రాక్షసీయం

చీమ, ఏనుగుల్ని సమఉజ్జీ చేస్తూ సాంఘిక మాధ్యమాల్లో ఎన్నో సరదా కథలు ప్రచారంలో ఉన్నాయి. అవి నవ్వుకుందుకు బాగానే ఉంటాయి కానీ, వాస్తవంలో చీమ ఏనుగు కాలికింద నలిగిపోవడం సహజం...

Updated : 03 Jul 2021 17:47 IST


కథావిజయం 2020 పోటీల్లో ప్రోత్సాహక బహుమతి (రూ.3 వేలు) పొందిన కథ

చీమ, ఏనుగుల్ని సమఉజ్జీ చేస్తూ సాంఘిక మాధ్యమాల్లో ఎన్నో సరదా కథలు ప్రచారంలో ఉన్నాయి. అవి నవ్వుకుందుకు బాగానే ఉంటాయి కానీ, వాస్తవంలో చీమ ఏనుగు కాలికింద నలిగిపోవడం సహజం. నేను చీమ. గోపతి ఏనుగు. మేమిద్దరం ఎన్నికల్లో ప్రత్యర్థులమైనప్పుడు, ఈ వాస్తవం నాకు తెలుసు. కానీ తప్పలేదు. ఏదో అద్భుతం జరిగి, విజయం నన్ను వరిస్తుందన్న ఆశ కూడా నాకు లేదు. ఎందుకంటే- జనం లక్షల్లో, కోట్లలో ఉండొచ్చు. వారి జాతకాల్ని రాసేది మాత్రం నాయకులు. ఈ విషయం కృత, త్రేతా, ద్వాపర యుగాలకు చెందిన మన పురాణ కథల్లో చాలా స్పష్టంగా చెప్పారు.

ఆ నాయకుల్లో దేవతలుంటారు. రాక్షసులుంటారు. దేవతలకి మహిమలుంటే, రాక్షసులకి వరాలుంటాయి. ఆ వరాలు కూడా వారికి జనం పూజించే దేవుళ్ల నుంచే లభిస్తాయి.

నాయకులు దేవతలైతే జనం అదృష్టం. రాక్షసులైతే జనం దురదృష్టం.

ఆ యుగాల్లో రాక్షసులు వరాల బలంతో నాయకత్వాన్ని సాధించి జనాన్ని అష్టకష్టాలు పెట్టేవారు. అలా జనం కొన్నాళ్లు కష్టపడ్డాక దేవతలు అవతారమూర్తులుగా ఉద్భవించి రాక్షసుల్ని మట్టుబెట్టేవారు. ఏంచేసినా అవతారమూర్తులూ, నాయకులే చెయ్యాలి. జనం పని సుఖించడమో, భరించడమో- అంతే!

కలియుగంలో పరిస్థితి వేరు. ఇక్కడ స్వభావాన్ని బట్టి మనుషుల్లోనే దేవతలు, రాక్షసులు ఉంటారు.  రాక్షసత్వమున్న మనిషికి, పదవి లేకపోయినా కూడా జనం భయపడతారు. ఇంకా చెప్పాలంటే పదవి ఉండి దేవతలుగా చెలామణీ అవుతున్నవారు కూడా రాక్షసులకి భయపడతారు.
వీరపల్లెలో గోపతి - మనిషిగా చెలామణీ అవుతున్న రాక్షసుడని ఆ ఊరి జనం అనుకుంటారు.   
గోపతిది వీరపల్లె కాదు. అతడా ఊరి పెద్ద కామందు వేషయ్యకి ఇల్లరికపుటల్లుడిగా వచ్చాడు.
వేషయ్య పెద్దమనిషి. మర్యాదస్థుడు. పరోపకారి. ఏ పదవీ లేకపోయినా ఊరంతా ఆయన్ని గౌరవిస్తారు. ఊరి ప్రెసిడెంటు కూడా ఏదైనా కార్యం తలపెట్టినప్పుడు ముందాయన చెవిని ఓ మాట వేస్తాడు.
గోపతి పూర్తిగా ఆయనకు భిన్నం. అతడికి నోటిదురుసు, చేతిదురుసు ఎక్కువే. దురలవాట్లున్నాయి. స్త్రీలోలత కూడా ఉంది. పువ్వు పుట్టగానే పరిమళించినట్లు- ఊళ్లోకి రాగానే అతడి లక్షణాలు బయటపడ్డాయి. వేషయ్యమీదున్న గౌరవంవల్ల ఊళ్లోవాళ్లా విషయాన్ని ఆయనకు చేరవెయ్యడానికి కాస్త సమయం తీసుకున్నారు. నానాటికీ అతగాడు రెచ్చిపోతుంటే, చివరికి తప్పనిసరై ఆయనకి చెప్పాల్సి వచ్చింది.
వేషయ్య మాత్రం ఏంచేస్తాడు? కొడుకైతే మందలించేవాడు. అల్లుడైపోయె. అందుకని ముందు కూతురు రాధకి చెప్పాడు.
కానీ, బయటెలాగున్నా ఇంట్లో భార్యని ప్రేమానురాగాలతో ముంచెత్తేస్తాడు గోపతి. ప్రేయసిని తనకి అనుకూలంగా ప్రభావితం చెయ్యడంలో శ్రీకృష్ణుణ్ని మించిన దిట్ట. రాధ గోపతిని దైవంలా భావించి ఆరాధిస్తుంది. 
‘‘ఆయనలో కృష్ణుడి అంశ ఉంది నాన్నా! సరదాగా మాట్లాడతాడు. చిలిపిగా ప్రవర్తిస్తాడు. ఏంచేసినా ఆయన తత్వం మాత్రం ప్రేమమయం’’ అని భర్తని సమర్థించిందామె.
వేషయ్యకి కృష్ణుడంటే భక్తి ఉంది. జనంకోసం కాళీయుణ్ని మర్దించి, గోవర్ధనగిరి ఎత్తిన వాడు గోపికలతో సరసాలాడినా తప్పు లేదనుకునే తత్వం ఆయనది. కేవలం గోపికలతో సరసాలాడ్డమే కృష్ణాంశ అనుకోలేడాయన. కానీ కూతురు ఆయన బలహీనత. ఆమె మనసు నొప్పించే పని ఏదీ చెయ్యలేడు.
వేషయ్య మంచివాడు. అంటే ప్లస్‌. గోపతి చెడ్డవాడు. అంటే మైనస్‌. వాళ్ల కాంబినేషన్‌ మైనస్‌ ఇంటూ ప్లస్‌ కాబట్టి మైనస్సే కదా! అలా ఊరివాళ్లకి వేషయ్య కుటుంబం మైనస్‌ అయింది. ఆ మైనస్‌ స్థాయి గోపతిని అక్కడ తిరుగులేని రాక్షసుణ్ని చేసింది.
మనకి పోలీసులున్నారు. సామాన్యులకి వాళ్లు ఎఫ్‌ఐఆర్లు రాయరు.
కోర్టులున్నాయి. అవి ముద్దాయిల్ని నిర్దోషులుగా నిర్ధారించేలోగా వాళ్లు ఏళ్ల తరబడి జైళ్లలో మగ్గుతారు.
దోషులున్నారు. వాళ్లు హత్యలు, మానభంగాలు వగైరా ఎన్ని దారుణాలు చేసినా- ఇలా అరెస్టయి అలా బెయిలుమీద బయటికొచ్చి తమపై ఆరోపణ చేసినవారి చుట్టూ ‘నరవాసన’ ఆంటూ తిరుగుతారు.
నాయకులున్నారు. తమ నాయకత్వాన్ని నిలుపుకుందుకు వాళ్లు రాక్షసుల మద్దతు తీసుకుంటారు.
ప్రచార మాధ్యమముంది. ఓ నేరం బయటపడగానే డ్రాయింగ్‌ రూమ్స్‌ అదిరేలా ఓ రోజంతా చర్చలు లేవదీసి, మర్నాడు మరో అంశానికి మారిపోతుంది. 
ఇది కలియుగధర్మం. ఆ ధర్మం ప్రకారం వీరపల్లె జనం గోపతికి భయపడుతున్నారు. వీరపల్లె ప్రెసిడెంటు కూడా అతడికి భయపడుతున్నాడు.
గోపతి గురించి వీరపల్లె జనానికే పట్టనప్పుడు, ఆ ఊరికి చెందని నాకేం పట్టింది? కానీ నా భార్య శ్యామలవల్ల పట్టించుకోవాల్సి వచ్చింది. అసలేం జరిగిందంటే.....
***  
మా మూడో పెళ్లిరోజుకి ఎరక్కపోయి అడిగాను శ్యామలని, ‘‘నీకేంకావాలో ఈసారి నువ్వే అడుగు’’ అని.
నేను వ్యాపారిని. ఏడాదికి నా నికరాదాయం ఏడెనిమిది కోట్లకి తక్కువుండదు.
తనకోసం మా మొదటి పెళ్లిరోజుకి లక్ష రూపాయల నెక్లెస్‌ కొన్నాను. రెండో పెళ్లిరోజుకి లక్షా ఏబైవేల డిజిటల్‌ టీవీ కొన్నాను. ఈ మూడో పెళ్లిరోజుకి మూడు లక్షలు ఖర్చు పెట్టడానికి సిద్ధంగా ఉన్నాను. కానీ తను, ‘‘మా ఊరెళ్లి ఓ వారం రోజులుండి రావాలనుంది’’ అంది.
శ్యామలకి పల్లెటూళ్లంటే ఇష్టం. తన బాల్యం గడిచిన స్వగ్రామం వీరపల్లె అంటే మరీ ఇష్టం. అక్కడే ఆమె అయిదో తరగతి దాకా చదువుకుంది. ఇంకా చదువుకునేది ఆ ఊరికి గోపతి రాకపోతే.
తొమ్మిదేళ్ల వయసులో ఒకసారి ఆమె ఎవరింటికో వెళ్లి పూలు కోసుకుని వస్తోంది. పక్కన ఎవరూ లేరు. వీధిలోనూ ఎవరూ లేరు. ఉన్నట్లుండి గోపతి ఎదురయ్యాడు. ‘‘పిల్లా! చాలా బాగున్నావు. కొంచెం పెద్దయ్యేక మొదటిసారి నాతోనే’’ అన్నాడు నర్మగర్భంగా నవ్వుతూ ఆమెను పలకరించి.
నిజం చెప్పొద్దూ, ఆమెకప్పుడా మాట అర్థం తెలియలేదు. కానీ గోపతి అంటే భయం మాత్రముంది. వడివడిగా నడుచుకుంటూ ఇల్లు చేరేదాకా ఆమెని గోపతి నవ్వు వికటాట్టహాసంలా వెన్నాడింది. ఇంటికెళ్లి గోపతి అన్న మాటలు యథాతథంగా చెప్పింది. ఇంట్లోవాళ్లకి అతడి మాటలు అర్థమయ్యాయి.
కులం పేరో, మతం పేరో, ప్రాంతం పేరో, భాష పేరో చెప్పి- నాయకులు రెచ్చగొట్టినప్పుడు ఒక్కసారిగా మరిగే జనం రక్తం- వ్యక్తిగతమైన అవమానాల సమయంలో మాత్రం ఫ్రీజర్లో పాలలా గడ్డ కట్టి ఉంటుంది.
‘‘పిల్ల పెద్దదౌతోంది. చదువుకి పట్నంలో తమ్ముడింట్లో పెడదాం’’ అన్నది ఆ ఇంటి యజమాని స్పందన. ఫలితంగా శ్యామల పట్నంలో బీకాం చదివి, నా ఇల్లాలయింది. 
శ్యామల చెప్పుకోదగ్గ అందగత్తె. అరమరికలు లేని మంచి మనిషి. తన సంతోషంకంటే ఎదుటివాళ్ల సంతోషం గురించి ఎక్కువ ఆలోచిస్తుంది.
ఆమె నాకు నచ్చడంలో విశేషం లేదు. అమ్మతో సహా మా ఇంట్లో అందరికీ కూడా చాలా నచ్చింది. అయితే ఆమెకు సంబంధించి మా అమ్మకి నచ్చని ఓ రహస్యముంది. చెబితే ఇంట్లో గొడవౌతుందని నేను దాచిపెట్టాను. అదేమిటంటే మొదటి పురుడు వీరపల్లెలో పోసుకోవాలని. అందుకోసం పిల్లల్ని కూడా వాయిదా వేస్తోంది. అందుకు నా సహకారముంది కానీ, ఇలా ఎన్నాళ్లో సాగేలా లేదు.
మనవడినో, మనవరాలినో ఎత్తుకోవాలని అమ్మకి మనసు. కొన్నాళ్లుగా తను మమ్మల్ని పిల్లకోసం ఎంతలా సతాయిస్తోందంటే, ఇద్దర్నీ వైద్యపరీక్షలు చేయించుకోమనేదాకా వచ్చింది వ్యవహారం.
శ్యామల కోరిక చిన్నదే కావచ్చు. కానీ చాలా బలమైంది. నా ప్రేమబలంతో ఆ బలాన్ని జయించి, ఆమె వీరపల్లెని మరచిపోయేలా చెయ్యాలని నా ఆశయం. ఆమెకు ఖరీదైన కానుకలివ్వడానికి ప్రేమానురాగాలతో పాటు ఆ ఆశయమూ ఒక కారణం.
మొదటి రెండుసార్లూ మా పెళ్లిరోజుకి తనడక్కుండానే, మనోగతం తెలుసుకుని ఆ కానుకలు కొన్నాను. తను చాలా సంతోషించింది. ఈసారి పొరపాటున తనని అడిగేశాను. తను మనసులోని కోరిక బయటపెట్టింది.
వినడానికి ఆ కోరిక చాలా సామాన్యమైందిగానే తోస్తుంది - గోపతి గురించి తెలియనివారికి!
వీరపల్లెలో గోపతి ఉండగా శ్యామలని అక్కడికి పంపొద్దని - మామగారు... అంటే శ్యామల తండ్రే స్వయానా నాకు చెప్పారు. ఆయన చెప్పడానికి ముందే గోపతి లీలలు కొన్ని విన్నాను. ఆయన మరికొన్ని చెప్పారు.
కోట్లు సంపాదిస్తున్న వ్యాపారినై ఉండి, నా భార్య చిన్న కోరికని తీర్చలేకపోవడం చిన్నతనమే! ఆ కోరిక ఆమె మనసులో ఉందని తెలిసే, చాలా కాలం ఆమెకి అడిగే అవకాశం ఇవ్వలేదు. ఒకసారి ఆమె అడిగాక నేనా కోరిక తీర్చక తప్పదు.
శ్యామల తొలికాన్పు వీరపల్లెలో జరగాలనుకోవడం ఇంత పెద్ద సమస్య కావడాన్ని తలచుకుంటే, మనముండేది జనం మధ్యనా, అడవిలోనా అన్న అనుమానం నన్ను బాధించింది. ఎటొచ్చీ అడవిలో అయితే ఏ మూలనుంచి ఏ క్రూరమృగం దాడి చేస్తుందో తెలియదు. ఇక్కడ అలాంటి భయం లేదు. గోపతిలాంటి క్రూరమృగాలు ఎక్కడుంటాయో తెలుసు. వాటిని తప్పించుకుని తిరిగితే, నాబోటివాళ్లు సుఖంగా బతికెయ్యవచ్చు. అసలు సుఖంగా బతకడం కోసమే నేను గోపతిలాంటి వాళ్లని ఎదుర్కోవడాన్ని సాహసంగా భావించి, తప్పించుకుందుకు ప్రయత్నిస్తాను. 
నిజానికిప్పుడు నా జీవితం వైభవంగానే ఉంది. ఆ వైభవానికి ఏ ఆటంకమూ కలగని విధంగా శ్యామల కోరిక తీర్చడం నాకిప్పుడు సవాలు. ‘‘ఏంచెయ్యాలి?’’ అని ఆలోచిస్తుంటే చటుక్కున గుర్తొచ్చాడు సుధాకర్‌.
సుధాకర్‌ హైస్కూల్‌ నుంచీ నా క్లాస్‌మేట్‌. వాడికి చదువు మీద ఆసక్తి తక్కువ. అందుకని ఆటపాటలమీద దృష్టి పెట్టాడు. కానీ వాటిలో రాణించలేదు. చదువులో వాడికి నేను బాగా సాయపడేవాణ్ని. నా మూలంగానే వాడు టెన్తు ప్యాసై నాతోపాటు కాలేజీలో చేరాడు. అక్కడ రాజకీయాల్లోకి దిగి, తొందరగానే విద్యార్థి నాయకుడయ్యాడు. నన్ను కూడా తనతో కలవమనేవాడు.
‘‘నాకు రాజకీయాలు పడవు. డిగ్రీ అవగానే వ్యాపారంలోకి దిగిపోతాను’’ అని స్పష్టం చేశాను. వ్యాపారంలో రాణించడానికి కూడా రాజకీయాలు అవసరమని వాడు నచ్చజెప్పాడు. కానీ నేను వినలేదు. డిగ్రీ అవగానే మా దార్లు వేరయ్యాయి.
‘‘రాజకీయాల్లో గెలుపే తప్ప ఓటమి ఉండదు. అక్కడ అవసరాన్ని బట్టి పార్టీలు మారొచ్చు. ఆశయాలు మార్చుకోవచ్చు. విలువల్ని నమ్మక్కర్లేదు. మనం చేసేదే మంచి. మనకి మంచి కానిది చెడు. అన్నీ అవలక్షణాలున్నా మహానుభావుడిగా వెలిగిపోవచ్చు. రాజకీయాలు వంటబట్టించుకున్నవాడికి తనకి తానే తోడు. తనకి తనే ఆసరా. వ్యాపారంలో అలా కాదు. ఆచితూచి అడుగెయ్యాలి. ప్రతి అడుగుకీ ఎందరో సహకరించాలి. ఎందరినో తృప్తిపరచాలి. ఒకసారి దెబ్బ తింటే తట్టుకోవడం కష్టం. అలాంటప్పుడు ఎప్పుడైనా నా సాయం అవసరమనిపిస్తే నిస్సంకోచంగా నన్నడుగు. నీకు సాయపడ్డం నా కర్తవ్యంగా భావిస్తాను. అవసరానికి నా సాయం అడుగలేదూ, నువ్వు మన స్నేహాన్ని కించపర్చినట్లు భావించి నొచ్చుకుంటాను’’ అన్నాడు సుధాకర్‌ అప్పట్లో.
వరుస పరాజయాలు చవిచూస్తున్న ఓ జాతీయ పార్టీలోని వ్యక్తుల ప్రాభవం దశాబ్దాల తరబడి ఏమాత్రం తగ్గకపోవడం గమనిస్తున్న నాకు వాడి మాటలు నిజమే ననిపించాయి. అందుకని వాడి ఆఫర్‌కి సంతోషించాను. కానీ, తన అవసరం నాకుంటుంది కానీ, నా అవసరం వాడికుండదనడంలోని వాడి అహం, నా అహానికి నచ్చలేదు. ఎప్పటికైనా వాడు నా దగ్గరికి రావాలికానీ, నేను వాడి దగ్గరికి వెళ్లకూడదని అప్పుడే అనుకున్నాను. కానీ ఇప్పుడు వెళ్లాల్సొచ్చింది.
అలాగని సుధాకర్‌ వల్ల నా పని అవుతుందని నమ్మకం లేదు. అయితే సరే శ్యామల కోరిక తీర్చగల్గుతాను. లేదూ- తనకోసం నేను సిన్సియర్‌గా ప్రయత్నించానని శ్యామల అనుకోవడం ఒకటి. నా వల్లకాని పని సుధాకర్‌ వల్ల కూడా కాదని తేలిపోవడంతో నా అహానికి కొంచెం తృప్తి కలుగుతుంది.             
అలా నేను సుధాకర్ని కలుసుకుని నా సమస్య గురించి క్లుప్తంగా చెప్పాను. వాడు వెంటనే, ‘‘ఈ గోపతి ఎవరూ, ఇంతవరకూ నా దృష్టికి రాలేదే!’’ అన్నాడు.
నా సమస్య కంటే కూడా గోపతే వాణ్ని ఎక్కువగా ఆకర్షించాడా అనిపించింది. ‘‘వీరపల్లె వాసులతణ్ని రాక్షసుడంటారు. భారతంలో ఏకచక్రపురవాసులు బకాసురుణ్ని భరించినట్లే వీరపల్లె పౌరులూ అతణ్ని భరిస్తున్నారు. అతడి ఆగడాల సమాచారం ఊరు దాటి వెళ్లదు కాబట్టి, నీలాంటివారికి అతడి గురించి తెలియదు’’ అన్నాను.
‘‘ఇది చాలా చిన్న పని. నీ శ్రీమతిని వీరపల్లె వెళ్లి ఇష్టమైనన్ని రోజులు ఉండమను. తనకి జడ్‌ప్లస్‌ సెక్యూరిటీ ఏర్పాటు చేయిస్తాను’’ అన్నాడు సుధాకర్‌.
నవ్వాను, ‘‘నేనింత చెప్పినా నీకు గోపతి పవర్‌ అర్థం కాలేదనుకుంటాను. వీరపల్లెలో అతడి ఆగడాల్ని ఏ సెక్యూరిటీ ఆపలేదు’’ అన్నాను.
సుధాకర్‌ తనూ నవ్వాడు, ‘‘పరిస్థితి నాకప్పుడే అర్థమైంది. కొన్నాళ్లపాటు గోపతిని ఊర్నించి బయటికి తేవడమొక్కటే మార్గమని అనుకున్నాను కానీ - ఆ మాట నేనంటే నువ్వు అపార్థం చేసుకునే అవకాశముంది. అది నీచేతే అనిపించాలని సెక్యూరిటీ గురించి మాట్లాడాను’’ అన్నాడు.
నిజమో, అబద్ధమో - ఫక్తు రాజకీయవాదిలా మాట మార్చాడు. ఆ మాట పైకి అనకుండా, ‘‘గోపతిని ఊళ్లోంచి బయటికి తీసుకొస్తానంటే నేనెందుకు అపార్థం చేసుకుంటాను?’’ అన్నాను.
‘‘ఎందుకంటే, నాలుగు నెలల్లో వీరపల్లె నియోజకవర్గంలో ఎన్నికలున్నాయి. టికెట్‌ ఎవరికివ్వాలా అని మా పార్టీ వాళ్లు మల్లగుల్లాలు పడుతున్నారు. గోపతి గురించి వినగానే, ఆ ఊరివాడే కాబట్టి అతడికే మా పార్టీ టికెట్‌ ఇవ్వడం బాగుంటుందనిపించింది’’ అన్నాడు.
‘‘ఏమిటీ, అలాంటివాడికి మీ పార్టీ టికెట్టా? దేశంలో ఇప్పుడిప్పుడే ప్రభంజనంలా దూసుకుపోతున్న పార్టీ మీది’’ అన్నాను ఆశ్చర్యంగా.
‘‘ఈ రోజుల్లో ఏ పార్టీకైనా గోపతిలాంటివాడే పెద్ద అసెట్‌. ఆ విషయం నేను చెబితే తప్ప తెలియని అమాయకుడివనుకోను’’ అన్నాడు సుధాకర్‌.
బాగానే ఉందని ముందనుకున్నా, అంతలోనే వెలిగింది నాకు. ‘‘ఇప్పటికే ఊళ్లో ఇష్టమొచ్చినట్లు చెలరేగిపోతున్న గోపతిని, అధికారమొస్తే ఇంక పట్టుకోగలమా?’’ అన్నాను కలవరంగా.
‘‘అందుకే ఇందాక అపార్థం గురించి ప్రస్తావించాను. గోపతికి మా పార్టీ టికెట్‌ వస్తుందని నాకు నమ్మకమే. కానీ అతడికి ప్రత్యర్థిగా నువ్వు నిలబడాలి’’ అన్నాడు సుధాకర్‌.
తెల్లబోయాను. ‘‘అవకాశమొచ్చింది కదా అని, నన్నూ రాజకీయాల ఊబిలోకి దింపుదామనా? ఇంతవరకూ నాకూ, ఆ గోపతికీ ముఖపరిచయమైనా లేదు. అయినా అతడికి భయపడుతున్నాను. ఇప్పుడు నువ్వు మా ఇద్దర్నీ ముఖాముఖీగా నిలబెట్టాలనుకోవడం రాజకీయమౌతుంది కానీ, స్నేహధర్మం కాదు’’ అన్నాను.
సుధాకర్‌ కూల్‌గా నవ్వి తన ఆంతర్యం వివరించాడు.
రాక్షసత్వమున్న మనుషుల్ని లొంగదియ్యడానికి రాజకీయాల్ని మించిన మార్గం లేదట. అలా లొంగినవాళ్లు క్రమంగా రాజకీయాల్లో రాటుదేలి పార్టీకి పెద్ద అసెట్సు ఔతారట.
రాజకీయం పేరిట గోపతి మకాం ముందు ఊళ్లోంచి రాజధానికి మారుతుంది. అక్కడ అతడికి పదవి, అధికారంలో ఉండే సదుపాయాలు, సౌఖ్యాల రుచి తెలుస్తుంది. ఆ రుచి మరిగితే గోపతిలాంటివాడు రాజకీయాల్ని ఎప్పటికీ వదలాలనుకోడు.
యువకుడు, పార్టీకి కొత్తముఖం అనే ప్రచారంతో - గోపతిని పార్టీ అభ్యర్థిని చేస్తారు. ఎన్నికల్లో నెగ్గడానికి అతడు తన ప్రవర్తనని కొంతవరకూ తాత్కాలికంగానైనా సంస్కరించుకోక తప్పదు. లేని పక్షంలో తనకి పదవీ వైభోగం దక్కదన్న భయం అతడికుంటుంది. 
గోపతికి ఊళ్లో మంచిపేరు లేదు. ప్రత్యర్థిగా ఎవరు నిలబడ్డా, గెలిచే అవకాశమెక్కువ. ఆ విషయం పార్టీకి తెలుసు. కానీ వీరపల్లె ఎన్నిక పార్టీకి అంత ముఖ్యమైందికాదు.
నేనా గ్రామంలో ఓ ఇంటలుణ్ని. గోపతి మరో ఇంటల్లుడు. ప్రచారానికీ అల్లుళ్ల వ్యవహారం బాగా పనికొస్తుంది.
ఎన్నికల ప్రచారంలో నేను గోపతికి భయపడనక్కర్లేదు. ఒకటి- అభ్యర్థిగా నా భద్రతకు ఏర్పాట్లుంటాయి. రెండు- నాకు గోపతివల్ల ప్రాణప్రమాదముందన్న విషయం ప్రచారం చేస్తే, నా భద్రత గోపతికి కూడా బాధ్యత అవుతుంది.
ఆ ఎన్నికలో నా గెలుపు తథ్యం. నేను గోపతికే తప్ప తమ పార్టీకి వ్యతిరేకిని కాదు కాబట్టి, నా విజయం ఆ పార్టీకి అభ్యంతరం కాదు. అపజయానికి తప్పు పట్టకుండా పార్టీ గోపతిని తమ కత్తులో చేర్చుకుంటుంది.
‘‘నీ భార్య కోరిక చిన్నదనుకుంటే- ఇప్పుడు నువ్వు చేస్తున్నది అంతకంటే చిన్న పని’’ అన్నాడు సుధాకర్‌.
రాజకీయాల్లో రాటుదేలాడు. వాడికి నన్నొప్పించడం కష్టం కాదు. కానీ ఇందుకు శ్యామల ఒప్పుకుంటుందా? గోపతి కారణంగా ఊరెళ్లి ఉండటానికే భయపడే తను - తన భర్త గోపతికి ప్రత్యర్థిగా ఎన్నికల్లో పోటీ చేస్తాడంటే ఒప్పుకుంటుందా?
అనుకుంటాంకానీ, తెగింపులో మగాళ్ల స్థానం ఆడవాళ్ల తర్వాతే! నేను ఎన్నికల్లో పోటీ చేస్తున్నాననగానే- శ్యామల భయపడలేదు సరికదా, ‘‘చాలా గొప్ప వార్త చెప్పారు. అది నా ఊరు. మీ తరఫున నేను ప్రచారం చేస్తాను’’ అంది మహోత్సాహంగా.
తెల్లబోయినా తమాయించుకుని, ‘‘అమ్మో! అసలు నువ్వా ఊరే రావద్దు. జరిగింది మరిచావా?’’ అన్నాను.
‘‘అప్పట్లో వాడేమన్నాడో వెంటనే నాకు అర్థమవలేదు. అర్థమయ్యేక వాడిôటికి వెళ్లి ఆ చెంపా ఈ చెంపా వాయించాలనుకున్నాను. కానీ పెద్దల స్పందన వేరే ఉంటే తలొంచక తప్పలేదు. మనసులో మాట కూడా పైకి చెప్పలేదు. మన పెళ్లయ్యేక మీకు జరిగింది చెప్పినప్పుడు - మీరావేశ పడతారనుకున్నాను. విని ఊరుకున్నారే తప్ప మీరూ ఏమనలేదు. తొలికానుపు వీరపల్లెలో జరగాలన్న నా కోరిక కూడా, మీరు గోపతి విషయమై ఏమైనా ఆలోచిస్తారనే! ఏదేమైతేనేం- ఇప్పుడు మీరు గోపతికి ప్రత్యర్థిగా నిలబడ్డారు. భార్యగా మీ తరఫున ప్రచారం చెయ్యడం నా హక్కు. గోపతి ఆగడాల్ని పబ్లిక్‌గా తూర్పారబట్టడానికి ఇది నాకో గొప్ప అవకాశం. ఇది నేను వదులుకోను’’ అందామె ఆవేశంగా.
అప్పుడు నాకో విషయం అర్థమైంది.
మన దేశంలో ఆవేశపడేవాళ్లు చాలామందున్నారు. సరైనదైనప్పుడు అదుపు చెయ్యడంవల్లనూ, సరైనది కానప్పుడు ఎగదోసి రెచ్చగొట్టడంవల్లనూ ఆ ఆవేశం  నీరుగారిపోవడమో, దురుపయోగం కావడమో జరుగుతోంది.
‘‘గోపతి నిన్నెప్పుడో మర్చిపోయాడు. ఇప్పుడు రెచ్చగొట్టి మళ్లీ తన దృష్టిలో పడ్డం అవసరమా?’’ అన్నాను.
‘‘నా విషయంలోనే కాదు. వాడు ఎందరి విషయంలోనో తప్పు చేశాడు. అప్పుడూ నాతో సహా ఊళ్లోవాళ్లలో ఒక్కరు కూడా నోరెత్తలేదు. కనీసం వాడు మా ఊరికి ప్రతినిధిగా నిలబడుతున్నప్పుడైనా, వాడి తప్పు గురించి మాట్లాడకపోతే ఎలా?’’ అందామె ధైర్యంగా.
నాకు మాత్రం ఇంకా భయంగానే ఉంది, ‘‘కానీ గోపతి రాక్షసుడు’’ అన్నాను.
‘‘నాకోసం మీరా రాక్షసుడితో పోటీ పడుతున్నారు. నాకు మీమీద గౌరవం పెరిగిపోతోంది. పొటీలో మీ తరఫున ప్రచారం చెయ్యలేకపోతే, నన్ను నేనే అసహ్యించుకునే ప్రమాదముంది. రాక్షసులకి భయపడే మనిషి, మనిషిగా బతకడంకంటే రాక్షసులకి ఆహారం కావడమే మంచిదని నా అభిప్రాయం’’ అంది శ్యామల.
ఆమె నిర్ణయం అంత బలమైనదనుకోలేదు. ఇన్నాళ్లూ శ్యామల నాకు కార్యేషు దాసీ, కరణేషు మంత్రీ, భోజ్యేషు మాతా, శయనేషు రంభా. ఈరోజు తనలో ‘సాహసేషు ఝాన్సీ’ అనిపించేలా కొత్త శ్యామల కనిపించింది.
ఆమెకు గోపతిపై పీకలదాకా కోపముంది. నేనతడిపై పోటీకి నిబడతాననగానే ఆమెలో కొత్త ఉత్సాహం పుట్టింది. అది చూస్తే, ‘ఈమెనా నేను కాసులపేరు, డిజిటల్‌ టీవీతో సంతృప్తి పరచాలనుకున్నది’ అనిపించి చిన్నబుచ్చుకున్నాను.  
***             
వీరపల్లెకి గోపతి నుంచి విముక్తి- ఇదీ ఎన్నికల్లో నా నినాదం.
ప్రచారంలో కూడా గోపతి వ్యక్తిత్వంలో పెద్దగా మార్పు లేదు. ఊరికి తనేంచేస్తాడో చెప్పకుండా నన్ను దుమ్మెత్తిపొయ్యడమే ప్రధానంగా పెట్టుకున్నాడు. ఎక్కడో వ్యాపారం చేసుకుంటూ, డబ్బు తప్ప ఏమీ పట్టని నాకు ఆ ఊరికి ప్రతినిధి అయ్యే అర్హత లేదన్నాడు. ఇల్లరికం పేరిట ఆ ఊరికి తరలి వచ్చిన తనే ఆ ఊరికి ప్రతినిధి కావడం న్యాయమన్నాడు. తనని వ్యతిరేకించేవారికి తగిన విధంగా బుద్ధి చెప్పగలనంటూ పరోక్షంగా హెచ్చరించాడు.
నా తరఫున శ్యామల ఇంటింటికీ వెళ్లి మాట్లాడింది. వాళ్లామెతో సానుకూలంగా మాట్లాడేరు. ఇప్పటికైనా ఊరికి ఆ దుష్టుడి పీడ విరగడైతే అదే చాలన్నారు. అందుకని గోపతి వ్యక్తిత్వమే నాకు ప్రచారం అనుకున్నాను. ఎన్నికల Ëకోసం నేను ఖర్చు పెట్టింది చాలా చిన్నమొత్తం. 
ఎన్నికలు ముగిశాయి. ఫలితాలు వచ్చాయి. నేను ఓడిపోయాను. చెప్పాలంటే చిత్తుగా ఓడిపోయాను.
***
నేను సుధాకర్‌ని కలవలేదు. తనే కలవడానికి వస్తే మాట్లాడాలనిపించలేదు. ముభావంగా నవ్వాను.
‘‘నీకు రాజకీయాలు సరిపడవని ఎప్పుడో చెప్పావు. నేను కాదన్నాను. కానీ నువ్వే రైటు. నీ గెలుపునకి నా అభినందనలు’’ అన్నాడు.
నా ఓటమిని గెలుపంటున్నాడు. ‘రాజకీయవాది కదా’ అనుకున్నాను చిరాగ్గా.
‘‘వీరపల్లె వాసులు తెలివైనవాళ్లు. గోపతిని ఎన్నుకుని ఊరికి పట్టిన పీడని వదిలించుకున్నారు. ఎన్నికల్లో నెగ్గాక కొన్నేళ్లదాకా తనా ఊరిని చూడనైనా చూడడని వాళ్లకి తెలుసు. ఇప్పుడు నా చెల్లాయి అక్కడికెళ్లి ఎన్నాళ్లైనా ఉండి- హాయిగా, కులాసాగా గడిపిరావచ్చు. తన కోరిక ఇప్పుడు నిజంగానే చిన్నదైపోయింది. అందుకు నీకు నా అభినందనలు’’ అన్నాడు సుధాకర్‌. 
తెల్లబోయాను. కొన్నేళ్లపాటు ప్రజల మొహం చూడకుండా ఉండడానికా నాయకులు ఎన్నికల్లో పోటీ చేసేది? కొన్నేళ్లపాటు వాళ్ల పీడ వదుల్చుకుందుకా జనం వాళ్లకి ఓట్లేసేది? ప్రజాస్వామ్యమంటే నిజంగా ఇదేనా? లేక ఈ మాటలన్నీ నా ఓటమిలో నా సమస్య పరిష్కారాన్ని చూపిస్తున్న సుధాకర్‌ రాజకీయ చాతుర్యమా?
ఉక్రోషం పట్టలేక, ‘‘నా సంగతి సరే! నీ విషయానికొస్తే - వీరపల్లెకి వదిలిన పీడని మీ పార్టీకి తగిలించావు. అభినందించాలా, జాలిపడాలా. అది చెప్పు’’ అన్నాను.
‘‘రాజకీయంలో కావాల్సిందే గోపతి లాంటి రాక్షసులు. అతణ్ని పరిచయం చేసిన నీకు నా ధన్యవాదాలు’’ అన్నాడు సుధాకర్‌ తడుముకోకుండా. 
ఉలిక్కిపడ్డాను. ఎందుకంటే రాజకీయం అని వాడన్న మాట నాకు రాక్షసీయంగా వినిపించింది!


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని