలా, ప్రత్యేకంగా పూజగది ఉన్న తమ సొంత ఫ్లాట్‌లో ఆదిలక్ష్మి పాలు పొంగించింది.

*    *    *

తెల్లవారుతూనే ఎదురైంది సమస్య.

‘‘ఏం మనుషులో ఏమిటో...’’ పక్కమీది దుప్పటి దులిపి మడతేస్తూ గొణుక్కుంటోంది ఆదిలక్ష్మి.

‘‘ఏమయింది?’’ అప్పుడే మేల్కొని అరచేతిలో శ్రీరామ చుట్టుకుంటున్న పరంధామయ్యగారు అడిగారు.

‘‘పాలవాళ్ళెవరైనా కనబడతారేమోనని ఇందాక వీధి తలుపు తీసి చూశానా... ఆ చివరి ఫ్లాటు ఆమె నైటీలో బయటకొచ్చింది. ‘పాలబూతు దగ్గర్లో ఎక్కడుంది అక్కగారూ’ అనడిగాను. 

తప్పేముంది చెప్పండి’’.

‘‘ఊ’’

‘‘నన్నో పురుగును చూసినట్టు చూసి ‘నాకిట్లా వరసలు కలపడం నచ్చదు’ అని కొట్టినట్టు చెప్పి తలుపేసుకుంది. తల తీసినట్టనిపించిందండీ నాకు’’ చిన్నబుచ్చుకున్న మొహంతో అన్నది ఆదిలక్ష్మి.

ఆమెకు తమ పాత ఇంటి పరిసరాలు మనసులో మెదిలాయి.

కొత్తగా అద్దెకి దిగినవాళ్ళకి చుట్టుపక్కలవాళ్ళు ఎంత సహాయపడతారని... పాల వాడిక కుదిర్చి, పనిమనిషిని మాట్లాడి, పేపరువాడికి చెప్పి, ఏం కావాలన్నా మొహమాటపడకుండా అడగమని.

‘‘హు... ఇదేమి పద్ధతో’’ నిట్టూర్పు ఆగలేదు ఆదిలక్ష్మికి.

దాదాపు ఇలాంటి అనుభవమే రెండ్రోజుల తరవాత పరంధామయ్యగారికీ ఎదురైంది.

ప్రత్యూషానికి ముందరే కాస్త దూరం నడిచి రావటం ఆయనకి అలవాటు. కొత్త ఇంటికి మారాక ఆ అలవాటుని పునరుద్దరించుదామని ఆరోజు బయటకు వచ్చారు. అదే సమయానికి ఎదురింటాయన ఇంట్లోంచి ఇవతలకి వస్తూ కనిపించాడు. మంకీ క్యాపూ మెడకి మఫ్లరూ చేతిలో స్టిక్కూ... ఆయన వాకింగుకేనని అర్థమైంది.

ఈ ఇంటికి వచ్చాక ఆయన్ని పలకరించే సందర్భం చిక్కలేదింతవరకు. ‘‘నా పేరు పరంధామయ్య. ఈ ఫ్లాటు మాదే. విఠలరావుగారు ఇంతవరకూ ఇందులో రెంటుకు ఉండేవారు. సొంత ఇంట్లో ఉండాలని ఇప్పుడు మేమే వచ్చేశాం’’ అన్నారాయన్ని చూస్తూ పరిచయపూర్వకంగా నవ్వుతూ.

ఆయన నవ్వలేదు. కళ్ళు మాత్రం ఎగాదిగా చూశాయి. ‘‘ఓ, నువ్వేనా ఆ తెలుగు మాస్టారు’’ అన్నాడు నొసలెగరేస్తూ.

చివుక్కుమంది మనసు. కానీ అంత తొందరగా తొణికే స్వభావం కాదు కనుక పట్టించుకోనట్టుగా మందహాసం చేశారు. ‘‘అవును. పదండి నడుస్తూ మాట్లాడుకుందాం’’ అంటూ ముందుకడుగేశారు. కానీ ఆయన ఆ మాట విననట్టుగానే గబగబా ముందుకు వెళ్ళిపోయాడు. చివరి ఫ్లాటు లాయర్ని కేకేశాడు. ఇద్దరూ కలిసి లిఫ్టు వైపు నడిచారు. 

స్తబ్ధుగా అయిపోయారు పరంధామయ్యగారు. అంతలోనే తేరుకున్నారు. ‘అవునులే, నా స్థాయి వేరు ఆయన స్థాయి వేరు. ఇరుగూ పొరుగూ అయినంత మాత్రాన నాతో కలిసి అడుగులు వెయ్యాలని ఎక్కడుంది’ వెలితిగా నవ్వుకున్నారు. ఆ క్షణంలో ఆయనకూ భార్యకు గుర్తొచ్చినట్టుగా తాము ఉండొచ్చిన కాలనీవాసులు తలపుకొచ్చారు.

తనతోపాటు నడవటం కోసం వీధిచివర తన కోసం నిరీక్షిస్తూ ఉండేవాడు పోస్టుమాస్టారు ముకుందం. తను రావటం చూస్తే స్వయంగా అరుగు దిగివచ్చి గేటు తీసేవాడు తన ఇంటి యజమాని. ఇరుగూ పొరుగూ ‘మాస్టారుగారు’ అంటూ తన వృత్తికో విలువనీ తనకో పెద్దరికాన్నీ ఇచ్చేవాళ్ళు. ఆ గౌరవం ఆ మర్యాద అన్నిచోట్లా లభిస్తాయని ఆశించటం తన అవివేకమే. నిర్వేదంగా మెట్లవైపు నడిచారు పరంధామయ్యగారు.

ఇక హరికీ సుకన్యకీ కూడా ఇక్కడ పరాయిదేశంలో ఉన్నట్టు ఒంటరితనంగా అనిపిస్తోంది.

వాళ్ళ వయసు పిల్లలు లేకకాదు. ఎదురు ఫ్లాటులో నందిని సుకన్య తోటిదే. ఎదురైనప్పుడు తను నవ్వినా తిరిగి నవ్వదు. ‘హాయ్‌’ అంటే తప్పదన్నట్టు పెదాలు కదిలిస్తుంది. ఆ చివరి ఫ్లాటు వకీలుగారమ్మాయి రాణి అయితే మరీనూ- చూయింగ్‌గమ్‌ నముల్తూ వెస్ట్రన్‌ మ్యూజిక్‌ హమ్‌ చేస్తూ తన ఉనికినే గమనించనట్టు పక్కనుంచే వెళ్ళిపోతుంది. పోనీ వాళ్ళ నేచరే అంత అనుకుందామా అంటే సాయంత్రాలు వాళ్ళిద్దరూ రోడ్డువైపు బాల్కనీలో చేరి గంటల తరబడి హస్క్‌ కొట్టడం తను చూస్తూనే ఉంది.

తనంటేనే ఆ ఉపేక్ష. ఎందుకని? వాళ్ళకంటే ఎందులో తీసిపోయింది? తనూ డిగ్రీ చేసింది. ఎటొచ్చీ వాళ్ళు పీజీ చేస్తున్నారు. తను ఉద్యోగం చేస్తోంది. పోనీ అందంలో సరితూగనా అంటే... తనముందు వాళ్ళిద్దరూ తీసికట్టే. మరెందుకు తనను దూరంగా ఉంచుతున్నారు వాళ్ళు- సుకన్య మధన, వాళ్ళతో కలిసిపోవటమెలాగా అని ఆరాటం.

హరిదీ సేమ్‌ ప్రాబ్లమే. అదే ఫ్లోరులో మెడిసిన్‌ చదువుతున్న ప్రదీప్‌ ఉన్నాడు. ‘లా’లో జాయినయిన రాకేష్‌ ఉన్నాడు. ఎదురింట్లో భరత్‌ తన కాలేజీనే. తన బ్రాంచే. కనిపించినప్పుడు ‘హాయ్‌’ అంటారు. పలకరిస్తే రెండు నిమిషాలు ఏదో టాపిక్‌ మాట్లాడతారు. చిరునవ్వు విసురుతారు. కానీ ఎవరిలోనూ తనతో స్నేహం చేయాలనే అభిలాష కనిపించదు. ఆ వైఖరికి కారణం తెలుసు. అంతస్థుల మధ్య తారతమ్యం.

వాళ్ళూ తనూ జీన్సే వేసుకుంటారు. తన జీన్స్‌ మూడు వందలు. వాళ్ళది మూడువేలు. బస్సు కోసం తను స్టాపులో పడిగాపులు పడుతూవుంటే వాళ్ళు తనమీదో లుక్కు పడేసి, బైక్‌ మీద ఝుమ్మని దూసుకుపోతారు. అదీ తేడా.

‘వాళ్ళున్న అంతస్థులో నివాసమున్నంత మాత్రాన సరిపోతుందా- కనీసం పైపైకన్నా ఆ అంతస్థుకి తగినట్టు మెరుగులు పెట్టుకోవద్దా. కానీ తనకది సాధ్యపడుతుందా..?’ హరి అంతరంగమిది.

మూడు నెలలు గడిచేటప్పటికి బయటి వాతావరణంలో కొద్దిపాటి మార్పొచ్చింది.

ఎదురు ఫ్లాటు పెద్దమనిషి తను వాకింగ్‌కి వెడుతూ ‘రావయ్యా మాస్టారూ’ అని పరంధామయ్యగారిని ఆహ్వానిస్తున్నాడు. కాకపోతే దారిపొడుగునా ఆయన వక్త, ఈయన శ్రోత- ఒక్కడుగు వెనగ్గా.

ఆదిలక్ష్మిక్కూడా కాలక్షేపం బాగానే అవుతోంది. తరచూ ఎదురు ఆఫీసరుగారి భార్య వసంతో, మధ్య ఫ్లాటు కాంట్రాక్టరుగారి మిసెస్సు అపర్ణో పిలుస్తూ ఉంటారు- వాళ్ళకురాని కూరో పిండివంటో ఎలాచేయాలో చూపించమని. పొంగిపోతూ వెళ్ళి చూపించటం కాదు, చేసిపెట్టి వస్తూంటుంది. అలా వెశ్ళాల్సినప్పుడల్లా వసంతగారు కొత్తగా చేయించుకున్న రవ్వల బ్రేస్‌లెట్‌ గురించో అపర్ణగారికున్న మూడువందల చీరల గురించో ఇంట్లో అందరి దగ్గరా వర్ణించి నిట్టూరుస్తూ ఉంటుంది. లేదా వాళ్ళతోపాటు షాపింగులకి వెళ్ళి అవసరం లేకపోయినా డైనింగ్‌ టేబుల్‌మీదకంటూ పళ్ళు పెట్టుకునే గాజు బౌలో, షోకేసులోకి ఓ వీనస్‌ బొమ్మో కొనుక్కొచ్చి పరంధామయ్యగారి బడ్జెట్‌ పెంచుతూ ఉంటుంది.

ఇక హరీ సుకన్యా హ్యాపీగానే ఉంటున్నారు.

సుకన్య కంప్యూటర్‌ పరిజ్ఞానం ఆమెకే ఉపకరించిందనుకోవాలో చివరి ఫ్లాటు లాయరుగారికే అనుకూలించిందనుకోవాలోగానీ ఆయన దగ్గర పన్జేసే క్లర్కులిద్దరూ ఒకేమాటు సెలవు పెట్టడం మూలాన సుకన్య ఆయన దృష్టిలో పడింది. ‘చూడమ్మా, నీకు ఖాళీ ఉన్నప్పుడు కాస్త ఈ డాక్యుమెంట్లు ఫైల్లో లోడ్‌ చేసిపెడుదూ’ అనో, ‘ప్రింటర్లో ఈ ఫారాలు కాపీలు తీసిపెట్టమ్మా’ అనో ఇంటిదగ్గరకొచ్చి మరీ అడుగుతున్నాడు.

ఆయనంతటి లీడింగ్‌ లాయరు వచ్చి అడగటమే చాలు కాదనటమొకటా- సుకన్య హడావుడిపడుతూ చేసిపెట్టొస్తూ ఉంది.

దానాదీనా ఆ ఇంటితో సుకన్యకి చనువేర్పడింది. ఇప్పుడు రాణి ఆమెకు ఎంతో క్లోజయిపోయింది. షాపింగ్‌లకీ సినిమాలకీ వెంట తీసుకువెడుతుంది. తండ్రికి సాయం చేస్తున్నందుకూ అని చెప్పకుండా చిన్నిచిన్ని గిఫ్టులు కొనిపెడుతూ ఉంటుంది. 

తమబోటి ఈతరం అమ్మాయిలు నడకలోనూ మాటలోనూ చూపులోనూ వేషధారణలోనూ ఎంత మోడ్రన్‌గా ఎంత డైనమిక్‌గా ఉండాలో ఎడ్యుకేట్‌ చేస్తూంటుంది.

విత్తనాలు నాటుకునే తరుణం. అవి తిండిగింజలైనా మత్తుగింజలైనా చక్కగా మొలకెత్తుతాయి. సుకన్య ఇప్పుడు చాలా ఉత్సాహంగా ఉంటోంది.

హరి ఈమధ్య ఇంటికి అప్పుడప్పుడూ త్వరగా వస్తున్నాడు. ‘ఏరా’ అంటే ‘భరత్‌ బైక్‌మీద లిఫ్టు ఇచ్చాడమ్మా. పది నిమిషాల్లో వచ్చేశాను. బస్సులో ఆ తొక్కిసలాటలో నిలబడలేక చెమటతో తడిచి ముద్దయి చచ్చేవాణ్ణి. ఇవాళ హాయిగా ఉంది’ అంటాడు హుషారుగా.

మొత్తానికి అందరూ హ్యాపీ. ఒక్క పరంధామయ్యగారికే ఎందుకో ఏదో నచ్చట్లేదు. తాము కష్టాలుపడ్డారు. కష్టాల్లో బతికేవాళ్ళమధ్య బతికారు. కష్టపడ్డమంటే ఎంత కష్టమో తెలిసి స్పందించారు. ఇప్పుడు కష్టమంటే ఏమిటో తెలీనివాళ్ళ దగ్గరకొచ్చి పడ్డారు. ఈ మార్పు తమకి మేలు చేస్తుందా, చెడుకి దారితీస్తుందా.

‘పోన్లే, ప్రస్తుతానికి ఎలాగోలా అడ్జస్టయ్యారు. అది చాలు’ అనుకున్నారు మధ్యతరగతి మనస్తత్వంతో ఎప్పట్లాగే సమాధానపడిపోతూ.

*    *    *

‘‘అమ్మా, ఇవాళ శాలరీ అందుతుంది. సాయంత్రం అటునించటే షాపుకి వెళ్ళి బట్టలు తెచ్చేసుకుంటాను. సరేనా. కాస్త ఆలస్యమైనా కంగారుపడకు’’ తల్లితో చెబుతోంది సుకన్య.

పదిరోజుల్లో సంక్రాంతి. అదీ హడావుడి.

దిద్దిన స్లిప్‌టెస్ట్‌ పేపర్లు కట్టకడుతోన్న పరంధామయ్యగారు విన్నారామాట. ‘‘అదేమిటి? అమ్మతో కలిసి వెళ్ళవా? తనూ తెచ్చుకోవాలిగా’’. ఇప్పటివరకూ తల్లీ కూతుళ్ళిద్దరూ కలిసి వెళ్ళటమే అలవాటు మరి.

‘‘ఉహు. అమ్మ అపర్ణగారితో వెడుతోందట మధ్యాహ్నం. రాణి సాయంత్రం మా ఇన్‌స్టిట్యూట్‌కి వస్తానంది. మేమిద్దరం చేద్దామనుకుంటున్నాం షాపింగ్‌’’ చెప్పింది సుకన్య.

‘హతోస్మి’ అనుకున్నారు పరంధామయ్యగారు.

స్కూలుకు వెళ్ళేముందర ఆదిలక్ష్మి చేతికి డబ్బిచ్చారు. ‘‘అన్నయ్యకీ వదినకీ కూడా బట్టలు తీసుకోవాలి, గుర్తుందిగా’’ అన్నారు హెచ్చరింపుగా.

‘‘ఆ’’ అన్నది ఆదిలక్ష్మి. తిరిగి ఆయన సాయంత్రం స్కూలు నుంచి ఇల్లు చేరేసరికి తల్లీ కూతుళ్ళిద్దరూ ప్యాకెట్లు విప్పి ఒకరు తెచ్చినవి ఇంకొకరికి చూపించుకునే ముచ్చటలో ఉన్నారు. సుకన్య తెచ్చుకున్న బట్టలు చూసి ఫక్తు శాకాహారి విస్తట్లో చికెన్‌ముక్క చూసినట్టు విస్తుపోయారు పరంధామయ్యగారు.

రెండు షేడ్‌లలో ఉన్న జీన్స్‌. వాటిమీదకి ఏవేవో వెర్రిమొర్రి రాతలు ప్రింటుచేసి ఉన్న టీషర్టులు, బ్లాక్‌ కలర్‌ మిడ్డీ దానిమీద గులాబీరంగు టాపు.

చీరో... తప్పితే చుడీదారో తప్ప ఇప్పటివరకూ మరోటి కట్టి ఎరుగని కూతురా ఇవి తెచ్చుకున్నది.

‘‘పాత కాలనీలో అయితే అందరివీ బీసీ కాలం వాలకాలే. అక్కడున్నప్పుడు ఇలాంటివి చూస్తే ఎబ్బెట్టనిపించేవి నాక్కూడా. ఇక్కడిలాంటివి వేసుకోకపోవటమే ఎబ్బెట్టుగా ఉంటోంది. రోమ్‌లో రోమన్‌లాగే ఉండాలి కదా... అందుకే ఇవి తెచ్చుకున్నాను. బావున్నాయి కదా నాన్నా. రాణి అయితే నా సెలక్షన్‌ మార్వ్‌లెస్‌ అంది’’ ఉలుకూ పలుకూ లేకుండా చూస్తోన్న తండ్రికి అడక్కుండానే సమాధానమిచ్చింది సుకన్య.

‘‘మంచి పన్జేశావు. పిల్లలు ఏ కాలానికి తగ్గట్టు ఆ కాలంలో ఉండటమే ఆరోగ్యం’’ 

ఈ మాటలన్నది తండ్రికాదు... తల్లి.

‘‘సారీ నాన్నా. ఈ నెల శాలరీలో ఏం మిగల్లేదు’’ ఏమాత్రం విచారం లేకుండా విచారాన్ని వ్యక్తంచేసి చేతిలో బట్టల్ని మురిపెంగా చూసుకుంటూ వెళ్ళిందక్కణ్ణుంచి సుకన్య. తరువాయి భాగంగా తను తెచ్చిన చీరల్ని భర్త ముందుంచింది ఆదిలక్ష్మి. అవి చూస్తే మతిపోయింది పరంధామయ్యగారికి.

ఆవిడ ఎప్పుడు కొనుక్కున్నా నాలుగొందల్లో వచ్చే ఏ సెమీ గద్వాలు చీరో మాగ్జిమమ్‌. 

అలాటిది నాలుగువేలు పెట్టి పట్టుచీరొకటీ కొట్టొచ్చినట్టు కనబడే రంగంటేనే ‘అబ్బే’ అనే మనిషి జరీ దారంతో నిండా ఎంబ్రాయిడరీ చేసిన ఇంకో సిల్కు చీరొకటీ తెచ్చుకున్నదంటే- నిలువుగుడ్లు పడుతున్నాయి ఆయనకని కనిపెట్టేసింది ఆదిలక్ష్మి. ‘‘ఏం చెయ్యమంటారు, ఆ అపర్ణగారు పట్టుపట్టి కూర్చుంది- ఈ చీర మీ పసిమిఛాయకి బ్రహ్మాండంగా ఉంటుందంటూ తీసుకునేదాకా వదిలింది కాదు. ఇప్పుడందరూ ఇవే. నాక్కూడా కట్టుకోవాలనిపించింది. మీకిష్టముండదని తెలుసు’’ నొచ్చుకుంటున్నట్టుగా అంది.

‘‘మరి... వదినా వాళ్ళకి బట్టలు...’’ గొంతు పెగుల్చుకుని అడిగారు పరంధామయ్యగారు.

‘‘సర్లేండి, మీరిచ్చిన డబ్బు ఈ చీరలకి మొదటి వాయిదా కట్టడానికే సరిపోయింది. వాటిక్కూడా ఎక్కడ అప్పు చెయ్యను?’’ చీరలు చేతికి తీసుకుని పైకి లేస్తూ, ‘‘ఒక్కసారికి వాళ్ళకి పంపకపోతే పలంటుకుపోవులెండి’’ తేలిగ్గా అంటూ వెళ్ళింది ఆదిలక్ష్మి.

నోటమాట రాలేదు పరంధామయ్యగారికి. మౌనంగా వెళ్ళి పడక్కుర్చీలో కూర్చుండిపోయారు.

ఎప్పుడు వచ్చాడో హరి - తండ్రి దగ్గరగా స్టూలు లాగి కూర్చొని తండ్రి చేతిమీద చేయి వేశాడు.

‘‘నాన్నా’’

వేదనా భారాన్ని మోస్తున్నట్టు రెప్పలు మూసుకున్న పరంధామయ్యగారు కళ్ళు తెరిచి ఏమిటన్నట్టు చూశారు.

‘‘నాకీ పండక్కి బట్టలు వద్దులే నాన్నా...’’

తన బాధని అర్థంచేసుకున్న కొడుకు మీద వాత్సల్యం పెల్లుబికిందాయనలో. చేయెత్తి కొడుకు తలమీదుంచి, ‘పర్లేదులే హరీ, ఈసారికి ఎలాగో సర్దుబాటు చేస్తాలే’ అనబోయారు మృదువుగా.

‘‘నాకు బైకు కావాలి నాన్నా’’ హరి వాక్యం పూర్తిచేశాడు.

ఓరినీ! వీడూ వాళ్ళలో ఒకడేనా- ‘‘నీకుగానీ పిచ్చెక్కిందా. బైకంటే మాటలనుకుంటున్నావా? అరవై, డెబ్భైవేలు ఎక్కణ్ణించి తెమ్మంటావ్‌?’’ ఒక్కసారిగా బరస్టయ్యారు పరంధామయ్యగారు.

ఎన్నడూ లేంది ఆయన గొంతు పెంచేసరికి గదిలో ఉన్న ఆదిలక్ష్మీ సుకన్యా పరిగెత్తుకొచ్చారు.

‘‘మీరు ఒక్కసారిగా ఏం కట్టక్కర్లేదు. వాయిదాలుగా నెలకింతని కట్టొచ్చు’’ మొహం ముడుచుకొనే తమకి అనుకూలమైన పద్ధతొకటున్నదని తెలియజేశాడు హరి.

‘‘అవును నాన్నా, మన వీలునుబట్టి ఒకటి రెండేళ్ళలో తీర్చెయ్యొచ్చు’’ సంగతి తెలిసి అన్నకి వంతపాడింది సుకన్య.

‘‘మరికనేం?’’ అన్నది ఆదిలక్ష్మి. తనూ వాళ్ళ పక్షమే అన్నట్టు.

ఒక్కసారిగా నీరసపడిపోయారు పరంధామయ్యగారు. ఒంటరితనంగా నిస్సహాయంగా అనిపిస్తోంది. ‘ఎంత ఒబ్బిడిగా ఎంత బాధ్యతగా ఉండేవాళ్ళు- ఎంత మారిపోయారు వీళ్ళు. ఈ శక్తికి తగని పరుగులు ఎక్కడిదాకా? చాప ఉన్నంతవరకే కాళ్ళు చాపుకోవాలనే సూత్రాన్ని మరిచిపోయారా?’

‘‘ఎందుకిలా తయారయ్యారు మీరు? అలివిమాలిన ఆ కోరికలేమిటి? స్తోమతుకి మించిన ఆ ఖర్చేమిటి? మీరేం చేస్తున్నారో మీకైనా తెలుస్తోందా?’’ అన్నారు ఉద్రేకాన్ని అణచుకుంటూ.

‘‘ఇప్పుడంత తలకుమించిన ఖర్చేం చేశాం?’’ తీక్షణంగా అడిగింది ఆదిలక్ష్మి.

‘‘ఏమిటీ అని నువ్వే అడుగుతున్నావా? ముగ్గురికి బట్టలు తెమ్మని డబ్బిస్తే ఒక్కదానివి తెచ్చుకున్నావ్‌- పైగా ఇంకొంచెం అప్పుపెట్టి మరీ. ఈ వయసులో ఆ పట్టుచీర మీద అంత మోజేమిటీ నీకు. సుకన్యా అంతే. జీతమంతా తగలేసి ఆ జీన్స్‌ తెచ్చుకుంది. కొత్తగా ఆ అలవాటు దానికంత ముఖ్యమా? మిమ్మల్ని చూసి వాడు ఏకంగా బైక్‌ అడుగుతున్నాడు. ఈ వాయిదాలన్నిటికీ డబ్బెలా కట్టగలమన్న ఆలోచనేమన్నా ఉందా మీకు?’’

‘‘ఇంతకీ మీ బాధంతా మీ అన్నావదినలకి బట్టలు తేలేదనే కదా. అసలీ తనకుమాలిన ధర్మాలన్నీ మానుకుంటే మీరు బెంగపడుతున్న ఆ వాయిదాలన్నీ నిక్షేపంగా కట్టొచ్చు’’.

‘‘తనకుమాలిన ధర్మమా, ఏమంటున్నావు ఆదిలక్ష్మీ?’’ విస్తుపోతూ అడిగారు.

‘‘అవును. అదే చెబుతున్నాను. నెలనెలా వాళ్ళ ఖర్చులకంటూ మీరు పంపే డబ్బు ఆపేస్తే సరి. అయినా ఎన్నాళ్ళని ఒకరి సంసారాన్ని మరో సంసారం ఆదుకోగలదు? ఎవరి తిప్పలు వాళ్ళవి. మనకీ పిల్లలు ఎదిగొస్తున్నారు. 

వాళ్ళ బాగోగులు చూసుకుంటే చాలిక’’.

నోటమాట రావటంలేదు పరంధామయ్యగారికి. ఒకనాడు ‘అయ్యో, వాళ్ళని మనం కాకపోతే ఎవరు చూస్తారు’ అన్న ఆదిలక్ష్మేనా ఈమె.

ఉన్న ఒక్కగానొక్క కొడుకునీ యాక్సిడెంట్‌లో పోగొట్టుకుని, ఆ షాక్‌లో కాలూ చెయ్యీ చచ్చుపడి మంచానికే అంకితమయ్యాడు తన అన్నగారు. ఉన్న ఆస్తంతా వైద్యానికి కరిగిపోతే అప్పడాలొత్తీ విస్తర్లు కుట్టీ అతి కష్టంమీద సంసారాన్నీదుకొస్తున్న దీనురాలు వదినమ్మకి చిరుసాయం నెలకోసారి తను పంపే మొత్తం.

తన సోదర ప్రేమనీ వితరణ గుణాన్నీ తన భార్యా పిల్లలూ ఎంతో హర్షించారు. సహకరించారు. వారి పూర్తి మద్దతుండబట్టే దీనస్థితిలో ఉన్న ఆ కుటుంబానికి ఇంతవరకూ ఆసరా ఇవ్వగలిగారు.

‘కానీ వాళ్ళే ఈరోజిలా...’ బేలగా భార్య వంక చూశారు పరంధామయ్యగారు.

‘మేము కాదు, ఇక మీరే మామాట వినాలి’ అన్నట్టు చురుగ్గా ఓ చూపు విసిరి గదిలోకి నిష్క్రమించింది ఆదిలక్ష్మి.

*    *     *

ఆ మరుసటిరోజు పరంధామయ్యగారితో అందరూ ముభావంగానే మసలుకున్నారు.

సాయంత్రం స్కూలు నుంచి రాగానే భార్య మౌనంగా అందించిన టీ అందుకుంటూ ‘‘అడ్వాన్స్‌ ఇచ్చేశాను’’ చెప్పారు పరంధామయ్యగారు గంభీరంగా.

గప్పున వెలిగింది ఆదిలక్ష్మి మొహం. అక్కడే ఉన్న పిల్లల మొహాలు కూడా సంభ్రమంతో ఇంతయ్యాయి.

‘బైకుకి అడ్వాన్స్‌ కట్టేశారన్నమాట. ఆహా, మొత్తానికి తండ్రిని తమ దారికి తెచ్చుకోగలిగాం’.

‘‘ఏం బైక్‌ నాన్నా. ఎంత సి.సి., కలరేమిటి, ఖరీదెంత... నేనూ వచ్చేవాణ్ణిగా’’ గుక్కతిప్పుకోకుండా అడుగుతోన్న హరిని ఆపారు.

‘‘అడ్వాన్స్‌ బైకుకి కాదు. అద్దె ఇంటికి. 

మొన్నటివరకూ మనమున్న కాలనీలోకే’’.

‘‘ఎందుకు?’’ అరిచారు ముగ్గురూ.

‘‘మనకు అనువయిన చోటదే’’ దృఢంగా అన్నారు పరంధామయ్యగారు. 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు