త్రీ కమాండ్మెంట్స్‌!

కథావిజయం 2020 పోటీల్లో తృతీయ బహుమతి (రూ.10 వేలు) పొందిన కథ

Updated : 03 Jul 2021 17:30 IST

కథావిజయం 2020 పోటీల్లో తృతీయ బహుమతి (రూ.10 వేలు) పొందిన కథ

‘ఈ రోజుల్లో అంతా మామా బాబాయ్‌ అని పిలుచుకుంటున్నారు, కలిసి పోతున్నారు, చిన్న కులం లేదు, పెద్ద కులం లేదు’ 

నరేంద్ర, పెద్ద కాపు రైట్‌ హ్యాండ్‌ అంటారు, పోనీలే లెఫ్ట్‌ హ్యాండ్‌ కాలేదు, దేనికి వాడే వాడో!

అతనన్నదీ నిజమే, టీ కొట్టు కాడ, ఎలక్షన్ల కాడ, బస్టాండ్‌ లో జరిగే చిన్నాచితకా పనులకు అంతా ఒకటే. పూర్వం ఇలా లేదు కదా, అందుకే ఇప్పుడు మా వాళ్ళకి భలే ముచ్చటేస్తుంది, వాళ్ల మీద ప్రేమ చూపించే పెద్దోళ్లు అంటే. 

‘మూడు లక్షలు’ అన్నాడు నరేంద్ర, కిషోర్‌ బాబు స్థలానికి పెద్ద కాపు కట్టిన రేటు. అతని మొహం వాడిపోయింది, 

‘రోడ్డుకి అవతల దీని ఎదురుగా ఉన్నది ఆయన 13 లక్షల కి చెబుతున్నాడు, ఆ పక్క నుండి 13, 14 ఇంకా పైన ఉన్నాయి, మధ్యలో పది అడుగుల రోడ్డు తప్ప ఇంకేమన్నా ఉందా, ఇది మూడు లక్షలకు ఎట్ట వస్తది’ 

మీడియేటర్‌ మోషే బాబాయ్‌తో బలం లేకున్నా బలమైన గొంతుతో అరిచాడు కిషోర్‌ బామ్మర్ది ఫిలిప్‌. పాలెంలో పీజీ చేసిన మొదటి తరం వాడతను.

‘ఎట్లా అంటే అట్లే, రోడ్డు అవతల పాలెం ఉంది కదా, అటువైపు ఉన్న స్థలం పాలెం లోకి వచ్చిద్ది’ అసలు సంగతి చెప్పాడు మోషే బాబాయ్‌. 

ఇది తెలీక కాదు, తండ్రి నుంచి వచ్చిన ఆ స్థలం అమ్మి కూతురు పెళ్లి చేద్దామని, రెండేళ్ల నుంచి ప్రయత్నిస్తుంటే ఇద్దీ వరస, చిన్న అద్దె కొంపా, పెయింటింగ్‌ పనీ, అతనికి మరో దారి లేకుండా చేశాయి.

‘అసల పాలెంలో స్థలం పాలెంవాడు తప్ప ఊర్లో వాడు ఎవడు కొంటాడు చిన్నొడా’ పెద్ద కాపు. 

 ‘వీళ్ళు కాకపోతే ఇంకొకళ్ళు, పాలెం అయితే నేల కాదా! మనం అడిగేది మార్కెట్‌ రేటేగా, ఎలాగైనా దీన్ని మార్కెట్‌ రేట్‌ కి అమ్మి అమ్మాయి పెళ్లి చేద్దాం’ మేనకోడలు పెళ్లికి భరోసా ఇచ్చి తీసుకొచ్చాడు గాని ఆ రేటుకి ఎలా పోతుంది అన్న బెంగ పట్టుకుంది ఫిలిప్‌కి.

మొదటి సారి అడిగి లేదని పించుకున్నాడు పెద్దకాపు, ఆయన మొహం మాడింది ‘అదింక అమ్ముడు పోదు’ సాగ దీశాడు.

బావా బామ్మర్దులు వినపడనట్లే వచ్చేశారు.

* * *

వారం రోజుల తర్వాత ఓ మంచిరోజు వచ్చింది.

‘వాళ్లిచ్చే బోడి స్థలం మనకు అక్కర్లేదు’ 

‘ఉత్త పుణ్యానికి గౌర్నమెంట్‌ ఇస్తుంటే వద్దంటాడు ఏంది వీడు? యాడనైనా బామ్మర్ది అంటే బావ బాగు కోరుకుంటాడు కానీ ఇట్ట మాత్రం చెయ్యరు’ గడ్డానికి అంటిన పెరుగన్నం తుడవడం ఆపి అన్నాడు బావ కిషోర్‌. ఈ బామ్మర్ది వాలకానికి బావేందీ, పాలెమంతా ఆశ్చర్యపోయింది. పోదూ మరి, చేతివృత్తుల వాళ్లకి అంటే టైలర్లకి, ఫొటోగ్రాఫర్లకు, ఆటో డ్రైవర్లకు, పెయింటర్‌లకీ వగైరా వగైరా చాలా మందికి ఊర్లో గవర్నమెంట్‌ ఇళ్ల స్థలాలు కేటాయించింది. అదేదో అందరినీ పిలిచి నీకిదీ, నీకిది ఇది అని పట్టాలిస్తే సరిపోదూ.. అలా జరగలా, వెరైటీగా అయ్యిందిలే.

ఊర్లో కొప్పుకొండ అని ఫేమస్‌ కొండ ఉంది. దాన్ని బట్టే మా ఊరికి ఈ పేరు వచ్చింది. ఏ పేరూ? ఎర్రగొండపాలెం అని. ఆ కొండ ఎర్రగా ఉంటది గదా మరి, అదనే కాదు, దాని చుట్టూ, ఆమాటకొస్తే ఊరు చుట్టూ కొండలే. అవన్నీ ఎర్రగానే ఉంటాయి. కాబట్టి ఊర్లో ఎవరైనా ఎర్రగా పుడితే ఎర్రగానే ఉంటారన్న గ్యారంటీ లేదు. ఎర్రటి దుమ్ము ధూళికి రంగు మారచ్చు. కొప్పుకొండకి కాస్త ఎడంగా మరో చిన్న కొండ ఉంది. దేశంలో ఊరికి దగ్గరగానో, ఊరులోనో కొండ ఉంటే అది ఖాళీగా ఉండదు, ఏ వెంకటేశ్వర స్వామి వైకుంఠగిరి గానో, జీసస్‌ కల్వరి కొండగానో మారిపోతుంది. అట్టా కొప్పు కొండ మీద గుడినీ, చిన్న కొండమీద సిలువని స్థాపించి ఆ స్థలాలు దేవుళ్ళవిగా లేదా స్థాపించిన వాళ్ళవిగా అధికారికంగా ప్రకటించారు పూర్వం. మరే, ఆ కొండల దగ్గర చాలా మందికి చాలా మెమరీలుంటాయి. అవన్ని చెప్పుకోవద్దులే గానీ, ఇప్పుడు చెప్పుకోవాల్సింది ఒకటుంది, బావకీ బామ్మర్దికీ తగువు పెట్టింది ఏదనీ. 

చిన్నకొండ వారగా ఉన్న ఖాళీ స్థలాలకు ఏ పాపం తెలీదు. పాపమంతా జనందే.  

‘మీరు పోయి ఇల్లు కట్టుకోండి, మేము వచ్చి ఎంక్వైరీ చేసి పట్టాలిస్తాం’ అన్నారు ఎమ్మార్వో. ఇదేదో వెరైటీగా ఉందే అనుకున్నారు విన్న వాళ్లు. ఆరోజు నుంచీ అక్కడికి వచ్చి ఎవరికి దొరికింది వాడు తన ప్లాటుగా ప్రకటించుకున్నారు, పునాదులు కూడా మొదలు పెట్టారు. వాళ్ళల్లో ఫిలిప్‌ గాడి బావ టైలర్‌ కిషోర్‌ బాబు కూడా ఉన్నాడు. కూతురు పెళ్లి అనుకున్నాడుగా, కాబట్టి ‘హమ్మయ్యా, మనకు ఓ సమస్య తీరింది’ అనుకోటం బానే ఉంది. 

లిస్ట్‌ చూస్తే నాలుగొందల మందిలో పాతిక ముప్పై దాకా ఇజ్రాయిల్‌ పేట వాళ్ళే. మా కాలనీకి ఆ పేరున్నా అందరికీ పాలెమనే అలవాటు కాబట్టి అలాగే అందాం. ఆ కొద్దిమంది పాలెమోల్లు కాకుండా మిగతా అంతా ఊర్లో వాళ్లే. ఈ స్థలాలు మార్కాపురం హైవేకి దగ్గరగా ఉండటం వల్ల మంచి కాలనీ ఏర్పడిపోతుందని అందరికీ సంతోషంగానే ఉంది. అట్టానే ఉంటే మనం ఇంత చెప్పుకోము కదా, మొన్న సాయంత్రం పూట హుటాహుటిన ఎమ్మార్వో అక్కడికొచ్చి ‘మేము పట్టాలు జారీ చేసేదాకా కట్టడాలు ఆపేయండి’ అని హుకుం జారీ చేశాడు. జీ హుజూర్‌ అన్నారు జనం.

‘ఆ ముక్కేదో ముందే ఏడవచ్చుగా’ అని వీళ్ళు ఏడుస్తూ పైన సిలువ దాకా వేసుకున్న బేస్‌ మట్టాలు కూల గొట్టుకున్నారు, ప్రతి ఒక్కరికీ దాదాపు యాబై వేల నష్టం. ఎందుకు ఆపారో ఎవరికీ అర్థం కాలేదు. ఫిలిప్‌ గాడికి తప్ప. 

‘లిస్టులో ఉన్న పాలెం వాళ్ళకి స్థలాలు పాలానికి వచ్చి తీర్మానం చేస్తాను’ అన్నాడు ఎమ్మార్వో. 

అక్కడొచ్చిది డౌటు ‘ఊర్లో పెద్ద తలకాయలు అందరిని వదిలేసి మన మీద స్పెషల్‌ ఫోకస్‌ ఏమిటి? అందరికన్నా ముందు మనకే ఎందుకు స్థలాలు జారీ చేయడం, ఈ కౌగిలి ధృతరాష్ట్ర కౌగిలి కాదుకదా’ పాలెంలో అందరి చెవులూ కొరికాడు ఫిలిప్‌. 

తెల్లారితే చర్చిలో మీటింగ్, బావ అన్నం పూర్తిగా తినేదాకా ఆగి అందుకున్నాడు బామ్మర్ది ‘కొత్తగా వేరే చోట స్థలాలు కేటాయిస్తారని అనుకుంటున్నారు, కొత్తగా ఇచ్చేది వద్దని చెప్పు’ 

బావ చేతిలో టవల్‌ విసిరేసి ‘ఇచ్చేది వద్దనే దరిద్రుని నిన్నే చూస్తున్నా, రేపు అక్కడికి వచ్చి ఇదే మిడిమేలంతోటి ఆఫీసర్‌ ని ఏమన్నా అన్నావంటే అదే ఆఖరు’ అని అగ్గిపెట్టె లటుక్కున జేబులో పెట్టుకొని నడిపయ్య కొట్టుకాడికి పోయాడు. అక్కకి, వాళ్ల పిల్లలకి, పక్కింటి వాళ్ళకి, అసలు కాలనీ మొత్తానికి బుర్ర తక్కువ వాడిలా కనపడ్డాడు ఫిలిప్‌.

* * *

12 గంటలకు ఎమ్మార్వో వచ్చాడని తెలియడంతో కిషోర్‌ బామ్మర్దికి చెప్పకుండా హుటాహుటిన వచ్చేశాడు. వెనకాలే బామ్మర్ది ఫాలో అయ్యాడు. లోనికి వెళ్ళగానే బావ బలవంతంగా బయటకు తోసేసాడు. చేసేది లేక మెట్లు దిగాడు. పక్కనే ఉన్న చర్చి ప్రాంగణం నుంచి గుమగుమలు ఆహ్వానించాయి. చూస్తే టెంట్‌ వేసిఉంది. భోజనాలు సెటప్‌ చేస్తున్నారు. మనకు తెలీకుండా కాలనీలో ఫంక్షన్స్‌ లేవే అనుకుంటూ లోనికి వెళ్ళాడు. 

ఫంక్షన్‌ ఎవరిదైనా హడావుడి మోషే బాబాయ్‌దే. చుట్టుపక్కల ఫ్రెండ్స్‌ అందరినీ పలకరించాడు, 

‘అల్లుడూ ఈ పూట చికెన్‌ బిర్యాని, కుమ్మేయ్‌’ మామ వరసయ్యే ఫ్రెండ్‌ సురేషూ. 

‘ఈవురి రెండో పెళ్లి గానీ చేసుకుంటున్నవా? మామ్మాయి నిన్ను కుమ్మిద్ది’ 

మోషే వైపు తిరిగి ‘ఏంది బాబాయ్‌’

‘ఏంటి ఏంటి రా, పెద్ద కాపు కొడుకు పెళ్లి ఈరోజు, ఓహో మన కోసం ఇక్కడ స్పెషల్గా భోజనాలు ఏర్పాటు చేశారు’ గర్వంగా చెప్పాడు.

‘మనకోసం మాత్రమేనా? అదేంటి!’ కార్యక్రమాన్ని పర్యవేక్షిస్తున్న పెద్ద మనుషులు ఇద్దరు వచ్చారు, 

వాళ్ళలో ఒకడు నరేంద్ర ‘మీకోసమే ఫిలిప్స్‌’ ఆ ఎలక్టాన్రిక్‌ కంపెనీ పుణ్యమా అనీ వీడి పేరు బహువచనంలోకి మారింది.  

‘మా మీద అంత ప్రేమ ఉంటే మీ వాళ్లతో పాటు పెళ్లి జరిగే కన్వెన్షన్‌ హాల్‌ లోనే పెట్టొచ్చుగా, ఇక్కడ ఎందుకు?’ నీళ్లు నమిలాడు నరేంద్ర. 

మోషే ఇద్దరి మొహాల్లో మాడు వాసన పసిగట్టాడు ।కాదురా, అసలే కోవిడ్‌ రూల్స్, ఎక్కువ మంది  గుమికూడితే కష్టం అని’ 

‘ఊర్లో అందరూ వచ్చారుగా, మన పాలేమోల్లు మాత్రమే ఎక్కువ అవుతారా’ 

నరేంద్ర చిరాగ్గా చూశాడు, మోషే బాబాయ్‌ చటుక్కున ఆగిపోయాడు. లైట్‌ వెలిగినట్టు ఉంది. సురేష్‌ మొహంలో పజిల్‌ పటాపంచలైంది.

‘ఏందిరా నువ్వు మాట్లాడేది, మూడేళ్ల కితం మాజీ సర్పంచ్‌ ఇంట్లో ఫంక్షన్‌కి ఆర్‌అండ్‌బీ బంగ్లాలో భోజనం పెడితే మనం తినలేదా, నువ్వు కూడా వచ్చి కుతికెల దాకా మెక్కావుగా, ఇప్పుడు ఏమైంది’ 

‘అంటే అప్పుడు పెట్టింది కూడా ఇదే పద్ధతిలోనా! అందుకేనా ఆ రోజు మన కాలనీ వాళ్లు తప్ప వెరేవాల్లేవురు లేరు’ అప్పుడు తిన్నందుకు ఇప్పుడు తనను తాను క్షమించుకోలేనంత కుంగిపోయాడు. విన్న ఫ్రెండ్స్‌ అంతా మొహాలు చూసుకున్నారు.

‘అరేయ్‌ ఇది మనం తినాల్సిన పనిలేదు’ సేనాధిపతిలా ఆదేశించాడు. మోషే కల్ల నిండా కారమే అన్నంత ఎర్రగా ఉన్నాయి కళ్లు  ‘నిన్ను తగువుల మారోడు అన్నది అందుకేరా’ 

ఏరా, నీ స్థలం కొనలేదని గొడవ చెయ్యటానికి వచ్చావా? పో ఇక్కడినుంచి’ నరేంద్ర.

మోషే  రెక్క పట్టుకుని గేటు దాకా తీసుకొచ్చి వదిలిపెట్టారు. ఓ రకంగా గెంటేశాడు. వాళ్లు చేయాల్సిన పని మన వాడే చేయడం గొప్ప పరిణామ చిహ్నం.

* * *

నరేంద్ర కూర్చొని చూస్తున్నాడు, మోషే చెప్పిన పనులు చేస్తూ హుషారుగా ఉన్నారు యువత. ఇజ్రాయిల్‌ బానిసలను టెన్‌ కమాండ్మెంట్స్‌ తెచ్చి రక్షించిన ప్రవక్త మోషే లాగా ఫీల్‌ అవుతున్నాడు కాబోలు. 

ఈ ఇజ్రాయిల్‌ పేటకు నేనే దిక్కు అని. అసలు బానిసలు అంటే యూదులు మాత్రమేనా! ఈజిప్ట్, ఆఫ్రికా మరెన్నో దేశాల జనం బానిస బతుకు బతికే వాళ్ళు కాదా, అందరి కోసం అనే దేవుడు కొందరిని మాత్రమే బానిసత్వం రక్షించి నుంచి మిగతా వాళ్ళని గాలికి వదిలేశాడే. అసలు అందులో న్యాయం లేదు. ఇప్పుడు కూడా అలాగే అవుతోంది’

ఎలా అడ్డుకోవాలి, బుర్ర గోక్కుంటూన్నాడు, ఆలోచిస్తూ పైకి చూసాడు, ఎత్తైన ప్రహరీ గోడ మీద బల్లి పాకుతోంది, ఆలోచన అక్కడే ఆగిపోయింది.

సరిగ్గా భోజనం టయానికి ‘కూరల్లో బల్లి పడిందంట’ మోషే బాబాయ్‌కి చెవిలో చెప్పాడు. 

అదిరిపడ్డాడు పెద్దాయన.

‘ఏ కూరలో?’ 

‘నాకు తెలీదు, అందరూ అనుకుంటున్నారు. వంటలు చేసిన వాళ్ళు, చూసిన వాళ్లు’ చూస్తే పైన బల్లులు కనపడ్డాయి, కన్ఫామ్‌ చేసుకున్నాడు 

‘కోవిడ్‌ టెస్ట్‌లు చేసినట్టు దీన్ని పరీక్షించడానికి టెస్ట్‌ లేకపోయె, దేంట్లోనో తెలిస్తే దాన్ని వరకు పక్కన పెట్టొచ్చు. సాంబార్‌ లోనా కూరలోనా,  తిన్నారంటే లేనిపోని సమస్యలు, ఆ పాపం నాకు చుట్టుకుంటుంది, చెప్తే నరేంద్ర ఏమంటాడో’ మోషే.

అంతా విని తాపీగా వెళ్లిపోయాడు సురేష్‌.

చెప్పక తప్పదుగా, చెప్పాడు. తల పట్టుకుని ‘ఏం చేద్దాం?’ అన్నాడు. ‘విందు సాయంత్రం అని చెబుదాం, ఈలోపు ఏదో ఒకటి చేద్దాం’ పెద్దవాడు మోషే ఐడియా పాసయ్యింది. అన్నట్టే ప్రకటించారు. అయినా ఏం లాభం ఈలోపే బల్లి పడింది అన్న ప్రచారం అందరికీ తెలిసింది... ఎవరివల్లో? 

‘మీ బల్లి భోజనానికి నమస్కారం’ అని ఒక్కొక్కరే జారుకున్నారు. ఆ పూట కొందరిని పస్తు పెట్టారన్న బాధ ఉన్నా సమానత్వం ఆకలికి బలికాకుండా కాపాడినందుకు భలేగా నవ్వుకున్నారు స్నేహితులు ఇద్దరూ.

* * *

అందరి పేర్లు చదివి ఫైనల్‌ డెసిషన్‌కి గట్టిగా ఊపిరి పీల్చాడు ఎమ్మార్వో. ‘మీ పాలెం వాళ్ళందరికీ స్థలాలు కొప్పు కొండకింద ఇస్తాం, ముందు కేటాయించిన కాలనీలో జనాభా ఎక్కువ అయిపోయారు’ మూడో కమాండ్మెంట్‌ ప్రకటించాడు.

‘జనాభా ఎక్కువైన ప్రతిసారీ తప్పు కోవాల్సింది ఎవరు, అనే ప్రశ్న రానేరాదు, ఎందుకంటే సమాధానం రెడీగా ఉంది కాబట్టి, కొండ కింద అన్నప్పుడే కొండ రాళ్ళు దొల్లుకుంటు వచ్చి గుండెల్లో పడ్డాయి. కొండ కింద మా కాలనీ వాళ్ళ స్మశానం, ఆ కొండగుట్టల మీదనే మీదనే మా తాత ముత్తాతల సమాధులు. 

‘మనం, మన శ్మశానాల కన్నా ఎక్కువ కాదు’ అడుగు పెట్టిన బామ్మర్ది తో అన్నాడు. ×ఇప్పుడు ఏం చేయాలి’ ఇది ఊరు నుంచి మరింత అవతలికి వెళ్లడం, పథకాలు మన మీద అమలవుతాయి, కానీ దాని రూపేది! 

అందరితో పాటు తనూ సరేనని తలాడించి బైటికి వచ్చాడు కిషోర్‌.

ఒకచోట ఆకలి చంపుకుని గెలిచి, మరోచోట అభిమానం చంపుకుని ఓడి, ఇంకో చోట కూడా ఓటమికి సిద్ధపడాలి. పాలెం స్థలం జన్మలో మార్కెట్‌ రేట్‌ కి అమ్మలేమని తెలిసొచ్చింది. చివరి ఓటమి కోసం ఎదురు చూస్తూ ఉన్నారు ఇద్దరూ.

- చరణ్‌ పరిమి, 8985095040; cartoons.charan@gmail.com


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు