నలుపంటే మాకిష్టం...!

హాయ్‌ ఫ్రెండ్స్‌... ‘మీకు నల్లకోడి గురించి తెలుసా!’ అని మిమ్మల్ని ఎవరైనా అడిగితే... ‘ఓ... తెలుసు. కడక్‌నాథ్‌ కోళ్లేగా. వాటి మాంసం కూడా నల్లగానే ఉంటుంది కదా!’ అంటారు కదూ! కానీ మీకో విషయం తెలుసా.. మరో నాలుగు జాతుల కోడిమాంసం కూడా నల్లగానే ఉంటుంది.

Published : 30 Jan 2023 00:19 IST

క్కొ..క్కొ..క్కొ...

హాయ్‌ ఫ్రెండ్స్‌... ‘మీకు నల్లకోడి గురించి తెలుసా!’ అని మిమ్మల్ని ఎవరైనా అడిగితే... ‘ఓ... తెలుసు. కడక్‌నాథ్‌ కోళ్లేగా. వాటి మాంసం కూడా నల్లగానే ఉంటుంది కదా!’ అంటారు కదూ! కానీ మీకో విషయం తెలుసా.. మరో నాలుగు జాతుల కోడిమాంసం కూడా నల్లగానే ఉంటుంది. ఈ రోజు మనం వాటి గురించి తెలుకుందాం సరేనా.

నేస్తాలూ.. మీకు ఎలాగూ కడక్‌నాథ్‌ కోళ్ల గురించి కాస్తో కూస్తో తెలిసే ఉంటుంది కదా. వాటిలో ప్రొటీన్‌ ఎక్కువగా ఉంటుందని, కొవ్వు తక్కువగా ఉంటుందని, వీటి మాంసం తింటే ఆరోగ్యానికి ఎంతో మంచిదని, అందుకే మనం మిగతా మూడు రకాల కోళ్ల గురించి తెలుసుకుందాం సరేనా.


1. బాహుబలి.. ‘అయామ్‌ సెమానీ!’

ఇది ఇండోనేషియాకు చెందిన కోడి జాతి. హైపర్‌ పిగ్మెంటేషన్‌ వల్ల అయామ్‌ సెమానీ కోళ్లలో ఈకలు, రెక్కలు, తురాయి, ముక్కు నల్లగా ఉంటుంది. మాంసం, ఎముకలు కూడా నల్లగానే ఉంటాయి. మిగతా కోళ్లతో పోల్చుకుంటే వీటి కండరాల్లో శక్తి ఎక్కువగా ఉంటుంది. పుంజు బరువు 2 నుంచి 2.5 కిలోల వరకు ఉంటుంది. కోడిపెట్టల బరువు 1.5 నుంచి 2కిలోల వరకు ఉంటుంది. అందరూ ఈ జాతికోళ్లు నలుపు రంగు గుడ్లు పెడతాయి అని భ్రమపడతారు. కానీ మనదగ్గరి నాటుకోళ్లు పెట్టే గుడ్ల రంగే ఇవి పెట్టే గుడ్లకూ ఉంటుంది. అంతెందుకు మన దగ్గరి కడక్‌నాథ్‌ కోళ్లు కూడా నలుపు రంగు గుడ్లు పెట్టవు. ఈ అయామ్‌ సెమానీ కోడిపెట్ట పెట్టే గుడ్డు బరువు 45 గ్రాముల వరకు ఉంటుంది.


2. పొడవైన తోకతో ‘సుమత్రా’..

ఇది కూడా ఇండోనేషియాకు చెందిన కోడి జాతే. సుమత్రా ద్వీపంలో ఎక్కువగా కనిపిస్తుంది. నల్లని ఈకలు, రెక్కలు, ముక్కు ఉంటుంది తురాయి మాత్రం ఎరుపు రంగులోనే ఉంటుంది. సుమత్రా పుంజులు 2.25 నుంచి 2.70 కిలోల వరకు పెరుగుతాయి. కోడిపెట్టలేమో 1.8 కేజీల వరకు బరువు తూగుతాయి. పుంజులకు పొడవైన తోక ఉండి అందంగా కనిపిస్తాయి.


3. చిన్న గుడ్లు పెట్టే ‘స్వార్ట్‌హోనా’...

ఇది స్వీడన్‌ దేశానికి చెందిన రకం. అయామ్‌ సెమానీ లక్షణాలు ఈ స్వార్ట్‌హోనాలో ఎక్కువగా కనిపిస్తాయి. దాని నుంచే ఈ జాతి ఉద్భవించిందని చెబుతుంటారు. దీని మాంసం, చర్మం కూడా నలుపు రంగులోనే ఉంటుంది. స్వార్ట్‌హోనా పుంజు బరువు 2 కిలోల వరకు ఉంటుంది. కోడిపెట్టలేమో 1.5 కిలోల వరకు పెరుగుతాయి. ఇవి పెట్టే గుడ్లు కాస్త చిన్నగా ఉన్నాయి. 38 నుంచి 48 గ్రాముల బరువు తూగుతాయి. కానీ వీటిలో పచ్చసొన మాత్రం పెద్దగా ఉంటుంది. మిగతా కోళ్లతో పోల్చుకుంటే ఇవి కాస్త చక్కగా ఎగరగలవు!


4. తెగ ముద్దొచ్చే ‘సిల్కీ’..

సిల్కీ చైనాకు చెందిన కోడి జాతి. ఈ కోళ్ల మాంసం నలుపు రంగులో ఉంటుంది. కానీ కోళ్లు మాత్రం చాలా రంగుల్లో ఉంటాయి. వీటి ఈకలు మిగతా కోళ్లతో పోల్చుకుంటే భిన్నంగా, మెత్తగా ఉంటాయి. అందుకే దీనికి సిల్కీ అనే పేరు వచ్చింది. బుజ్జి కుక్కపిల్లల్లా ఇవి కూడా తెగ ముద్దొస్తాయి. నేస్తాలూ.. మొత్తానికి ఇవీ వింత కోళ్ల విశేషాలు.   భలే ఉన్నాయి కదూ!


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని