అందరికీ వందనాలు
వైశాలితో పాటు గదిలోకి నడిచాడు శివనాథ్. ‘‘కూర్చోండి’’ అంది వైశాలి మంచం పక్కన ఉన్న కుర్చీ చూపిస్తూ. ‘‘మీరేమీ అనుకోనంటే ముందుగా నేను రెండు విషయాలు చెప్పాలి’’ అన్నాడు.
కథావిజయం 2020 పోటీల్లో తృతీయ బహుమతి (రూ.10 వేలు) పొందిన కథ
వైశాలితో పాటు గదిలోకి నడిచాడు శివనాథ్.
‘‘కూర్చోండి’’ అంది వైశాలి మంచం పక్కన ఉన్న కుర్చీ చూపిస్తూ.
‘‘మీరేమీ అనుకోనంటే ముందుగా నేను రెండు విషయాలు చెప్పాలి’’ అన్నాడు.
‘చెప్పాలనుకున్నవి దాయకుండా బయటపెట్టాలనే కదా మనకి ఈ అవకాశం ఇచ్చింది’ అని వైశాలి మనసులో అనుకుంది. పైకి మాత్రం ‘‘చెప్పండి’’ అంది.
ఎలా మొదలుపెట్టాలా అన్నట్లు గదిని పరీక్షగా చూడటంలో కొన్ని క్షణాలు గడిపాడు శివనాథ్. గదిలో సాధారణ మధ్యతరగతి వాతావరణం అతనికి నచ్చింది. మనసులో ఉన్నది సూటిగా చెప్పవచ్చు అన్న ధైర్యం కలిగింది.
పెళ్లిచూపుల్లో ఏకాంతంగా అతను చెప్పబోయే మొదటి విషయం ఏమిటా అన్న కుతూహలం సహజంగానే వైశాలికి కలిగింది. ఫొటోలో శివనాథ్‌ని చూసినప్పుడు ఎక్కడో తారసపడ్డ వ్యక్తి అన్న భావన కలిగింది వైశాలికి. కొన్ని నిమిషాల కిందట ముఖాముఖీ చూసినప్పుడు ఆ తారసపడటం ఎలా జరిగిందో ఆమెకి చప్పున స్ఫురించింది.
వైశాలి ఒక స్కూల్లో టీచర్‌గా పనిచేస్తోంది. అందులో అదనంగా కొన్ని తరగతి గదులు నిర్మించాలన్న ప్రతిపాదన తొమ్మిది నెలల కిందట, అంటే 2019 చివరి నెలలో వచ్చింది.
మరికొన్ని వారాల్లో మొత్తం ప్రపంచాన్ని భయకంపితుల్ని చెయ్యబోయే పెను విపత్తు గురించి అప్పటికి ఎవరికీ తెలియదు. భవన నిర్మాణానికి తమ వంతు సాయం అందించటానికి పూర్వ విద్యార్థులు ముందుకొచ్చారు.
చిత్రకారుడిగా దేశ వ్యాప్తంగా మంచి పేరున్న ఒక పూర్వ విద్యార్థి తాను గీసిన చిత్రాలని విరాళంగా ఇచ్చాడు. వాటిని చక్కగా ప్రదర్శించే ఏర్పాట్లు చేసే బాధ్యత వైశాలికి అప్పగించింది యాజమాన్యం.
స్థానిక టీవీ ఛానెల్ పుణ్యమా అని ఆ చిత్రకళా ప్రదర్శనకి మంచి ప్రచారం వచ్చింది. ఒకటొకటిగా చిత్రాలు అమ్ముడుపోసాగాయి. ఊహించిన దానికన్నా ఎక్కువ ఆదాయమే రావటం సంతోషం కలిగిస్తున్నా మిగిలిన ఒక చిత్రాన్ని మాత్రం కొనటానికి ఎవరూ ముందుకురాకపోవటం వైశాలికి చిత్రంగా తోచింది.
ఆ రోజు... అమ్ముడుపోని చిత్రం ముందు ఒకతను నిలబడి తదేకంగా చూస్తున్నాడు.
ఆ చిత్రాన్ని చూసిన పిల్లలు నవ్వుకోవటం, పెద్దలు మొహం చిట్లించటం అప్పటి వరకూ గమనించిన వైశాలికి గంటన్నర గడచినా అతను అలాగే శిలలా ఆ చిత్రాన్ని చూస్తూ ఉండటం ఆశ్చర్యం కలిగించింది.
‘అతగాడికి అంతగా నచ్చితే కొనేస్తాడేమో..’ అనుకుంది వైశాలి నవ్వుకుంటూ. అసలు ఆ చిత్రంలో ఏముందని అతను అంతలా చూస్తున్నాడు అనుకుని అతని వెనక వెళ్లి నిలుచుంది.
ఆ చిత్రం ముంబయి నగర జీవితాన్ని చూపిస్తోంది. జీబ్రా క్రాసింగ్ దాటుతున్న జనసమూహం చిత్రం అది. స్కూల్ బ్యాగులతో వివిధ వయసుల పిల్లలు, బ్రీఫ్ కేసులు, బ్యాగులతో ఆడామగా ఉద్యోగులు, విద్యార్థులు, లంచ్ డబ్బాలు తీసుకెళుతున్న డబ్బా వాలాలు, వాకింగ్ స్టిక్ సాయంతో నడుస్తున్న వృద్ధులు అందరూ ఉన్నారు. పిల్లల యూనిఫాంలు, ఉద్యోగుల దుస్తులు, డబ్బావాలాల టోపీలు, వృద్ధుల వయోభారం అన్నీ సుస్పష్టమయ్యేలా గీశాడు చిత్రకారుడు. కానీ, అందులో ఒక్కరికీ కనుముక్కులు లేవు. అన్నీ కోలగా ఉన్న ఖాళీ ముఖాలు.
చిత్రంలో డజను మందికి పైగా ఉన్న మహిళా ఉద్యోగులు, విద్యార్థినుల దుస్తులు విభిన్నంగా ఉన్నాయి. చాలా ఆకర్షణీయ రంగులతో గీశాడు. ఫ్యాషన్‌గా ధరించే చిరుగుల జీన్స్, దూరంగా కనబడుతున్న హోర్డింగ్స్‌ని కూడా ఫొటో తీసినంత స్పష్టంగా గీసిన చిత్రకారుడు మనుషుల మొహాలని మాత్రమే కాకుండా బిచ్చగాడి పక్కన నిలబడి ఉన్న కుక్క మొహాన్ని కూడా ఎందుకు ఖాళీగా వదిలాడో అంతుపట్టని పజిల్ అనుకుంది వైశాలి. దాన్ని మోడరన్ ఆర్ట్ అనుకోవాలా, జీవితంలో అనూహ్యంగా ఎదురయ్యి జటిలమయిన ప్రశ్నలు వేసి నిలదీసే సమస్యలకి ప్రతీక అనుకోవాలా అని వైశాలి ఆలోచిస్తుంటే, అతను వెనక్కి తిరిగి ఒక్క క్షణం వైశాలిని చూసి మళ్లీ చిత్రం అంతరార్థాన్ని మథనం చేసే పనిలో పడ్డాడు.
చిత్రాల గురించి కనుక్కోవటానికి రాత్రి ఆ ఆర్టిస్ట్ ఫోన్ చేసినప్పుడు ఏక దీక్షగా చూస్తూ ఉండిపోయిన వ్యక్తి గురించి చెప్పింది వైశాలి.
కొన్ని నిమిషాల కిందట శివనాథ్‌ని పరిచయం చేసినప్పుడు ‘‘ఇతనే కదూ అప్పుడు ఆ చిత్రానికి అంతగా ఆకర్షితుడు అయిన వ్యక్తి!’’ అనుకుంది వైశాలి. ఆ విషయం ఇప్పుడు ప్రస్తావించటం సబబుగా ఉంటుందా అన్న ఆలోచనలో పడింది.
‘‘మరీ అంత గంభీరమైన విషయం కాదు. కానీ...’’ అని శివనాథ్ అనటంతో అతని వైపు తిరిగింది.
అప్పటికి శివనాథ్ ఏ విషయం ముందుగా చెప్పాలో ఒక నిర్ణయానికి వచ్చాడు. ‘‘నేను చెప్పాలనుకున్న మొదటి విషయం...’’ చిన్నగా నవ్వాడు. ‘‘అది విన్నాక ఆలూ లేదు చూలూ లేదు కొడుకు పేరు సోమలింగం అన్న సామెతని చాలా దూరదృష్టితో రూపకల్పన చేశారనుకుని హాయిగా నవ్వుకోండి. ఫర్వాలేదు. ఈ అబ్బాయికి కాసింత స్క్రూ లూజ్ అనుకున్నా నాకు అభ్యంతరం లేదు. కానీ, అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. రాజశేఖరం మాస్టారు నాకు చేసిన సాయం అంతా ఇంతా కాదు. నేను ఇంజినీర్‌ని అయ్యానన్నా, ఈ స్థాయికి రాగలిగానన్నా అంతా ఆయన చలవే! నేనేం చేసినా ఆ రుణాన్ని తీర్చుకోలేను. ఆయన పేరు గుర్తుకొచ్చేలా, నిత్యం స్మరించేలా మొదటి సంతానానికి ఆయన పేరు పెట్టుకోవాలనుకుంటున్నాను’’ అంతవరకూ చెప్పాక, ఆ మాటలు ఇంకా పొడిగిస్తే సభ్యత కాదేమో అన్న శంకతో దృష్టి మరల్చి తల దించుకున్నాడు శివనాథ్.
పెళ్లి చూపుల్లో ఇలాంటి ప్రస్తావనా అన్న ఆలోచనతో వైశాలి నుదుటి మీద ముడతలు ప్రత్యక్షమయ్యాయి. అంతలోనే ఒక అల్లరి ఊహ మెదడులో మెదిలి మొహం ప్రసన్నంగా మారింది. సరిగ్గా అప్పుడే శివనాథ్ తలెత్తి ఆమె వంక చూశాడు. ‘‘చిన్నప్పుడే తల్లిదండ్రులని పోగొట్టుకున్నాను. రాజశేఖరం మాస్టారు సాయం చేసేంత వరకూ చాలా దైన్యమైన జీవితాన్ని గడిపాను. కడుపు నింపుకోవటానికి అందుబాటులో ఉన్న ప్రతిపనీ న్యాయబద్ధంగా చేశాను. ఆ విషయం చెప్పుకోవటానికి సిగ్గుపడాల్సిన అవసరం లేదు. అలాగే...’’ అంటూ వాక్యాన్ని పూర్తి చేయకుండా ఆపాడు.
‘నాతో జీవితాన్ని పంచుకునే సహచరి కూడా అలాగే భావించాలని అనుకుంటున్నాను’ అన్నది శివనాథ్ చెప్పకుండా వదిలిన భాగం అనుకుంది వైశాలి. ఏవేవో నియమ నిబంధనలు పెడుతున్నట్లుగా కాకుండా నచ్చచెప్పే విధంగా తన కోరికలు వివరించిన విధానం వైశాలికి నచ్చింది.
ఆ తరవాత కరోనా సమయంలో ఉద్యోగ విధులకి హాజరవటంలో ఇబ్బందుల గురించి మాటలు దొర్లుతున్నప్పుడు వైశాలి చెప్పింది ‘‘మా స్కూల్లో చిత్ర ప్రదర్శన జరిగినప్పుడు మీరొచ్చారు..’’
‘‘అవును’’ అన్నాడు శివనాథ్. అతను క్లుప్తంగా ఒక్క మాటలో చెప్పాడని మాత్రమే అనుకుంది వైశాలి.
అయితే పెళ్లయ్యి కాపురం పెట్టాక అతణ్ని ఆకర్షించిన చిత్రాన్ని ఇంట్లో చూసి... క్లుప్తంగానే కాదు అతని మాటలు నర్మగర్భంగా కూడా ఉంటాయని ఆమెకి తెలిసింది.
‘‘మీరొచ్చి వెళ్లిన తరువాతి రోజు ఆర్టిస్ట్ ఫోన్ చేసి ఈ చిత్రానికి ‘నాట్ ఫర్ సేల్’ అన్న సూచిక పెట్టమని చెప్పాడు. మరి ఇది మీ దగ్గరికి ఎలా వచ్చింది?’’ వైశాలి అడిగింది.
శివనాథ్ చిన్నగా నవ్వి, మెల్లగా చెప్పసాగాడు. ‘‘చిత్రం నాకు అంతగా ఎందుకు నచ్చిందో నాకే స్పష్టంగా తెలియదు. కానీ, దాన్ని సొంతం చేసుకోవాలన్న కోరిక మాత్రం బలంగా కలిగింది. చిత్రానికి చెప్పిన ధర ఎక్కువో తక్కువో చెప్పేంత పరిజ్ఞానం నాకు లేదుగానీ, నా బడ్జెట్‌కి మాత్రం అది అందనిది అనుకున్నాను. చివరికి ధైర్యం చేసి ముంబయిలో ఉన్న ఆర్టిస్ట్ ఫోన్ నంబర్ సంపాదించి మాట్లాడాను. పెయింటింగ్ నాకు బాగా నచ్చిందని, స్కూల్‌కి వచ్చే విరాళానికి గండి కొట్టే ఆలోచన లేదని, కొంచం సమయం ఇస్తే ఆ మొత్తాన్ని వాయిదాల రూపంలో స్కూల్‌కి ఇస్తానని చెప్పాను. ఆర్టిస్ట్ ఒప్పుకుంటాడని అనుకోలేదు. ఎగతాళి చేసి కాల్ కట్ చేస్తాడని అనుకున్నాను. అయితే ‘పెయింటింగ్ ముందు గంటల తరబడి నుంచున్నది మీరేనా?’ అన్న ప్రశ్న అటునుంచి రావటంతో ఆశ్చర్యపోయాను. అవును అని చెప్పాక, ‘వారం తరవాత నేను హైదరాబాద్ వస్తున్నాను. అప్పుడు నేనే స్వయంగా ఆ పెయింటింగ్ నా చేతులతో మీకిస్తాను’ అన్నాడాయన. ఆ విధంగా ఈ పెయింటింగ్ నా దగ్గరికి చేరింది’’
‘‘మిమ్మల్ని ఆ పెయింటింగ్ ఎందుకంతగా ఆకట్టుకుంది?’’ వైశాలి భర్తని అడిగింది.
ఇబ్బందిగా నవ్వాడు శివనాథ్. ‘‘ఇప్పుడా సంగతి మాట్లాడటం నాకు ఇష్టం లేదు. దానికి రెండు కారణాలున్నాయి. మొదటిది- అది ఎందుకు నచ్చిందన్న విషయం నాకే పూర్తిగా బోధపడకుండా గజిబిజిగా అస్పష్టంగా ఉంది. రెండోది- ఇప్పుడే మనిద్దరం కరోనా భయం నీడలో కొత్త జీవితం తీయగా ఆరంభిస్తున్నాం. చేదు విషయాలని జ్ఞాపకం చేసుకోవాల్సిన సమయం ఇది కాదేమో’’
అర్థమయ్యిందన్నట్లు తలూపి అతని భుజం పైన చెయ్యి వేసింది వైశాలి. నిజానికీ ఆమెకి అర్థమయ్యింది ఏమీ లేదు.
శివనాథ్ ప్రతి ఉదయం ఆ చిత్రం ముందు నిలబడి చూస్తూ కాఫీ తాగటం గమనించినప్పుడు ఈయన గారికి ఆ చిత్రంలో ప్రతి రోజూ ఏ అర్థం, పరమార్థం స్ఫురిస్తున్నాయో అనుకుని నవ్వుకునేది వైశాలి.
దేశంలో క్రమంగా కరోనా కేసులు తగ్గుముఖం పట్టసాగాయి. మెల్లగా జనజీవనం సాధారణ స్థితికి రాసాగింది. ఇంకొన్ని రోజులు జాగ్రత్తలు పాటిస్తే రేపో మాపో టీకా వచ్చేస్తుంది అన్న ఆశ అందరిలో పెరిగింది.
రాజశేఖరం మాస్టారు నుంచి ఆ రోజు ఉత్తరం వచ్చింది. భార్యకి చూపిస్తూ ‘‘వైశాలీ! నాకు చాలా ఆనందంగా ఉంది. నిజానికీ పెళ్లయిన వెంటనే వెళ్లి ఆయన ఆశీస్సులు తీసుకుందాం అనుకున్నాను. అప్పుడు ప్రయాణాలు మంచిది కాదని మాస్టారు వద్దన్నారు. ఇప్పుడు పరిస్థితి దాదాపు సాధారణ స్థితికి వచ్చింది కదా. వచ్చే నెల రైళ్లు తిరిగి పట్టాలు ఎక్కాక రమ్మని అన్నారు..’’ సంబరంగా అన్నాడు.
‘‘మా స్కూల్లో కూడా పెద్ద తరగతులకి క్లాసులు మొదలవుతాయని అంటున్నారు..’’ అంది వైశాలి.
‘‘అలాగా? అంటే నీకు సెలవు దొరకదా?..’’ అనుమానంగా అడిగాడు శివనాథ్.
‘‘సెలవు దొరకదన్నది నిజమేకానీ, అసలు సెలవు అక్కరలేదు. ఆయన ఉండేది అనంతపూర్ దగ్గర కదా. శనివారం రాత్రి రైల్లో వెళ్లి ఆయన్ని కలిసి తిరిగి రాత్రికి బయలుదేరి సోమవారం పొద్దునకల్లా హైదరాబాద్‌లో ఉంటాం. ఇక సమస్య ఏముంది?’’ అంది వైశాలి.
‘‘హమ్మయ్యా!’’ అనుకున్నాడు శివనాథ్ సంబరంగా.
‘‘అప్పుడడిగితే కొత్తగా పెళ్లయిన రోజులని ఏమీ చెప్పలేదు. ఇప్పుడు పరిస్థితులు కూడా మెరుగవుతున్నాయి కదా. ఇప్పుడు చెప్పొచ్చు కదా..’’ అతని ఆనందాన్ని అవకాశంగా తీసుకుని వైశాలి ఆ చిత్రం గురించి అడిగింది.
‘‘చెబుతాను..’’ అని శివనాథ్ అంటుంటే వైశాలి అడ్డుపడింది. ‘‘ముందు నాదో సందేహం తీర్చండి. పెళ్లిచూపుల్లో మొదటి సంతానానికి ఆయన పేరు పెడదామని అన్నారు కదా. ఒకవేళ...’’ ఆరోజు కలిగిన చిలిపి ఊహ మళ్లీ పలకరించటంతో వైశాలి వదనం చిరునవ్వుతో మెరిసింది.
దాన్ని అర్థం చేసుకున్న శివనాథ్ ‘‘ముందుగా అమ్మాయి పుడితే పేరేం పెడతారని కదా నీ సందేహం? రాజశ్రీ అనో లేదంటే, రాజ అన్న శబ్దం వచ్చేలా నీకు నచ్చిన పేరు సూచించాలని అడిగేవాణ్ని’’ అన్నాడు.
ఆ వివరణ వైశాలికి నచ్చింది. రాజశేఖరం మాస్టారు చేసిన సాయం గురించి ఆ తరవాత శివనాథ్ చెప్పాడు. ‘‘నేను ఏడో తరగతి చదువుతున్నప్పుడు బైక్ మీద వెళుతున్న తల్లితండ్రుల్ని లారీ ఢీకొని మరణించారు. మా నాన్న చిన్న ప్రైవేట్ ఉద్యోగం చేసేవాడు. ఆయన మరణం తరవాత యాజమాన్యం నుంచి కొద్ది మొత్తం నాకు అందింది. ‘ఈ డబ్బుతో నిన్ను పోషించటమే కష్టం. ఇక చదువు కూడా చెప్పించాలా. నా వల్ల కాదు..’ అన్నాడు వేరే ఊరిలో ఉన్న మా మేనమామ. ‘మా ఊర్లో బడే లేదు..’ అన్నాడు పెదనాన్న. పెదనాన్న మేనమామల తగవుల గుంజాటనలో డబ్బు మాయమయ్యింది. మంచి విద్యార్థి చదువు ఆగకూడదని రాజశేఖరం మాస్టారు స్కూల్ ఫీజ్ కట్టారు. నేను న్యూస్ పేపర్లు, పాల ప్యాకెట్లు వేయటం మొదలుపెట్టాను. దొరికిన పని చేస్తూ రెండున్నరేళ్లు చాలా అవస్థలు పడ్డాను.
‘‘పదో తరగతిలో మంచి మార్కులొస్తే కొన్ని ఇంటర్ కళాశాలలు హాస్టల్ వసతితో పాటు, ఎంసెట్‌్ శిక్షణ ఉచితంగా ఇస్తాయి, గుర్తుంచుకో అని రాజశేఖరం మాస్టారు చెప్పిన మాటలు మనసులో పెట్టుకుని ఆ లక్ష్యాన్ని సాధించాను. అలాగే సవాళ్లని ఎదుర్కొంటూ ఎంసెట్ పరీక్ష కూడా బాగా రాశాను. అయితే, ప్రశ్నపత్రం లీకయ్యిందని పరీక్ష రెండో సారి పెట్టారు. మొదటి పరీక్ష రాయగానే హాస్టల్ ఖాళీ చేయాల్సొచ్చింది. నిలుËవ నీడ లేని నాకు రాజశేఖరం మాస్టారు ఆశ్రయం ఇచ్చారు. రెండో సారి ఎంసెట్ పరీక్ష ఎలా రాస్తానో అన్నదానికన్నా అసలు పరీక్షకి సమయానికి హాజరు కాగలనా లేదా అన్న ప్రశ్న భూతంలాగా నన్ను భయపెట్టే పరిస్థితి ఎదురయ్యింది..’’ శివనాథ్ చెప్పాడు.
‘‘ఏమయ్యింది?’’ కుతూహలంగా అడిగింది వైశాలి.
‘‘నేను పరీక్ష రాయాల్సిన కళాశాల చాలా దూరంగా పొలిమేరల్లో ఉంది. ఒక్క నిమిషం ఆలస్యమైనా లోపలికి వెళ్లనివ్వరు కాబట్టి ఉదయాన్నే బయల్దేరి వెళ్లాలని అనుకున్నాను. బస్టాపులో అటువైపు వెళ్లే బస్సు గురించి ఒక వ్యక్తిని అడిగితే తప్పుగా చెప్పాడు. బహుశా ఆయన సరిగా వినలేదేమో. ఆ సంగతి పావు గంట బస్సు ప్రయాణం తరవాత తెలిసింది. ఇంకో బస్సు ఎక్కి గంట తరవాత సరైన స్టాప్‌లోనే దిగాను. అక్కడి నుంచి కాలేజీ కిలోమీటర్ దూరం అని చెప్పారు. అటువైపు వెళ్లే బస్సులు ఎప్పుడోగానీ రావన్నారు. పరుగులాంటి నడక అందుకున్నాను. హడావుడిగా మలుపు తిరుగుతూ ఎదురుగా వస్తున్న ఒక కారు కింద పడబోయాను...’’
‘‘అయ్యో... ఆ తర్వాత’’ ఉత్కంఠగా అడిగింది వైశాలి.
‘‘కారు నడుపుతున్న వ్యక్తికి నామీద పట్టరాని కోపం వచ్చింది. ‘నీకేమన్నా అయితే నేను ఇబ్బందుల్లో పడేవాణ్ని’ అంటూ చెయ్యెత్తాడు. పరీక్ష సమయం అవుతోంది సార్. క్షమించండి అంటూ చేతులు జోడించి ప్రాధేయపడ్డాను. ఆయన కరిగినట్లు కనిపించాడు. పరీక్ష ఎక్కడో కనుక్కున్నాడు. కారులో అక్కడ దింపుతానని ఎక్కించుకున్నాడు. కానీ, అయిదు నిమిషాల తరవాత నన్ను దిగమన్నాడు. పక్కన కూర్చున్న కూతురి మీదగా ఒంగుని కిటికీలోకి తల పెట్టి రోడ్డు మీద నిలబడ్డ నన్ను చూస్తూ ఉమ్మి ‘‘ఒళ్ళు దగ్గరపెట్టుకుని రోడ్డు మీద నడువు. ఇది నీకో పాఠం. ఇప్పుడు ఆ కాలేజీ ఇంకో కిలోమీటర్ దూరం ఎక్కువ..’’ అన్నాడు.
‘‘అయ్యో.. ఎంత పని చేశాడు. తర్వాత ఏం చేశారు’’ అడిగింది వైశాలి కళ్లు విశాలం చేస్తూ.
‘‘నాకు ఏడుపు తన్నుకొచ్చింది. జీవితం మీద విరక్తి కలిగింది. నా దురదృష్టానికి నన్ను నేను తిట్టుకున్నాను. కారు ముందుకి వెళుతుంటే దాని కిటికీలోంచి ఆ అమ్మాయి ఓ రుమాలు కింద పడేసింది. నాకోసమే దాన్ని వేసిందని అర్థమై పరుగున వెళ్లి తీసి తీశాను. రెండు పది రూపాయల నోట్లున్నాయి. ఆటోలో వెళ్లటానికి ఇచ్చి ఉంటుందని వెంటనే స్ఫురించింది’’ ఆ నాటి సంగతులు గుర్తు చేసుకుంటూ చెప్పాడు శివనాథ్.
‘‘ఎంసెట్‌లో మంచి ర్యాంక్ వచ్చింది. స్కాలర్‌షిప్ దక్కింది. రాజశేఖరం మాస్టారి ఔదార్యంతో ఇబ్బందులు లేకుండా చదువు పూర్తి చేసుకున్నాను. ఇంకొంచెం కష్టపడితే ఉద్యోగం దొరికింది అదీ నా కథ..’’ అని శివనాథ్ ముగించాడు.
ట్రైన్ రిజర్వేషన్లు మొదలు పెట్టిన రోజు వైశాలి చూసేసరికి వెయిటింగ్ లిస్ట్ అయిదు నడుస్తోంది. శివనాథ్‌కి ఆ విషయం చెబుతూ ఇప్పటికి వెయిటింగ్ లిస్ట్ అయిదు ఆరు. చూద్దాం దొరకొచ్చు. అంది.
‘‘ఎలాగయినా మనం వెళ్లాలి’’ అన్నాడు శివనాథ్.
మూడోరోజు వెయిటింగ్ లిస్ట్ తగ్గిపోయి వాళ్ల టికెట్లు కన్‌ఫం అయ్యాయి.
‘‘చూశారా. మీ సంకల్పం గట్టిది’’ అంది వైశాలి. అంతలోనే సన్నగా నవ్వుతూ ‘‘నిజానికీ మీరు నాకు థాంక్స్ చెప్పాలి. నా లక్కీ హాండ్‌తో బుక్ చేశాను. టికెట్లు దొరికాయి’’ తల ఎగరేస్తూ చెప్పింది.
‘‘తప్పకుండా చెబుతాను. నిజానికి టికెట్లు దొరికినందుకు మనం ముఖ్యంగా కృతజ్ఞతలు చెప్పాల్సిన వాళ్లని కూడా విస్మరించకుండా స్మరించుకోవాలి కదా..’’ అన్నాడు శివనాథ్, వెళ్లి పెయింటింగ్ ముందు నిలబడుతూ.
అయోమయంగా అతని పక్కన నిలబడింది వైశాలి.
ఆ చిత్రంలో దాగున్న మర్మం తెలిసిందన్నట్లు శివనాథ్ పెదవులు చిరునవ్వుతో మెరిశాయి.
‘‘టికెట్లు కన్‌ఫం అయ్యాయి కాబట్టి బుక్ చేసిన నీది లక్కీ హ్యాండ్ అన్నావు. థాంక్స్ చెప్పించుకోవాలి అనుకున్నావు. కానీ మన ప్రయాణం ఖాయం అవటానికి నీ చేతిలో అదృష్టం ఉందని అనుకోవటానికి ముఖ్య కారణం అయిన వారి గురించి నువ్వు పట్టించుకోలేదు..’’ అతని స్వరంలో ఆరోపణ లేదు ఆలోచించు అన్న మెత్తటి సూచన ఉంది.
ఆ మాటలు మెత్తగా అయినా గుచ్చుకున్నాయేమో ‘‘ఎవరండీ ఆ మహానుభావులు?’’ వ్యంగ్యంగా అడిగింది వైశాలి.
‘‘ముందుగా కొనుక్కుని ఆ తరవాత టికెట్లు రద్దు చేసుకున్న వారి వల్ల మన ప్రయాణం ఖాయం అయ్యింది. వాళ్లెవరో మనకి తెలియదు. నిజానికీ వాళ్లకి థాంక్స్ చెప్పాలి కదా!? వాళ్లు ఈ బ్రీఫ్‌కేస్ పట్టుకున్న వ్యక్తిలా ఉండొచ్చు. చేతిలో వాకింగ్ స్టిక్ ఉన్నా నిటారుగా నడుస్తున్న ఈవిడ లాంటి వాళ్లు కావొచ్చు. వీళ్ల పోలికలు కనబడవు. అలాగే టికెట్ వద్దనుకున్న వాళ్లు కూడా ఎలా ఉంటారో మనకి తెలియదు..’’
వైశాలి అప్రయత్నంగా తలూపింది. శివనాథ్‌ని ఆ పెయింటింగ్ అంతగా ఆకర్షించటానికి కారణం లీలగా తెలిసినట్లయ్యింది.
‘‘అసలే హడావుడి పడుతున్న నన్ను తన తండ్రి ఇంకా ఇబ్బంది పెట్టాడని జాలిపడ్డ ఆ అమ్మాయిని నేను సరిగా చూడనే చూడలేదు. ఆమె ఎలా ఉంటుందో నాకు తెలియదు. వయసు తొమ్మిదా పదా పన్నెండా నాకు తెలియదు. తెలిసింది ఏంటంటే సాయం చేయాలన్న గొప్ప మనసు ఆ అమ్మాయికి ఉందని మాత్రమే. ఈ నీలం డ్రెస్ చూస్తుంటే ఆ రోజు ఆ అమ్మాయి డ్రెస్ గుర్తుకొస్తుంది. ‘ఆమె సాయం లేకుంటే పరీక్ష రాసేవాణ్ని కాదు. తరవాత నా జీవితం ఏమయ్యేదో!?’ అనుకుంటూ కృతజ్ఞతలు చెప్పుకుంటాను. ఒంగి నడుస్తున్న ఈయనని చూస్తే పెదనాన్న గుర్తుకొస్తాడు. చదువు చెప్పించకపోయినా నా తమ్ముడి కొడుకు నా దగ్గరే ఉండాలని పెదనాన్న పంతం పట్టి ఉంటే ఎన్ని కష్టాల్లో ఉండేవాణ్నో అని తలచుకుంటే ఉద్యోగంలో ఎదుర్కొంటున్న సమస్యలు దూదిపింజలా ఎగిరిపోతాయి. ఒక్కోసారి ఒక్కో విషయంలో ఒక్కో వ్యక్తి గుర్తొస్తారు’’ గొంతుకి ఏదో అడ్డొచ్చినట్లు శివనాథ్ మాటలు ఆగాయి.
‘అవును నిజమే అనుకుంది’ వైశాలి. వైశాలి టెన్త్ పరీక్షకి వెళుతున్నప్పుడు హాల్ టికెట్ పడిపోయింది. చూసుకోకుండా వెళ్లిపోతుంటే పరుగున వచ్చి ఒక చిన్నపిల్లాడు ఇచ్చాడు. శివనాథ్ భుజం పైన చెయ్యి వేసి పక్కన నిలబడి పెయింటింగ్‌లో ఆ పిల్లాణ్ని గుర్తుపట్టే ప్రయత్నం చేసింది వైశాలి.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Chidambaram: మహిళా రిజర్వేషన్.. నీటిలో జాబిల్లి: కాంగ్రెస్ నేత చిదంబరం
-
ODI WC 2023: వరల్డ్ కప్ వారిదే.. ఫేవరెట్ టీమ్ చెప్పేసిన సునీల్ గావస్కర్
-
Smile Pinki: ఆస్కార్ విజేత పింకీ ఇంటికి కూల్చివేత నోటీసులు
-
Kantara: ‘కాంతార’కు ఏడాది.. నిర్మాణ సంస్థ స్పెషల్ పోస్ట్
-
Vijayawada: విద్యార్థుల అరెస్ట్.. రణరంగంగా మారిన ధర్నా చౌక్
-
Palak Gulia: సరదాగా మొదలుపెట్టి.. షూటింగ్లో స్వర్ణం నెగ్గి