అడ్డుగోడ
నరికేసిన చెట్లు నిరసనగా నిప్పురాళ్లు విసిరినట్టు ఎండ దాడి చేస్తోంది. బండి పక్కనాపి, హెల్మెట్ తీసి, జేబులోంచి మోగుతున్న ఫోన్ తీసుకుని చూశాడు రామ్మూర్తి. ‘సుందరం’ పేరు కనబడగానే అతనికి మల్లెతోటలో మంచు కురిసినట్టయింది. ‘‘ఆ చెప్పరా సుందరం!’’ అన్నాడు
కథావిజయం 2020 పోటీల్లో ప్రోత్సాహక బహుమతి (రూ.3 వేలు) పొందిన కథ
నరికేసిన చెట్లు నిరసనగా నిప్పురాళ్లు విసిరినట్టు ఎండ దాడి చేస్తోంది. బండి పక్కనాపి, హెల్మెట్ తీసి, జేబులోంచి మోగుతున్న ఫోన్ తీసుకుని చూశాడు రామ్మూర్తి. ‘సుందరం’ పేరు కనబడగానే అతనికి మల్లెతోటలో మంచు కురిసినట్టయింది. ‘‘ఆ చెప్పరా సుందరం!’’ అన్నాడు కులాసాగా.
‘‘మన పక్కవీధిలో నాలుగొందల గజాల స్థలం అమ్మకానికొచ్చింది. ఓ చిన్న పెంకుటిల్లుంది. కానీ నివాసానికి అంతగా పనికిరాదు. స్థలమే లెక్క. పదకొండు చెబుతున్నారు. పదికి రావొచ్చు. డిమాండ్ బాగా ఉంది. తీసుకుందామంటే, నువ్వు రేపొస్తే ఓసారి చూసుకుని అడ్వాన్స్ ఇచ్చేద్దాం. ఇప్పుడు కాకపోయినా ఎప్పటికైనా అందులో మనం ఇళ్లు కట్టుకుంటే పక్కపక్కనే ఉండొచ్చు’’ అన్నాడు సుందరం.
‘‘నువ్వు చూశావు కదా. మళ్లీ నేనెందుకు. నీకు నచ్చితే ఫైనలైజ్ చేసెయ్. కానీ ప్రస్తుతం నా దగ్గర నాలుగే ఉంది. ఓ పనిచెయ్యి, నువ్వు రెండూ యాభై తీసుకో. నేను నూటేభై తీసుకుంటా’’ అన్నాడు రామ్మూర్తి.
‘‘డబ్బు విషయం నువ్వు మర్చిపో. నువ్వు ఓకే అంటే రేపే అడ్వాన్స్ ఇచ్చి, అగ్రిమెంట్ లేకుండా వచ్చేవారం నేరుగా రిజిస్ట్రేషన్ చేయించేద్దాం. లక్ష నేను సర్దుతాలే. నీ దగ్గరున్నప్పుడు ఇవ్వు. రిజిస్ట్రేషన్‌కి కూడా నువ్వు అవసరంలేదు. సెలవులకి ఏకంగా అమ్మాయిని పిల్లల్ని తీసుకురా. అప్పుడు చూడొచ్చు స్థలం. తనకి కూడా ఓ మాట చెప్పు’’ అన్నాడు సుందరం.
‘‘సరే. నువ్వు కూడా ఫ్యామిలీతో ఓ సెకండ్ సాటర్ డే, సండే వైజాగ్ రా. సరదాగా అరకు వెళదాం’’ సుందరంతో మాట్లాడుతూ ఉంటే తల్లోంచి కారే చెమట చూరు మీద నుంచి జారే చినుకులా ఉంది తప్ప ఎండ తెలీటం లేదు రామ్మూర్తికి.
* * *
అసుర సంధ్య వేళ. వెలుతురుని మింగే ముందు చీకటి పరిషేచన చేసినట్టు అక్కడక్కడా చినుకులు పడుతున్నాయి.
‘‘ఏంటి బావా మనూళ్లో సైటు కొన్నావట, అక్క చెప్పింది’’ అడిగాడు రామ్మూర్తి బావమరిది అక్క చేసిన వేడి వేడి పకోడీ నములుతూ.
‘‘ఆ అవునురా. నేనూ, సుందరం కలిసి తీసుకున్నాం’’ అన్నాడు రామ్మూర్తి.
‘‘గజం ఎంత పడింది బావా?’’
‘‘రెండువేలా అయిదొందలు’’
‘‘అవునా. సుందరం వాళ్ల పక్కవీధే కదా. ఆ వీధిలో అంతుందా? ట్వంటీ ఫీట్ రోడ్డు, ఊరి చివర, శ్మశానాలకి దగ్గర. రెండువేలా అయిదొందలా? పోష్ లొకాలిటీ బ్యాంకు కాలనీలో మా పిన్ని కొడుకు మొన్నే రెండువేల చొప్పున తీసుకున్నాడు. బేరం ఆడలేదా బావా?’’
‘‘ఏమోరా, అన్నీ సుందరమే చూశాడు. లెక్క కూడా ఓ లక్ష తక్కువైతే వాడే పెట్టాడు’’
‘‘అదీ సంగతి!’’
‘‘అంటే ఏంటి రా, నీ ఉద్దేశం’’
‘‘అదేం లేదు బావా, ఇంతకీ ఆ స్థలం ఎవరిదో తెలుసా?’’
‘‘తెలుసు. సుందరం వాళ్ల పిన మావగారి కొడుకుది. అందుకే తక్కువకి వచ్చింది అని కూడా చెప్పాడు సుందరం. అయితే ఏంటట?’’
‘అదీ సంగతి’ అనలేదు, ఎక్సప్రెషన్ ఇచ్చాడు బావమరిది.
‘‘అంటే ఏంటిరా నువ్వనేది? సుందరం ఎక్కువ పెట్టాడంటావా?’’
‘‘నేననలేదు బావా, నువ్వే అంటున్నావు. మార్కెట్ రేటు అంత లేదేమో అంటున్నానంతే’’ నసిగాడు.
‘‘ఛఛ, సుందరం అలాంటివాడు కాదు. నా విషయంలో అలా ఎప్పుడూ చెయ్యడు’’ ఫామ్‌లో లేని బాట్స్‌మన్ ప్యాడ్స్ కట్టుకుంటున్నట్టు కాస్త తడబడుతూ అన్నాడు రామ్మూర్తి.
‘‘బావా, ఒకే ప్రెస్‌లో ప్రింట్ అయ్యే నోట్లే ఒకలా ఉండవు. నువ్వేమో అందరూ ఒక్కలాగానే ఉంటారంటావు. ఏదైనా చెబుదామంటే అత్తవారి తరఫువారి పెత్తనం ఎక్కువైపోయింది అంటారేమోనని భయం’’ బావమరిది వినయంగా చెప్పినా వినసొంపుగా చెప్పాడు.
రామ్మూర్తి కాసేపు మౌనంగా ఉండిపోయాడు.
‘‘సరేలే బావా, మీ మధ్య చిచ్చుపెట్టాలని కాదు. బామ్మర్ది బతుకు కోరతాడంటారు. జస్ట్ మా అక్కమీద అభిమానంతో అడిగా అంతే. ఇందులో నిజంగానే ఏమీ ఉండకపోవచ్చు. సైటు కొని నష్టపోయినవాళ్లెవరూ ఉండరు. కాకపోతే కొంచెం లాభం తగ్గొచ్చు. బ్యాంకు వడ్డీకేం ఢోకా ఉండదు’’
ఈ సారి కొంచెం బ్యాలన్స్ చేశాడు బావమరిది. ఖాళీగా ఉన్న ఎదురు సీటు మీద కాళ్లు పెట్టుకుని కంఫర్టబుల్‌గా ఉన్న ప్రయాణంలో హఠాత్తుగా టీసీ ఆ బెర్తుని వేరే వాళ్లకి అలాట్ చేస్తే వచ్చే ఇబ్బంది లాంటిది తప్ప, అతనేం చెడ్డవాడు కాదు.
రామ్మూర్తి ఇంకాస్త ఆలోచనలో పడ్డాడు.
‘‘పోనీ ఓ పని చెయ్యి బావా, ఓ నెలాగి, అర్జెంటుగా డబ్బు అవసరం పడింది, ఆ స్థలం నువ్వే తీసేసుకో అని అడిగి చూడు. ఒప్పుకుంటే రేటు జెన్యూన్ అని, ఒప్పుకోకపోతే కొంచెం ఇన్‌ఫ్లేట్ అయిందని అర్థం. జస్ట్ ట్రై చెయ్యి’’ అంటూ లేచి వెళ్లిపోయాడు బావమరిది.
బయట చీకటి పూర్తిగా కమ్ముకుంది, రామ్మూర్తి మనసులో ఆలోచనల్లా.
* * *
ఓ గ్రహణం రోజు రామ్మూర్తి ఫోన్ చేసాడు, ‘‘సుందరం, అనుకోకుండా కొన్ని ఖర్చులొచ్చాయి. పిల్లల ఫీజులు కూడా కట్టాలి. నీకు అభ్యంతరం లేకపోతే ఆ స్థలం నువ్వే తీసేసుకో అదే రేటుకి’’
‘‘అబ్బే నా దగ్గర అంత డబ్బులేదురా. ఉండనీ, రేటు పెరుగుతుంది’’ చెప్పాడు సుందరం.
రాహువు నెమ్మది నెమ్మదిగా చంద్రుణ్ని మింగసాగాడు.
మరో ఆర్నెల్లు మూఢంలో మండపాల్లా మౌనంగా గడిచాయి.
‘‘సుందరం మనం కొన్న స్థలం రేటేమైనా పెరిగిందా’’ అడిగాడు రామ్మూర్తి.
‘‘లేదురా. నోట్ల రద్దు తర్వాత రియల్ ఎస్టేట్ కొంచెం డౌన్ అయ్యింది’’ సుందరం అనగానే మరేం మాట్లాడకుండా ఫోను పెట్టేశాడు రామ్మూర్తి.
* * *
‘‘బావా నీకీ విషయం తెలిసిందా. అయినా నీకు తెలియకుండా జరగదులే’’
‘‘ఏ విషయం?’’
‘‘మీరామధ్య కొన్న స్థలంలో ఓ చిన్న పెంకుటిల్లు ఉందన్నావు కదా’’
‘‘అవును. అది శిథిలావస్థలో ఉందని చెప్పాడు సుందరం’’
‘‘కదా, కానీ సుందరం దాన్ని ఎవరికో అద్దెకిచ్చాడట. ఓ పెద్దావిడ, ఆవిడ కూతురు ఉంటున్నారట’’
‘‘అవునా, సుందరం నాకు మాటమాత్రమైనా చెప్పలేదే’’ అంటూనే ఫోన్ చేశాడు రామ్మూర్తి. వచ్చిన పని అయిపోవడంతో అతని బావమరిది అక్కడి నుంచి లేచి వంటింట్లోకి వెళ్లాడు.
‘‘ఆ సుందరం, మన స్థలంలో ఉన్న ఇంటిని ఎవరికైనా అద్దెకిచ్చావా?’’
‘‘ఓ అదా. తెలుసున్నవాళ్లే. స్కీంలో ఇల్లు అలాట్ అయ్యిందట. అది రావటానికి ఇంకా మూణ్నెల్లు పడుతుందట. ఈలోగా వాళ్ల ఇంటి ఓనర్ ఖాళీ చెయ్యమన్నాడు. అందుకని మూణ్నెల్లు ఉంటామంటే పాపం ఇద్దరూ ఆడవాళ్లే కదా అని నేనే ఉండమన్నా. అద్దె అదీ ఏం లేదు’’ అన్నాడు సుందరం సానుభూతిగా.
‘‘నాకు చెప్పాలి కదా’’ అన్నాడు రామ్మూర్తి అసహనంగా.
‘‘ఇందులో చెప్పడానికి ఏముందిరా? నేనేమన్నా అద్దెకి తిప్పుతున్నానా లేక ఆరగిస్తున్నానా. వాళ్లు ఇంచుమించు సామాన్లతో రోడ్డున పడే స్థితిలో ఉంటే సాయం చేశా. కొన్నప్పుడు నచ్చిన నా చొరవ ఇలాంటప్పుడు నచ్చలేదా’’ అంతే విసురుగా అన్నాడు సుందరం.
అంతే. మిగిలిన కుందేలంత నమ్మకాన్నీ పెరిగిన అనకొండంత అనుమానం మింగేసింది.
‘‘సరే అయితే. వాదనలు ఎందుకు. పార్టిషన్ చేసుకుందాం’’ ఎప్పటి నుంచో అనాలనుకుంటున్న మాట అనేశాడు రామ్మూర్తి.
‘‘అలాగే. నీకు ఎప్పుడు వీలౌతుందో చెప్పు’’ అన్నాడు సుందరం కూడా విసుగ్గా.
‘‘వచ్చే ఆదివారం వస్తాను. మనుషుల్ని పెట్టించు. నాకు ఉండటానికి వీలుపడదు. అదే రోజు అయ్యేలా చూడు’’ అన్నాడు రామ్మూర్తి, ఆ రాత్రికి సుందరం ఇంట్లో ఉండటం ఇష్టంలేక.
‘‘వెడల్పు తక్కువగా ఉంది కదా, తూర్పు వైపు పదడుగుల దారి వదిలేసి అడ్డుగా రెండు భాగాలు చేద్దాం. బావుంటుంది’’ అన్నాడు సుందరం.
‘‘అప్పుడు నాకు ముందువాటా, అంటే రోడ్డు వైపు కావాలి’’ అన్నాడు రామ్మూర్తి వెంటనే.
‘‘సరే అలాగే. కానీ నా ఇంటి వరకూ దారికి గేటు పెట్టుకుంటాను. నీకు అటువైపు ఎలాగూ పనుండదు కదా’’
‘‘అదెలా కుదురుతుంది, అది కామన్ రోడ్డు. నువ్వు గేటెలా పెడతావు’’
‘‘సరే అయితే ఇదంతా ఎందుకు? నిలువుకి గోడ కట్టేద్దాం. పొడవుకీ ఇరుగ్గా వస్తుంది. వస్తే రానీ ఎవరి వాటా వాళ్లకి ఉంటుంది’’
‘‘సరే, అలాగే కానీ’’
ప్రతీ ఏటా సంక్రాంతికి రథం బొమ్మతో వీధిలో ఇళ్లన్నీ కలిపే ముగ్గు పిండి ఆ ఏడు సర్వేయర్ సాయంతో ఆ ఇంటిని విడదీసింది.
అలా ఒకప్పటి ఎవరిదో పొదరిల్లో, ఆ చిన్న పెంకుటిల్లు రెండ్రోజుల్లో కూలి అందులోని ఇటుకలనే వాడి ఆ నాలుగొందల గజాల స్థలం రెండు భాగాలైంది.
స్థలం కొనుగోలు విషయంలో సుందరం కమీషన్ కొట్టాడని రామ్మూర్తి, డబ్బులు సర్ది మరీ స్థలం కొనిపిస్తే రామ్మూర్తి రిజిస్ట్రేషన్ ఛార్జీలు, పై ఖర్చులు కూడా ఇవ్వకపోగా తిరిగి తనని అవమానించాడని సుందరం, ఇద్దరూ కూర్చుని మాట్లాడుకోవడానికి కూడా ఇష్టపడనంత బలంగా నమ్మడంతో అది చినుకంతై, వరదంతై, తొంభైల్లో వరదలకి తుని, పాయకరావుపేట బ్రిడ్జి కూలిపోయినట్టు, వాళ్ల ఇళ్ల మధ్య రాకపోకల్ని కూల్చేసింది.
అప్పటి వరకూ వరినారులా ఒక్కటిగా పెరిగిన పిల్లలు వార్ కంట్రీస్‌లో పౌరుల్లా ఎందుకు విడిపోతున్నామో తెలియకుండానే విడిపోయారు.
నీది, నాది అనే తేడా లేకుండా జిగిని నెక్లెసులు సైతం మార్చుకుని వేసుకునే ఆడవాళ్ల మధ్య జాకెట్ గుడ్డ పాటి పెట్టుపోతలు కూడా లేకుండా ఆగిపోయాయి. ‘కందా-బచ్చలి’లా కలిసుండే ఆ రెండు కుటుంబాలూ ‘కోడిగుడ్డు-పొట్లకాయ’లా అపోహలతో విడిపోయాయి.
భారతమైనా, ప్రస్తుతమైనా... మనుగడ కోసం మాత్రమే వాడే నేల మారకంగా మారిన వేళ, మానవసంబంధాలు మరీచికలా మారక తప్పదని మరోసారి రుజువు చేస్తూ ఆ నలుచదరపు స్థలాన్ని రెండు సందుల్లా విడదీస్తూ ఓ అడ్డుగోడ మొలిచింది.
* * *
ఆర్నెల్ల పాటు ఒకరితో ఒకరు మాట్లాడుకోలేదు. అలా అని ఒకరి గురించి ఒకరు వేరే వాళ్లదగ్గర మాట్లాడకుండా ఉండనూలేదు. తెల్లన్నం సైతం ఎల్లోగానే బైటికొచ్చినట్టు వాళ్లు మాట్లాడిన మంచీ, చెడ్డా మధ్యవర్తుల వడపోతకి గురై, చెడు మాత్రమే ఇద్దరికీ చేరింది.
ఆ ఊరిని, ఆ సైట్‌ని, దాని పక్క సైట్ ఓనర్ సుందరాన్ని, ఎలా వదిలించుకోవాలా అన్న ఆలోచనలు కాకుల్లా పొడుస్తూ ఉంటే, ఆ సమస్య రామ్మూర్తిని ఎంతకీ మానని ఎద్దు పుండులా బాధపెడుతోంది.
రైతుని రుతుపవనాలు పలకరించినట్టు అనుకోకుండా ఓ రోజు ఫోన్ మోగింది. ‘‘సర్ నమస్తే, నేను గేదెల నారాయణ కొడుకుని. ఊళ్లో మీ సైట్ అమ్ముతారని తెలిసింది. మేం తీసుకుంటాం. మీకు ఇష్టమైతే రేటు మాట్లాడుకుందాం’’
బ్రోకర్ లేకుండా, సుందరం సహాయం లేకుండా అనుకున్న రేటు రావటంతో రామ్మూర్తి వెంటనే ఒప్పుకున్నాడు. ఓ మంచిరోజున నేరుగా రిజిస్ట్రేషన్ ఆఫీస్‌కి వెళ్లి సంతకాలు పెట్టి, కొంత క్యాష్, కొంత చెక్కుగా తీసుకుని, ఉడిపి హోటల్లో భోంచేసి, సుందరాన్ని కలవకుండా తిరిగొచ్చేశాడు రామ్మూర్తి. ఇక ఆ ఊరితో తనకు రుణం తీరి పోయినందుకు ఒక్క క్షణం బాధేసినా, ఆ సైటు తలనొప్పి వదిలిందని సంతోషించాడు.
* * *
ఓ ఏడాది తర్వాత గేదెల నారాయణ కొడుకు నుంచి ఫోనొచ్చింది. కొత్తింటి గృహప్రవేశం అట. ఫ్యామిలీతో రమ్మని మరీ మరీ పిలిచాడు. పాతికేళ్ల కుర్రాడు అంత ప్లానింగ్‌తో ఉన్నందుకు సంతోషం వేసింది.
గృహప్రవేశం రోజు కుటుంబంతో బయలుదేరి స్టేషన్ దగ్గరలో లాడ్జీలో రూమ్ తీసుకున్నాడు రామ్మూర్తి. ముహూర్తానికి ఓ గంట ముందువెళ్లాడు. అప్పటికే సుందరం ఫ్యామిలీతో వచ్చాడు.
సుందరాన్ని చూసి రామ్మూర్తి దుమ్ముని దాచిన డోర్ మేట్‌లా నవ్వాడు. మచ్చని దాచిన మేకప్ కిట్‌లా తిరిగి నవ్వాడు సుందరం. ఆడవాళ్లు మాత్రం మనస్ఫూర్తిగా పలకరించుకున్నారు.
ఇల్లు చూసి ఆశ్చర్యపోయాడు రామ్మూర్తి. ఎలాంటి ఫౌండేషన్, ఫేషియల్, లేకుండా ఓ అచ్చ తెలుగు పల్లెటూరి అమ్మాయి చారెడు పసుపు, చెంబుడు కుంకుడు రసంతో స్నానం చేసినట్టు పోర్టికో, పార్కింగ్ లాంటి హంగులేవీ లేకుండానే ఇల్లు చాలా బావుంది. రేపటి చల్లదనానికి హామీగా తలూపినట్టు ఇంటిముందు మట్టిలో నాటిన మొక్కలు చిన్నగా ఊగుతున్నాయి. అడ్డుగోడ పడగొట్టేసి మొత్తం జాగాలో చుట్టూ వదిలేసి మధ్యలో ఇమ్ముగా జి ప్లస్ టూ కట్టాడు. అంటే సుందరం కూడా అమ్మేశాడా?
ఎవర్నడగాలో తెలీక అటూ ఇటూ చూశాడు. వాకిట్లో కుర్చీలో కూర్చుని ఉన్నాడు గేదెల నారాయణ. చిన్నప్పుడు ఇంట్లో ఉండే ఒకటి రెండు గేదెలని మంద బయలుకి తీసుకెళ్లటం, రెండు పూట్లా పాలు పితకటం చేసేవాడు. ఖాకీ నిక్కరు, పాలిస్టర్ చొక్కాతో ఎప్పుడూ నల్లగా నిగనిగలాడుతూ నూనె పెట్టిన ఉంగరాల జుట్టు, చేతికి పెద్ద డయల్ స్టీల్ వాచ్, చాలా హుషారుగా ఉండేవాడు. జుట్టు రంగు తెల్లబడిందే తప్ప ఇప్పుడూ అలానే ఉన్నాడు.
ఉత్సుకత ఆగక అతని పక్కనే కూర్చుని వివరం తెలుసుకున్నాడు. సుందరం కూడా అమ్మేశాడట. తండ్రి పాల వ్యాపారం అందుకున్న పెద్దకొడుకు, హైదరాబాద్‌లో సాఫ్ట్‌వేర్ ఉద్యోగం చేస్తున్న చిన్నకొడుకు కలిపి కట్టుకున్నారట. అన్నదమ్ములిద్దరూ కలిసి లోన్ తీసుకున్నారట. కింద ఫ్లోర్లో తను, భార్య ఉంటారట. ఫస్ట్ ఫ్లోర్ పెద్ద కొడుక్కి, సెకండ్ ఫ్ల్లోర్ చిన్న కొడుకుది.
‘‘ఇద్దరూ సగం సగం వేసుకున్నారా?’’ అడిగాడు రామ్మూర్తి అనుమానంగా, పాల వ్యాపారంలో పెద్దగా మిగిలేది ఉండదని అప్పుడెప్పుడో అనటం గుర్తొచ్చి.
‘‘అదేం లేదు బాబూ. పెద్దోడి దగ్గరున్నది పోనూ మిగతాది సిన్నోడే ఏశాడు. రేప్పొద్దున గొడవలొత్తాయి, నాయంగా సెరి సగం ఏసుకోండర్రా అని అక్కడికీ నేనన్నా బాబూ. దానికి మా సిన్నోడు ‘తొలీత, మలీత దూడల్లా ఒకర్నొకరు మర్సిపోడానికి, పొడుసుకోడానికీ, మేమేమన్నా పశువులమేటి నాన్నా, ఓ కడుపున పుట్టిన శిశువులం’ అన్నడయ్యా’’ అన్నాడు గేదెల నారాయణ తృప్తిగా ఇల్లు చూసుకుని మురిసిపోతూ.
ఏదో దిగులు మెలిపెడుతూ ఉంటే ఇంటి చుట్టూ ఓమారు కలియ తిరిగాడు రామ్మూర్తి. తన వాటాలో కొబ్బరి చెట్టు ఓ మూలకి ఉండటంతో అలానే ఉంది. సుందరం వాటాలో ఉన్న మామిడిచెట్టు మాత్రం కొన్ని పలవలు అడ్డొస్తే కొట్టేశారు. తూర్పు నాలుగడుగులు, పడమర రెండడుగుల సందు, వీధిలో విశాలమైన మట్టి వాకిలి, పెరట్లో పశువుల షెడ్డు. సందులోకి వెళ్తే అక్కడ తన పిల్లలు, సుందరం పిల్లలు కలిసి బిల్డింగ్ బ్లాక్స్ పేరుస్తున్నారు. తనని చూసి కంగారుగా లేచి పరిగెత్తబోయారు. ఆ హడావుడిలో అప్పటి వరకు పేర్చిన బ్లాక్స్ అన్నీ చిందరవందరగా పడిపోయాయి. వాళ్లనాపి కూర్చోమని చెప్పాడు. తిడతాడేమోనని వాళ్లు భయం భయంగా చూస్తున్నారు. వాళ్లని ఆడుకోమని, బయటికొచ్చి వెతికాడు. సుందరం దూరంగా అటు తిరిగి ఎవరితోనో మాట్లాడుతున్నాడు.
‘‘సుందరం’’ పిలిచాడు రామ్మూర్తి. అతనికి వినిపించలేదు. ‘‘సుందరం’’ గట్టిగా పిలిచాడు. ఊహూ ..
ఎందుకో చిన్నప్పుడు తండ్రి చెప్పిన విషయం గుర్తొచ్చింది. ‘‘పెళ్లిళ్లయ్యాక అన్నదమ్ములు ఒకే చూరుకింద ఉండటం సాధ్యం కాకపోవచ్చు. గోడ తప్పనిసరి అయినప్పుడు అది ‘ఉమ్మడి గోడ’లా ఉండాలిగానీ ‘అడ్డుగోడ’లా ఉండకూడదు రా’’ అనేవాడు. అప్పట్లో అర్థంకాలేదు. కొడుకు పుడితే ‘‘సుందర్రామ్మూర్తి’’ అని పేరు పెడదామనుకున్నాడట. కవలలు పుట్టడంతో ‘సుందరం, రామ్మూర్తి’ అని పెట్టాడట. నిమిషాలతో సహా ఒకే వయసు వాళ్లవటంతో ఎప్పుడూ పేర్లు పెట్టి పిలుచుకోవటమే అలవాటు.
‘‘అన్నయ్యా..’’ మొదటిసారి కావటంతో కొంచెం సిగ్గుపడుతూ పిలిచాడు.
నెమ్మదిగా పిలిచినా సుందరం ఠక్కున వెనక్కి తిరిగి చూశాడు.
రామ్మూర్తి ఓ అడుగు ముందుకేశాడు. సుందరం రెండడుగులు వేశాడు.
గజాలు దూరం చేస్తే, అడుగులు వాళ్లని తిరిగి దగ్గర చేశాయి.
ఒక్కటై పెరగవలసిన కణం రెండుగా మారి, ఒకటిగా పెరిగి, ‘స్థలం’ చేత వేరై, నేటి, రేపటి తరాల్ని చూసి తిరిగి ఒక్కటైన వేళ, ఆ కొత్తింట్లోంచి కొబ్బరికాయ కొట్టిన శబ్దం వినిపించింది. సత్యనారాయణ వ్రతంలో ఓ కథ పూర్తయినట్టుగా.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Rahul Gandhi: తెలంగాణలో ప్రజా ప్రభుత్వాన్ని నిర్మిస్తాం: రాహుల్ గాంధీ
-
Top Ten News @ 1 PM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు
-
Heart Attack: గుండెపోటు కలవరం వేళ.. 10 లక్షల మందికి సీపీఆర్ ట్రైనింగ్
-
OnePlus 12: స్నాప్‌డ్రాగన్ లేటెస్ట్ ప్రాసెసర్‌తో వన్‌ప్లస్ 12.. ఇండియాలో ఎప్పుడంటే?
-
Revanth Reddy: రేవంత్ ప్రమాణస్వీకారం.. కేసీఆర్, చంద్రబాబు సహా ముఖ్యనేతలకు ఆహ్వానాలు
-
IND vs SA: దక్షిణాఫ్రికాతో సిరీస్.. వారిద్దరి మధ్య డైరెక్ట్ షూటౌట్: భారత మాజీ క్రికెటర్