నాయిన చెప్పిన అబద్ధం

నేల దిక్కు తల్కా యాలడేషి ఆలోచించుకుంట చిన్నగ  నడుస్తున్నడు అంజి. రేపో మాపో తెగిపోయేటట్టున్న  అంజి చెప్పు సడన్గ ఓ రాయికి గుద్దుకొని తెగిపోయింది. దాబాన ముందర్కి వడేటోడు జెరంత బ్యాలెన్స్‌ జేస్కొని చెప్పు దిక్కు చూస్కున్నడు. చిరాకుగ మొఖం బెట్టి కాలు రాక్కుంట..

Updated : 03 Jul 2021 17:28 IST


కథావిజయం 2020 పోటీల్లో ప్రోత్సాహక బహుమతి (రూ.3 వేలు) పొందిన కథ

నేల దిక్కు తల్కా యాలడేషి ఆలోచించుకుంట చిన్నగ  నడుస్తున్నడు అంజి. రేపో మాపో తెగిపోయేటట్టున్న  అంజి చెప్పు సడన్గ ఓ రాయికి గుద్దుకొని తెగిపోయింది. దాబాన ముందర్కి వడేటోడు జెరంత బ్యాలెన్స్‌ జేస్కొని చెప్పు దిక్కు చూస్కున్నడు. చిరాకుగ మొఖం బెట్టి కాలు రాక్కుంట ఆడ్నే పక్కకున్నఓ యాప చెట్టు కిందికి వొయి, ప్యాంటుకు గుండీ పోతే, వాళ్ళ అమ్మమ్మ వెట్టిన రెండు పిన్నీసులుల్లకేంచి ఒకటి తీసి చెప్పుకు వెట్టిండు. తర్వాత దాన్ని కాలికి తొడుక్కొని నాల్గడుగులు ముందర్కి వొయి మల్ల పోబుద్ది గాక ఆగి ఎనకకొచ్చి ఈపుకున్న బ్యాగు తీసి చెట్టు కింద వెట్టి తాను కూడా అక్కడ్నే కూసున్నడు. మట్టిల పడున్న ఓ యాప పుల్లను తీస్కొని ఏం తోచనోన్లాగ మట్టిల ఏవో గీతలు గీస్తున్నడు.

అరేయ్‌ అంజి! ఈడ కూసున్నవేంది రా...ఇస్కూల్కి రావా?, అని కేకేసిండు అక్కడ్నుంచే పోతున్న వెంకటేశు.

దోస్తు గొంతు ఇనవడంగనే తల పైకెత్తి మొఖం మీద పడుతున్న ఎండకు కండ్లు చిన్నగ చేసి చూసిండు అంజి.

ఇస్కూల్కి రావా? మల్లడిగిండు వెంకటేశు.

నీవు వో రా! నేను ఎనకసిరి వొస్తా అన్నడు అంజి.

వెంకటేశు సరే అన్నట్లు చూసి మల్ల బడి బాట వట్టిండు.
దోస్తు వొయినాక, అంజి జేబులకేంచి తన చేతి వాచి బయటికి తీసి, దాని వంకనే ధీర్ఘంగా చూస్తుంటే, చేదుగుళికల్లాంటి యాదులు కండ్ల ముంగట మెదిలేటాలకు తన కండ్లుల్ల నీళ్లు తిరిగినయ్‌.

* * *

చేతిల కాయితాలు (కాగితాలు) వట్కొని దబదబ నడ్సుకుంట వొస్తున్న శ్రీశైలం సార్‌ ను చూసి, సారొస్తున్నడ్రా... పాండ్రి.. పాండ్రి లోపల్కి అన్కుంట పోరగాళ్లంతా క్లాసు లోపటికి ఉర్కి ఎవరి ప్లేసుల వాళ్ళు కూసున్నరు.

శ్రీశైలం సార్‌ క్లాసు లోపటికి రాంగనే, అరేయ్‌..! జెంగిల్గాంలలెక్క బైట తిరుక్కుంట ఉండకపోతే క్లాసులనే ఉండొచ్చు గదరా. హెచ్చెమ్‌ సారు చూసిండంటే మమ్ముల కోపమైతడు. ఆడివిల్లలు సూడుండ్రి బుద్దిగ క్లాసులనేకూసున్నరు అని మగ పోరగాళ్లందర్ని కసిరిండు.
ఆయనట్ల అనేటాలకు పిల్లలందరు పకపకా నగుతుంటే, నవ్వుండ్రి...నవ్వుండ్రి! ప్రోగ్రెస్‌ కార్డులు వొచ్చినయి, ఇప్పుడు మార్కులు చెప్త గద, అప్పుడు చెప్తా ఒక్కొక్కళ్ల పని అన్నడు.
ఇగ పిల్లలందరు గుసగుసలు మొదలు వెట్టిన్రు. శ్రీశైలం సార్‌ అటెండెన్స్‌ తీస్కొని, ఒక్కొక్కరి ప్రోగ్రెస్‌ కార్డు తీసి మార్కులు చెప్తున్నడు.

ఈ సారి వెంకటేశు ఫస్టొచ్చిండు అని శ్రీశైలం సార్‌ చెప్పంగనే అందరు చప్పట్లు కొట్టిన్రు. తర్వాత మిగతా పిల్లలవి కూడా మార్కులు చెప్పి ప్రోగ్రెస్‌ కార్డులు ఇచ్చినాక, ఆఖరున పిల్షిండు అంజి పేరు. సార్‌ తన పేరు పిలవంగనే బెదురు బెదురుగా లేసి నిలవడిండు అంజి.
శ్రీశైలం సార్‌ అంజి బెంచి దగ్గరికి వొయి, ఒరేయ్‌ అంజిగా...ఈ సారి నీవు కూడా ఫస్టొచ్చినవ్‌ అన్నడు.
అంజితో సహా క్లాసుల పిల్లలందరూ పర్శానయ్యిన్రు.

మన అంజిగాడు లాస్ట్‌ నుంచి ఫస్టొచ్చిండు అని బిగ్గరగా నవ్విండు శ్రీశైలం సార్‌. ఇగ అది వినంగనే క్లాసుల పోరలు, పోరగాళ్ళందరు కూడా సారెంబడి బిగ్గరగా నగవట్టిన్రు.

అంజికి అగుమానంతోని మొఖం ముడుచుకపోయింది.

ఇది మొదటిసారేమి కాదు. అంజికి ఎప్పుడూ క్లాసుల తక్కువ మార్కులే వొస్తుంటయ్‌. ఈ సారి ఏకంగా ఫెయిలయ్యిండు. అందుకనే శ్రీశైలం సార్‌ అట్ల వెటకారంగా అన్నడు.
అంతలనే శ్రీశైలం సార్‌ మల్ల కోపగొండి మొఖం బెట్టి, నిన్ను తిట్టి తిట్టి నాకు యాసరకొస్తుంది గాని, నీవు మాత్రం చదువుతలేవు. మీ నాయిన నిన్ను ఎట్లనన్న చదివియ్యాలని నీకోసం కష్టం చేస్తుంటే, నీవేమో ఇట్ల చదవకుండా ఫెయిలయితున్నవ్‌ అని, అంజి చేతికున్న వాచి చూసి, అబ్బో...మల్ల ఆఫీసర్‌ లాగా చేతికి వాచి గూడనా! చదువు మీద ఖాయిష్‌ లేదు గాని ఈ సోకులకేం తక్వలేదు అన్నడు.
ఆ మాటనంగనే క్లాసుల అందరు మల్ల పకపక నగుతుంటే, సిగ్గుతోని తల్కా కిందికేసి నిలవడిండు అంజి.
ప్రోగ్రెస్‌ కార్డుల మీ నాయినతోని సంతకం బెట్టిచ్చుకొని రేపు తీస్కరా అని కోపంగా అంజికి ప్రోగ్రెస్‌ కార్డు ఇచ్చి, బోర్డు కాడికి పోయిండు శ్రీశైలం సార్‌.
మీ నాయినతోని సంతకం పెట్టిచ్చుకొని రా... అనెవరకు ఇగ అంజికి గుండె వలిగినంత పనైంది. ఏం జేయాలో అర్థంగాలే, ఏం తోస్తలేదు అంజికి. పరీక్షలుల్ల ఫేయిలయ్యిండని తెలిస్తే తండ్రి ఎంత గరమైతడో అని చాన బుగులైతుంది తనకి.
ఇదిట్లుంటే, మూలిగే నక్క మీద తాటికాయవడ్డట్టు, అసలే ఒక దిక్కు తండ్రితోని కార్డుల సంతకమెట్ల వెట్టియ్యాలా అని అంజి బుగుల్వట్టుకొని ఉంటే, ఇస్కూలు గంట గొట్టే టైమ్‌ కు శ్రీశైలం సార్‌, అంజి తండ్రి బసవయ్యను ఇస్కూలుకాడికి రమ్మని కబురు వెడితే, బసవయ్య సరిగ్గ అదే టైముకు వొచ్చిండు. ఇంగేముంది...పెనం మీది నుంచి పొయ్యిల వడ్డట్టయ్యింది అంజి పరిస్థితి.
అంజి దగ్గరున్న ప్రోగ్రెస్‌ కార్డు తీస్కొని శ్రీశైలం సార్‌, ఇగో బసవయ్య! మొత్తం అన్ని సబ్జెక్టులుల్ల ఫెయిలు మార్కులే. ఇంతకు ముందన్న జెర పాస్‌ మార్కులు వొచ్చేది, ఈ సారి అది కూడా లేదు. ఇట్లయితే కష్టం. పనికి వొయి ఇంటికొచ్చినాక నీవు కూడా జెర టైం తీస్కొని వాడు ఎట్ల చదువుతున్నడని అప్పుడప్పుడన్నా పట్టించుకోవాలి. ఈ మధ్య స్కూలుకు డుమ్మాలు కూడా ఎక్కువైనయ్‌. అడుగుతే ఆ పనికి వొయినా, ఈ పనికి వొయినా, లేకుంటే మా అమ్మమ్మకు సుస్తయ్యింది అని ఇట్ల అన్ని జూట మాటలే చెప్తుంటడు. అందుకే, సంతకం పెట్టిచ్చుకరమ్మంటే మల్ల ఇంకేం కథలు చెప్తడో అని మల్ల నిన్ను పిల్పిచ్చిన. జెర నీవు కూడా పిల్లగాడు ఏమేం చేస్తున్నడు, చదువుతున్నడా లేదా, స్కూలుకు సరిగ్గా పోతున్నడా లేదా అని కొంచం పట్టించుకోవాలి బసవయ్య అని చెప్పి, అంజి తండ్రికి మార్కులు చూపి కార్డుల సంతకం పెట్టి పంపమన్నడు.
బసవయ్య, అట్లెగే సార్‌! ఇప్పట్సంది చూస్కుంట అని వినయంగా చెప్పి ప్రోగ్రెస్‌ కార్డు తీస్కొని, కోపంగా అంజి రెక్క పట్టుకొని ఇంటికి గుంజుకపోయిండు.

ఇంటికి పోంగనే బసవయ్య ఆవేశంగా అంజిని తిట్టుకుంట ఈపులు వలగ్గొడ్తుంటే, అరే...బసవయ్య! పిల్లగాడ్నట్ల బాదవడ్తివి, ఏమైందిఅనుకుంట ఇంట్ల నుంచి ఉర్కొచ్చి, అంజిని పక్కకు గుంజింది ముత్తవ్వ.
నీవు అడ్డం రాకత్తా! జర్గు...ఇయాల వాడు సచ్చిండు నా చేతిల అనుకుంట ఇంగింత ఆవేశంగా ఊగిపోయిండు బసవయ్య.

తిక్కగాన వట్టిందా బసవయ్య నీకు! ఒక్కగానొక్క బిడ్డాయే. వాడ్ని వట్టుకొని నా చేతిల సచ్చిండు అదీ అంటవా? జెర ఆగు, అసలేమైంది? అల్లుడిని మందలింపుగా అన్నది ముత్తవ్వ.
ఒక్కగానొక్క బిడ్డ కాబట్టే వాడ్ని సదివియ్యనీకే నేనెంత కష్ట పడుతున్ననో నీకు తెల్వదా అత్తా! వాడేమో సక్కగ సదువుతనేలేడు, కనీసం ఇస్కూల్కు కూడా సక్కగ పోతలేడంట. ఇస్కూల్ల టీచర్లు, సారోల్లు అడుగుతే రోజొక కథ చెప్తడంట. ఇయాల వాళ్ళ సారు నన్ను పిల్షి ప్రోగ్రెస్‌ కార్డు చూపుకుంట చెప్పిండు. అన్ని సబ్జెక్టులుల్ల ఫెయిలయ్యిండు. మల్ల ఏదో క్లాసుల ఫస్టొచ్చినోంలెక్క చేతికి ఆ వాచొకటి. సదువు లేదు గాని ఈ ఏతులకేం తక్వలేదు. అసలు ఇస్కూలుకు వోకుండా యాడికి వోతున్నవ్‌ రా? అన్కుంట మల్ల అంజిని కొట్టనీకే ముందుకొస్తుంటే, ముత్తవ్వ అల్లుడికి అడ్డుపడి, నీవుండు బసవయ్య! నేను మాట్లాడ్తగద వాంతోని. పసిబిడ్డను వట్టుకొని అట్ల కొడ్తా అని మీదిమీదికొస్తవేంది అని కసిరింది.

బసవయ్య అసహనంగా మొఖం పక్కకు తిప్పుకున్నడు.

తండ్రి కొట్టిన దెబ్బలకు వెక్కి వెక్కి ఏడుస్తున్న మనవడిని దగ్గరికి తీస్కొని, చెంపల మీది నుంచి ధార కట్టిన కన్నీళ్లను ఆమె పైట కొనతోని తుడిసి, నాయనా అంజి! ఎందుకు కొడ్కా అట్ల చేస్తున్నవ్‌. సదువుతలేవంట, ఇస్కూలుకు కూడా సరిగ్గ పోతలేవంట ఎందుకు? మీ నాయిన నీ కోసం ఎంత కష్టవడ్తున్నడో నీకు ఏర్కే గదా. ఇప్పుడు కూడా మీ నాయిన నిన్ను కోపంతోని కొట్టలేదు. నీవిట్ల సదువుకోకుంటే నీ భవిష్యత్తు ఏమైతదా అని బాధతోని కొట్టిండు. నిన్ను కొట్టిండు కానీ సూడు మీ నాయన ఎంత బాధవడ్తున్నడో అన్నది.
అంజి ఏం మాట్లాడకుండా ఏడ్సుకుంట అమ్మమ్మ మొఖం చూస్కుంట నిలవడిండు.
చూస్నవా అత్తా! నీవు, నేను ఇంతగానం అడుగుతుంటే నోట్ల బెల్లం ముక్క వెట్టుకున్నట్టు నోరే తెరుస్తలేడు అన్నడు బసవయ్య.
అరే...నేను అడుగుతున్న కదా బసవయ్య, నీవూకో అని అల్లుడికి నచ్చజెప్పి, మనవడి దిక్కు తిరిగి, మనవడి గడ్డం పట్టుకొని, చెప్పు కొడ్క! ఎందుకు సదువుతలేవు? అమ్మమ్మకు కూడా చెప్పవా? చెప్పకుంటే ఇగ నీకు నాకు మాటలే వొద్దుపో లాలనగా అన్నది ముత్తవ్వ.
అంజి నేల దిక్కు చూసి మల్ల ముత్తవ్వ దిక్కు చూసి, షర్టుతోని ముక్కు తూడ్సుకొని, చిన్నగ, అది కాదు అమ్మమ్మ! నాయిన ఆ మధ్య ఓ రోజు చేను కాడికి పురుగుల మందు తీస్కపోయిండు కదా అందుకే.. అన్నడు ఏడుపు గొంతుతోని.
అంజి మాటలకు ఏం అర్థంకాక బసవయ్య, ముత్తవ్వ తన దిక్కు ప్రశ్నార్థకంగా చూసిన్రు.
దానికీ, నీవు ఇస్కూల్కి పోకపోడానికి, ఏమ్‌ సంబంధం? అడిగింది ముత్తవ్వ.
కొడుకు ఏం సమాధానం చెప్తడా అని బసవయ్య కూడా ఆతృతగా చూస్తున్నాడు.
అదీ...అదీ...పోయినేడాది... అమ్మకు బాగ సుస్తయ్యి మంచంల వడ్డది కదా, అదే టైంల, తీరా పంట చేతికొచ్చే టైంకు వర్షాలు వడి మన పంట మొత్తం నాశ్నమయ్యింది. ఇగ నాయినకు గుండె వలిగి ఏడుస్తుంటే, అమ్మ దినాము అది చూడలేక, ఆమె వల్ల నాయినకు ఇంగింత భారం కావొద్దని, ఆ దినం మనమెవ్వరం ఇంట్ల లేనప్పుడు పురుగుల మందు తాగి నన్నిట్ల వొదిలేషి పోయింది గదా. ఇగ ఈ సారేమో నకిలీ విత్తనాల వల్ల, పెట్టిన పైసలన్ని ఆగమైనయి. మన చేను చూస్కొని ఓ రోజు నాయిన మస్తు యేడ్శిండు. అందుకే...అందుకే...ఇగ నాయిన కూడా అమ్మ చేసినట్టే చేసి ఎక్కడ నన్ను దిక్కులేనోంలెక్క చేస్తడో అని భయపడి.. అని ఆగిపోయిండు అంజి.
భయపడి...?ఆదుర్దాగా అడిగిండు బసవయ్య.
అంజి బెదురుబెదురుగా తండ్రికెల్లి చూసి, మల్ల ముత్తవ్వ వంక చూసి, భయపడి...రోజు ఇస్కూలుకు పోయినట్టు పోయి, నాయిన చేనుకాడికి వొయినాక, నాయినకు తెల్వకుండా నేను కూడా చేనుకాడికి వొయి, రోజంతా ఆడ్నే ఉండి, నాయనని చూస్కుంట ఉంటుంటి. అప్పుడు నాయిన, అమ్మలాగా ఏమన్న చేస్తే నేను ఆడ్నే ఉంట కాబట్టి నాయనని ఆపొచ్చు అని చెప్పి అరచేతులతోని కండ్లుల్ల నుంచి వొస్తున్న నీళ్లను తుడుచుకున్నడు అంజి.
అంజి మాటలు విని ముత్తవ్వకు, బసవయ్యకు మనసంతా కశిబిషయ్యింది. బసవయ్య కండ్లుల్ల నీళ్లు పెల్లుబికినయి. ఎంబడే కొడుకును గుండెలకు అదుముకుని, ఇంత ఆలోచన చేస్నవా! పెద్దోడివైపోయినవ్‌ రా అంజిగా! తెల్సుకోలేకపోయిన రా. అనవసరంగా నీ మీద చేయి జెస్కున్న కొడ్కా. నన్ను చెమించు! అన్నడు.
ముత్తవ్వకు కూడా కండ్లుల్ల నీళ్లు తిరిగినయ్‌. సూస్తివా అల్లుడూ! అనోస్రంగా వాని మీద చేయి చేస్కున్నవ్‌. నా మవనడు బంగారం అని అపురూపంగా మెటికలు విరిచింది.
బసవయ్య చిన్నగ నవ్వి, కొడుకు తలను ప్రేమగా నిమిరి, అట్లాంటి పని అస్సలు చేయను కొడ్కా. ఎంత కష్టమొచ్చినా నిన్ను ఇడిషివెట్టి యాడికి పోను.. ఒట్టు! అని కొడుకుకి మాటిచ్చిండు.
అది విన్నెంబడే అంజి మొఖం పున్నమి నాటి చంద్రుడిలెక్క వెలిగిపోయింది. తండ్రిని గట్టిగా కావలించుకున్నడు.
తర్వాత బసవయ్య, కొడుకు చేతిని తన చేతిలోకి తీస్కొని, అంజి! ఈ వాచి ఎక్కడిదో నీకు యాదుందా?అని అడిగిండు.
అంజి, ఉంది అన్నట్లు తలాడిచ్చి, ఓ సారి మనూర్ల జాతరైనప్పుడు, అమ్మ ఓ షాపుల ఈ వాచి చూసి, పైసలు లేవు అంటే గూడ నీతోని కొట్లాడి మరీ ఇప్పిచ్చింది నాకు ఈ వాచి అని చెప్పిండు.
ఆ...ఎందుకిప్పిచ్చిందో తెల్సా? ఇప్పిచ్చినాక నాతోనేమన్నదో తెల్సా కొడ్కా! నా కొడుకు మంచిగ సదివి క్లాసుల ఫస్టొస్తే, క్లాసుకు లీడరయితడు. అప్పుడు నా కొడుకు అందరు పిల్లలుల్ల స్పెషల్గా కనవడాలె గదా. అందుకే నీవొద్దటుంటే కూడా ఇంతగానం కొట్లాడి కొన్న వానికి ఈ వాచి, అనుకుంట మస్తు మురిసిపోయింది మీయమ్మ ఆ దినం దాన్ని చూస్కుంట పెండ్లాన్ని యాది జేస్కుంటా చెప్పిండు బసవయ్య.
నిజంగనా నాయిన! కండ్లుల్ల అమాయకత్వం నింపుకొని ఆతృతగా అడిగిండు అంజి.
అవ్వు కొడ్కా నిజం! చెప్పిండు బసవయ్య.
అంజి, తన చేతికున్న వాచి తీసి, అట్లైతే అమ్మ కోసమన్న ఇప్పట్సంది మంచిగ సదువుకుంటా. అమ్మ కోరిక తీర్చినాకనే మల్ల ఈ వాచి పెట్కుంటా అని చెప్పి, ఆ వాచిని భద్రంగా దాచిపెట్టుకున్నడు.
ముత్తవ్వ అల్లుడి వంక అనుమానంగా చూసింది. బసవయ్య, అత్తను చూసి సన్నగా నగిండు. ఆ నవ్వుకు అర్థం ముత్తవ్వకు అర్థమయ్యింది. కొడుకుని మార్చనీకే బసవయ్య చిన్న అబద్ధం ఆడిండు అని గ్రహించి, ఆమె కూడా హాయిగా నగింది.

  *  *  *

ఇగ తండ్రి చేను కోసం ప్రాణాలు తీసుకోను అని మాటిచ్చేవరకు, అంజికి జెర మనసు కుడుటవడింది. తాను కూడా తండ్రికిచ్చిన మాట ప్రకారం, ఎట్లనన్న తల్లి కోరిక తీర్చాలని, ఇగ అప్పట్సంది రోజు మంచిగ ఇస్కూల్కి వొయి, ఈ సారి పరీక్షలకు కష్టపడి చదివిండు.
ఇయాల ప్రోగ్రెస్‌ కార్డులు ఇస్తమన్నరు ఇస్కూల్ల. తల్లి కోరిక నెరవేర్చగలుగుతనో లేదో అని చాన టెన్షనయితుంది అంజికి. అందుకే తనకి ఇస్కూల్కి పోవాల్నంటే భయం భయంగుంది.

పైకి లేసి నిలవడి, తన వాచిని తిరిగి ప్యాంటు జేబుల వెట్టుకొని చిన్నగ నడ్సుకుంట ఇస్కూలుకు పోయిండు అంజి.
బెల్లు గొట్టంగనే ఎప్పట్లాగనే శ్రీశైలం సార్‌ క్లాసులకొచ్చిండు. ప్రోగ్రెస్‌ కార్డులు తీసి, ఈ సారి... ఫస్ట్‌ ర్యాంకు... అంజికి వొచ్చింది అన్నడు చిన్నగ నమ్మకం కుదరనోడిలాగా మల్ల మల్ల అంజి ప్రోగ్రెస్‌ కార్డునే చూస్కుంట.
ఎప్పట్లాగనే సార్‌ జోకు చేస్తున్నడేమో అని క్లాసుల పిల్లల్లంతా నవ్వుడు షురూ చేసిన్రు.
అప్పుడు శ్రీశైలం సార్‌, ఈ సారి నిజంగనే ఫస్టొచ్చిండ్రా మన అంజి గాడు పిల్లల్లందరినీ ఓ సారి కలియజూసి అన్నడు.
క్లాసుల అందరూ ఒక్కసారిగా హతాశులయ్యిన్రు. దోస్తుకు నిజంగనే ఫస్టు ర్యాంకు వొచ్చిందని వెంకటేశు మస్తు ఖుషయ్యిండు.
అంజి ఇగ మస్తు సంతోషంగా నగుకుంట లేసి నిలవడిండు.
శ్రీశైలం సార్‌, అంజి దగ్గరికొచ్చి, అట్లెట్లొస్తివిరా ఫస్ట్‌ ర్యాంకు..! అనుకుంట అంజి భుజం తట్టి నగిండు. అంజి కూడా నగుకుంటా ప్రోగ్రెస్‌ కార్డు తీస్కున్నడు.
తర్వాత జేబులకేంచి తన వాచి తీసి, కీ తిప్పి, టైము కరెక్టుగా సెట్‌ చేసి, చేతికి పెట్టుకున్నడు.

ఇస్కూలు బెల్లు కొట్టంగనే ఉరుక్కుంట ఇంటికి వొయి, అమ్మమ్మా! నాయిన! నేను క్లాసుల ఫస్టొచ్చిన. నేను క్లాస్‌ లీడర్‌ అయిన. అమ్మ కోరిక తీర్చిన. అందుకే నా చేతికి ఇగ అమ్మ ఇచ్చిన వాచి కూడా పెట్టుకున్నా. ఇప్పుడిగ ఎవ్వరు నన్ను ఎక్కిరియ్యరు అనుకుంట సంబరంగా ఎగుర్లాడుతుంటే, కొడుకుని చూస్కొని బసవయ్యకు, మనవడిని చూస్కొని ముత్తవ్వకు కండ్లు మురిసినయ్‌.

తన నాయిన చెప్పిన అబద్ధం వల్ల అంజిల వొచ్చిన మార్పుకు ముత్తవ్వ గోడకున్న కూతురి ఫోటోను చూసి తృప్తిగా నగింది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు