కొన్ని చీకట్లూ... ఓ వెలుతురూ

అంతా అల్లకల్లోలం. కట్టెగా మారిన సిరి శరీరం మీదబడి ఇంకా కట్టెనెందుకు కాలేకపోయానా అని ఉప్పు సంద్రంలా సుమతి రోదన. చుట్టూ మూగిన జనాలు గుసగుసలాడుకుంటున్నారు... అందరికీ వినబడేలా!..

Updated : 09 Jul 2021 17:49 IST


కథావిజయం 2020 పోటీల్లో ప్రోత్సాహక బహుమతి (రూ.3 వేలు) పొందిన కథ

అంతా అల్లకల్లోలం. కట్టెగా మారిన సిరి శరీరం మీదబడి ఇంకా కట్టెనెందుకు కాలేకపోయానా అని ఉప్పు సంద్రంలా సుమతి రోదన. చుట్టూ మూగిన జనాలు గుసగుసలాడుకుంటున్నారు... అందరికీ వినబడేలా!
‘‘పెండ్లయిన రెండ్రోజులకే ఉరి పోసుకుందంటే ఏమయినాదో పాపం?’’
‘‘మనువు ఇష్టం లేదంట!’’
‘‘కాదెహె, పిల్లోడు పనికిమాలినోడంట’’
‘‘అదేం కాదు. ఆ పిల్ల ఎవర్నో ప్రేమించినాదంట. ఇష్టం లేని పెండ్లి చేసినారని, అర్ధాంతరంగా ఆయువు ముగించుకున్నాది’’
‘‘పాపం బిడ్డ. పచ్చగ పారాణి, పెట్టింది పెట్టినట్లే ఉంది’’
అన్నీ వినబడుతున్నా ఏమీ వినబడనట్లు అచేతనంగా వెంకట్రామయ్య. తన సిరి సంపదలకు కారణమని తను నమ్మిన తన ‘సిరి’ నిర్జీవంగా. వొంటి మీద నలభై తులాల బంగారం, ఏ మాత్రం తగ్గరాదని కట్టబెట్టిన యాభై వేల చీరతో నిన్న గాక మొన్న తన ఇంటి నుంచి అత్తగారింటికి తరలెళ్లిన తన గారాల పట్టి, కాదు కాదు, తన వంశ ప్రతిష్ఠ. అవును వంశ ప్రతిష్ఠే, అప్పుడూ ప్రాణమున్న మనిషేమీ కాదు.
‘‘అన్నీ తెలిసి నాకెందుకు కట్టబెట్టారు? మా పరువూ మర్యాదా అన్నీ పాయె’’ అల్లుడి గొంతులో బాధ కంటే కోపం, అవమానం అగ్నిపర్వతంలా పలుకుతున్నాయి.
‘‘పరువేనా...? పెండ్లయిన రెండ్రోజులకే చచ్చిపోయినాదంటే అత్తింటోళ్లు ఏం జేసినారోనని మామీద అనుమానం. లేనిపోని కేసులు. ఎట్ల సావాల్రా దేవుడా...? వీళ్లు నాశనమైపోను!’’ సిరి అత్తగారి శోకాల్లో శాపాలు.

*****

పరువు... పరువు... ఛళ్లున చరిచినట్లయింది. దిగ్గున లేచి కూర్చున్నాడు వెంకట్రామయ్య. చుట్టూ చీకట్లు. ఇదంతా కలా? సెల్ఫోన్‌ తీసి టైం చూశాడు. పదకొండున్నర. ఇలాంటి కలొచ్చిందేమిటి? పక్కన సుమతి గాఢనిద్రలో ఉంది. మెల్లగా గది బయటికొచ్చాడు. హాల్లో సిరి నాయనమ్మతో కలసి నిద్రపోతోంది. సిరి నిజంగా అంత ప్రశాంతంగా నిద్రపోతోందా? లేకపోతే నిద్ర నటిస్తోందా? లోపలికొచ్చి మళ్లీ పడుకున్నాడు, కానీ నిద్ర దగ్గరికి రానంటోంది. నిద్రకు బదులు గతమొచ్చి కళ్లల్లో నిలిచింది.
తొలి సంతానం ఆడపిల్ల పుట్టగానే చాలా కుటుంబాల్లో లాగానే మహాలక్ష్మి పుట్టిందని సంబరపడి శ్రీలక్ష్మి అని పేరు పెట్టుకున్నాడు. ముద్దుగానే కాకుండా ఆధునికంగా కూడా ఉండాలని ‘శ్రీ’ కాస్తా సిరిగా మారింది. నిజంగా సిరి పుట్టాక సిరి కలిసొచ్చిందని వెంకట్రామయ్యకు అపారమైన నమ్మకం. పట్టిన వ్యాపారమల్లా బంగారమై కురిసింది. సిరి వెనక రెండేళ్లకు అబ్బాయి రమేష్‌ పుట్టాడు. ఆస్తికి వారసుడు పుట్టాడని వెంకట్రామయ్యకు సంబరం. సంఘంలో పేరు ప్రతిష్ఠలతో పాటు, సంపద పెరగడానికి కారణమైందని సిరి అంటే ప్రాణం. అందులోనూ చిన్నప్పట్నుంచీ సిరి తెలివితో పాటు పట్టుదల గలిగిన పిల్ల. చదువులో ఏ మాత్రం వెనుకబడటానికి ఇష్టపడేది కాదు. సిరి ఏదడిగినా కాదనకుండా తెచ్చిచ్చేవాళ్లు గారాబంతో. ఆడపిల్లని చదువు ఆపకుండా చదివించారు. బీటెక్‌ మంచి మార్కులతో పాసయి, క్యాంపస్‌ సెలక్షన్స్‌ లో మంచి ఉద్యోగం కూడా సాధించుకుంది. ఎంత చదివితేనేం, అంతకంటే ఎక్కువ చదివిన వాణ్ని తెచ్చే దమ్ముందని ధైర్యం వెంకట్రామయ్యకు.
సిరి పెళ్లి వెంకట్రామయ్యకు గొప్ప కల, ఇంకా చెప్పాలంటే ప్రతిష్ఠ. ఎంత డబ్బయినా సరే ఖర్చు పెట్టి గొప్ప సంబంధం తీసుకొచ్చి, అంగరంగ వైభవంగా పెళ్లి చేయాలి; ఆ పెళ్లి గురించి, వెంకట్రామయ్య గొప్పతనం గురించి జనాలు గొప్పగా చెప్పుకోవాలి. కానీ సిరి అతని అంచనాలను తారుమారు చేస్తూ, ఎవర్నో ప్రేమించానని, అతణ్నే పెళ్లి చేసుకుంటానని తెగేసి చెప్పింది. అతను కులంలోనూ, ఆర్థికంగానూ వెంకట్రామయ్య కుటుంబం కంటే చాలా కింది స్థాయిలో ఉన్నాడు. వెంకట్రామయ్య కాళ్ల కింద భూమి కంపించినట్లయింది. ‘నా బిడ్డ నా వంశ గౌరవాన్ని మరింత ఇనుమడింపజేస్తుందనుకుంటే, ఇంతపని చేస్తుందా? నా పరువేం కావాలి? సమాజంలో నాకున్న గౌరవ మర్యాదలేమై పోవాలి?’ గింజుకున్నాడు. 
చిన్నప్పట్నుంచీ ఏ రోజూ బిడ్డ మాట కాదనని మనిషి, కూతుర్ని అపురూపంగా పెంచుకున్న మనిషి, మొదటిసారి సిరి నిర్ణయాన్ని తప్పుపట్టాడు. తను చూసిన వాణ్ని చేసుకోవాల్సిందేనని హుకుం జారీ చేశాడు. కూతురికీ పట్టుదల తక్కువేం కాదుగా. తండ్రితో వాదించింది, ఘర్షణ పడింది. కానీ తండ్రి ప్రేమ చాటునున్న వంశ గౌరవం, ప్రతిష్ఠ ఓడిపోవడానికి ఇష్టపడలేదు. సుమతి హాల్లోకి ప్రవేశం నిషిద్ధమన్నట్లు, వంటింట్లో పొయ్యి మీద మగ్గుతున్న కూరను కలబెడుతోంది, ఆ కూర మగ్గిపోతోందో, మాడిపోతోందో ఎవరికీ తెలీదు.
బిడ్డ ప్రేమ ముందు వంశ గౌరవం, పెద్దరికం తలదించలేదు. ఈరోజు ఈపిల్ల మాటలకు తలొగ్గితే రేపు ఇంటి మానం-మర్యాదా అన్నీ మంటగలిసిపోతాయి. ఎట్లయినా సరే కూతురి మనసు మార్చాలనుకున్నాడు. మొదట మెల్లగా నచ్చజెప్పి ప్రయత్నించాడు. ఊహూ... సిరి మారలేదు. ఇక లాభం లేదని ఇంకో అస్త్రం వదిలాడు.
‘‘ఆస్తివ్వను’’
‘‘అక్కర్లేదు’’ షటిల్‌లాగా దూసుకొచ్చింది సమాధానం.
‘‘మాతో సంబంధాలుండవు’’
‘‘మీరు చూసే పెళ్లితో ఉంటాయని గ్యారంటీ ఉందా?’’ సమాధానం చెప్పలేని ప్రశ్న.
చివరికిక చస్తానని బెదిరించాడు. బెదిరించడం అంటే ఊరికే మాటతో కాదు. నాలుగు రోజులు అన్నమూ, నీళ్లూ మానేసి, మాట్లాడకుండా మొండికేసి, ఏమేం చేయగలడో అన్నీ చేశాడు. చివరికి ప్రేమ ఓడిపోయింది. కాదు, ఓడిపోయేలా చేశాడు.
విశాలమైన తటాకంలో ఉండాల్సిన చిరు చేపలు గాజు గోడల మధ్య అక్వేరియంలో ఆక్సిజన్‌ అందక గిలగిల లాడుతుంటే జాలిగా చూస్తూ ‘‘నీ ఇష్టం నాన్నా’’ అంది సిరి నిర్లిప్తంగా.
ఆ తర్వాత సిరి తండ్రితో మామూలుగా మాట్లాడాలని ప్రయత్నించినా, తనకే ఎందుకో మామూలుగా లేదేమోనని అనుమానం. ఆ... ఏదయితేనేం, తనకు తన పరువు ముఖ్యం. తర్వాత అన్నీ వాటంతటవే సర్దుకుంటాయి. ఎన్ని చూడలేదు. సమాధానం చెప్పుకుని, తనకు నచ్చిన తమ కులపు కుర్రాణ్ని, తమ కంటే గొప్ప ఆస్తిపరుణ్ణి వెతికి మరీ పెళ్లి నిశ్చయించాడు. అయినా ఎందుకో పెళ్లి దగ్గర పడేకొద్దీ ఏవో భయాలు. ‘ఈ పెళ్లి ప్రశాంతంగా జరిగిపోతుందా? బంధు మిత్రుల మధ్య తల దించుకునే పరిస్థితి రాదు కదా, కుటుంబం పరువు పోదు కదా’ ఇలాంటి ఆలోచనలతో నిద్రెప్పుడు పట్టిందో?
*****
తెల్లారింది.
‘‘సిరీ... సిరీ...’’ సుమతి కేకలు.
ఉలిక్కిపడి లేచాడు వెంకట్రామయ్య.
‘‘ఏమయింది?’’
‘‘సిరి కనిపించటం లేదండీ’’ సుమతి జీర గొంతులో ఏడుపు పలికింది.
‘‘ఎక్కడికెళ్లింది? సరిగ్గా చూడండి’’
‘‘స్నానం చేస్తోందేమో?’’
‘‘ఎన్ని గంటలు చేస్తుంది?’’
‘‘పెరట్లో ఉందేమో?’’
‘‘ఇప్పటికి పదిసార్లు తిరిగొచ్చారు’’
తన భయాలు నిజమయ్యేట్టున్నాయని వెంకట్రామయ్య మనసు పొరల్లో కంగారు. స్నేహితులకు ఫోన్‌ చేద్దామని సెల్ఫోన్‌ తీసుకున్నాడు. అందులో వాట్సప్‌ సందేశం.
‘‘నా జీవితానికి నేనే బాధ్యత వహించాలనుకుంటున్నాను. దయచేసి మీ బరువుగా నన్ను భావించడం మానేయండి. ్థ సిరి’’
అనుకున్నంతా అయింది. వెంకట్రామయ్య నిలబడిన నేల పాతాళంలోకి జారిపోయింది.
‘‘వెంకట్రామయ్య కూతురు ఎవరితోనో లేచిపోయిందంట’’
‘‘పోయే కాలాలు. అందుకే ఆడపిల్లకు చదువూ గిదువూ లేకుండా పిల్లప్పుడే పెళ్లి జేయాలనేది’’
‘‘అయినా ఆ పిల్ల ఎంతంటే అంత, మితిమీరిన గారాబం చేశార్లే. అదుపులో పెట్టుకోకపోతే ఇంతే అయ్యేది’’
‘‘ఏనాడన్నా ఆ పిల్లను హద్దుల్లో పెట్టినారా? ఆడపిల్లలకు సెల్లు సగం చేటు. ఎవరితో మాట్లాడతాందో, ఏం చేస్తాందో చూసుకోవద్దా?’’
ఇలాంటి మాటలన్నీ వినాలి కాబోలు. ప్రాణంగా పెంచుకున్న బిడ్డతో పాటు, ప్రాణసమానంగా చూసుకున్న పరువూ పోయె. ఇంక బతికేం చేయాలి. మౌనంగా గదిలోకి నడిచి, తలుపేసుకున్నాడు. పరువూ, ప్రతిష్ఠా, వంశమూ, గౌరవమూ, మన్నూ మశానమూ ఉరితాడై గొంతును బిగించాయి. ఊపిరి ఆడటం లేదు, ప్రాణం ఒరుసుకుపోతోంది.
*****
రెండు చేతులతో మెడ పట్టుకొని విదిలించాడు. చీకటికి తోడు బయట కీచురాళ్ల శబ్దాలు. ‘మళ్లీ ఇంకో కలా...?’ మరో సారి మెడ విదిలించాడు. టైం ఒకటిన్నర. ఎంత అస్థిమితం? చీకట్లోనే తడిమి, నీళ్ల సీసా తీసుకొని కాసిని నీళ్లు గొంతులో పోసుకున్నాడు.
ఎందుకీ అస్థిమితం? తన కూతురి బాగు కోసమే కదా ఇదంతా చేస్తున్నది. తనకంటే ఎక్కువ ప్రేమను ఎవరు పంచుతారు? ఇరవై మూడేళ్లు ముద్దుగా పెంచుకున్న బిడ్డ సుఖంగా ఉండాలనే కదా తాపత్రయం. తన గారాల బిడ్డ తనను మోసం చేసి వెళ్లిపోతుందా? లేదు, సిరి మాట ఇచ్చిందంటే తప్పదు. నాన్నంటే దానికి ప్రాణం. బలవంతంగా నిద్ర తెచ్చుకోవాలని కళ్లలోకి చీకట్లు మోసుకొచ్చుకున్నాడు.
*****
నల్లగా చీకటి. ఇంట్లో కాంతిగా వెలగాల్సిన విద్యుల్లత భయంకరంగా షాకిచ్చింది.
‘‘ఎన్నాళ్లిలా చీకట్లో ఉంటావు?’’ స్విచ్‌ వేస్తూ సుమతి.
కళ్లు చికిలించాడు వెంకట్రామయ్య. ‘‘ముందా లైట్‌ తీసెయ్‌’’ ఆజ్ఞాపించాడు.
సుమతి వినిపించుకోలేదు.
‘‘ఎన్నాళ్లిలా చీకట్లో ఉంటావని అడుగుతున్నాను?’’
‘‘బతికినన్నాళ్లు...! చాలా? నీ కూతురు చేసిన ఘనకార్యానికి బలయిపోయింది నా కొడుకు. ఇంక వెలుతురెక్కడ మిగిలింది?’’
‘‘ఎన్ని సార్లు ఈ మాటలంటావు? గొప్పగా మార్కులు తెచ్చుకుంటే, మంచి పేరు తెచ్చి పెడితే, నీ కూతురని గర్వపడితివి. నీ ఇంటి పరువు తీసిందనుకున్ననాడు నా కూతురని దెప్పిపొడుస్తున్నావు. అసలు మా పనంతా మీ గొప్పను నిలబెట్టడమేనా?’’
‘‘ఇదిగో ఇట్ల తలతిక్క ప్రశ్నలడిగే అది కొంపలో నుంచి పోయి, సంతకాల పెండ్లి చేసుకుని, మర్యాద తీసింది. పోయింది అట్లా దూరంగానన్నా పోయిందా? ఊళ్లోనే కాపరం పెట్టి, ఎక్కడా తిరగకుండా, తలెత్తుకోకుండా చేసింది. అదింత కడుపేసుకొని తిరుగుతుంటే, ఆ సంకర సంతానాన్ని చూడలేకగదూ, నా కొడుకు నరికి పారేసింది. అది పాపమై వాడు జైల్లో మగ్గుతున్నాడు. దానికేం సుఖంగా చచ్చింది’’
‘‘అవును పాపం కాదు, నెలలు నిండిన బిడ్డను కనీసం కనికరం చూపించకుండా చంపడం పాపం కాదు. పందులూ, కుక్కలూ కూడా తమ పిల్లల్ని ముట్టుకుంటే మీదికొస్తాయే, అంత ఘోరంగా నిండు చూలాలిని పొట్టన బెట్టుకున్న నీది పాపం కాదు! నీ మాట కాదనిందని నీ బిడ్డను చంపుకున్నావు, సరే, ఇంకెవరి బిడ్డనో చంపేకి ఏం హక్కుందని? ఆ తల్లిదండ్రుల కెంత గుండె కోతనో ఎన్నడన్న ఆలోచిస్తివా?’’
‘‘ఏంది ఆలోచించేది? పైసాకు తరుంగాని ప్రతోడూ డబ్బున్న పిల్లను చూసి లవ్వాడానని బుట్టలో ఏసుకొనేటోడే. వాడెంత, వాని తాహతెంత? మన పిల్లనే చేసుకొనేటోడా. ప్రతి ఎదవ నా కొడుకొచ్చి నా ముందు కాలరెగరేసి, నీతులు చెప్పేవాడే ఆడపిల్ల నెట్ట పెంచల్లా అని’’
‘‘అవును, ఆడపిల్లనెట్ట పెంచల్లా అని మగ నా కొడుకులే చెప్పేది. అసలు మేం మనుషులమైతే కదా, ఏది మంచో ఏది చెడుపో మాకు తెలిసేది. మీ ఇంటి పరువును కాపాడల్ల, మీ మర్యాదను నిలబెట్టల్ల. మీరు మటుకు మొగుళ్లై, తండ్రులై, అన్నదమ్ములై, కొడుకులై మా మీద బడి తిని, మేమేం జెయ్యాలో, ఎట్టుండాలో తీరుమానం జేస్తారు. కాదూ కూడదంటే చంపి పాతరేస్తారు’’
‘‘ఏందే గొంతు లేస్తాంది, వీడు సగం చచ్చిన పామనుకుంటాండావా? ఇష్టానుసారం మాట్లాడతాండావు?’’ చింత జచ్చినా పులుపు చావలేదు, పాత సామెతే కానీ, ఎప్పటికీ పాతబడదు.
‘‘అది కాదయ్యా, ఏం చేసింది నా బిడ్డ? మనసుకు నచ్చినోణ్ని పెండ్లి చేసుకునింది, అదీ తప్పేనా? నా బిడ్డ అంత తెలివైందని మురిసిపోతాంటివే, ఇరవై మూడేండ్లు ముద్దుగా పెంచుకున్న బిడ్డ తెలివి లేని నిర్ణయం తీసుకుంటాదని ఎట్లనుకొంటివి? అట్లా బిడ్డ పాయె, ఇట్ల కొడుకూ జైలు పాలాయె. ఏం సాధిస్తివి? పరువేమన్నా తిరిగొచ్చెనా? ఈ సంది ఇంగా జనాలకు తెలిసి, బిడ్డను చంపుకుంటిమని, ఉన్ని మర్యాద పాయె. అయినా బిడ్డలే పోయినంక ఇంకా పరువు మిగిలిందా?’’ వెంకట్రామయ్య భుజం మీద చేయేసింది సుమతి.
దాదాపు రెండు నెలË్లయింది సుమతి తనతో ప్రేమగా మాట్లాడి. ఆమె చేతి స్పర్శతో శరీరంలో ఏదో చిన్న కదలిక.
‘‘అవును ఏం సాధించాను? ప్రేమ ఇంత హింసాత్మకంగా ఉంటుందా? ప్రణయం ప్రాణాలు బలిగోరుతుందా? ప్రాణాలు తీసే ఈ ప్రేమను ఎందుక్కావాలనుకుంటారీ పిల్లలు? వాళ్లేం సాధించారు, నేనేం సాధించాను? ప్రేమా... పరువా...? ప్రాణమా...? చివరికి ఏం మిగిలింది? నా పరువూ మిగల్లేదు, నా బిడ్డ ప్రేమా మిగల్లేదు. ఏం సాధించినట్లు?’’
*****
‘‘ఏందయ్యో...? ఏందీ కలవరింతలు...? ఇంకా చిమ్మ చీకట్లు. నిద్రబో నిమ్మళంగా’’ సుమతి చిరాకుతో కళ్లు తెరిచాడు వెంకట్రామయ్య.
అవును ఇంకా చిమ్మ చీకటి. చీకటెందుకింత బీభత్సంగా ఉంది? ఇంత భయంకరమైన దృశ్యాలతో, చావు మేళాలతో నిద్రెట్లా పడుతుంది? ఈ చీకట్లెప్పుడు వెలుతుర్లో కలుస్తాయి? వెంకట్రామయ్య విసుగ్గా మరోసారి టైం చూశాడు. అయిదు నిమిషాలు తక్కువ నాలుగు. ఇప్పుడిక కళ్లు మూసుకోవాలంటే భయమేస్తోంది. నిద్రపోయినా ఇంకే భయంకరమైన కలలొచ్చి కల్లోలం లేపుతాయో. చీకట్లో కళ్లు మూసుకుపోతాయేమోనని బలవంతంగా కళ్లు పెద్దవిగా తెరచి, పెట్టుకున్నాడు.
*****
మంద్ర స్వరంలో బిస్మిల్లా ఖాన్‌ షహనాయ్‌ సంగీతం హాయిగొలుపుతూ వినిపిస్తోంది. కళ్లకు మిరుమిట్ల ప్రయాస లేకుండా ఆహ్లాదకరమైన పూల అలంకరణ. అక్కడక్కడా ఆహూతులను అందంగా ఆహ్వానిస్తూ ముచ్చటైన పూల కుండీలు.
‘‘మంచిపని చేశారు వెంకట్రామయ్య గారూ, ఆర్కెస్ట్రా పేరుతో చెవులు దద్దరిల్లేలా సినిమా పాటలతో చావగొడుతున్నారీమధ్య. ఇన్‌స్ట్రుమెంటల్‌ మ్యూజిక్‌ చెవులతో పాటు, మనసుకు కూడా హాయిగా ఉంది’’ అతిథులు అభిరుచిని మెచ్చుకుంటున్నారు.
వేదిక పైన సిరి తన జీవిత భాగస్వామితో కబుర్లు చెబుతూ, స్నేహితులకు పరిచయం చేస్తూ... ఆనందంగా! అవును, అతను సిరి మనసిచ్చిన, మనసారా కోరుకున్న జీవిత భాగస్వామి, తను కావాలనుకున్న గొప్ప పెళ్లి కొడుక్కాదు.
‘‘గ్రేట్‌ వీఆర్‌. అమ్మాయి మనసు తెలుసుకొని తనకు నచ్చిన వాడితో పెళ్లి జరిపిస్తున్నావు చూడూ. నువ్వు నిజంగా గ్రేట్‌’’
‘‘అవును, ప్రేమగా పెంచుకున్న పిల్లలను అందునా ఆడపిల్లను చదువు, కెరియర్‌, భాగస్వామి అన్ని విషయాల్లో సరైన నిర్ణయం తీసుకునేలా తీర్చిదిద్దామంటే తల్లిదండ్రులుగా మనం సక్సెస్‌ అయినట్లే’’
‘‘వాళ్లు మన పెద్దరికానికి విలువనిచ్చినపుడు ఆ గౌరవం నిలుపుకోవాల్సిన బాధ్యత మనదే. ఘర్షణపడితే ఎవరికీ మనశ్శాంతి లేకపోవడమే తప్ప ఏ ప్రయోజనమూ ఉండదు’’
‘‘వెంకట్రామయ్యా, నీమీద నాకింకా గౌరవం పెరిగిందయ్యా. చాలా మంది తల్లిదండ్రులకు నిన్ను ఆదర్శంగా చూపించొచ్చు’’
మిత్రుల మాటల్లో తనపై ఎనలేని గౌరవం, ప్రేమ. ఆ మాటలు నోట్లోంచి వచ్చినవి కావు. గుండె లోతుల్లోంచే వస్తున్నాయని తెలుస్తోంది. ఇంతకంటే ఎక్కువ ప్రేమ కూతురి కళ్లల్లో... ప్రేమ మాత్రమే కాదు, అంతకంటే ఎక్కువగా ఇంకా ఏదో...
*****
‘‘ఏందయ్యో ముసిముసి నవ్వులు నవ్వుతున్నావు? ఇంగా నీ కలవరింతలు అయిపోలేదా? తెల్లారింది లే’’ కిటికీ కర్టెన్‌ పక్కకు జరుపుతూ సుమతి అరుస్తుంటే బద్ధకంగా లేచాడు.
కళ్లు తెరవాలనిపించలేదు. కలలోంచి బయటికి రావాలనిపించలేదు. అయినా లేచాడు... హుషారుగా! తెల్లారింది కదా. అవును తెల్లారిపోయింది. ఇక వెలుగు దారాలందుకొని ముందుకు నడవాలి. కిటికీలోంచి బయటికి చూస్తే, సిరి మొక్కలకు నీళ్లు పెడుతూ, గులాబీ మొగ్గను ప్రేమగా తడుముతోంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని