ఒక రైతు కథ

పగలంతా వడిసెల రాయి పట్టుకుని గువ్వలు తోలాలి.. సందకాడికి ఇంటికి రాగానే పశులకు గడ్డేయాలి, పాలు పితకాలి, పొద్దున్నుంచి చెమట చుక్కల్తో తడిబారిన శరీరాన్ని శుభ్రంగా కడుక్కుని గడపలోకి అడుగు పెట్టగానే..

Updated : 03 Jul 2021 17:47 IST


కథావిజయం 2020 పోటీల్లో ప్రోత్సాహక బహుమతి (రూ.3 వేలు) పొందిన కథ

పగలంతా వడిసెల రాయి పట్టుకుని గువ్వలు తోలాలి.. సందకాడికి ఇంటికి రాగానే పశులకు గడ్డేయాలి, పాలు పితకాలి, పొద్దున్నుంచి చెమట చుక్కల్తో తడిబారిన శరీరాన్ని శుభ్రంగా కడుక్కుని గడపలోకి అడుగు పెట్టగానే ‘‘ఏమండీ.. అబ్బాయికి ఫీజు కట్టాలట, ఆన్‌లైన్‌ క్లాసులట, వాడికి సెల్‌ ఫోన్‌ కావాలని అడుగుతున్నాడు’’ అంటూ భార్య బాధ్యత గుర్తు చేసింది.

‘‘సరేలే కొనిద్దాం’’ అంటూ ఒక్కడుగు ముందుకు వేశానో లేదో ‘‘ఏమండీ.. అమ్మాయికి పెళ్లి చేద్దాం. ఎన్నాళ్లని ఇంట్లో కూర్చోబెట్టుకుంటాం. ఆ పెళ్లిళ్ల పేరయ్యకు కబురు పెట్టండి. మంచి సంబంధం చూస్తాడు’’ అంటూనే తుడుచుకోడానికి గుడ్డ ముక్క చేతిలో పెట్టింది భార్య రాజ్యలక్ష్మి.

‘‘అలాగే చేద్దాం’’ అంటూనే వెళ్లి కంచం ముందర కూర్చున్నాను.
‘‘ఆ పాపన్న లేడూ.. మీరు అలా బయటికి వెళ్లగానే వచ్చాడు. మొన్న బోరు వేయడానికి చేసిన అప్పు ఎప్పుడు తీరుస్తారని అడిగాడు’’ అంది పప్పు కూర అన్నంలోకి వడ్డిస్తూ భార్య. నేనేమీ మాట్లాడలేదు, అన్నం తినేసి వసారాలోకి వచ్చేశాను. 
అప్పు చేసి వేసిన పంట అంతో ఇంతో పండితే గడ్డి కూడా మిగలకుండా పోయింది. ఈసారైనా కాపుకొచ్చిందా అంటే అదీ లేకపోయే.. రేపు కంకులు కోయాలి, కూలీల కోసం ఊర్లోకి బయలుదేరాను. మామూలుగా పనికొచ్చే సాలమ్మతో కలిసి ‘‘రేపు కంకులు కోయాలి సాలమ్మా’’ అన్నాను.
‘‘నాలుగు వందలిస్తే వస్తాము’’ అంది సాలమ్మ.
గొంతులో వెలక్కాయ పడ్డట్లయ్యింది నాకు.
‘‘అంతలేదే.. మొన్న రెండు వందలేగా ఇచ్చింది’’ అన్నాను.
‘‘పక్కూరి వెంకటేశం నాలుగు వందలిస్తామన్నాడు. ఆయనకు ఒక రేటు నీకు ఒకరేటునా. కుదర్దు’’ అనేసింది సాలమ్మ.

‘‘ఆయనకూ నాకూ పోలికేంటి సాలమ్మ. ఆయన ఉద్యోగస్థుడు. నేను రైతు కాస్త తగ్గించుకోండి’’ అంటూ ఎలాగో యాభై తక్కువ చేసి ఒప్పించుకున్నాను. మరుసటి రోజు పంట మొత్తం కోయించేసి, గింజలు ఆరబోశాను. అమ్మకానికి పెడితేగాని డబ్బులు ఇచ్చుకోలేని పరిస్థితి. ఆ రాత్రి వసారాలోనే పడుకున్నాను. సరిగ్గా రాత్రి పన్నెండు గంటలు, దక్షిణాదిలో మెరిసింది, ఉత్తరం ఉరిమింది. అంతే గుండె వేగం పెరిగింది. ఉన్నపళంగా భార్యను, కొడుకును లేపి, గింజల కుప్ప దగ్గరికి పరుగుతో వెళ్లాము, అప్పటికే ఒక్కొక్క చినుకుతో మొదలైన వాన జోరుగా కురవసాగింది. గింజలన్నీ సంచులకు పోసేలోపే సగం గింజలు నీటిలో కొట్టుకుపోయాయి. మిగతావి ఇంటికి చేర్చినాం. 
ఏం చేయాలో అర్థం కాలేదు చేతికొచ్చిన పంట నీటిపాలైంది. ఉన్న వాటినే ఎండబెట్టి మార్కెట్‌కు తీసుకెళ్లడానికి సిద్ధమయ్యాను.
‘‘నాన్నా! సెల్‌ఫోన్‌ లేకుంటే పాఠాలు వినలేకపోతున్నాను. ఎగ్జామ్స్‌ ఎలా రాయను’’ కొడుకు ఆవేదన కాళ్లకు అడ్డు తగిలింది. భార్య చీటీ చేతిలో పెట్టింది. ‘‘ఏంటిది’’ అని అడిగాను 
‘‘ఇంట్లో సరుకులు మొత్తం ఐపోయాయి. ఏం కూర వండాలో అర్థంకాలేదు. అది సరుకుల పట్టీ’’ అంది భార్య. జేబులో పెట్టుకుని వెళ్లాను. మార్కెట్లో మూటలు దింపగానే దళారులు డేగల్లా వాలిపోయారు. ఉన్న రేటునే కుదించి ధాన్యం తన్నుకుపోయారు. డబ్బు జేబులో పెట్టుకుని ఊరి వాకిట్లోకి అడుగు పెట్టానో లేదో కూలీలు ఎదురయ్యారు. ఉన్న డబ్బు వారి చేతిలో పెట్టి ఒట్టి చేతులతో ఇంటికొచ్చాను.
‘‘నాన్నా! ఫోన్‌ తెచ్చావా?’’ గడపలోకి అడుగు పెట్టగానే కొడుకు ఎదురొచ్చాడు.
‘‘సరుకులు తీసుకురాలేదా’’ వెనువెంటనే భార్య ప్రశ్న. సమాధానం ఏం చెప్పాలో అర్థం కాలేదు.
‘‘ఇప్పుడే వస్తాను’’ అంటూ అటు నుంచి అటే వెనక్కి తిరిగాను. కొడుకు కంట్లో నీళ్లు పెట్టుకుని లోపలికెళ్లాడు. వాడికి చదువుకోవాలనే పట్టుదల చాలా ఉంది. నాన్న చదివించలేడనే బాధ ఉంది. ఎలాగైనా సెల్‌ ఫోన్‌ తీసియ్యాలని డబ్బు కోసం అప్పలనాయుడు దగ్గరికి వెళ్లాను. మధ్యలో పాపన్న ఎదురొచ్చాడు ‘‘ఏమయ్యా రాముడూ! నా దగ్గర అప్పు తీసుకుని తప్పించుకుని తిరుగుతున్నావా. ఎప్పుడిస్తావ్‌?’’ కాస్త కఠినంగా అడిగాడు. 
‘‘నువ్విచ్చిన డబ్బుతోనే కదా బోరు వేశాను. బతుకుదామని బాయి తవ్వితే బండ పడినట్లు అయ్యింది నా పరిస్థితి. దగ్గర్లోనే తీర్చేస్తాను’’ అన్నాను. 
‘‘ఈ మాట రెండేళ్ల నుంచి చెబుతూనే ఉన్నావు. రేపు ఇచ్చెయ్‌’’ అంటూ కోపంగా వెళ్లిపోయాడు పాపన్న.
ఉన్నది కొద్ది పొలం. అందులోనే జీవనం. నీళ్లు పడితే పంట తీసి బతకవచ్చు, కూతురికి కొడుక్కి పెళ్లి చేయవచ్చన్న ఒక్క ఆశతో అప్పు చేసి నాలుగు బోర్లు వేసినా ఫలితం లేదు. ఇలా అనుకుంటూనే అప్పలనాయుడు ఇంటి ఆవరణలోకి అడుగు పెట్టాను. నన్ను చూడగానే చుట్ట తాగుతున్న నాయుడు కుర్చీ నుంచి లేచి నిలబడ్డాడు.
‘‘ఏమయ్యా.. రాముడూ! బాగున్నావా?’’ అన్నాడు అప్పలనాయుడు.
‘‘ఏం బాగులే నాయుడుగారూ’’ అంటూ వచ్చిన విషయం చెప్పాను.
నాయుడు గట్టిగా నవ్వేశాడు. ఎందుకు నవ్వాడో అర్థం కాలేదు.
‘‘ఇప్పుడు రైతుకు అప్పు ఎవరిస్తారు చెప్పు. ఆ కాలం పోయింది రాముడూ. రైతుకు అప్పు ఇవ్వడం, మట్టిలో పూడ్చటం రెండూ ఒకటే. వ్యాపారస్థులకు రోజు వారీ వడ్డీకి తప్ప ఇంకెవరికీ అప్పు ఇవ్వడంలేదు. ఇక వెళ్లొచ్చు’’ అంటూ లోపలికెళ్లి మొహం మీదే తలుపు వేసేశాడు అప్పలనాయుడు. కళ్లల్లో నీళ్లు తిరిగాయి నాకు. తుడుచుకొని వెనక్కి తిరిగాను. 
తిన్నగా బజారులోకి అడుగుపెట్టాను. జనాలందరూ దిగుడు బావి గట్టు వైపు పరుగులు పెడుతున్నారు.
‘‘ఏం జరిగింది’’ అని ఒకరిద్దర్ని అడిగితే సరైన సమాధానం చెప్పలేదు. నేను కూడా వెళ్లాను. బావి దగ్గర జనాలు గుంపుగా ఉన్నారు. ఆ గుంపులోంచి ఎవరో ఆడవాళ్ల ఏడుపు వినిపిస్తోంది. అక్కడున్న కొందరు నా వైపు అదోలా చూశారు. జనాలను తోసుకుంటూ మందుకెళ్లి చూసే సరికి గుండె ఆగిపోయినంత పనైంది. కొడుకు చెట్టుకు విగత జీవిగా వేలాడుతున్నాడు. నాన్న చదివించలేడని నిర్ణయించుకున్నాడేమో.. ఇంట్లో ఇబ్బందులు చూసి కలత చెందాడేమో.. ఏదైతేనేమి ఒక్కగానొక్క కొడుకు కనుమరుగయ్యాడని దుఃఖానికి ఆనకట్ట వేయలేకపోయాను.. భార్య సొమ్మసిల్లి పడిపోయింది. కర్మ కార్యం ముగించామన్న మాటేగానీ ఇంట్లో మునుపటి కళ లేదు. 
కష్టాలతోనే కాలం వెల్లబుచ్చుతున్నాం. ఆరోజు ఊరంతా జాతర చేస్తున్నారు. చేతిలో చిల్లిగవ్వ లేదు. 
‘‘జాతర సంగతి దేవుడెరుగు, ఊర్లో అందరూ తునకలు తింటుండారు. అమ్మాయికైనా తీసుకురాండి’’ అంది భార్య. 
పాత స్నేహితుడు రంగడి దగ్గరికి వెళ్తున్నాను. మధ్యలో రచ్చబండ దగ్గర సమావేశం పెట్టారు. చూద్దామని వెళ్లాను. రైతుల గురించి వారి కష్టాల గురించి సమావేశపు పెద్ద ఉపన్యాసం ఇస్తున్నాడు. ‘‘కష్టపడి పంట వేస్తే కూలీలకు సగం, దున్నకానికి సగం, మందులకు సగం పోయి అంతో ఇంతో చేతికొస్తే మార్కెట్‌లో దళారీకి కాస్త పోతుంది. ఒట్టి చేతులతో ఇంటికి వచ్చే పరిస్థితి రైతుది’’ అంటూ చెబుతున్నాడు. 
అక్కడి నుంచి నేరుగా మిత్రుడి దగ్గరికి వెళ్లి విషయం చెబితే, ‘‘చేతిలో పైసా లేదు రాముడూ! మా ఆవిడ కూడా కూరగాయలు లేక చింత పులుసు చేసింది’’ అనేశాడు.
తిరుగుముఖం పట్టాను. వస్తుంటే పెళ్లిళ్ల పేరయ్య ఎదురొచ్చాడు. సంబంధం చూశాడట. వచ్చే శనివారం మంచి రోజు. పెళ్లికొడుకు తరఫు వాళ్లని రమ్మని చెబుతానన్నాడు. సరే అన్నాను. విషయం ఇంట్లో చెప్పగానే భార్య ముఖంలో సంతోషం తాండవించింది. 
కావలసిన ఏర్పాట్లు అన్నీ చేసుకున్నాం. ఆ రోజు రానే వచ్చింది. అమ్మాయిని చూడ్డానికి అబ్బాయి తరఫువాళ్లు వచ్చారు. ఇల్లు, వాతావరణం, పద్ధతులు అన్ని బాగా నచ్చాయి వాళ్లకు. వాళ్లేమో ఒప్పేసుకున్నారు. సంబంధం కుదిరిందని తెలియగానే గుండె కొంచెం బరువెక్కింది. ఇచ్చి పుచ్చుకోవడాలన్నీ మాట్లాడేసుకున్నాక కార్యం ఎలా ముగించాలా అని దిగులు పుట్టింది నాలో. పంట లేదు ఆదాయం లేదు. ఇల్లు గడవడానికే ఇబ్బందిగా ఉంది. ఎలాగైనా అమ్మాయిని పెళ్లి చేసి పంపిస్తే తర్వాత సంగతి ఆలోచించవచ్చులే అని తిరిగి అప్పలనాయుడు వద్దకే వెళ్లి విషయం చెప్పాను. 
‘‘భూములు పెద్దగా రేటు పలకలేదు రాముడు. అందులో మీ భూమి రహదారికి దూరంగా ఉంది. ఇక ఎన్నేళ్లయినా ఆ భూమి రేటు లక్షకు మించి పెరగదు. ఆలోచించుకో’’ అన్నాడు అప్పలనాయుడు. 
ఏ రేటైనా తప్పదు. ఒక రేటు నిర్ధారణ చేసి, అగ్రిమెంట్‌ కాగితాలపై సంతకం చేసి కొంత పైకం తీసుకుని ఇంటికి వచ్చాను. భార్య బట్టలు ఉతుకుతూ కూర్చుంది బయట. విషయాన్ని తడబడుతూనే చెప్పాను. గుడ్లప్పగించి చూసింది నా వైపు ‘‘అమ్మాయికి పెళ్లీడు దాటిపోయింది. చేయకపోతే సమాజంలో చులకన అయిపోతాం. తప్పదు చేయాలి కదా’’ అన్నాను. ‘‘అలాగే చేద్దాం’’ అంది. 
పొలం కొంత అమ్మేసి అమ్మాయికి పెళ్లి చేసేశాను. ఇప్పుడు ఇంట్లో ఇద్దరమే ఉన్నాం. మిగిలిన పైకంతో ఈ ఏట పంట పెడదామని నిర్ణయించుకున్నాం, అనుకున్న విధంగానే సకాలంలో వర్షం పడింది. నేలను చదును చేసి విత్తనం పూడ్చాను. రెండు నెలలు తిరిగే సరికి పంట ఏపెత్తున పెరిగింది. నా సంతోషానికి అవధుల్లేవు. దిష్టి బొమ్మ కూడా పెట్టించాను. ‘‘ఏరా.. రాము.. అదృష్టవంతుడివి. పంట చాలా బాగొచ్చింది. అప్పులన్నీ తీర్చేసి సంతోషంగా ఉండు’’ అన్నాడు నా చిన్ననాటి స్నేహితుడు రంగడు. నిజమే ఈ ఏట ఎలాగైనా అప్పు తీర్చేయాలి. మనసులో అనుకున్నాను. శ్రద్ధగా పని చేసి కలుపు తీయించాను. డబ్బు బాగానే ఖర్చుపెట్టాను. ఈ ఏటతో కష్టాలు తీరిపోతాయని నా భార్య సంతోషపడుతోంది. పంట కోత కోయించాను. నేలపై విరగ్గాసిన చెట్లను చూడ్డానికి ఊరాళ్లందరూ వస్తున్నారు. ‘‘మన ఊరి పైన పంట నీదే.. ఇలా పండితే ఇంకేముంది రైతు బాగుపడి పోడూ’’ అంటున్నారందరు. 
ఆ రోజు రాత్రి టీవీ చూస్తూ కూర్చున్నాను. ఏడు గంటల వార్తలు వస్తున్నాయి. బంగాళాఖాతంలో అల్పపీడన ద్రోణి కొనసాగుతోందని రాగల ఇరవైనాలుగు గంటల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపిందట. నేలపై చెట్లు నానిపోతే కాయ పనికి రాదు, పైగా ధర పలకదు.
కాయలు ఇంటికి చేరాలంటే ట్రాక్టర్‌ సహాయం కావాలి. పొరుగూరి రామంజికి ఫోన్‌ చేశాను. పని చేయలేదు. ఆ ఊరికి వెళ్లక తప్పడం లేదు. రోడ్డు మార్గంలో ఆటోలు చాలా తక్కువ, ఎప్పుడు వస్తాయో, ఎప్పుడు పోతాయో తెలియదు. అడ్డదారిలో నడిచి వెళ్తే.. మూడు పర్లాంగుల దూరం. తెల్లవారుజామున లేచి బయలుదేరి వెళ్లాను. ఆ ఊరికి చేరేపాటికి అన్నం పొద్దు దాటిపోయింది. ఎలాగో రామంజిని కలిసాను.
‘‘ట్రాక్టర్‌ దున్నకానికి వెళ్లింది. మధ్యాహ్నం పైన వస్తుంది రాగానే వెంటనే పంపిస్తాను’’ అన్నాడు. ఉన్నది అదొక్కటే. సరే అనక తప్పలేదు. ఒకప్పుడు నాలుగైదు ట్రాక్టర్లు ఉండేవి. వర్షం లేక బోర్లు చెరువులు ఎండిపోగానే, అవి అమ్మేసి బతుకు తెరువు కోసం పట్నం వెళ్లిపోయారు. నేను ఇంటికి బయలుదేరాను. అర పర్లాంగు దాటానో లేదో తూర్పు దిక్కు నుంచి మేఘాలు కమ్ముకొచ్చాయి. ఒక్కొక్క చినుకు పడటం మొదలైంది. దిగులుతో ఇంటికి ఫోన్‌ చేశాను. భార్య ఎత్తి ‘‘ఇక్కడ వర్షం రాలేదు’’ అని చెప్పగానే హమ్మయ్య అనుకుని కాస్త ఊపిరి పీల్చుకున్నాను.
వర్షం జోరందుకుంది. వడిసెల రాళ్లతో కొడుతున్నట్లు గాలి వాన ఎక్కువైంది. నడవడానికి కాలేదు. పక్కనే ఉన్న చెట్టు కింద తల దాచుకున్నాను. ఉరుములు మెరుపులతో బీభత్సం సృష్టిస్తోంది. కాసేపటి తర్వాత కాస్త తగ్గుముఖం పట్టగానే ఇంటికి బయలుదేరాను. అక్కడి పరిస్థితి ఎలా ఉందోనని భార్యకు ఫోన్‌ చేశాను. రింగయ్యింది. తియ్యలేదు. 
వేగంగా ఇంటికి చేరుకున్నాను. ఇంటికి తాళం వేసి ఉంది. ఎక్కడికి వెళ్లినట్టు. అర్థం కాలేదు. పొలం దగ్గరికి పరుగులు పెట్టాను. జనాలందరూ గొడుగులు పట్టుకుని నిలుచున్నారు. అందర్నీ తోసుకుంటూ వెళ్లి చూశాను.  గుండె ఆగిపోయినంత పనైంది. పంట మొత్తం ఊడ్చుకుపోయింది. భార్య సొమ్మసిల్లి పడి ఉంది. వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లాను. భయంతో గుండె పట్టేసి చనిపోయిందని చెప్పగానే అక్కడే కూలబడిపోయాను. 
ఏం జరిగిందో తెలీదు. మెలకువ వచ్చేపాటికి కూతురు ఏడుస్తూ గుమ్మం దగ్గర నిలుచుంది. అల్లుడు పక్కనే కూర్చున్నాడు. ఇద్దరు వ్యక్తులు నా ఎదురుగా నిలబడి ఉన్నారు. ‘‘ఎవరు మీరు’’ అనడిగాను. 
‘‘రాముగారు. మీ పంట నష్టపోయిందని తెలిసింది. నష్టపరిహారం రాసుకుందామని వచ్చాము’’ అన్నాడతను. గట్టిగా నవ్వేశాను. అదేంటో వెంటనే ఏడ్చేశాను. ‘‘మీరు ఇవ్వాల్సింది పంట నష్టం కన్నా ముందు పరువు నష్టం. అప్పు చేసినప్పుడు మీరు లేరు. పస్తులు పడుకున్నప్పుడు మీరు లేరు. కొడుకును పోగొట్టుకున్నప్పుడు మీరు లేరు. జీవనం జరగక ఆస్తిని అమ్ముకున్నప్పుడు మీరు లేరు. చివరికి భార్య గుండె ఆగి చనిపోయినప్పుడు మీరు లేరు. ఇప్పుడొచ్చి దేనికి నష్టం చెల్లిస్తారండి. అందరూ ఉన్నప్పుడే దిక్కులేంది, ఒంటరివాణ్ని ఇవన్నీ అవసరమా’’ అంటూ రెండు చేతులు జోడించాను. కూతురు వైపు చూసి ‘‘రైతుగా పుట్టడం అదృష్టమే కానీ పేద రైతుగా పుట్టకూడదమ్మా’’ అంటూ కన్నీళ్లు తుడుచుకున్నాను. అల్లుడు దేవుడు కాబట్టి నన్ను తన వద్దే పెట్టుకున్నాడు. అదే తడవు నాగలి పట్టింది లేదు. 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు