తూర్పారబోత

కథావిజయం 2020 పోటీల్లో తృతీయ బహుమతి (రూ.10 వేలు) పొందిన కథ

Updated : 10 Jun 2021 12:40 IST

కథావిజయం 2020 పోటీల్లో తృతీయ బహుమతి (రూ.10 వేలు) పొందిన కథ

‘‘ఇంత రేతిరికాడ ఎక్కడికెల్తావు? పొద్దుగూకినంక మొదలైన వాన ఇంకా తగ్గలేదు, దానికి తోడు కరెంటు కూడా లేదు. దారి కనబడక ఏ పురుగో పుట్రో కుడితే ఏం గాను? నా మాటిను... కాసేపైతే తెల్లారుద్ది. అప్పుడెల్లొచ్చు... ఆగిపో’’ ఉరుములతోనూ మెరుపులతోనూ మిరుమిట్లు గొల్పుతున్న ఆకాశాన్ని చూస్తూ చెప్పింది శాంతమ్మ.

చూరులో ఉన్న గోనెపట్టాను తీసుకుని తల తడవకుండా చిన్నపాటి గొడుగులాగా చేసుకుంటున్న మల్లేశం ఆమె మాటలకు చిన్నగా నవ్వుతూ నాకు వూహ తెలిసినప్పటినుంచీ ఇదే పని. తాతతో కలిశెల్లాను, నా తండ్రితో కలిశెల్లాను. శేలో తిరిగాను, గట్టున నడిశాను. ఇట్టాంటి ఆటుపోట్లెన్నో తట్టుకున్న నాకు ఇదో లెక్కా అన్నాడు.

‘‘నీకు నవ్వులాటగానే వుంటది. నువ్వెల్లి తిరిగొచ్చేదాకా నా పై పేనాలు పైనే పోతన్నాయి. అయినా రేత్రి పొగులూ ఆ మడిశెక్కలో బడి దొర్లడం తప్పితే ఇన్నాల్లూ సాధించేముంది? ఇకపైన సంపాదించేదేముంది? మూడుపూటలు గడవాలంటే నాలుగు కొంపల చుట్టూ అప్పులకోసం తిరగాల్సి వత్తంది. ఎప్పటినుంచో పట్నంలో వున్న కొడుకు రమ్మని పోరుతున్నాడు. వున్న కొంచెం బూమీ అమ్మేసి ఆడి దెగ్గిరికెల్లి కాలుమీద కాలేసుకుని గడపకుండా, కాలుగాలిన పిల్లిలాగా ఇంటికీ పొలానికీ తిరుగుతూ నువ్వొరగబెట్టేది ఏముందంట. అయినా పండిన పంట తిందురుగానీ రమ్మని ఆడు పిలుత్తుంటే పరిగేరుకుని బతుకుతాననేవోడిని నిన్నే చూత్తన్నా అంది శాంతమ్మ. 

శాంతమ్మ వంక శాంతంగా నవ్వుతూ చూసిన మల్లేశం పిచ్చిదానా... దూరపుకొండలెప్పుడూ నున్నగానే వుంటాయి. పరిగెత్తి ఎల్లామంటే బొక్కబోర్లా పడతాము. నేనేమన్నా పోటీకోసం పరిగెడ్తన్నానా...గెలవడానికి! గుప్పెడు తిండిగింజలు పండించుకుంటున్నాను. బూమ్మీద ఆదారపడేవోడికి ఆశ వుండాలి గానీ, అత్యాశ వుండగూడదు, పోరాటం శేయాలి గానీ ఆరాటం వుండగూడదే! అయినా నా మట్టుకు నాకు పొలంగట్టు చుట్టూ తిరుగుతూ శేలో నడుత్తుంటే మా అమ్మానాన్నతో ఊసులు శెప్తూ ఆడుకున్నట్టుంటుంది. గాలికి మొక్కలూగినప్పుడల్లా ‘ఏరా అయ్యా బాగున్నావా’ అంటూ కన్నోల్లు పలకరించినట్టుగా వుంటుంది. అయినా మనం కన్నోడు రమ్మన్నాడని మనల్ని కన్నోల్ని ఇడిసిపెట్టి ఎల్తే ఆ పాపం వూరికే పోదు... అన్నాడు బయటికి నడుస్తూ.    

ఆ...ఈ చాదత్తానికేమీ తక్కువలేదు, కొంచెం కదిపిత్తే సాలు... మా తాత, మా నాన్న అంటా ఇంత పొడుగు కతలు శెప్తావు... పెద్దేదో జమీందారులైనట్టు! నేను కాపరానికొచ్చినప్పటి నుంచీ అదే తూర్పారబోత... గట్టిగింజలన్నీ అప్పులోల్ల బొడ్లోకి, తాలుగింజలన్నీ పండించినోల్ల నోట్లోకి! శేలో పుట్టిన మొక్కలు శేలోనే చచ్చినట్టు... నాకు తెలవదా మీ యవసాయం గురించి... ఇదిగో ఈ టార్సీలైటు తీసుకెల్లుృ అంది నవ్వుతూ శాంతమ్మ.

కొడుకు మీద బెమ తిరిగిందా?అన్నాడు టార్చిలైట్‌ అందుకుంటూ మల్లేశం.

యాభైదాటిన శాంతమ్మ ముఖంపైన ముడతలు మెరుపుల వెలుతురులో కొత్తగా కనిపిస్తున్నాయి. సూత్రాల బరువులేని పసుపుతాడు వెనక్కిపోయి మెడకేదో తాడు బిగించినట్లుగా ఉంది. నిద్రలో చెదిరిన కుంకుమబొట్టు ముఖమంతా పరుచుకుని మందారపువ్వు రేకలు అక్కడక్కడా అతికించినట్లుగా ఉంది. వసారాదాటి లోపలికి వస్తున్న ఈదురుగాలికి చెదిరిన జుట్టంతా తెరచాప పరిచినట్టుగా ఉంది. మాట్లాడుతున్నప్పుడు మాటలకు దరువేసినట్లుగా వినిపిస్తున్న చేతికున్న మట్టిగాజుల చప్పుడు తప్ప కాసేపు ఇద్దరి మధ్యా మాటల్లేవు. కాసేపయ్యాక శాన్నాల్లైపోయింది చూసి... ఎట్టున్నారో! కొట్టినా తిట్టినా కొడుకుని మించిన ఆదరువు ఎవురుంటారు? అంది.  

భార్యవంక జాలిగానూ, విభ్రాంతిగానూ చూశాడు మల్లేశం. పెళ్లైన దగ్గర్నుంచీ ఇంటిపనితోనూ, పొలం పని తోనూ అలసిపోయినట్లుగా కళ్లు భారంగా కనిపించాయి. సుఖంగా నాలుగురోజులు కూర్చుని తిన్న దాఖలాలు లేవు. దానికి తోడు అప్పులు, తిప్పలు, ఆకలిదప్పులు! అన్ని పరిస్థితుల్లోనూ కట్టించుకున్న తాళిబొట్టుకు విలువిచ్చింది. గుట్టుగా సంసారాన్ని లాక్కొస్తుంది. గట్టిగా పంట పండితే చిన్న బంగారం నగ చేయించడానికి అవకాశమే కుదరట్లేదు. ఎప్పుడూ ఏదో ఒక రొంపి, బురద. రోజురోజుకూ తాను ఊబిలోకి దిగిపోతూ, తనతో ఉన్నవాళ్లను కూడా అందులోకి లాగడమే తప్ప బయటపడింది లేదు, పడతామో లేదో కూడా తెలియదు. భూమైనా, భార్యైనా... నమ్ముకున్నదాన్ని తెంపుకోవడానికి నిముషం పట్టదు! నమ్మకాన్ని నిలబెట్టుకోవడానికి జీవితకాలం పడుతుంది.

ఆలోచనలు చెదపురుగుల్లా తినేస్తున్నాయి. పేడపురుగుల్లా అంతరంగంలోకి చొచ్చుకువెళ్ళి నరాల్ని మెలిపెడు తున్నాయి. తల విదిలించుకుంటూ భార్యను చూసి కొడుకు గురించి తల్సుకుంటే శిన్నపిల్లలాగా అయిపోతావు. నీ పట్ల ఎంత దురమార్గంగా ప్రెవర్తించినా ఇట్టే మర్సిపోతావు. తల్లిదండ్రులు జీవితాంతం పిల్లలకోసం ఏదో ఒక త్యాగం చేత్తానే వుండాలి. పిల్లల్ని కంటం కస్టం, పెంచడం కస్టం, చదివించడం కస్టం, ఒకింటోడిని చేయడం కస్టం. ఆ తర్వాత మన తలరాత బాగుంటే కొన్నాల్లు సుకపడతాం, లేదంటే బతికినన్నాల్లు చత్తా బతుకుతాం... ఆలోచిత్తా కూచుంటే మనేదితో మంచం పట్టడం తప్ప లేచి తిరిగే దారి కనబడదుృ చెప్పి ముందుకు కదిలాడు మల్లేశం.

భర్త వెళ్ళిన వైపు చూస్తూ వసారాలో ఉన్న గుంజకు ఆనుకుని కూర్చుండిపోయింది రాజమ్మ. ఆమె దేహమంతా లోలోపల తెగి ప్రవహిస్తున్న దుఃఖ ప్రవాహానికి వణికిపోసాగింది. నిద్రలో లేచిరావడం వల్ల కళ్ళు ఉబ్బినట్లుగా అనిపిస్తు న్నాయి. ఆకాశం ఉరిమినప్పుడల్లా గుండెలు అదిరిపడుతున్నాయి. మెరుపులు మెరిసినప్పుడల్లా అలసిపోయిన ముఖంలోని అలసట కనిపించసాగింది.

ఎన్ని నోములు నోచిందో.... ఎన్ని పూజలు చేసిందో... కొడుకుకోసం! లేకలేక పుట్టిన కొడుకును చూసుకుని లోకాన్నంతా మరిచిపోయింది. వాడి ఆలనలో అన్నీ మర్చిపోయింది. ఒక తల్లిగా కొడుకుకోసం ఆరాటపడడం తప్పు కాదు. అయినా చిన్నప్పుడు గుండెలమీద తన్నుతూ ఆడుకున్న కొడుకు పెద్దయ్యాక అదే గుండెలమీద తన్ని వెళ్ళిపోతే తల్చు కోకుండా ఎలా ఉండగలదు? గుండె ఆగిపోతే తప్ప కొడుకు ఙ్ఞాపకాలు ఆగవు. ఈ దేహం మట్టిలో కలిస్తే తప్ప మనసును పట్టి పీడించే కన్నపేగు విషాదం విడిచిపెట్టదు. ఈ కన్ను శాశ్వతంగా నిద్రపోతే తప్ప కలవరింతలు ఆగవు. అయినా పిల్లల సుఖాన్ని మించిన పరమానందం తల్లిదండ్రులకి ఏముంటుంది? ‘ఎక్కడున్నా పిల్లాపాపలతో సుఖంగా ఉండాలి’ అనుకుని మనసులోనే ఆశీర్వదించి స్థిమితపడింది.

***

ఏరా అయ్యా! తెల్లారకముందే ఎల్తన్నావు? శీకట్లో జాగర్తగా ఎల్లు... రోడ్డుపక్కనున్న గుడిసె ముందు కూర్చుని చుట్ట కాలుస్తూ పిలుస్తున్న గురవయ్య తాతను చూసి ఆగిపోయాడు మల్లేశం.

రాత్రంతా కురుస్తూనే ఉన్న వానకి రోడ్డేదో, వాకిలేదో తెలియకుండా ఉంది.

మన బతుకులన్నీ పున్నెం పుట్టెడు, పురుగులు తట్టెడు. నిన్ను చూత్తంటే... నీ తాతతో యవసాయం చేసిన రోజులు గుర్తొత్తన్నాయి. నీకులాగే పొద్దత్తమానం పొలము పొలమని పలవరించేవోడు. పొలంలోనే శిన్న గుడిశేసుకుని కొన్నిసార్లు అక్కడే పడుకునేవోడు. విషప్పురుగు కుట్టి పొడుకున్నోడిని పొడుకున్నట్టే కాలం గేలమేసి లాక్కుపోయింది. ఒక్కోసారి అనిపిత్తా వుంటది... అంత ఎగిరెగిరి యవసాయం శేసి వుండే యింటికి కంతలు, ఏసుకునే బట్టకి అతుకులు తప్ప ఇన్నేల్లల్లో బావుకున్నదేముందని! అన్నాడు గురవయ్య పొగను నోట్లోనుంచి వాకిట్లోకి వదులుతూ.

గురవయ్య తాతవంక బాధగా చూశాడు మల్లేశం. మొలకి గోచి, తలకి కండవా చుట్టుకున్నాడు. బుడ్డిదీపం వెలుతురు అతని కళ్లమీద పడి గోళీల్లా మెరుస్తున్నాయి. ఎన్నో ఆటుపోట్లకు తట్టుకున్న ఎనభై దాటిన దేహం... ఎప్పుడు నిద్రపోతాడో, ఎప్పుడు నిద్రలేస్తాడో తెలియదు. ఎప్పుడూ గుమ్మంముందు కూర్చుని చుట్ట తాగుతూనే ఉంటాడు. భార్య పోయాక మరీ ఒంటరితనంతో, దిగులుతో ఉన్నట్టుగా కనిపిస్తుంటాడు. ఒకరి కోసం ఎదురుచూడడు, ఒకరి గురించి ఆలోచించడు. ఎదురుచూసినా వచ్చి పలకరించి వెళ్లడానికి పిల్లల్లేరు, బంధువులు అనుకున్నవాళ్లు కూడా ఎప్పుడో తప్ప ఆయన వాకిట్లో అడుగుపెట్టరు. నాలుగ్గింజలు ఉడకిన తర్వాత వార్చిన గంజిలోనే ఉల్లిపాయో, పచ్చిమిరపకాయో నంజుకుంటూ కాలక్షేపం చేస్తుంటాడు. తిన్న తర్వాత తనకు తెలిసిన పద్యమో పాటో పాడుకుంటూ రోజు గడిపేస్తాడు.

‘‘ఏం చేత్తాం తాతా... నాలుగువేల్లు నోట్టోకెల్లాలంటే కట్టపడకపోతే ఎట్టా? నువ్వంటే వొక్కడివే... నాకలా కాదుగా! పండినా పండకపోయినా పొలాన్ని సాగుచేయకుండా వదిలేయడమంటే... పిల్లోడ్ని కని రోడ్డున పడేయడమే! ఏదో బెమ... కొడుకు చూత్తాడని, పొలం పండి ఆకలి తీర్సుతుందని! అన్నాడు తాత చేతిని నొక్కుతూ.

మల్లేశం స్పర్శకి తాత దేహం కదిలిపోయింది. గుంటలు పడిన బుగ్గల్ని చీల్చుకుంటూ నవ్వు బయటికి రావాలని విశ్వప్రయత్నం చేస్తోంది. సగానికి పైగా ఊడిపోయిన పళ్లలోనుంచి గాలితో కూడిన శబ్దాలు తప్ప నవ్వుతున్నట్లుగా అనిపించట్లేదు. బలవంతంగా ప్రయత్నం చేస్తూ నవ్వుతున్నట్లుగా దేహాన్నంతా కదిలిస్తూ అంతేలేరా... ఆకలైనప్పుడు, బాద కలిగినప్పుడు శుట్ట ఎలిగించి నాలుగు పీకులు లాగితే అన్నీ మర్సిపోతాను! నాకీ శుట్ట వెసనం... నీకు ఆ పొలం ఎసనం! ఇయ్యి మానాలంటే మనం పోవాలంతే... అన్నాడు గురవయ్య తాత.

ఏమీ మాట్లాడకుండా రోడ్డుమీద పడుతున్న వానను చూస్తూ కూర్చున్నాడు మల్లేశం.

కుడిచేతితో మల్లేశం భుజంమీద తట్టి ఎడమచేత్తో నోట్లో చుట్ట బయటికి తీసి పొగవదిలిన గురవయ్య పెద్దగా నవ్వుతూ మన గొడవ వొదిలెయ్యి...నిన్న వూల్లోకి రామనాదం వొచ్చాడంటగా! ఎప్పుడో శిన్నప్పుడు వూరొదిలి ఎల్లినోడు ఇన్నేల్ల తర్వాత డాబుగా కారేసుకుని వొచ్చాడు. పట్నంలో ఏదో ఇత్తనాల యాపారం శేత్తాడంట. బాగా సంపాయించాడు. మన కర్మ కాకపోతే, ఇన్నేల్ల నుంచీ బూమిలో పడి దొర్లుతుంటే రాని లాబాలన్నీ ఇత్తనాలమ్మితే ఎట్టా వొచ్చినయ్యో తెలవటల్లేదు. యవసాయం కంటే యాపారమే బాగున్నట్టుందిృ పొగ ఎదురుగాలికి ముఖానికి కొట్టి ఉక్కిరిబిక్కిరయ్యి పెద్దగా దగ్గసాగాడు గురవయ్య తాత.

పక్కన కూర్చున్న మల్లేశం పైకిలేచి గురవయ్యతాత తలమీద కొట్టి ఇట్టా తాగీతాగీ ఏదోనాడు తెలవకుండానే పోయేటట్టున్నావు. ఇన్నేల్లనుంచీ తాగుతున్నావు. ఇప్పుడైనా మానొచ్చుగాృ అని, మళ్ళీ కాసేపయ్యాక యవసాయం చేసేవోడు గానుగెద్దులా కస్టపడాలి. మాయామరమం తెలియదు, మాట మార్సడం కుదరదు. యాపారం చేసేవోల్లు అట్టాకాదుగా... బుర్రలో వున్న గుజ్జంతా ఎదుటోడి బుర్రలోకి ఎక్కించాలి, ఆల్లని నమ్మించాలి, సరుకు కొనిపించాలి. మనం మట్టిని నమ్ముకున్నోల్లం కాబట్టి బతికినన్నాల్లు మట్టిలోనే పడి దొర్లుతుంటాం. ఆల్లు మారాజులు... మెదడ్ని నమ్ముకున్నోల్లు కాబట్టి మేడల్లో వుంటారు! యవసాయం చేయడం మన కర్మ కాదు తాతా... దర్మం! అయినా శేనుచేసి చెడలేదు, చెడ్డచేసి బతకలేదని వూరికే అన్నారాృ అని చెప్పి ముందుకు కదిలాడు మల్లేశం.

వెళ్తున్న మల్లేశాన్ని చూస్తూ తాత పెదాలు విచ్చుకుని కళ్ళు మూతలుపడ్డాయి. ‘‘ఏటికేతం బట్టి ఎయి పుట్లు పండించి గంజిలో మెతుకెరగరన్నా...’’ ఆగుతూ ఆగుతూ గురవయ్య తాత తొర్రిపళ్లల్లో నుంచి తోసుకుంటూ వస్తున్న పాట వింటూ ముందుకు నడిచాడు మల్లేశం.

* * *

నిద్రలో నడిచినట్లుగా ముందుకెళ్తున్నాడు మల్లేశం. అలవాటైన దారే అయినా వానవల్ల గుంటెక్కడో, మెరకెక్కడో తెలియకుండా అడుగులు పడుతున్నాయి. మెరక ఉందనుకుని అడుగేసి ముందుకు తూలుతున్నాడు, గుంట ఉందనుకుని దాటబోయి పట్టుతప్పుతున్నాడు. తల, వీపు తడవకుండా కప్పుకున్న గోనెసంచి గొడుగు గాలికి ఎరిగిపోకుండా రెండు చివర్లను చేతితో గట్టిగా లాగిపట్టుకోవడం వల్ల వేళ్లు నొప్పిపెడుతున్నాయి.

చిన్నబజారు, పెద్దబజారు దాటి మెయినురోడ్డు మీదకి వచ్చేశాడు. ఆ రోడ్డుదాటి కొంచెం ముందుకెళ్తే అటూఇటూ పొలాలు! రోడ్డుమీద తప్ప అడుగు పక్కన పడుతుంటే కాలినిండా బురద అంటుకుంటోంది. బొటనవేలికేదో తగిలినట్లుగా నొప్పి పుట్టసాగింది. మోకాలి కిందనుంచి పాదాల వరకూ ఏదో ముళ్లకంచె గీరుకున్నట్లుగా అనిపించసాగింది.

దేన్నీ పట్టించుకునే స్థితిలో లేడు మల్లేశం.

పరిశోధనలో నిమగ్నమైన శాస్త్రవేత్తలాగా, తదేకంగా ఆపరేషన్‌ చేస్తున్న డాక్టరులాగా, పరిసరాలను పట్టించు కోకుండా ధ్యానముద్రలో ఉన్న మునిలాగా అతని దృష్టంతా చేను చుట్టూనే తిరగసాగింది. ఇంటికి వచ్చే ఈ పంటమీద ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు. ఈ పంటను చూపించి ఎంతోమంది దగ్గర అప్పులు చేశాడు, చేబదులు తీసుకున్నాడు. వాళ్ల అప్పులు తీర్చగా ఏమైనా మిగిలితే ఏదో చేయాలని ఆశపడ్డాడు. కానీ పరిస్థితి చూస్తుంటే ఆకాశమంతా అమావాస్య కమ్ముకున్నట్లుగా మారిపోయింది.

దూరంగా కనిపిస్తున్న పొలాన్ని చూస్తూ గట్టుమీద నడవసాగాడు మల్లేశం. గట్టుకు రెండువైపులా ఉన్న చేలన్నీ మోకాల్లోతు నీళ్లల్లో మునిగిపోయి కనిపించసాగాయి. ఒక నెలలో చేతికి రావాల్సిన వరికంకులన్నీ కుప్పలుకుప్పలుగా బిగించి కట్టినట్లు వాలిపోయి నీళ్లల్లో తేలుతూ కనిపిస్తున్నాయి. ‘తన చేనసలే పల్లంలో ఉంది. పంటమొత్తం నీళ్లల్లో మునకలేస్తూ ఉండుంటుంది’ అనుకున్న మల్లేశం వణుకుతున్న కాళ్లతోనే చేలో ప్రవేశించాడు. గుండె బద్దలైంది. చేలో దిగి వెర్రిగా అరుస్తూ ఆ చివరనుంచి ఈ చివరి వరకూ నడిచాడు. పడిపోయిన వరిపైరును చేత్తో పట్టుకుని నిలబెట్టే ప్రయత్నం చేశాడు. కంకుల బరువుకు మళ్లీ నీళ్లలోనే వాలిపోతున్న పంటను చూసి మల్లేశం ప్రాణం సోలిపోయింది. కనీసం కొంత నీరైనా బయటికి పోతే ఎంతోకొంత పంట మిగులుతుందనే ఆశతో చేలో ఒక మూలకు వెళ్లి గట్టు తెగ్గొట్టాడు. మెరక పల్లం కలగలిసి ఉండడం వల్ల నీళ్ళు కొద్దికొద్దిగా వెళ్లసాగాయి. కొద్దికొద్దిగా వెళ్తున్న నీళ్లను చూస్తూ మనసు బరువుగా అయిపోయింది. అయినా తన వెర్రిగానీ అలా ఎంతసేపు చేయగలడు? జరిగేది జరక్క మానదు, నష్టమో కష్టమో... అడుగు ముందుకేశాక ఆలోచించకూడదు!

పొలం వంక చూస్తూ గట్టుమీద కూర్చున్నాడు.

అప్పుల కొండలతో పాటు దిగులు బరువునూ మోయాలంటే ఇబ్బందిగానే ఉంది. తనలో తానే మాట్లాడుకుంటూ తనకి తనే ధైర్యం చెప్పుకోసాగాడు. వాన ఉధృతి తగ్గింది. కళ్లముందు మసకమసగ్గా వెలుగురేఖలు పరుచుకుంటున్నాయి.

పైకిలేచి ఒకసారి పొలం వంక చూశాడు.

పది లంఖణాలు చేశాక నిలబడే ఓపిక లేనట్లుగా ఎటుపడితే అటు పడిపోయిన రోగిలా కనిపించింది పొలం.

భుజాన తుండుగుడ్డతో ముఖం తుడుచుకుని ఇంటికి బయల్దేరాడు. దారంతా వరద, బురద. ఎంత జాగ్రత్తగా నడుస్తున్నా ఎక్కడో ఒకచోట బురదలో కూరుకుపోతున్న కాళ్లను చూసి ‘వ్యవసాయం ఎంత జాగ్రత్తగా చేసినా చివరికి మిగిలేది బురదేనన్నమాట’ అనుకుని నవ్వుకున్నాడు.

దారిపక్కనున్న చేతిపంపు దగ్గర కాళ్లకంటిన మట్టిని శుభ్రంగా కడుక్కుని ఇంటిదారి పట్టాడు. రోజంతా కురిసిన వానకి పల్లెంతా కకావికలంగా కనిపించింది. ఎక్కడెక్కడి చెత్తా కొట్టుకొచ్చి దారంతా పరుచుకుని ఉంది. గాలికి విరిగిన చెట్టుకొమ్మలను నరికి పక్కకి లాగుతున్నారు పల్లెవాళ్లు. వాటిని చూస్తూ తన గళ్లీలోకి వెళ్లబోతున్న మల్లేశం ్డబాబాయ్‌... ఒకడుగు ఇటేసి వెళ్ళుృ అన్న మాటతో ఆగిపోయి మాట వినిపించిన వైపు తిరిగాడు.

రామమందిరం అరుగుమీద వెలిగిపోతూ కూర్చున్న రామనాథం కనిపించాడు. నలగని బట్టల్తో, అన్ని వేళ్లకూ బంగారు ఉంగరాలతో, మెడలో లావుపాటి గొలుసుతో వ్యాపార మెళకువల్ని ఔపోసన పట్టిన మహాసామ్రాజ్యంలా ఉన్నాడు. చేతిలోని కర్రపుల్లతో నేలమీద రాస్తూ కొంతమంది, చుట్టపీకలు చుట్టుకుంటూ మరికొంతమంది అతని ముందు పదిమంది దాకా కూర్చుని కనిపించారు. అటువైపు నడిచి అక్కడున్న వాళ్లతో కూర్చున్నాడు మల్లేశం.

‘‘ఇదివరకటిలాగా వ్యవసాయం లాభసాటిగా లేదు. ఎగిరి దంచినా అదే కూలి, ఎగరకపోయినా అదే కూలి అన్నట్టుగా రోజులు మారిపోయాయి. ఎప్పుడు వానొస్తుందో, పంట మునుగుతుందో కూడా తెలియకుండా ఉంది. పోయిన సారి తెచ్చిన విత్తనాల్లో ఎక్కడో పొరపాటు జరిగింది. ఎప్పుడూ ఇచ్చేవాడే కదా అని తీసుకుంటే నకిలీవి అంటగట్టాడు. వాటివల్ల లాభం ఎక్కువగా లేకపోయినా నష్టం మాత్రం రాదు. అందుకే ఈసారి వాడి దగ్గర కాకుండా వేరేవాడి దగ్గర మెట్టపంటకు అవసరమయ్యే విత్తనాలు తెచ్చాను. కనీసం మాగాణిలో వచ్చే నష్టాన్ని కొంత వరకు మెట్టలోనైనా పూడ్చు కుంటారని! అసలు కొన్నిచోట్ల వ్యవసాయం లాభసాటిగా లేదని వచ్చిన రేటుకి పొలాలు అమ్మేసి ఆ డబ్బుల్ని బ్యాంకులో దాచుకుని కాలుమీద కాలేసుకుని కూర్చుంటున్నారు చాలామందిృ చెప్పుకుపోతున్న రామనాథం వంక దిగులుగా, భయంగా చూశాడు మల్లేశం.

తన దిశ మార్చుకుని ఒక్కోసారి ఒక్కో ప్రాంతాన్ని కబళించే తుఫాను లక్షణాలు కనిపించాయి రామనాథంలో. తమంత తామే పంటలు వేసి కావాలని బురదలో కూరుకుపోతున్నారో, తెలిసినవాళ్లు తమ వ్యాపారాన్ని లాభసాటిగా చేసుకోవడానికి తమను బురదలోకి లాగుతున్నారో కొంచెం కొంచెంగా అర్థమైంది మల్లేశానికి. విత్తనాలు కల్తీ, ఎరువులు కల్తీ, మందులు కల్తీ... అసలు రైతు బతుకే నకిలీగా మారిపోయింది. పేదరికంతో అడుగు ముందుకు పడదు. అప్పులిచ్చినవాళ్లతో నిరంతరం సతమతం, సంఘర్షణ! రైతు బతుకే బయటికి రాలేని ఊబిలాగా మారిపోయింది.

ఒప్పుకుంటారన్న ధీమాతో వేలి ఉంగరాల్ని అటూఇటూ తిప్పుకుంటూ కనిపించాడు రామనాథం. చుట్టూ కూర్చున్న అందర్నీ ఒకసారి చూసి ‘‘రామనాదమా! వరిశేలో మిగిలిన బురద చాలదా బాబూ... మెట్టశేలో మట్టికూడా వొంటికి పూసుకోవాలా?’’ అన్నాడు.

అందరూ మల్లేశం వైపు అయోమయంగా చూశారు.

రామనాథం విస్తుబోయాడు.

ప్రాణం తీస్తుందని తెలిసినా విషజంతువుల్ని కూడా పెంచుతూనో పూజిస్తూనో ఉన్న జనాలున్నంత కాలం తనలాంటి వాళ్ళకు ఇబ్బందిలేదనకున్నాడు. తను చెప్పే మాటలకు తలాడిస్తూ తోకూపుకుంటూ వచ్చే రైతులంతా అమాయక గొర్రెలనుకున్నాడు. కానీ కళ్లముందు దృశ్యం అతనిలో ఏవో అనుమానాలను రేకెత్తించసాగింది. మాట్లాడుతున్న మల్లేశం వంక విస్తుబోయి చూడసాగాడు.

‘‘బాబూ... ఇత్తనం చెడిందని యవసాయం వదులుకుంటామా? పెత్తనం సాగలేదని పాడె బిగించుకుంటామా? నాలుగు గడ్డిపరకలేత్తే ఆవు పాలిత్తంది, నాలుగు ఎంగిలి మెతుకులేత్తే కుక్క ఇశ్వాసం చూపిత్తంది. మనిశేంటో బాబూ... పక్కనే వుండి డొక్కల్లో పొడుత్తాడు, పాలుతాగి రొమ్ము గుద్దుతాడు, తిన్నయింటి వాసాలు లెక్కేత్తాడు. ఎండకీ వానకీ పనికిరాని మా ఇల్లూవాకిల్లూ చూడండి, అంటుకుపోతున్న మా కడుపులు చూడండి. రేత్రీ పొగులూ రెక్కలు ముక్కలు చేసుకుంటే మాకు మిగిలేది... తాలుగింజలు, ఎండుగడ్డే బాబూ! ఒక్కోసారి ఆ ఎండు గడ్డిని కూడా అప్పులకోసం అమ్ముకుంటున్నాం. మాటలు శెప్పి మాయజేసే మీలాంటోల్లున్న చోట యవసాయం చేసేవోల్లంతా తూర్పారబోతకి ఎగిరిపోయే తాలుగింజలే బాబూ... తాలుగింజలే!’’

ఇంటిదారి పట్టాడు మల్లేశం. కూర్చున్న అందరిలోనూ ఏదో ఆలోచన మొదలయింది. 

- డా.జడా సుబ్బారావు; 9849031587


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని