ఉత్తములు

కథావిజయం 2020 పోటీల్లో ప్రోత్సాహక బహుమతి (రూ.3 వేలు) పొందిన కథ

Updated : 03 Jul 2021 17:42 IST

కథావిజయం 2020 పోటీల్లో ప్రోత్సాహక బహుమతి (రూ.3 వేలు) పొందిన కథ

ఎవరో పెద్ద ఆఫీసరు ‘బడి’ని చూడ్డానికి వస్తున్నాడనే వార్త ఊరంతా గుప్పుమంది. హెడ్‌ టీచరు రాజారెడ్డి సారు చుట్టుపక్కల స్కూళ్లలోని టీచర్లకు, ఊర్లోని పెద్దలకు, మండలంలోని విలేకరులకు ఆరోజు స్కూళ్లోనే అదిరిపోయే విందు భోజనాలు ఏర్పాటు చేస్తున్నాడనే వార్త ఎంత రహస్యంగా ఉంచాలన్నా కుదరలేదు. ఎందుకంటే మైదుకూరు నుంచి వచ్చిన వంట మాస్టారు బిర్యాని బాషా, అతని అనుచరులు చేస్తున్న వంటల ఘుమఘుమలు ఊరంతా వ్యాపించి అసలు విషయం అందరికీ తెలిసిపోయేలా చేసింది. 

పెద్దాఫీసరును ఎలాగైనా మెప్పించాలని వారం రోజుల నుంచి రాజారెడ్డి సారు క్షణం తీరిక లేకుండా ఏర్పాట్లు చేస్తున్నాడు. మొత్తానికి స్కూలు కొత్త పెళ్లికూతురులా ముస్తాబైంది. రంగుల షామియానాలు, కొబ్బరి ఆకుల తోరణాలు, అందమైన ముగ్గులు... స్కూలు పక్కనున్న తార్రోడ్డు మీదనుంచి బస్సులు, ఆటోల్లో వెళ్లే ప్రయాణీకులు ఆసక్తిగా గమనిస్తూ వెళుతున్నారు. 

‘‘గుడ్‌మార్నింగ్‌ సార్‌’’ రామప్ప, చెన్నయ్య సార్‌ను పలకరించాడు. ఏదో పరధ్యానంగా ఉన్న చెన్నయ్య సార్‌ రామప్ప పిలుపుతో ఆలోచనల నుంచి బయటికి వస్తూ... ‘రా రామప్పా... కూర్చో...’ అంటూ కుర్చీ చూపాడు.

అదో చిన్న పల్లెటూరు. ఊరికి ఓ వైపున ఉన్న ఎలిమెంటరీ స్కూల్‌. కొత్తగా వేసిన తార్రోడ్డుకి ఇటువైపు చుట్టూ ప్రహారీ గోడతో ఉన్న మూడు గదులు, అటువైపు రెండేళ్ల క్రితం కట్టిన అదనపు తరగతి ఉన్నాయి. ఆ గదిలోనే ఐదవతరగతి పిల్లలకు రోజూ చెన్నయ్య సార్‌ పాఠాలు చెబుతుంటారు.

చెన్నయ్య సార్‌ కూర్చున్న కుర్చీ పక్కనున్న ప్లాస్టిక్‌ కుర్చీలో రామప్ప కూర్చున్నాడు. అక్కడ నలభై మంది ఉండాల్సిన పిల్లల్లో ఆ రోజు ఐదారు మంది కంటే ఎక్కువ లేరు. మిగతా పిల్లలంతా స్కూళ్లో వంట కార్యక్రమాల్లో సాయం చేయడానికి వెళ్లారు.

‘‘అబ్బ రాత్రంతా నిద్దరలేదు సార్‌. తిర్నాల లేపాడు పెద్దసారు. రెండు పొట్టేళ్లు కోయించాడు. అరవై కేజీల చికెనూ, ఇంకా పది కేజీల పచ్చాపలు.. ఫ్రైకంట.. ఆ వచ్చే ఆఫీసరు సంగతేమో కానీ పెండ్లిమైన ఖర్చు పెడుతున్నాడు...’’ అంటూ ఆశ్చర్యం ప్రకటించాడు రామప్ప.

స్కూలుకు కొంచెం దూరంలో చిన్న బంకు పెట్టుకొని బతుకుబండి లాక్కొస్తున్నాడు రామప్ప. పదో తరగతిలో చదువు మానేసాడు. మంచి ఆలోచనాపరుడే కానీ.. మెల్ల కన్ను, సన్నగా... చూడ్డానికి అమాయకంగా ఉంటాడు. పేపర్‌ చదవడానికి ప్రతిరోజూ చెన్నయ్య సార్‌ దగ్గరికి వస్తాడు. ఎంతోమంది టీచర్లు ఆ స్కూలుకు వచ్చినా చెన్నయ్య సార్‌ లాంటి మంచి మనిషి ఇంతవరకూ రాలేదని రామప్ప నమ్మకం.

‘‘లక్ష్మీదేవి గురించి ఏమైనా తెల్సిందా రామప్పా’’ ఆతృతగా అడిగాడు చెన్నయ్య సార్‌.

‘‘లేదు సార్‌. అయినా ఆయమ్మి గురించి మర్సిపోండి సార్‌. లేకపోతే మీకు శానా సమస్యలు వస్తాయి. ఇప్పటికే మీ ఇద్దరి గురించి ఊర్లో రకరకాలుగా అనుకుంటున్నారు’’ హితవు చెప్పాడు రామప్ప.

చెన్నయ్య సార్‌కు ఇరవై నాలుగు సంవత్సరాలుంటాయి. ఎత్తు మనిషి. ఎత్తుకు తగ్గ లావు. చామనఛాయ, అయినా ముఖంలో గొప్పకళ. చిన్నప్పటి నుంచీ చదువులో అద్భుతంగా రానించేవాడు. కానీ, విధి పగబట్టి ఐదో తరగతిలో నాన్నను, పదో తరగతిలో అమ్మను దూరం చేసి దిక్కులేని అనాథగా మార్చింది. అయితే దేవుడు సైన్స్‌మాస్టర్‌ ‘క్రిష్ణారెడ్డి’ సార్‌ రూపంలో ఆదుకున్నాడు.

‘‘రాత్రి వెంకట్రామయ్యను పోలీసులు విడిచిపెట్టారంట సార్‌. ‘రాజమ్మ’... అదే సార్‌ వెంకట్రామయ్య భార్య తన ఇద్దరు పిల్లలతో వెళ్లి రాజారెడ్డి సార్‌ కాళ్లు పట్టుకొనే సరికి ఎవరెవరితోనో మాట్లాడి మొత్తానికి విడిపించుకొని వచ్చాడు.

‘సారు గొప్పదనం ఊర్లో కథలు కథలుగా చెప్పుకుంటున్నారు...’ 

వెంకట్రామయ్య ఒకప్పుడు బాగా బతికిన రైతే కానీ మందుకు బానిసై... నాటుసారా కాయడం మొదలుపెట్టి పోలీసులకు దొరికిపోయాడు.

‘‘పిల్లలకు యా పొద్దూ ఒక్క అచ్చరం ముక్క చెప్పకపోయినా ఇట్టాంటి పనులు జేసి ఊర్లోవాళ్లు తన జోలికి రాకుండా చేస్కుంటాడు పెద్దసారు. కనీసం ఇరవై లక్షలు ఊర్లో అప్పులు ఇచ్చి వున్నాడు, రెండు రూపాయల వడ్డీకి. మొన్నటికి మొన్న పోలేరమ్మ గుడికాడ పెద్దాయన విగ్రహం పెట్టించి సర్పంచ్‌ సోమిరెడ్డి నోరు మూయించాడు...’’

రాజారెడ్డి సార్‌ లీలలన్నీ వరుసపెట్టి చెప్పుకొచ్చాడు రామప్ప.

చెన్నయ్య సార్‌ యాంత్రికంగా వింటున్నాడు తప్ప అతని మనసు లక్ష్మీదేవి ఆలోచనలతో నిండిపోయి ఉంది. నాలుగు రోజులైంది తనని చూసి. ఎక్కడికెళ్లిందో... ఏమైపోయిందో...

కిటికీలోంచి బయటికి చూశాడు. పచ్చని వరిపైరు మధ్యలో లక్ష్మీదేవి నిలబడి ఉన్నట్లు అనిపించింది. నారాయణ రెడ్డి పది ఎకరాల పొలం పక్కన, తరగతి గది ఆనుకొని వున్న అర్దెకరం లక్ష్మీదేవి అమ్మదేనట. తను పుట్టిన మూడో ఏట తండ్రి దేశాలు పట్టి వెళ్లిపోయాడట. ఆ దిగులుతో లక్ష్మీదేవి తల్లి మానసికంగా కుంగిపోయి రోగిష్టిలా తయారైందట. రామప్పే చెప్పాడు ఈ సంగతులన్నీ.

వరినాట్లు వేసే స్త్రీల మధ్య బాపు బొమ్మలా వున్న లక్ష్మీదేవిని మొదటిసారి చూశాడు చెన్నయ్య సారు... ఆ తర్వాత రోజూ ఆమెను గమనించేవాడు. కల్మషం లేని నవ్వు, సహజ సౌందర్యం.. నండూరి ఎంకిలా.. భావ కవుల ఊహా ప్రేయసిలా రకరకాలుగా అనిపించేది తనకు.

పొలం దగ్గరికి వెళ్లే ప్రతిసారీ తనను పలకరించేది. గలగలా సెలయేరులా నవ్వేది. తను ఏమైనా చిరుతిండ్లు తింటూ ఉంటే సంకోచం లేకుండా చెన్నయ్య సార్‌కి పెట్టేది. పోయిన నెల తన గురువు, తన దైవం, సర్వస్వం అయిన క్రిష్ణారెడ్డి సార్‌ హార్ట్‌ ఎటాక్‌తో చనిపోయాడని తెలిసి అంత్యక్రియలకు వెళ్లి వచ్చినప్పటి నుంచీ తను ముభావంగా ఉండేవాడు. సారుతో తన అనుబంధం గుర్తొచ్చి కన్నీళ్లు ధారగా కారిపోయేవి. జీవితం శూన్యంగా అనిపించేది. ఆ దిగులు సముద్రంలో కొట్టుకుపోతున్నప్పుడు నాలుగు రోజుల క్రితం తాను ఒంటరిగా గదిలో ఉన్నప్పుడు ఎదురుగా వచ్చి నిలబడింది. హఠాత్తుగా గాఢంగా కౌగిలించుకొంది. పెదవులపై ముద్దు పెట్టుకొంది. షాక్‌లోంచి తాను కోలుకోకముందే...‘‘సదువు చెప్పిన సారు పోయాడని సిన్నపిల్లోని లెక్కన ఏడుస్తాండావు సూడు.. నువ్వు అసలైన మనిషివి సారూ’’ అని కళ్లలోకి చూస్తూ మళ్లీ పెదవులపై ముద్దు పెట్టుకొని.. వెళ్తూ వెళ్తూ తలుపు దగ్గర ఆగి వెనక్కి తిరిగి చూసి మనోహరంగా నవ్వి మాయమైంది. ఆ తర్వాత ఇంతవరకూ కనిపించలేదు.

‘‘లక్ష్మీదేవిని నేను పెండ్లి చేసుకుంటే ఎలా వుంటుంది రామప్పా..’’ సూటిగా అడిగాడు చెన్నయ్య సారు. 

‘‘మీకేమైనా పిచ్చా సార్‌. ఆయమ్మిని నారాయణరెడ్డి పెట్టుకొని వున్నాడని ఊర్లో అందరికీ తెలుసు.. పోయి పోయీ ఆ పిల్లను... వద్దు సార్‌... అట్టాంటి ఆలోచనలు ఇడ్సిపెట్టండి’’ కరాఖండీగా చెప్పాడు రామప్ప.

ఒక విద్యార్థి పరుగెత్తుకుంటూ వచ్చి... ‘‘సార్‌ పెద్ద సార్‌ పిలుస్తా వున్నాడు’’ అని చెప్పి అంతే వేగంగా వెనుదిరిగి వెళ్లిపోయాడు...

చెన్నయ్య సారు రామప్పతో చెప్పి తార్రోడ్డు దాటి మెయిన్‌ స్కూల్‌ బిల్డింగ్‌ వైపు వచ్చాడు. గోడవారగా వరుసగా నాలుగు పొయ్యిలు పెట్టి బిర్యానీ బాషా అతని నలుగురు అనుచరులు వంటలు వండుతున్నారు.. రాజారెడ్డి సార్‌ పనులన్నీ పర్యవేక్షిస్తూ కలియ తిరుగుతున్నాడు.

‘‘గుడ్‌ మార్నింగ్‌ సార్‌’’ చెన్నయ్య సార్‌ విష్‌ చేశాడు. 

‘‘గుడ్‌ మార్నింగ్‌ చెన్నయ్యా... టిఫిన్‌ తెప్పించాను. నీకోసం సపరేటుగా పొంగళి తెప్పించాను.. తిను పో’’ అంటూ పురమాయించాడు.

‘‘అయ్యో వద్దు సార్‌... ఇప్పుడే కొండయ్య కాడ ఇడ్లీలు తిన్నాను. ఆకలిగా లేదు’’ అన్నాడు.

‘‘ఇడ్లీలు ఏమైతాయి... పొంగళి బాగుంది తినుపో’’ మళ్లీ చెప్పాడు...

అంత సులువుగా ఆయన వదలడని.. ఆఫీసు గదిలోకి వెళ్లి పొంగళి తిని బయటికి వచ్చి... ట్యాప్‌ దగ్గర చేయి కడుగుతూ వుంటే 

‘‘ఎప్పుడూ పిల్లలకు నాలుగు ముక్కలు సదువు చెప్పడమే కాదు చెన్నయ్య సార్‌.. అప్పుడప్పుడూ ఇలా పది మందికీ భోజనం పెట్టిస్తే పుణ్యం వస్తుంది.. బెన్నే పెండ్లి అయితది’’ పెరుగు పచ్చడిలోకి క్యారెట్‌ ముక్కలు కోస్తున్న బలరామయ్య గట్టిగా అనేశాడు. అక్కడున్న వారంతా పకపకా నవ్వారు. ఇవేమీ పట్టించుకోకుండా చెన్నయ్య సార్‌ బయటికి వచ్చాడు.

బయట తన దగ్గర చదివి, హైస్కూల్‌ విద్య పూర్తిచేసిన గంగిరెద్దులోళ్ల పిల్లలు ముగ్గురూ నిలబడి వున్నారు. వారందరికీ ఇడుపులపాయ ట్రిపుల్‌ ఐటీ కాలేజీలో సీట్లు వచ్చాయి. చెన్నయ్య సార్‌కు వారిని చూసి చాలా సంతోషం వేసింది... ‘‘మీరు లేకపోయి వుంటే మా సదువు మధ్యలోనే ఆగిపోయి వుండేది సార్‌’’ అంతా మీ దయ’’ అన్నాడు సైదులు అనే విద్యార్థి.

‘‘అదేం కాదురా... మీరు కష్టపడి చదివి సీటు తెచ్చుకున్నారు. ఇంకా బాగా చదవాలి’’ అని వారిని ప్రోత్సహించి పంపాడు.

ఇక అక్కడ తనకు ఏమీ పనిలేనట్లు దూరంగా వున్న భూతప్ప స్వామి దేవాలయం వైపు బయలుదేరాడు. దారిలో ఐదారు మంది పిల్లలు తనను అనుసరించారు. కడప శ్రీశైలం బస్సు ఎదురైంది దారిలో. ‘‘సమయం పన్నెండు కావస్తోంది’’ అనుకున్నాడు చెన్నయ్య సారు. దేవాలయం తనను హరిత హస్తాలతో ఆహ్వానిస్తున్నట్లు అనిపించింది. బోరింగ్‌ దగ్గర చల్లని నీరు తాగి అరుగు మీద కూర్చున్నాడు. పిల్లలు పక్కన కూర్చున్నారు. 

ఆయనకు పిల్లలంటే ఇష్టం. వారితో మాట్లాడడమంటే ఇష్టం. కలిసి ఆడటం.. పాడటం.. కలలు కనడం, కల్మషం లేకుండా జీవించడం ఇష్టం. తనకు బ్యాంకులో మేనేజరు ఉద్యోగం వచ్చినా వదలుకొని స్కూల్‌ టీచరుగానే ఉండిపోయాడు ఆ ‘‘ఇష్టం’’ కారణంగానే.

‘‘అరె... ఆ ఈగలు తోలుకోరా సామీ... చూళ్లేక సస్తున్నాం’’ జాఫర్‌ అనే విద్యార్థి మోకాలు గాయం మీద కూర్చున్న ఈగలు తోలుతూ చెప్పాడు పక్కనున్న విద్యార్థి.

‘‘నీ పుండు పెద్దదైంది కదరా... మందు అయిపోయిందా?’’ అడిగాడు.

‘‘ఇంకా వుంది సార్‌.. ఇది పోతాంది, వచ్చాంది’’ ఈగలు తోలుకుంటూ చెప్పాడు జాఫర్‌.

రాజారెడ్డి సారు ఊర్లో పెద్దలతో తలుపు వేసుకొని మీటింగ్‌లో వున్నప్పుడు పిల్లలు అల్లరి చేశారని మగ పిల్లల్లో కొందరిని బడి చుట్టూ మోకాళ్ల మీద ఒక రౌండ్‌ కొట్టించాడట. చాలామందికి మోకాళ్ల దగ్గర చర్మం ఎర్రగా కమిలి రక్తం కారింది. చెన్నయ్య సార్‌ ఆయింట్‌మెంట్‌ తెచ్చి ఇచ్చాడు. జాఫర్‌ విషయంలో చీము పట్టి గాయం కాస్తా పుండుగా మారింది.

‘‘నమస్తే చెన్నయ్య సార్‌...’’ ఎవరిదో పిలుపు విని తలెత్తి చూశాడు. ఎదురుగా టీవీఎస్‌ బండి మీద జనార్ధన్‌ సారు.. ఆయన పక్కనున్న పల్లెటూరి స్కూల్‌ హెడ్‌ టీచరు. 

‘‘నమస్తే సార్‌ రండి’’.. అని పిలిచాడు.

ఆయన అక్కడినుంచే మాటలు పెట్టుకున్నాడు.

‘‘ఏం సార్‌... వంటలు ఎంతవరకు వచ్చాయి?... అయినా మీ రాజారెడ్డి సార్‌తో ఏ విషయంలోనూ పోటీ పడలేం నాయనా.. ఖర్చుకు యెనకాడడు.. ఎంత దూరమైనా పోతాడు’’.. అన్నాడు జనార్ధన్‌ సారు.

చెన్నయ్య సారు నవ్వి ఊరుకున్నాడు.

‘‘అయినా నీకు ఇవన్నీ ఇష్టం ఉండదులే.. వెంకటాపురం హైస్కూల్‌ టీచర్లు చెపుతా వుంటారు. పది ఊర్ల పిల్లలు అక్కడ వున్నా... అన్ని తరగతుల్లో మీ ఊరి పిల్లలే ఫస్ట్‌ వస్తున్నారంట. ట్రిపుల్‌ ఐటీలో కూడా మీ స్టూడెంట్స్‌కే సీట్లు వస్తున్నాయంట గదా... నువ్వు కష్టపడి సదువు చెపితే అదంతా రాజారెడ్డి సార్‌ అకౌంట్‌లో వేస్తున్నారు...’’ అన్నాడు.

ఇంతలో రామప్ప వచ్చాడు. ‘‘పెద్దసార్‌ మిమ్మల్ని పిలుస్తున్నాడు సార్‌.. ఏదో రాయాలట’’ అన్నాడు.

చెన్నయ్య సార్‌ బయలుదేరాడు.. రామప్ప, జనార్ధన్‌ సార్‌ ఏదో మాటల్లో పడిపోయారు.

‘‘ఏంటి రామప్పా విశేషాలు?’’ అడిగాడు జనార్ధన్‌ సారు. భోజనాలకు ఇంకా సమయం వుంది. ఇప్పుడే అక్కడికి వెళ్లి ఏమీ చేసేది లేదని అతని ఆలోచన.

‘‘ఏముంటాయి సార్‌ విశేషాలు.. ఇప్పుడు రాజారెడ్డి సార్‌ ఇచ్చే పార్టీ గురించి, పార్టీకి వచ్చే పెద్ద ఆఫీసర్‌ గురించే అందరూ మాట్లాడుకుంటున్నారు’’ అన్నాడు రామప్ప.

‘‘అంతా బాగానే వుంది కానీ స్కూల్లోనే మందు తాగడం... రాజారెడ్డి సార్‌ విషయంలో నాకు నచ్చడంలేదు.

‘‘మీ ఊళ్లోవాళ్లు ఏమీ అనరా’’ ఆరా తీశాడు జనార్ధన్‌ సారు.

‘‘ఆయన ఎమ్‌.ఎల్‌.ఎ. మనిషి సార్‌... ఆయన జోలికి పొయ్యే ధైర్యం ఎవరికుంది.’’ మనసులో మాట బయటపెట్టాడు రామప్ప.

‘‘చెన్నయ్య సార్‌ తాగడా...’’

‘‘అయ్యయ్యో! దేవుడు సార్‌ ఆయన, ఏమీ దురలవాట్లు లేవు. మహానుభావుడు’’

‘‘ఎవరో అమ్మాయితో ప్రేమ వ్యవహారం...’’]

‘‘ఉత్త పుకార్లు సార్‌.. చెన్నయ్య సారుకు అంత సీన్‌ లేదు’’ వెనకేసుకొచ్చాడు రామప్ప.

ఇంతలో విలేకరి ప్రసాదు తన కొత్త పల్సర్‌ బండిమీద స్కూలువైపు వెళ్లడం ఇద్దరూ గమనించారు.

‘‘చూశావా ఎంత ముందే వచ్చాడో...’’ జనార్ధన్‌ సార్‌ అన్నాడు నెమ్మదిగా.

‘‘రేపు పేపర్లో చూడాలి నాసామిరంగా... ఉన్నేటియీ లేనేటియీ అన్నీ కలిపి రాజారెడ్డి సార్‌ను అక్షరాల మీద ఆకాశానికి ఎత్తుతాడు’’ చెప్పాడు రామప్ప.

భోజనాల వేళ కావస్తుండటంతో ఒక్కొక్కరుగా టీచర్లు - రాజారెడ్డి స్నేహితులు, ఛోటా మోటా నాయకులు లొట్టలేసుకుంటూ.. రాజారెడ్డి సార్‌ పార్టీకి వస్తున్నారు. టీవీఎస్‌ ఎక్కి జనార్ధన్‌ సారు రామప్ప కూడా బయలుదేరారు.

కరెక్టుగా ఒంటిగంటకు రెండు కార్లలో మందీ మార్భలంతో ‘‘రాజూ వెడలె రవితేజములరలగ’’ అన్నట్లు అధికారి దిగాడు. రాజారెడ్డి సారు తన చాతుర్యమంతా ఉపయోగించి ఆయనకు ఘన స్వాగతం పలికాడు.

ఏకాంతంగా ఒక చెట్టుకింద పెద్ద టేబుల్‌ వేసి ఇరవై రకాల వంటలు కొసరి కొసరి వడ్డించాడు. మిగతా వారందరికీ వారి వారి స్థాయికి తగ్గట్టు ఏ లోటూ రాకుండా శ్రద్ధగా ఏర్పాట్లు చేశాడు.

గంటసేపు అన్ని రకాల ఆహార పదార్థాలు తృప్తిగా భుజించాడు అధికారి. చివర్లో స్పెషల్‌గా కట్టించిన ఐదువందల రూపాయల స్పెషల్‌ కిళ్లీ సమర్పించాడు వినయంగా రాజారెడ్డి సారు.

ఇద్దరూ లేచి ఆఫీసు గదిలోకి వెళ్లారు. అధికారి ఏదో కవరు తీసి రాజారెడ్డి సార్‌ చేతిలో పెట్టాడు. అదేమిటో అర్థంకాక కవరు ఓపెన్‌ చేసి పేపర్లు బయటికి తీశాడు.

ఐదు పేజీల ఉత్తరం.. మొత్తం తన అవినీతి జీవితం గురించి ముఖ్యమంత్రికి వివరిస్తూ రాసిన లేఖ. అక్షరాలను చూసి పోల్చుకున్నాడు రాజారెడ్డి.. ఆయనక కళ్లు ఎర్రబడ్డాయి. కిళ్లీ నములుతూ నిదానంగా.. తుంపర్లు పడకుండా అనునయంగా చెప్పాడు అధికారి...’’ ఇవన్నీ మామూలే.. జాగ్రత్తగా వుండాలి. కానీ మీ ఏర్పాట్లు బాగున్నాయి. పెళ్లయిన కొత్తలో మా అత్తవారు ఒకసారి ఇలాంటి విందు ఇచ్చారు. మళ్లీ ఇప్పుడు మీరు. గుర్తు పెట్టుకుంటాను. సొద్దరొట్టెల చాపల పులుసు.. అబ్బా ఆ కాంబినేషనే సూపర్‌’’ అధికారి మెచ్చుకొంటే ఆ కిక్కే వేరు.. కానీ రాజారెడ్డి సార్‌ మనసులో వీటికి మించి ‘పగ’ బుసలు కొడుతోంది. అది ఒక పథకంగా రూపు దిద్దుకుంటోంది.

అందరూ పీకలదాకా ఆరగించారు. ఊర్లో పెద్దలు మిగిలిన ఆహార పదార్థాలను క్యారేజీలు కట్టి ఇంటికి మోసారు. ఎవరికీ ఏ లోటూ రాలేదు. ఇంకో ఐదేళ్లు ఈ పార్టీ గురించే చెప్పుకున్నారు.

ఐదు సంవత్సరాలు కాలగర్భంలో కలిసిపోయాయి.

దళిత అమ్మాయితో ప్రేమ వ్యవహారం నడిపి ఆమె అదృశ్యం కావడానికి కారకుడయ్యాడని చెన్నయ్య సార్‌ను సస్పెండ్‌ చేశారు అధికారులు. జైల్లో వేశారని కొందరు, బెయిలు మీద ఎక్కడో తిరుగుతున్నాడని కొందరు రకరకాలుగా చెప్పుకున్నారు.

ఆరోజు ఉదయం రామప్పకు ఒక వార్త తెలిసింది. నిజాయితీ పరుడైన ఒక అధికారి చెన్నయ్య సార్‌ తప్పు ఏమీ లేదని తేల్చాడని.. మళ్లీ ఉద్యోగం ఇచ్చారని ఎక్కడో మారుమూల ప్రాంతంలో చెన్నయ్య సార్‌ ఉద్యోగం చేస్తున్నాడని, ఆ వార్త సారాంశం.

రామప్ప ఏమాత్రం ఆలస్యం చేయలేదు. ఎలాగైనా చెన్నయ్య సార్‌ని కలవాలని బయలుదేరాడు.

యాభై కిలోమీటర్లు బస్సులో... ఇరవై కిలోమీటర్లు ఆటోలో.. చివరిగా ఐదు కిలోమీటర్లు నడిచి మొత్తానికి చెన్నయ్య సార్‌ను చేరుకున్నాడు రామప్ప.

అడవిలో పల్లె.. రేకుల గది.. చుట్టూ పిల్లలను కూర్చోబెట్టుకొని మధ్యలో చెన్నయ్య సారు. రామప్పను చూసి చాలా ఆనందపడ్డాడు. రామప్ప కూడా ఉద్వేగానికి లోనయ్యాడు.

‘‘రాజారెడ్డి సార్‌ ఎలా వున్నాడు..’’ అడిగాడు.

ఆయనకేం సార్‌.. రాష్ట్రస్థాయి ఉత్తమ ఉపాధ్యాయుడు అవార్డు ఇచ్చారు. జాతీయ స్థాయి అవార్డు కోసం ప్రయత్నం చేస్తున్నాడు.. మీరెలా వున్నారు సార్‌.. అడిగాడు ప్రేమగా.

‘‘చాలా బాగున్నాను రామప్పా’’ చూశావుగా...

‘‘సార్‌ జరిగిన దానికి మీకు బాధగా లేదా?’’

‘‘అవును రామప్పా.. బాధగా వుంది.. మా నాన్న చనిపోయినప్పుడు ఒక బంధువు నన్ను తీసుకెళ్లాడు. నా చేత లాండ్రీ షాపు పెట్టించాలని చూశాడు. అప్పుడు నన్ను వెతుక్కుంటూ వచ్చాడు మా క్రిష్ణారెడ్డి సారు. ఇప్పుడు నువ్వు నన్ను వెతుక్కుంటూ వచ్చావే ఇలాగే... ఒక యువజన కేంద్రంలో నాకు వసతి ఏర్పాటు చేశాడు. నా చదువుకు ఎలాంటి ఆటంకం కలగకుండా అనుక్షణం ప్రోత్సహించి నా జీవితాన్ని నిలబెట్టాడు. నా జీవిత కాలంలో కనీసం పదిమందినైనా క్రిష్ణారెడ్డి సార్‌ లాంటి వాళ్లను నా స్టూడెంట్స్‌ నుంచి తయారు చేయాలి. అదే లక్ష్యం.. నా జీవితంలో విలువైన కొన్ని రోజులను కోల్పోయాను. అదే నా బాధ’’ అన్నాడు.

ఇద్దరూ వెళ్లి స్కూల్‌ చుట్టూ ఒకసారి తిరిగి వచ్చారు. అదొక గిరిజన గ్రామం.

కనీస సౌకర్యాలకు నోచుకోని పేదలున్న అమాయకుల ఆవాసం. కానీ ఆ పిల్లలను చూస్తే రామప్పకు అసూయగా వుంది. ‘‘ఎంత పుణ్యం చేసుకుంటే చెన్నయ్య సార్‌’’ చేతిలో పడాలి’’ అనుకున్నాడు.

పిల్లలతో కలిసి చెన్నయ్య సారు, రామప్ప మధ్యాహ్న భోజనం చేశారు. ఒక గిరిజనుడు అడవిలో దొరికే ఊటి పళ్లు తెచ్చి సారుకి ఇచ్చాడు. చెట్టుకు మాగిన పళ్లు మధురంగా అనిపించాయి రామప్పకు.

‘‘నేను బయలుదేరతాను సార్‌.. చాలా దూరం వెళ్లాలి కదా’’ రామప్ప లేచాడు. ఒక యువకున్ని పిలిపించాడు. ఆ పల్లె మొత్తానికి అతని దగ్గర ఒక స్కూటర్‌ ఉంది. రామప్పను అడవి దాటించే బాధ్యత ఆ యువకునికి అప్పజెప్పాడు చెన్నయ్య సారు.

స్కూటరు దగ్గరికి వెళుతుండగా ‘‘రామప్పా నాకు ఇంకో సాయం చెయ్యాల’’ అడిగాడు చెన్నయ్య సారు.

‘‘చెప్పండి సార్‌...’’ ఆగాడు రామప్ప.

‘‘లక్ష్మీదేవి ఎక్కడైనా కనిపిస్తే నా అడ్రస్‌ చెప్పు. నాకు ఇంకా పెండ్లి కాలేదని గుర్తు చెయ్‌ చాలు’’ అన్నాడు. రామప్ప చెన్నయ్య సారు కళ్లలోకి చూశాడు. ఆ కళ్లలో సముద్రమంత ప్రేమ కనపించింది. కనుపాపలో లక్ష్మీదేవి రూపం మెరిసి మాయమైంది.

వేదాంతిలా నవ్వాడు రామప్ప. స్కూటరు వెళ్లిపోయింది. చుట్టూ పిల్లల మధ్యలో సారు. అక్షరయజ్ఞం మళ్లీ మొదలైంది. 

- టి.మహమ్మద్‌ రఫీ, కడప, 9441636821


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని