తీర్మానం

శెరువు నిండితే అత్తరుపల్లి... ఎండితే తుత్తురుపల్లి అని ఆ ఊరిపేరు మీద ఒగ శాత్రమ్‌ పుట్టిందంటే అది ఎసంటి ఊరో మీరే ఊహించుండ్రి. ఆ ఊరికి వాగూవుంది. ఆ వాగునీళ్లు ఊరి శెర్లకురావు. ఆ వాగుతోటి ఏం లాభం లేదు...

Updated : 03 Jul 2021 17:43 IST


కథావిజయం 2020 పోటీల్లో ప్రోత్సాహక బహుమతి (రూ.3 వేలు) పొందిన కథ

శెరువు నిండితే అత్తరుపల్లి... ఎండితే తుత్తురుపల్లి అని ఆ ఊరిపేరు మీద ఒగ శాత్రమ్‌ పుట్టిందంటే అది ఎసంటి ఊరో మీరే ఊహించుండ్రి. ఆ ఊరికి వాగూవుంది. ఆ వాగునీళ్లు ఊరి శెర్లకురావు. ఆ వాగుతోటి ఏం లాభం లేదు.
ఇంతకు ముందు ఇగున్నగురం గ్రామం అత్తరుపల్లీ ఒకవార్డు. ఓట్లు ఎప్పుడొచ్చినా ఇగున్నగురమ్‌ పొయి ఓట్లు ఎయ్యాలే. ఏ ఓట్లకయిన తెగనిపంచాదే ఉండు. రేషన్‌ బియ్యానికి, ఫించన్లకు పోవుడు తక్లీఫ్‌ అయ్యింది. ఊరోల్లకు యాష్టకొచ్చింది. మనూరు మనకుంటే ఎంత బాగుండు అని అందరికి కసి పెరిగింది.
మా ఊల్లే ఒక్క మస్కూరోడు లేడు. అంగన్వాడి లేదు. మా వాగునీళ్లు మాకు పారయి. మాయి మాకు గావాలే అని లొల్లి సురువు జేసిండ్రు. రాజీవ్‌ రహదారి మీద రాస్తారోకోలు లెక్కలేనన్ని సార్లు చేసిండ్రు. అన్నీ సమస్యలు పోవాలంటే ఒకటే. అది గ్రామ పంచాయతీ కావాలే అని ఉడుం పట్టు పట్టిండ్రు.
మా పల్లె మాక్కావాలే. మా రేషన్‌ మా వూల్లే ఇయ్యాలే అని ఉద్యమం లావట్టిండ్రు. మండలం పోయిండ్రు. జిల్లాకు పోయిండ్రు. వంటా వార్పు చేసిండ్రు. ఊరంతా గుంపుబోనాలు చేసిండ్రు. కరంటి బిల్లు కట్టకపోగా ఆఫీస్‌లో కరంటోళ్లను కట్టేసిండ్రు. బస్సులు నడవనియ్యలే. అరెస్టు అయ్యిండ్రు. తమకు తామే గ్రామపంచాయతి అని పేరుకూడా రాసుకున్నరు. తీరొక్క జాగలకు కాలుకు బట్టకట్టకుంట తిరిగిండ్రు. తీర్తీరు కొట్లాడిండ్రు.

ఊరు కావాలనీ గడి కోట ఎక్కి దుంకిండ్రు. ఉరివెట్టుకున్నరు. పెయిని (శరీరాన్ని) ఓంబత్తీలు చేసిండ్రు. రకరకాలుగా జీవి తీసుకున్నరు. రందికి రయమైయిండ్రు. పంచాయతి కోసం ఎన్ని చేయాల్నో అన్నీ చేసిండ్రు.
ఎట్లైనా గ్రామపంచాయితీ అయితదనుకునే యాల్ల అలుకుపూసిన జాగల గువ్వకూసున్నట్లు బాలయ్య వచ్చి చేరిండని బండి కిట్టయ్య ఒకటే తీరుగ మొత్తుకుంటడు. కిట్టయ్య బాలయ్య గురించి ఎర్రమల్లయ్యకు మండువలో జన్మ రహస్యాలు పోతపోత్తండు.
‘‘తమ్మీ! ఎర్రమల్లీ. బండమీది బాలయ్య గురించి దినమంత చెప్పినా ఒడువది. తీస్తే సినిమా. రాస్తే కథ. ఆడితే నాటకమే అయితది. సినిమంటే సినిమ కాదు. ఆ సినిమా ముంగట బాహుబలి లాంటి సినిమాలే నిమిషమంత అయితయి. అంటే ఎట్లుంటదో నీకే తెల్వాలే. ఆటంటే ఆటకాదు. ఒగ బాగోతంలో ఎన్నిపాత్రలుంటయో అన్ని పాత్రలు ఆయనొక్కనిలో ఉంటయంటే నమ్మబుద్ధికాదు. అంటే బుడ్రకాన్‌ నుంచి రాజేషమ్‌, రాణేషమ్‌, మంత్రి ఏషమ్‌... అన్నీ పాత్రల్లో ఉండే లక్షణాలు ఉంటాయా? అంటే ఏ ఒక్కటి తప్పకుంట తక్కెట్ల జోకినట్లే అన్నీ బాలయ్యలో ఉంటయి. ఆట చూస్తేగాని ఒప్పుకోరు.
తాకట్లోడు కాదు. తగిలిత్తడు. ఇగిలిత్తడు. వొచ్చినోడు ఒట్టిగూకుంటడా? ఒక్కొక్కల కొమ్ముల బర్రెలెక్క చెలిపిండు. గడ్డిబండి కింద కుక్కవోయి బండినంత నేనే మోసిన అన్నట్లు పెగ్గెలు గొడుతడు.
దేవినట్లు మాట్లాడుతడు. గాయాలకు పసురు పూస్తడు. బొంకుతడు. బోర్లేస్తడు. ఊరంత తన దిక్కు తిరిగేతందుకు ఒక కమాల్‌ కట్టిండు. ఊరొచ్చేదాకా తిండి తిన. నీళ్లు తాగనని సత్తెపమానం చేసిండు. మాట వోతే మానం పోయినట్లు మంత్రించిండు. ఊరోళ్లంతా బాగా నమ్మిండ్రు. కాదు నమ్మిచ్చిండు బాలయ్య. మన మాటలు ఎవ్వడు ఇనకుంట మలుపుకున్నడు. మనమిప్పుడు ఒనమిడిసిన కోతులమైనం’’ అని దమ్ముకో తరీక చెప్తనే ఉన్నడు.
‘‘నిజమే అన్నా! ఆయన మాట కోట పెట్టినట్లు. కోట కట్టినట్లు. ఊరు ఊరంతా బాలయ్య మాటకు పాబంది అయ్యింది. ఎంత పాబంది అంటే ఇప్పుడు ఊరోళ్లు నడిసేది బూమ్మీద కాదు బాలయ్య మాటమీదనే అన్నట్లు ఉన్నది’’ అని ఎర్ర మల్లయ్య చెప్తుండు.
ఇగున్నారమ్‌ ఇచ్చుకపోయి ఇప్పుడు అత్తురుపల్లి పుట్టింది. ఇగ సర్పంజి ఉండాల్నాయే. సర్కార్‌ ఓట్లు వెట్టింది. మనిషిన్నంక అందరికి నచ్చుతడా? బాలయ్య కూడా కొంత మందికి నచ్చలే. అన్నిటికి ముందు నడిసినా కొన్ని కానీ పనులు చేసిండనీ కొంతమంది గరమ్మీద ఉన్నరు. వొద్దనుకున్నా తిమ్మిని బమ్మిచేసే బాలయ్యనే గెలిసిండు. సర్పంజి అయ్యిండు. నయాన్నో బయాన్నో అందరినీ తనవైపుకు తిప్పుకున్నడు. ఇప్పుడు ఊల్లే బాలయ్య ఆడింది ఆట. పాడింది పాటయ్యింది.
గ్రామపంచాయతి అంటే బాలయ్య. బాలయ్య అంటే గ్రామపంచాయతిలా అయ్యింది. నీళ్ల కోసమే ఊరు తెచ్చుకునిరి. కాబట్టి తొల్త తీర్మానం చేసి వాగునీళ్లు మలిపెతందుకే పెట్టిండు. వాగునుంచి శెర్లకు కాలువ తీయించిండు. శెరువు నింపిండు. ఊరి మనసు సంబూరం అంబరాన్ని తాకింది. దుబ్బ, సౌట నేలలు కూడా పచ్చని చీర కట్టుకున్న పెళ్లి కూతురులా ముస్తాబవుతామని మురిసిపోయాయి. 
ఊల్లే రైతులు ఎక్కువ. నీళ్లను చూసేటాల్లకు పల్లె మనసు నీటిమీది బుడుబుంగలైతంది. రైతుల మనసు శాపలోలే చెంగున ఎగిరి దుంకుతనే ఉన్నయి. నోళ్లు తెరిచిన బీల్లు నీళ్లు పారెవరకు బూమి పచ్చవడ్డది. పంటలు పండినయి. సబ్బండ జాతికి సకులం అందుబాటులో ఉన్నయి. ఒకన్ని పట్టక ఒకడు ఉనక మీది రోకలోలే ఎగిరి దుంకుతుండ్రు.
తెచ్చిన నీళ్ల గురించి చిత్రాలుగా చెప్పుక తిరుగుతుండ్రు. అర్హతలు ఉన్నోళ్లకు పింఛన్లు ఇచ్చిండు. తాగినోనికి తాగినంత కల్లు, సారా ఏదంటే అది. సీస మందులు కూడా అందుబాటులో పెట్టిండు.
ఓట్లలో గెలిచేతందుకు ఏమేమి చెయ్యాల్నో, ఎట్లయితే ఓట్లు పడుతయో గట్ల చేసిండు. మళ్లా ఓట్లు ఒచ్చినయి. ఈ తాప అలుకగ గెలిసిండు బండ మీద బాలయ్య. అన్నీ వార్డుల్లో తన ప్యానలే గెలిపించుకొని సర్పంజి అయ్యిండు.
ఇంటి పేరు బండ. బాలయ్య అని పేరెవలు పెట్టిండ్రో కనీ వాళ్లకు పొద్దుపొడుపుకు దండం పెట్టినట్లే పెట్టాలే. నిజంగనే బండకు నారచీరే బాపతి. రాయిని లక్క చేస్తడు. లక్కను రాయిచేస్తడు. శాట్ల తవుడు పొయ్యకుండానే పంచాది పెట్టుట్ల మొనగాడే. పంజాతికి పోతే ఐరిని బైరి చేస్తడు. బైరిని ఐరిచేస్తడు. తీర్పు గురించి కథలు కథలుగా చెప్పుకుంటరు. సర్పంజి పంజిర్కం గురించి చెప్పాలంటే పీసులుగాదు కదా సబ్‌ స్టేషన్ల ట్రాన్స్‌పరాలే కాలిపోవాలే.
మక్కకంకుల తీర్పు గురించి చెప్పాలే. బాధితుని తరుపున మాట్లాడుతూ ‘‘అవును. కంకులు యిరిసింది తప్పే. కాదనం. ఆకలి అయ్యింది తెంపిండు. తిన్నడు. దానికేం పంచాది?’’ అని  తెల్లగోలు చేస్తడు.
ఇదే పంచాదిని మరో రకంగా చెప్పుతూ ‘‘అవునయ్య! నువ్వు మాట్లాడింది నిజమే. అట్లెట్ల తింటవు? ఆకలి అయిందని అశిద్దం తింటవా? తినవు. అది తిననపుడు ఇదెట్ల తింటవు? అట్ల తింటే తప్పేనా కాదా?’’ అని చేసిన తప్పును వాళ్లతోటే ఒప్పిస్తడు. తీర్పును కూడా తనకు, తనవాళ్లకు అనుకూలంగా మలుచుకునుట్లో మహా నేర్పరి.
అందరూ బాబయ్యను (బాయ్య బండమీది పేరును బాబ) దొరా అని పిలుస్తున్నరు. ఊర్ల జాగలు, బూములు బాగా ఉన్నోళ్లను దొర అని పిలుస్తరు. సర్పంజి అయినంక సర్పంజి బాబన్న, బాపు, బాబ అని పిలిపించుకుంటడు.
అంతకుముందే గ్రామసభ ఉన్నదని మస్కూరితోటి కాయిదం పంపేవరకు ఒక్కొక్కలు అందరూ కాశీర్‌ కాడి ఆఫీసు వద్దకు ఒగరిని పట్టకుంట ఒగరు ఎగపోసుకుంటా జమైతండ్రు.
ఉపసర్పంజీ, ఎంపీటీసీ, వార్డు నంబర్లు, కారోబార్‌, వీఆర్‌ఏ, సెక్రటరీ, కులసంఘాలు పెద్దమనుషులు, యువజన సంఘాల పెద్ద మనుషులు, డ్వాక్రా సంఘ సభ్యులు వొచ్చిండ్రు.
సర్పంజి టైంకు రాకపోయేవరకు పిట్టకు పెట్టినట్లు ఎదురుచూస్తూనే ఉన్నరు. సూడంగ సూడంగ డూడ్డుడూడ్డు అనుకుంటూ సర్పంజి బులోట్‌ వొచ్చింది. సెంటువాసన గప్పన ఇసురంగా బులోట్‌ ఆపిండు. సైడు స్టాండేసి కాలు గాల్లోంచి తీసి మిలిట్రీ పోలీస్‌లెక్క దిగిండు. సర్పంజి నడుస్తుంటే పయంటు, కద్దరు అంగీతో రాజదర్పం అద్దంపట్టినట్లు కనవడుతుంది.
అందరు దండం దొరా! అని చేతులు ఎత్తుతున్నపుడు సర్పంజి పబ్బతుపట్టి దండం పెట్టుకుంటూ ఆఫీస్‌ తంతెలు ఎక్కుతుండు.
వస్తున్న సర్పంజిని చూసి అందరూ లేసి నిలవడిరి. ముసి ముసిగా నవ్వుతూ అందరికి దండం పెట్టుకుంట కశీర్లకు వోయి తిరుగుడు కురిచిని జరుపుకొని కూసున్నడు. కూసున్నోడు కూసున్నట్లే కుర్చీని ఊపి సూసిండు. సర్పంజి కూసోంగనే అందరు వార్డు మెంబర్లు కుర్చీల బర్ర బర్ర జరుపుకుంటా కూసున్నరు.
రాంగనే మస్కూరి నీళ్ల గ్లాస్‌ తెచ్చిపెట్టే. సర్పంజి పెదవులకు ఆనించుకొని ఒక్క బుక్క తాగి పక్కకు టేబిల్‌ మీద టక్కున పెట్టిండు. ఫ్యాన్‌ సుడిగుండమోలే తిరుగుతుంటే సల్లటి గాలి రూమంతా విసురుతుంది.
సెక్రటరీ దిక్కు చూసుకుంటూ ‘‘అందరూ ఒచ్చిండ్రా?’’ అన్నట్లు బొమ్మలు ఎగరేసి సైగతో అడిగిండు.
‘వొచ్చిండ్రు’ అన్నట్లు తల ఊపిండు సెక్రటరీ.
సర్పంజి ముందట ఎవలు నోరు తెర్వరు. గట్టిగా సరాంచి సర్పంజి మాట్లాడబోతుంటే జీతగాడు ఉరుకొచ్చి చెవుల గుసగుసగా ‘‘దొరా! థంసప్ప్‌ల కలిపిన మందు ఉంది. ఇయ్యిమంటవా?’’ అని అడుగుతున్నడు. 
దొర గుడ్లు పెద్దగజేసి మర్రిచూసేవరకు జీతగాడు నాకేం దెలువదన్నట్లు తోక ముడుసుకున్నడు.
ముందు ఎవరిని మాట్లాడిస్తాడో వాళ్లు బలి. ఏదో రకంగా దెప్పిపొడుస్తడు. దొరకు ఎగిరెటోన్ని ఊదుపొగ ఏసి నెమలీకతోటి తూడిసి కూసుండవెట్టుడు అల్వాటే. అటూ ఇటూ తేరిపార జూసే వరకు ఓ ఇద్దరు కనవడ్డరు.
‘‘కిష్టయ్య గారూ! నమస్తే! బాగున్నావా?’’ అని గ్రాంథిక భాషలో పలకరిచ్చిండు.
అడ్డాగాలు ఏసినా, అట్లెట్ల అని అరికెలు పట్టాలన్నా బండి కిట్టయ్య ఒక్కడే బాలయ్యకు సరిదింటుగ మాట్లాడుతడు. ఆయనకు బుద్ది తెలిసిండు. ఊల్లే మొదలు ఒక్కటే పార్టీ. అదే అమ్మ పార్టీ. ఊరంతా ఒక్కటి ఊరవిస్కే ఒక్కటి అన్నట్లు ఆయనొక్కడే నిత్తే ప్రతిపక్షం.
మళ్లా సర్పంజి నోరు తెరిసిండు.
‘‘బాగున్నావా?’’ అని పక్కకే ఉన్న ఎంపీటీసీని చర్రుమనంగా తొడచరిచిండు. దూస్తూ మందిలిస్తున్నపుడు నిన్నవొద్దీకి తాగిన వాసన గప్పుమన్నది. మొస తీసుకునుడే తక్లీఫ్‌ అయ్యింది ఎంపీటీసీకి.
అయినా ఊపిరి బిగపట్టి ‘‘మంచిగనే ఉన్న సర్పంచ్‌ సాబ్‌’’ అన్నడు.
‘‘ఉపసర్పంజీ! బాయికాడ ఏంజేస్తున్నవు?’’ అని అడిగిండు. నిన్న వొద్దీకి మందుతాగేటప్పుడు దవడ పలగ్గోట్టింది యాదికొచ్చి దవడ పునికి సూసుకుంటా ‘‘నారుపోసిన’’ అని ఉపసర్పంజి  అన్నడు.
వార్డు మెంబర్లు సర్పంజి మాట్లాడుతుండని శెక్కరి బుక్కే చిన్న పోరగండ్లోలే షెంగలిత్తండ్రు. దొర దిల్లెకు మాటలకు మనసు నవ్వుముఖాలు సింగిడిలైతన్నయి. సీకట్ల యెన్నీల ఎగజల్లుతున్నట్లు తెల్లటి పలువరుసతో యిగిలిత్తండ్రు. సంబూరపడుతుండ్రు.
అప్పటికీ గంట దాటింది. ఎవలు అటకాయించుతలేరు. అంటే ఒకటి. అనకుంటే ఒకటి ఈ సర్పంజీతోటి. అనాలని ఉన్నా అనకపోవుడే ఉత్తమమని అన్నీ మూసుకొని ఊకున్నరు.
ఎవలు అంటలేరనీ ‘‘ముచ్చట సంబరాన మొగన్ని మరిచిపోయినట్లు. ఎహే వొచ్చినపని కానియ్యిండ్రి’’ అని బండి కిట్టయ్య పుల్లగీకినట్లు అన్నడు.
‘‘కిట్టయ్యసాబ్‌! మీ వాడకట్టుకు నల్లనీళ్లు ఒత్తున్నయా? మోరీలు మంచిగా తీస్తుండ్రా? లైట్లు ఎలుగుతున్నయా? మనూల్లే ఇంకేం సమస్యలున్నయి? ఏడ గింత ఎంటిక మందం పొరెపోనియ్య నేనుండంగా... ’’ అని గర్వంతో సర్పంజి అయినకాయనే జబ్బలు ఎగేసుకుంటా అన్నడు.
‘‘అన్నిమంచిగనే ఉన్నయి. కానీ అల్లున్నోట్ల శని ఉన్నట్లే ఉన్నది’’  అని బండి కిట్టయ్య అన్నడు.
‘‘ఆ... శనా?’’ అని నోరుదెరిసిండు సర్పంజి.
‘‘ఆ... శని గాకపోతే ఏంది? లోకమంతా మూతులకు బట్టకట్టుకోని అపసోపాలయి తిరుగుతుంటే మానూల్లె ఏదీ లేదాయే. కురుంబ గద్దె మీద నవాబోలే జెమ్మటాలు కొడుతవు. ఉత్తుత్తదానికి చాటింపు చేయిస్తవు. పానమ్మీదికి గత్తరలా వొస్తున్న బీమారిని పట్టించుకోవా? వొట్టి సంచికాడ మెలుకతో పన్నట్టు ఉన్నది మీ కథ. చేసేది ఇడిసిపెట్టి కోళ్ల గెదుమ వోయినట్లు చెప్పుతవు. మంచిగున్నరా? అని పాయదీసుకుంటా అడుగుతవు? కని గీ కరోన రోగం కోసం ఏం చెప్పుతున్నవు? ఎప్పుడన్నా చెప్పినవా? ఊరోళ్ల పానాలు గాలికే ఉన్నాయా?’’ అని బండి కిట్టయ్య ఈ సారి మాటలతో మంటపెట్టిండు.
జవాబు ఇచ్చేతందుకు సర్పంజి బంటు వార్డు నంబర్‌ పోశయ్య లేవవోయిండు. బాబయ్య దొర చూపుతో ఆగిండు కానీ, లేకపోతే ఇల్లు పీకి పందిరి ఏసెటోడే...
‘‘పోరుగూర్లల్ల దగ్గులు, సడుదులు, జరాలు ఉన్నోళ్ల లెక్క సూత్తండ్రు. మనిషికొక్క మాస్కు ఇత్తండ్రు. మనూల్లే ఏదీ లేదాయే. ఎందుకిత్తలేరు?’’ అని గరం గరం మాట్లాడుతండు బండి కిట్టయ్య శిష్యుడు ఎర్ర మల్లయ్య.
ఇగ పోశయ్య తాడు తెంపుకున్న దొంగబర్రోలే లేసి ‘‘గాలికి గడ్డపారాలు పడ్డట్లే ఉన్నయి ఈ బండి కిట్టయ్య, ఎర్ర మల్లయ్య మాటలు. మాట మాట్లాడితే తంతుండది. తరువాయి ఉండది. మా సర్పంజి దొర ఏది చేసినా అంత సక్కదనం చేస్తడు. చేసినా, చెయ్యకున్నా కంట్లె పెట్టుకుంటరు ఎందుకు? నిన్న మొన్న ఈ రోగం గురించి తెలవకనేపాయే. ఇయ్యాల్ల గ్రామసభ మీటింగ్‌ పెట్టనే పెట్టె. గందుకే గదా మనం కూడింది. ఏం మాట్లాడుదాము? ఏం చేస్తే బాగుంటది? ఎట్లా చేద్దామో గా ముచ్చట మాట్లాడుమంటే రాని పోని ముచ్చట్లు మాట్లాడుతరు. పెంటతవ్వితే పెంకాసులు ఎల్లుతయి. మా సర్పంజి దేవునసంటోడు. అమ్మ అడిగితే అన్నం పెడుతది గని మా సర్పంజి అడుగక ముందే పెడుతడు. అంటే ఒక తల్లి గుణము కంటే ఎక్కువ. గది కూడా తొవదా? ఒర్రుడు బంజేయిండ్రి’’ అని ఎచ్చిర్క జేసిండు.
పోశయ్య మాటలకు సర్పంజి ముసి ముసి నవ్వులు రువ్వుతుండు.
ముసలి ముత్తయ్యలేసిండు. సర్పంజి దిక్కు సూసి ‘‘సర్పంజి సాబ్‌! గీ కోరంకి రోగం గురించి ఈర బ్రమ్మంగారు అచ్చం ఆనాడు చెప్పినట్లే ఈనాడు జరుగవట్టే. కర్మం ఎట్లా కాలవడుతదో. కాలమే గిట్లొచ్చి కాలవడ్డది. పాపం పెరిగిపోతంది. కాలం గందుకే గిట్ల కాలవడుతుంది. పోచమ్మకు, ఎల్లమ్మకు బోనాలు చెయ్యాలే. అన్నీ దేవులకు చెయ్యాలే’’ అని చెప్పుతండు.
ఎంపీటీసీ కూడా సర్పంజి ప్యానలే. దొర మాట్లాడుమంటడో అని ఎదిరి సూత్తండు. చూపుతో సర్పంజి కనుబొమ్మలు ఎగరేసే వరకు ఎంపీటీసీ ఎల్లయ్య లేసిండు. 
‘‘పనిచేస్తే నీళ్లు వారినట్లుండాలే. సర్పంజి అంటే గట్లుండాలే. ఒగులపురం సర్పంజి ఇల్లు ఇల్లుకు, వాడ వాడకు, ఊరంతా బ్లీచింగ్‌ పౌడర్‌ సల్లుతున్నమనీ సాటింపు చేసిండు. ఫిఖర్‌ చేయకుమని వాట్సాప్‌ వీడియోలు పంపిండు. మీ పానానికి నా పానం అడ్డం పెడుత అని దీర చెప్పుతుండు. మనముంటిమి ఎందుకు? బూమికి బరువు అయ్యేటట్లు. మనం ఏం చెద్దామో చెప్పకపోతే ఎట్లా?’’ అని ఎర్ర మల్లయ్య మల్లో ప్రశ్న ఏసిండు.
‘‘కూట్లే రాయి తియ్యనోడు ఏట్లే రాయి తీసిండట నీ అసోంటోడు. మా సర్పంజి మాటకు సత్యం. మందుకు పత్యం. మా దొర! ఊరుకోసం ఉపాసముండి పులినోట్లే తల్కాయే పెట్టిండు. నీళ్లు ముట్టలే. బల్మీటికి బతికిండు. ఎట్లనబుద్ది అయితంది.   
మీనమేశాలు లెక్కపెడితే అయితదా? మా సర్పంజి మీ లెక్క అడ్డదిడ్డగాడనుకుంటున్నవా? ఆగమాగం చెయ్యనీకి. ఎట్లచేస్తాడో ఇగ సూడు. తాతమ్మ దిగిరావాలే. తొండ బలిసి ఊసరెల్లి కాకపోతే సగం మీసం కొరిగిచ్చుకుంట? మా మాటంటే ఏమనుకున్నవు?’’ అని మీసం మేలేస్తండు.
కరోన రాకుండా హరితహారం కార్యక్రమం కింద ఒక్కొక్క ఇంటికి నాలుగుచెట్లు పెడుదాం. కరోన తాతను కూడా కట్టేద్దాము. మాదండి మంత్రకాన్ని తెచ్చి ఎగపొద్దాము. దిగపోద్దాము. ఏమంటరు?’’ అని ఎర్ర మల్లయ్య దిక్కు చూసుకుంటా ఒకింత గర్వంతో కూసున్నడు.
ఇట్లయితే లాభం లేదని సర్పంజి లేసి లాగు సదురుకున్నడు. గ్లాస్‌ నీళ్లుతాగి టక్కున టేబిల్‌ మీద పెట్టిండు. దస్తితోటి పెదవులు తూడుసుకున్నడు. చేతి అడ్డం పెట్టి రాకున్న దగ్గి..., గట్టిగా సరాంచిండు.
‘‘నాకు తెలువదావయ? ఈ రోగాన్ని ఎట్లా తక్కువ చెయ్యాల్నో? మీరు చెప్పుతనే చేస్తున్ననా? నేనేమి చేస్తున్నానో మీకు చెప్పకుండా చేస్తున్నానా?
ఈ ముచ్చట తెలుసుకుందామని నిన్ననే పోయిన సిద్దిపాటకు. ఆరెంపి పిస్క రాజేషం డాక్టరును అడిగిన. కరోనా అనేది పెద్ద రోగమే కాదట. దగ్గు, సర్ది, జరమొస్తే జరమ్‌ గోలి ఏసుకోవాలన్నడు. సర్పంజి జరమ్‌ గోలి అనంగనే ఏది అన్నట్లు కొంత మంది వార్డు నంబర్లు గుడ్లు మిటకరిస్తూ చూస్తండ్రు.
అదేదో బ్రహ్మ రహస్యం చెప్పుతున్నట్లు సర్పంజి చెప్తండు. ఎద్దు ఎగురంగనే గంట ఎగురుతాది? నా ముంగట బచ్చెగాడు. గా ఊరి సర్పంజికి ఏమెరుక లొట్టపీసు? ఎవల అడుగకున్న నన్నడుగు నేనుజెప్త. అనుకుంటూ చెప్తండు.
గా కరోన పురుగు మనదగ్గరున్న గరిమికి ఇక్కడ పోగు పొయ్యది. మాడి మాడి మసైతది. ఫిర్‌ బీ వొచ్చిందనుకో గదే గా గోలి లేదా... పారసెటిమాల్‌ ఏస్తే సాలు. సడిదికి కోడి కూర, తల్కాయె కూర, కాళ్ల చారు, మటన్‌ కూరలో మసాలా దట్టించి తింటే ముక్కు సాపు సపాయి అయితది. మీరాల చారు పోసుకతింటే దెబ్బకు పోవాలె సడిది. ఓమ బుక్కితే దగ్గు అన్నీ తక్కువైపాయే. ఇంకేముంది? ఆహా ఇంకేముంది?
గీంత దానికి గాయి గత్తరలేపితే ఎట్లా?
ఇగో కట్టెకోత బ్యారగాన్ని బ్యారమ్‌ చెయ్యిమంటే మొదలు ఏమైతదో కానీ కొన దూలం అయితదన్నడట. ఏ ముచ్చటున్నా ఉంటే చెప్పలే గాని ఏంజెత్తలేడని బైసుజేస్తే అయితదా? తలా తోక లేనోళ్లు మాట్లాడితే ఎట్లుంటదో మొండి కిట్టయ్య... ఛీ ఛీ బండి కిట్టయ్య మాట్లాడితే గట్లె ఉంటది’’ అని దెప్పిపొడుస్తుండు.
ఏంలేని ఇత్తారు ఎగిరెగిరి పడ్డదట. అన్నీ ఉన్న ఇత్తారు అణిగి ఉన్నదట. తాకతి తక్క మాటలు మాట్లాడొద్దు. మనము పని చేస్తే చెవుల ఊదుకున్నట్లు పని చెయ్యాలే. పరేశాన్ల పడొద్దు. ఎర్రమల్లయ్య ముచ్చట గట్లున్నది.
మనమూ బ్లీచింగ్‌ పౌడర్‌ చల్లుదాం. నలుగురు డాక్టర్లను పెట్టుకుందాం. మన పాతబడిని కోరంటైన్‌ చేద్దాం. మన ఊరంత ఒకటే కుటుంబం. ఎవలింట్ల రోగం వొచ్చినా నాయింట్ల మనిషికే వొచ్చినట్లే బాధపడుతా. సర్పంజిగా గెలువక ముందే చెప్పినా మీ పాదాలకు ముల్లురిగితే నేను నోటితో తీస్తా. ఇప్పుడు గా కానీ రోగమొస్తే ఊకుంటాను? ఆరు నూరైన ఊకుండ. టెస్టు చేయిద్దాం. చికిత్స చేసుకుందాం. బతికించుకుందాం. మన దగ్గర పైసలు లేకపోతే బాకీలు చేసైనా సరే బతుకుదాం. బచ్చలాకు తిన్న సరే బతుకాలే. చింతల్ల జాగ అమ్మైనా సరే! ఊరుకేం గాకుంట సూద్దాం.  అది రాకుంట కంచెవేసి ఊరును కాపాడుదాం’’ దొర చెప్పుకుంట గుడ్లు మిత్కరించకుంట చూస్తూ వింటున్నరు. సర్పంజి దమ్ము వొచ్చి నీళ్లు తాగుతండు.
కోరంకి రోగాన్ని తరిమికొట్టాలే. పరిశుభ్రత, వైద్య చికిత్స మొదలైనవి తీర్మానం చేసిండ్రు. గ్రామ సభ ముగిసింది. వీఆర్‌ఏ, సెక్రటరీ, అంగన్వాడి, ఆశ, కార్యకర్తకు పనులు పంచేసుకున్నరు. అందరూ వెళ్లిపోయారు.
మందులతో సహా అన్నీ బంజేసి లాక్‌డౌన్‌ పెట్టిండ్రు. దుకుణాలు, హోటళ్లు, బెల్ట్‌ షాప్లూ, మండువలు బందు పెట్టిండ్రు. గ్రామసభ ఇచ్చిన స్ఫూర్తితో లేడికి లేసిందే పరుగు అన్నట్లు చకాచకా పనులు సాగుతున్నయి. సర్పంజి వార్డు మెంబర్లు తిరుగుతుండ్రు. మూతులకు బట్టలు కట్టేలా జాగర్తలు తీసుకుంటున్నరు. బొంబాయి నుంచి, పట్నం నుంచి వచ్చేటోళ్లకు కోరంటైన్‌ అని పద్నాలుగు రోజుల Ëపాటు ఇంట్ల నుంచి బయటికి రానిస్తలేరు.
పక్కూర్లు సంద్లాపురమ్‌, కోడూరు, నంగునూరు, సిద్దిపేట ఇంకొన్ని ఊల్లు కొన్ని కేసులు నమోదైతున్నయి. దగ్గు దమ్ము, సడిది మొదలైన లక్షణాలతోటి కరోన అంటుకుంటుంది. టీవీ సూపెట్టేవరకు భయాలు పెరుగుతున్నయి. మనిషి తప్పకుండా మాస్కులు కడుతుండ్రు.
అసలు కాన్నే పిసలు గయా అన్నట్లు పాలకేంద్రం, కూరగాయలు కొనేకాడ ఎక్కడా రోజులు గడుస్తున్న సోషల్‌ డిస్టెన్స్‌ లేదు. ఏదిలేదు. రోజులు కొద్దీ నిరాశ, నిరాసక్తత ఏర్పడుతుంది. చెప్పిన్నాడు ఉన్న ఆలోచన. తెల్లారి నుంచి ఆచరణ కొద్ది కొద్దిగా తగ్గుతుంది.
కరోన ఏర్పడకుంట ఊళ్లోకి వొచ్చింది. ఒక్కరిద్దరికి సోకంగానే ఊరు ఉసికె ఉడికినట్లు ఉడుకుతుంది.
మనిషి మనిషికి దూరం పెరుగుతుంది. తాపకు ముందు చేతులు కడుగుతుండ్రు.
‘పారిశుద్ద కార్మికులు మోరీలు సాపు చేస్తండ్రు. బ్లీచింగ్‌ పౌడర్‌ సల్లుతుండ్రు. డాక్టర్లు, నర్సులు, కరోనాతో యుద్ధం చేస్తుండ్రు. భయపడకుండా టెస్టులు చేస్తుండ్రు. లాక్‌డౌన్‌ పెట్టేవరకు ఏది అందుతలేదు. పొందుత లేదు. పైసల్లేవు. పనులు నామ్మ్కే వాస్తే అయితన్నయి’ ఎర్ర మల్లయ్య, బండి కిట్టయ్యలు నలుగురు కలిసినకాడ అంటనే ఉన్నరు.
పది గంటకు కండ్లు నలుపుకుంట గప్పుడే నిద్రలేసిన సర్పంజి వొచ్చి వరండాలో కూసున్నడు.
‘‘ఏంది ఏమో వస్తివి సెక్రటరీ సాబ్‌?’’ ఆవలింఫుకు చేయి అడ్డం పెట్టుకుంటూ అడుగుతుండు సర్పంజి.
‘‘అయ్యా! సేతులొక్క పైసలేదు. బ్లీచింగ్‌ పౌడర్‌, మందు లెవ్వు. సీపురుకట్టలు లెవ్వు. ఎన్నో కొనేది ఉండే. ఎట్లా? సార్‌?’’ అని  సెక్రటరి అడిగిండు. 
‘‘సూడు సేకరేటరీ సాబ్‌! మస్తుగ మాట్లాడుతం. మాట్లాడినయన్నీ అయితాయి? చేస్తే చేస్తం. ఎనుకా ముందు. మన సేతుల ఏమున్నది? పోయింది పొట్టు. ఉన్నది గట్టి. ఆయుష్షున్నోడు, బూమ్మీద నూకలున్నోడు బతుకుతడు. ఎవని సావు ఎట్లా రాసి పెట్టి ఉందో మనకేమెరుక? బ్రమ్మదేవునికెరుక? మనం నిమిత్తమాత్రులం. 
పదవి అంటే ఏంది! బండిరుగ్గొట్టి ఎడ్లకాసుడే రాజకీయం. ఇంకో ముచ్చట. ఈల్లంత ఎడ్డి జనాలు. ఏదీ గురుతుండది. జరిగేది జరుగక మానదు. జరిగేది ఆపజాలం. అని కృష్ణ పర్మాత్మ చెప్పలేదా? గట్లే జరుగుతది. నేనేం జేస్త. నువ్వేం జేస్తవు?’’ అని సెక్రటరికి పోత పొత్తండు.
సెక్రటరీ అన్నీ మూసుకొని తెచ్చిన కాయిదాలు మలిసి సంకన పెట్టుకొని ఎనుకకు మర్రి పంచాయితీ ఆఫీసు కాడ్కి కాళ్లు ఈడ్సుకుంటూ జండాకాడికి చేర వొచ్చిండు. సఫాయోల్లాకు ఏంచెప్పాల్నో ఎట్లా చెప్పాల్నో సంజైతలేదు. అదే ఆలోచన పడ్డడు.
ఒకరికి, ఇద్దరికీ, వాడకట్టు మొత్తానికి కరోన అంటుకుంది. సిద్దిపాట నుంచి డాక్టర్‌లు వస్తానే ఉన్నరు. కరోన ఒక్కరికి వస్తే ఆ ఇంటి ఇల్రాజులను ఇసోలేషన్‌కు తరలిస్తుండ్రు. టెస్టు చేస్తనే ఉన్నరు. ఎక్కువ మంది కోలుకుంటుండ్రు. కొంత మంది చనిపోయిండ్రు. చచ్చిన శవాలను కూడా ఇస్తలేరు. చచ్చినోళ్లను ఆకరితాప మొకం కూడా సూడనిస్తలేరు. చచ్చినోళ్ల అనాద శవాల తీరు సఫాయి కార్మికులే సందం చేస్తుండ్రు. కాటి కాళ్లు ఆరుతలేవు. బొందలగడ్డ నిండిపోతనే వుంది.
ఆకరిసూపులకూ వస్తలేరు. పైసున్నోళ్లు కూడా అనాద పీనుగులైతున్నరు. బతుకు మానని కాష్టంలా మండుతుంది.
కరోనా కట్టడికి ఒక్లొల్లు హరితహారం పెంచాలని చెప్పిన లీడర్లకూ కరోన లక్షణాలు బయటపడ్డయి. ట్రీట్‌మెంట్‌ చేస్తుండ్రు. లీడర్లైతే శానా మంది బతుకుతుండ్రు. అతీగతీ లేనోళ్ల బతుకులే అగ్గిపాలైతన్నయి. లేనోళ్లు మృతుల సంఖ్యను పెంచుతుంటే ఉన్నోళ్లు జనాభా లెక్క తరగకుంట పైసలు ఎగజల్లుతుండ్రు.
సర్పంజి తనకు, తన కుటుంబ సభ్యులకు రాకుంట ఎన్నో తీర్ల ఇద్దెల పడ్డడు. ఇకమాతుల పడ్డడు. రాకుండ జాగర్త పడుతుండు. ముందగాలనే గోలీలు మందు మింగుతుండు. తన కైరోత్‌ల ఉంటండు.
కరోనాకు కులం లేదు. మతంలేదు. బీదలేదు. సాదలేదు. అందరికీ అంటుకుంటంది.
సర్పంజి బార్యకు దగ్గు, దమ్ము, జరంతో కరోనా అందుకున్నది. సర్పంజిని ఇంట్లనే ఐసోలేషన్‌ పెట్టిండ్రు. కొడుకు, కోడండ్లు లేరు. పానమ్మీది పీర్తి లేందెవ్వరికీ? పని మనుషులు కుక్కకు బువ్వేసినట్లు దూరం నుంచి బువ్వేస్తుండ్రు. ఇంట్ల తిరుగుతున్నపుడు రాకాసి బూతం జబ్బలు చరుచుకున్నట్లు నిలవడ్డది. ఉలికిపడ్డడు. బాలయ్య జాంగల ఉచ్చవడ్డది. అటీటు మెసిలేవరకు ఆయన రూపమే గట్ల కనవడ్డది. అప్పటికే గడ్డం మీసాలు పెరిగి తనరూపమే గుడ్డెలుగు తీరు బుగులుపుట్టేట్లు కనవడుతుంది.
ఎవని కొడుకు? ఎవని బిడ్డ? ఎవనికెవడు? నా బార్య సత్తె మొకం సూడనియ్యకపోతే ఎట్లా? తుమ్మిండు. సచ్చం అనుకున్నడు. నా గతి ఇంతేనా అంటున్నపుడు మల్లా తుమ్మిండు. బంగ్ల రీసౌండ్‌ వొస్తుంది. రోగము అంటిందా అనే అనుమానము బలపడ్డది.
అపుడే టీవీలో స్వతంత్ర భారతంలో సావుకూడా పెల్లిలాంటిదే బ్రదరూ అనే పాట చెవులు నిండా ఇనిపిస్తుంది  నేను సత్తె నన్ను కూడా ఎవ్వడు సూడడు. శవయాత్ర ఉండనప్పుడు కుక్క సావుగాకపోతే ఇంకేంటిది? బహుగ బతికినోన్ని. మందిల బతికినోన్ని మంది లేకుండానే బొందల పడుతనా?
ఇప్పుడు బాలయ్య ఇల్లే కాదు. ఊరే పెద్ద ఇసోలేషన్‌ వార్డు అయ్యింది.
                                      ***                           

   కునుకు పట్టింది. తెగని దగ్గు, దమ్ము. అంతులేని ఎగపోత. జరంతో అన్ని వార్డులు, ఊరంతా  గజగజ ఒనుకుతున్నది. ఇగ ఊరు ఊరంతా కరోన సోకింది.
 ‘‘ఆయాస పడెట్లోల్లు ఆయాస పడుతనే ఉన్నరు. ‘‘అ.. య్యా! అ ... య్యా! నీ...  కా...ళ్లు మొ.... క్కు....తం... . నీ....కు ...దం......డం.... పె...డు....తం..... మ...మ్ము... ... బ... తి... కి... య్యి... ‘‘ అని కొందరు ఎగపోసుకుంటా మూలుగులతో మొర పెడుతుండ్రు. సైగలు చేస్తుండ్రు. ఇంకొంత మందియి పిల్లి కూత మూలుగు. కొందరు కొరి జీవునాతో కొట్టుకాడుతున్నరు.
  చనిపోయిన శవాలమీద ఈగలు జబ్బుమంటున్నయి. కొన్ని పీనుగుల్నీ చీమలు, ఎలుకలు కడుపు నింపుకుంటున్నయి. కుక్కలు పీక్క తింటున్నయి. పీకబడుతున్నయి. కర్రెటి నెత్తురు పీనుగులు కక్కుతున్నయి.
చూసెటోడు లేడు. చేసేటోడు లేడు. ఏడిసేటోడు లేడు. ఎత్తుకునేటోడు లేడు. మొత్తుకునేటోడు లేడు. ఎవ్వనెవ్వడు సూత్తలేడు. ఎటు సూసిన పీనుగుల కంపువాసన గాలితో గప్పన విసురుతుంది. ఊరిప్పుడు శవాల దిబ్బ. పీక్కతింటున్న శవాల గేదర్‌ వాసన. పీనుగులు కొన్ని సగం ఎముకలగూల్లల దర్శనమిస్తున్నాయి. సగం మాంసం తిత్తులు సూడ ఘోరంగా కనవడుతున్నయి.
     రసి కారుతున్న నెత్తురుదారల్ని దాటుకుంటూ సర్పంజి అడుగు తీసి అడుగు పెడుతుండు. అడుగడుక్కు ఎనుకటి గురుతు అల్లుకుంటున్నయి. నాతోటి జై అత్తురుపల్లి అనుకుంటూ ఊరు కోసం ఊపిరి బిగవట్టి కొట్లాడింది వీళ్లుకాదా? ఈ ఊపిరి లేనోల్లేనా? ఒక్కరూ మాట్లాడరేంది? నేను వొస్తుంటే తొవ్వంటి పబ్బతి పట్టి నిలుసున్నది ఈ పానం లేనోల్లేనా? కదులక కట్టెసరుసుక పన్నది ఈల్లేనా? ఈ పీనుగు దిబ్బగా మారిన ఊరికి నేను సర్పంజీనా? కాదు. కాకూడదూ.
  నాది నాది అని కొట్లాడి సచ్చి ఏం సాధించిండ్రు. ఏం ముల్లెగట్టుకపోయిండ్రు. తలుచుకుంటూ మోకాళ్ల మీద కూసుండి  అయ్యో! భగవంతా! ఇదేం అన్యాలం! ఇంతకంటే నరకం ఉంటుందా? ఇప్పుడు ఆరడుగుల నేలకూడా వీళ్లకు లేదు. ఆచారంతో చేసే దహన సంస్కారాలు లేవు’’ అని బాధ పడుతున్నడు. 

మంటలు అంటుకుంటున్నపుడు సల్లార్పకపోతే అవి మన ఇండ్లను, మనల్నీ కాల్చుతయి. బతికించుకోవాలే. నేనూ బతుకాలే. నా తోటి నా ఊరు బతుకాలే. బతికే వూరిలో నేనూ ఉండాలే.

వాసన భరించని సర్పంజి ముక్కుమూసుకొని ఇంటి మోకాన తొవ్వ తొక్కిండు. ఇంట్లకు వొయిండు. ఇషార పడుతుండు. అందరినీ బతికిస్తా అని అనుకుంటున్నప్పుడు తన మీద తనకి సోయి కలిగింది. ముట్టుకునేటోల్లు లేరు. పట్టుకునేటోల్లు లేరు. గడ్డకుపడ్డ శాప తీరు కొట్టుకాడుతుండు. ఉరివడి గిలగిల తన్నుకు చస్తున్నడు. ఆకరి ఘడియల్లా బతుకు కొట్టుకాడుతుంది. జీవి రుంగసుట్టుకపోతుంది. నీళ్లు తెచ్చుకుందామని పోతుంటే కళ్లు బైర్లు కమ్మినయి. దూపా దూప అనుకుంట పోతండు.. గోడలు తగిలి కూలవడ్డడు.

 కాపాడుండ్రి! కాపాడుండ్రి! అంటూ అటు పొర్లి, ఇటు పొర్లి, పర్వతం కూలినట్లు పన్నోడు పన్నట్లే దిబిల్లుమని మంచం కింద పడ్డడు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని