సుక్కల పూట

కథావిజయం 2020 పోటీల్లో ప్రత్యేక బహుమతి (రూ.5 వేలు) పొందిన కథ

Published : 06 Jun 2021 16:57 IST

కథావిజయం 2020 పోటీల్లో ప్రత్యేక బహుమతి (రూ.5 వేలు) పొందిన కథ

‘‘మేయ్‌ మంగా, నడీదిబండ మీదకు నన్ను పిలిసినారు నేను పోయిస్తా’’ అనే నా మొగుడు. 

‘‘ఏమిటికి’’ అంటి. 

‘‘సెరువు కింద మల్లు సాగుచేసే వాళ్లందరికీ పూట నిర్ణయిస్తారంట అందర్నీ పిలిసినారు’’ అని నా మొగుడు తవ్వాలు భుజానేసుకుని పాయ.

మా ఊరికి సీతాపతి సెరువుంది. మాకది కన్నతల్లి. నాలుగు చినుకులు నేలరాలినా సెరువు నిండుతుంది. నాలుగు కొండల మీద పన్ని చినుకులన్నీ దొర్లుకుంటూ సెరువులోకి వస్తాయి. అంత వాటం, పల్లం ఉంది. దిక్కల ఊర్లలో మా సెరువు జూసి మీరు పున్నెం చేసినారు అందుకే ఎంత కరువు పెట్టినా సీతాపతి సెరువులో చిప్పడు నీల్లయినా ఉంటాయి అంటారు. మాకు సెరువుకింద  ఇరవై కుంటల మడుంది. దాంట్లో వరిపైరు ఏసినాము. వాన్లు సరిగ్గా పడకపోవడంతో సెరువులో నీల్లు సాలక పూట్లు నిర్నయిస్తావుండారు. ఈ సారన్నా పంటొస్తే తిండి గింజలకు బయముండదు.

నేను ఇంట్లో పనులు చేసుకుంటా ఉండా. నాకు ఇద్దరు కూతుర్లు, ఒక కొడుకు. కాలేజీ సదువులు సదువుతున్నారు. ఆడబిడ్లు ఇద్దరూ నీళ్లు వొగరు తెస్తూ, పాత్రలు వొగరు కడుగుతూ నాకు ఎదరప చేస్తూ ఉన్నారు. ఈ మగపిల్లాడు మాత్రం ఇటు ఉన్ని పుల్ల అట్లేయడు. ఇమ్ముదప్పి పోయి దప్పికి నీల్లు ఈరా అంటేకూడా ఈడు. రేయ్‌ ఇంట్లో చిన్న చిన్న పనులు చేయరా అంటే ఊర్లో మగపిల్లలు ఎవరూ చేయరు నేను పని చేస్తే నన్ను ఆడోడు అంటారు పోమ్మా  అనేసి ఎలిపోతాడు.

రేపు నిన్ను చేసుకునేది ఏం తీరుబాకు తీర్సినారు అని తిడుతుంది అని చెప్పినా ఇనేవాడు కాదు. జత పిల్లల్ని ఎంటేసుకొని బైరేగను ఎలిపోతాడు. ఆకిలయినప్పుడు మాత్రమే ఇంటి మింద జోలి. జతలు మరిగి చెడుదావ పట్టినావురా అని నేను రోజూ తిట్టేదే.  లత్త గవ్వలు అన్ని ఒక దరికి  చేరినట్టు ఈ మగనాబట్టలు అందరూ ఒకటే. నూటికి నూరు జెప్పిన ఆడబిడ్డలే  మేలు.

మా ఇంట్లో మేము తల్లి కూతుర్లు అన్ని పనులు చేసి వండి పెడితే అన్నం యాలకి తినేదానికి వచ్చిరి నాయన, కొడుకు. నేను నా మొగుడ్ని అడిగితి  ‘‘బండమీదకి పోతివే ఏమయ్య’’ అని.

‘‘సెరువు కింద సాగు చేసే వాళ్లందర్నీ పిలిపించిరి. పూట్ల ప్రకారం మడికి నీల్లు పార గట్టుకోమన్రి. మొదటి పూట మీ ఈరమామది. తొలిత మొలుస్తుంది చూడు జాముసుక్క అబుడు. వరసగా మూడు సుక్కలుంటాయి అవి గుడిసి నాట్లు .అవి మొలిసే టబుడు మా యంగటన్నది పూట. మధ్యలో వొగ పెద్ద సుక్క దాని చుట్టూ చిన్న చిన్న సుక్కలు దానే పిల్లల కోడి అంటారు. పిల్లలకోడి మొలిసి నప్పుడు మీ నాగన్నది పూట. మూలసుక్క మొలిసినప్పుడు మనది పూట. ఈ సుక్క పరమట మూలయాసగా పుడుతుంది. గుడ్డిసుక్క మొలిసినప్పుడు మా సీనన్నది పూట. కాంతి సుక్క అన్ని సుక్కల కంటే కాంతిగా ఉంటుంది. ఇది కూడా పరమటనే మొలుస్తుంది. ఈ సుక్క తెల్లారి ఆరు దాక కనబడుతుంది ఇది మొలిస్తే ఆ పూట గోపన్నది’’ అని విసిదంగా చెప్పే పిల్లలు కూడా ఇంటున్నారని.

నేను ఉండు కోని ‘‘కాదే అందరి పూట్లు పొద్దుకు అట్లాఇట్లా ఉంటే నీ పూట మాత్రం సరిగ్గా రాయినీరు కరిగే పొద్దుకి, సరిగ్గా కోడి పిల్లలకు పాలు తాపేటైంకి ఉంది, యాలగానియాల వొగనివే పోవల్ల నీపూట మార్చమనకూడదా’’ అంటి.

‘‘ఆ యాల కాడ పోతేనే మన పని బచ్చా పడేది. నిద్రకు తట్టుకోలేక ఒక అడుగు ఎనుకు ముందు వస్తారు.  ఆయాల దాకా నీల్లు  మనమే కట్టుకోవచ్చు.  అదీగాక మన మడి పట్టకర్రతో ఉంది. పొట్లుపగిలి ఎన్ను ఇడస్తా ఉంది. ఎన్ను ఇడిసి కాయి వాలే టబుడు నీల్లు  తగ్గ దీస్తే వడ్లు జల్లులు పడతాయి. పట్టకర్రతో ఉన్న మడి ఎక్కువ నీల్లు తాగుతుందంట. అయినా వాన కార్తులు ముందుండాయి కదా అనే ధైర్యంతో మడి నాటితిమి. అయి మల్లీ మోసం జేసె’’ అని నామొగుడు గొనుక్కుండే.

నా కూతురు ఉండుకోని ‘‘నాయనా వాన కార్తులు ఎన్ని’’ అని అడగే వాల్ల నాయన్ని.

‘‘వాన కార్తుల్లో వాన పడితేనే మనకు, గొడ్డు గోదకు తిండుండేది. ఎండకాలం పాతనే తొలిత వచ్చేది భరణి కార్తీ. ఈ కార్తిలో బర్ని పక్షులు మాండ్లల్లో గూక్‌ గూక్‌మని కూస్తుంటాయి. ఈ కార్తీలో సింత పూత ఎక్కువ పూస్తుంది. ఈ కార్తిలో వరి నార్లు పోస్తే ఒడ్లు సింత పూలు రాలినట్లు రాలుతాయంటారు. అంటే పంట బాగా పండుతుంది’’ అని వాల్ల నాయన సెబతాఉండాడు.

సింత పూత అంటేనే మా యవ్వ గెవనానికొచ్చే. మేము చిన్న బిడ్డలప్పుడు మా ఇంట్లో సుమారు పది మంది జనం ఉండేది. ఆ కాలాన కూటికి జరిగేది కష్టం. ఏడేళ్లు కరువు. గవర్నమెంటోల్లు గెంజి పోస్తా ఉండారు. మా యమ్మకి అమ్మ మాయవ్వ ఉండే. ఇప్పుడు విఆర్వో సెక్రటరీ మాద్రి అప్పుడు గ్రామానికి అంతా రెడ్డి ఉండేది.  వాళ్లను గామిస్‌ రెడ్డి అనేది. రెడ్డి ఇంటి కాడ గంజి పోస్తరంట అని చాటింపు యేసేవాల్లు అబుడు. మా యవ్వ ఎనకాలే చెంబెత్తు కొని పోయేది. ఆ రెడ్డి ఇంటికాడ క్యూలో నిలబడితే వాల్లు అన్నమంతా దేవేసి వొట్టి గంజి బోసేది. ఆడా మోసమే. పోసినామని పేరు గవర్నమెంట్‌ లెక్క చెప్పుకునే దానికి. దాన్ని ఇడిస్తే గతి లేదని మైలు దూరం నడిచి పోయేది. అట్లా గెంజి తాగి గూడా పానాలు కాపాడుకున్నాము. అట్లాంటి కరువులో మాయవ్వ ఆ గంజి నీల్లలో వొట్టి రాగిపిండి బోసి సంగటి గెలికేది.  

అప్పుడు సింతపూల కాలం. ఆ సింతపూలన్నీ రాల్సు కోనొచ్చి అవన్నీ చాటలో పోసి చెరిగితే పూలు కిందపడి మొగ్గలు మిగులుతాయి. వాటికి మా యవ్వ మిరక్కాయలు, ధనియాలు, తెల్లగడ్డ, ఎర్రగడ్డ, మెంతి, జిలకర, కాసింత బీము ఏసి ఏయించి నూరి ఈ సింత మొగ్గలు పోసి తెర్లిచ్చేది. ఆ వొట్టి పిండిసంగటికి ఈ సారు కలిపి తింటే ఏముండేదిలే. మా యవ్వ ఇట్లాంటి కరువు సార్లు బలే జేసేది.

మల్లీ నాయనా బిడ్ల మాటలకి చెవిఏసా!

అర్థాలు 

పిలిసినారు = పిలిచారు 

మల్లు = మడులు 

ఎదరప = సహాయం

రంపు = గొడవ 

దెస్టలు = చెత్త

అస్తం = హస్తం

మస్కులు = మసక

తల మగసాల్లోకి = వాకిట్లోకి 

‘‘ఈ కార్తి పాతనే రోహిణి కార్తి. అది వచ్చి పోయేది కూడా ఎవురికి తెలియదు. మూడోది మగశిల కార్తి. ఈ కార్తీలోవానలు బాగా పడడంతో కొన్ని ఊటు సేన్లల్లో సద్దలు సామలు చల్ల తారు నాలుగవది ఆరుద్దల కార్తి. ఈ కార్తి లో వరి నాటేది. ఎర్రమసూర నెంబరొడ్లు, బై రొడ్లు, బుడ్డడ్లు, గంగసానొడ్లు, రాజేంద్ర, తెల్లంస, అయ్యేటి లాంటి రకాలు పోస్తారు. ఐదవ కార్తి పెద్దపుచ్చిల కార్తి. ఇత్తనాలన్నీ భూమిలో పడిపోతాయి. ఆరవది చిన్నపుచ్చిల కార్తి. ఏడవది ఉత్తర కార్తి. ఎనిమిదవది హస్త కార్తి. తొమ్మిదవది చిత్తకార్తి. ఈ కార్తిలో పైన పొటపొట మనిచినుకులు రాలుతుంటే చేన్లలో ఉలవలు జల్లుతారు. పుట్టగొడుగులు యాడ చూసిన లేస్తాయి. కుక్కలు కట్టుబోతుతనానికి  వచ్చి కాట్లాడుకుంటా ఒక ఆడ కుక్క చుట్టూ పది కుక్కలు చేరి కొట్లాడుకుంటా అరస్తా ఉంటాయి. కోరిక తీరని కుక్కలు ఆకాసం కల్లా ఎగచూసుకొని ఏడుస్తాయి. పదవుది సాతి కార్తి. ప్రతి ఒక పంట ఈ కార్తీలో ఎన్ని బోతాయి.

సాబ్బండ కింద ఉన్న గడ్డి కూడా ఎన్ను బోతుందంటారు. తర్వాతొచ్చేది ఇసారాక్‌ కార్తి. ఈ కార్తిలో జంతువులకి మనుషులకి పంటలకి రోగాలొస్తాయి. నానితే దగ్గులు జ్వరాలు పట్టుకుంటాయి. పన్నెండోది అనారాక్‌ కార్తి. ఈ కార్తిలో అన్ని రోగాలు పోతాయంటారు. నానితే కూడా మంచిదంటారు. పదమూడోది మూలకార్తి. ఈ కార్తిలో కూడా వానలు బాగా పడి చెరువులు నిండుతాయి. పదనాల్గోది దెస్ట కార్తి. వానలు ఎక్కువపడి మూలాలు ముంచి ఎక్కువ దెస్టలు చేరుస్తుంది. పదైదవది సంక్రాంతి గర్భాలు. అప్పుడు కూడా వానలు పడతాయి ఈడికి కార్తులన్ని ఆకీరు.

చిన్న పుచ్చుల కార్తీలో వాన పల్లే. ఇది తప్పితే పెద్ద పుచ్చుల కార్తీలో అన్న వానపడుతుంది అనుకుంటిమి అది పాయ. మగసిలకార్తిలో దాన్ని మగమేలేదు. అన్నారాక్‌ కార్తి అనుకోకుండా బోయే. పెద్దలు అనేది ఈ కార్తులన్నీ మోసంచేసి ఇంక ఈ ఊర్లో మనం బతకలేము అనీ గుడ్డ గుసురు, బోకి బాలి అన్ని గంపకు పెట్టుకొని సుట్టగుడ్డ నెత్తిన పెట్టి ఉత్తరం చూసి ఎత్తర గంప అంటే అప్పుడు ఉత్తరం చూస్తే అస్తం చూపించి నేను వస్తా ఉండ యాడికి పోవద్దండి అని అభయమిచ్చి దంట అస్త కార్తీ. నేనుఉన్నాను అని కుమ్మ వర్షం కురిసిందంట. అయినా మన ఎర్రి కాకపోతే ఈ కాలం యాడ కార్తీలో వాన కురస్తా ఉండేది, ఆకాశం తొక్కు ఎగచూసి ఎగ చూసి మెల్లు నొస్తా ఉండాయి. చినుకు నేల రాలాలంటే గగనం అయిపోతా ఉంది. ఇగ నెల దినాలు కాపాన్నామంటే చేతికొచ్చిన పంట నోటికొస్తుంది లేదంటే ఎండిపోతుంది. అదిగాక ఈసారి చెరువు కింద సాగుబడి ఎక్కువైపోయింది. మునుపు నీల్లతో చెరువు మొరవ కాడకి తునికేసేది. ఇప్పుడు తూము కాడికి ముగుసుకున్నాయి. సాగు ఎక్కువైంది, నీకు ఎక్కువ నీల్లు పాయ నాకు తక్కువ నీల్లు పాయ అని కొట్లాడుకుంటుంటే పూట్లు పెట్టినారు. మన పూట మూల సుక్క మొలిసి నప్పుడు వస్తుంది. నేను ఆదమరిస్తే కూడా నువ్వు గెవనంలో ఉండి లేపు అనే నాతో మా ఇంటాయన. 

నేను ఉండుకొని ‘‘కాదే మన మడి దిగువన ఉండేది. మనకు కాలవ సాగోచ్చే కుందికి గంట పడుతుంది. ముందుగా మన మడికి వదలమన కూడదా’’ అంటే దానికి నా మొగుడు ‘‘నీకు దోడుమైంది వొగతి పెల్లి పీట్ల మింద నుండి పిర్ర గిచ్చిందంట. మనం వారగా పదాం మనం వారగా పదాం అని. ఎందుకు అని మొగుడు అడిగితే నేనువొగటి ఎత్తిపెట్టినాను అన్నంట. వాడు ఇంగ సంబరంగా నా పెండ్లాము ఏందో విలువైందే ఎత్తి పెట్టుంటుంది అని ఇంట్లో వాళ్ళ అమ్మ నాయన మీద రంపు జేసి వారగా బాయినంట. ఇబుడు నువ్వెత్తి పెట్టి ఉండేది ఎత్తకరాబో అంటే అది దినము సంగటి చేసేటప్పుడు ఎవరికి తెలియకుండా దినానికి వొగ సంగటి ముద్ద వాడకు ఏసి పెట్టిందంట. ఆ వాడ మూత కింద పెరికినంట. ఆ వాడ బొక్కలోనుంచి సంగటి, కుల్లి పోయి నీల్లై కారతా ఉందంట. మొగుడు అది చూసి ఇదేనా నువ్వు దాసిపెట్టింది, నీ మాటలిని ఎక్కడా కాకుండా పోతినే అని నెత్తిన గుడ్డ ఏసుకున్నంట. అట్లదానివి నువ్వు. పైనుండి పార కట్టుకుంటా రానీలే ఒకేల నీల్లు అయిపోయిన ఎగవ నుండి దిగువకు వచ్చే నీల్లు మల్లలోపడతాయి. యగవన నీరు నిలేసినా ఆ ఎడగాలవ నీల్ల తోనే మడి పారుతుంది. మనకే మేలు’’ అనే నా మొగుడు. 

నేను ‘‘కాదే మూల సుక్క మొలీసేటబ్బుడు పన్నెండు ఒంటిగంట అవుతుంది నేనుగూడా వస్తా నీతో’’ అంటి. 

‘‘నువ్వు నా ఎనికిటి వస్తే బిడ్డలు ఒకరే అయిపోరా నాకేం భయం లేదు నేను బోతాలే’’ అనే!

నేను ఇంట్లో అన్నం కూర చేస్తా ఉండా. నా బిడ్డలు పొగులంతా ఎండనకా గాలనకా పిల్లల జతన ఏగులాడి ఏగులాడి పొద్దట్ల మస్కులు పడతానే నిద్రకు తట్టుకోలేక తూగత బెట్టకన్ను ఏస్తా ఉండారు. నేను బిడ్డలు యాడ నిద్రపోతరో అని బిరిబిరి సంగటి గెలికి ముద్దలు జేసి సింతసారు చేసి గిన్నెల్లో పెట్టి రేయ్‌ తినేసి నిద్రపోండి అని వాళ్ళను ఎచ్చరిచ్చ. అందరం సంగటి పెట్టుకొని తింటా ఉండాము. ఈ పిల్లలు కారానికి కారాలు ఆరస్తా నోరు మంటకి వుసీట్లు కొడతా ఉండారు. పొగులంతా నిలుకు లేకుండా చెరుకులు తిని తిని వీల్లకి నోర్లు మంటలు. ఏ పక్క చూసినా చెరుకు తోటలే. మేమందరం తిని చేలు కడిగి అట్లా కుసున్నాము. 

అప్పుడు జాముసుక్క మొలిసింది. మా వీరమామ భుజాన కమిడి ఏసుకొని చేతిలో దొన్నికట్టి పట్టుకొని తల మగసాల్లోకి వచ్చి ‘‘ఒరేయ్‌ సీనా, జాముసుక్క మొలిసింది సెరువు కిందకి నేను పోతా ఉండా. నువ్వు రా’’ అనేసి పాయ. 

తూర్పున మెడకాయ ఎత్తి చూస్తే మూడు నచ్చత్రాలు వరుసగా కనిపించాయి. అవే గుడిసెనాట్లు. అవి కనపడతానే వెంకటన్న సెరువు కాడికి పాతా ‘‘ఒరేయ్‌ గుడిసినాట్లు మొలిసినయ్‌ నేను పోతా ఉండా’’ అనేసిపాయ. ఆయాలకే నా మొగుడు తూగేసినాడు. నేను మేలుకొనే ఉండా. కాస్సేపటికి మైమరచి తూగతుండగా మా నాగన్న వచ్చి తలుపు తట్టే. ‘‘ఒరేయ్‌ శీనా పిల్లల కోడి మొలిసింది, నేను పోతా ఉండా’’ అనేసి పాయ. పిల్లల కోడి మొలిసిన తరవాత మూల సుక్కే. నేను మేలుకొని కండ్లు పులుముకుంటూ ఆకాశం తొక్కు ఎగ చూసుకోనుండా. మూల సుక్క కనపడతానే నా మొగున్ని లేపి పంపిస్తి. 

ఇంగన్న కాంచేడి నిద్ర పోదాంలే అని తలుపు గట్టిగా ఏసి పనుకుంటే గుడ్డి సుక్క మొలిసినప్పుడు మా అన్న వచ్చి లేపే. కాంతి సుక్క మొలిసినపుడు మల్లీ లేపిరి. అబుటికే కోడి గూసె! తెల్లారి పాయ! నా మొగునితోపాటు నాకూ జాగారమాయై! నా మొగుడు ఇంటికి వచ్చి పనుకుండే. నేను మాత్రానికి ఇంట్లో పనులు జేసుకుంటుండా. ఆడది వొల్లు బాగ లేనప్పుడు తప్ప తెల్లారిందాకా పనుకుంటే అది సంసారానికి పనికి రాదు అంటారు. మడి పండి గింజలు ఇల్లు చేరే దాకా నాకు నిద్ర కరువే!. 

- ఎండపల్లి భారతి, చిత్తూరు, 9391006866, bkiran38@gmail.com; navobharathi@gmail.com


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని