Published : 13/01/2022 01:07 IST

మూడు కుండలు!

శ్రీపతిపురంలో నిరంజనుడు ఉండేవాడు. అతడు తయారు చేసే మట్టిపాత్రలకు ఎంతో గిరాకీ ఉండేది. ఒకరోజు నిరంజనుడు బరువైన కుండ ఒకటి తయారు చేశాడు. దాన్ని రెండు చేతుల్లో పట్టుకుని ‘ఇది చాలా కాలం మన్నుతుంది’ అనుకున్నాడు. మరుసటి రోజు.. మెరుస్తూ, పట్టుకుంటే చాలు జారిపోయేలా ఉన్న కుండను చేశాడు. దాన్ని ఎంతో జాగ్రత్తగా పట్టుకుని ‘ఇంతటి నున్నటి కుండను నేను ఇంతకు ముందెప్పుడూ తయారు చేయలేదు’ అనుకున్నాడు.

ఆ తర్వాత రోజు.. పూలు, లతల ఆకృతులతో ఉన్న అందమైన కుండను చేశాడు. దాన్ని దూరం నుంచే చూస్తూ.. ‘ఆహా.. ఈ కుండలోని నీళ్లను తాగాలని అందరూ ఆశ పడతారు’ అని ఊహించుకున్నాడు. ఆ మూడు కుండలను అన్నింటికంటే ముందు వరుసలో ఉంచాడు.
ఒకరోజు ఓ రైతు నిరంజనుడి దగ్గరకు కుండను కొనేందుకు వచ్చాడు. అతను బరువైన కుండను చూసి ముచ్చటపడి, ‘ఈ కుండను నాకు అమ్ముతావా?’ అని అడిగాడు. అయితే ఆ కుండకు రైతు వెంట వెళ్లడం ఇష్టం లేదు. దాంతో అది.. ‘నన్ను అతనికి అమ్మవద్దు. నాకు అతను నచ్చలేదు. జాగ్రత్తగా చూసుకుంటాడన్న నమ్మకం లేదు’ అని నిరంజనుడితో గుసగుసగా చెప్పింది. దానికి నిరంజనుడు ‘సరేలే.. అమ్మను’ అన్నాడు. ఆ కుండను అమ్మకపోవడంతో రైతు మరో కుండను కొనుక్కుని వెళ్లాడు.

ఇంకోరోజు ఒక పల్లెటూరి మహిళ కుండను కొనేందుకు వచ్చింది. ఆమెకు నున్నగా మెరిసిపోయే కుండ నచ్చింది. ‘అన్నా.. ఈ కుండను నాకు అమ్ముతావా?’ అని అడిగింది. అయితే నున్నటికుండకు ఆ మహిళ వెంట వెళ్లడం ఇష్టం లేదు. దాంతో అది ‘నన్ను ఆమెకు అమ్మవద్దు. ఆమె పుల్లల్లాంటి చేతులు నన్ను సరిగా పట్టుకోలేవు’ అని నిరంజనుడితో గుసగుసలాడింది. దానికి నిరంజనుడు ‘సరేలే’ అన్నాడు. నున్నటి కుండను అమ్మకపోవడంతో, ఆమె మరోదాన్ని కొనుక్కుని వెళ్లింది.

మరోరోజు.. ఒక గాజుల వ్యాపారి నిరంజనుడి దగ్గర కుండను కొనేందుకు వచ్చాడు. అతనికి పూల ఆకృతులు ఉన్న కుండ నచ్చింది. ‘ఎంతో అందంగా ఉంది. దీన్ని నేను కొంటాను’ అన్నాడు. అయితే ఆ కుండకు కూడా ఆ వ్యాపారి వెంట వెళ్లడం ఇష్టం లేదు. దాంతో అది ‘ఊరూరా తిరిగి గాజులు అమ్ముకునే వ్యక్తికి నన్ను అమ్మకు. ఆయనకు నా బాగోగులు పట్టించుకునేంత సమయం ఉండదు’ అని కన్నీరు కార్చింది. నిరంజనుడు కూడా బాధపడి ‘అమ్మనులే.. నువ్వు దిగులు పడకు’ అన్నాడు. ఆ కుండను అమ్మకపోవడంతో, గాజుల వ్యాపారి ఇంకో కుండను కొనుక్కుని వెళ్లాడు. అలా కొద్ది రోజులు గడిచిపోయాయి.

ఒకపూట లక్ష్మయ్య అనే ధనవంతుడు గుర్రపు బండిలో నిరంజనుడి దగ్గరకు వచ్చాడు. అతడు తెలిసిన మనిషే. నిరంజనుడు అతణ్ని సాదరంగా ఆహ్వానించాడు. ‘ఒక కుండ కొనేందుకు వచ్చానోయ్‌. నీ దగ్గర ఉన్నవాటిలో నాణ్యమైనవి చూపించు’ అన్నాడు లక్ష్మయ్య. సంభాషణ విన్న మూడుకుండలు.. తమను కొనుగోలు చేసేందుకు సరైన వ్యక్తి వచ్చాడని సంబరపడ్డాయి.

‘మా ముగ్గురిని ఆ ధనవంతుడికి చూపించు. అతని ఇంటికి ఎప్పుడెప్పుడు వెళదామా? అని ఆత్రుతగా ఉంది’ అని మూడూ ఒకేసారి నిరంజనుడిని అడిగాయి. ఆ మూడు కుండలు కోరినట్లుగానే నిరంజనుడు వాటిని తెచ్చి, లక్ష్మయ్య ముందు పెట్టి.. వాటి గొప్పతనాన్ని వివరించాడు.

లక్ష్మయ్య బరువైన కుండను చేతిలోకి తీసుకుని.. ‘ఇంత బరువైన కుండను ఒక చోట నుంచి మరో చోటుకు మార్చడం ఎంతో కష్టం. ఇది నాకు అనవసరం’ అన్నాడు. ఆ తర్వాత నున్నటి కుండను చేతుల్లోకి తీసుకుని.. ‘ఇంత నున్నగా ఉంటే ఎప్పుడు చేతుల్లోంచి జారుతుందో తెలియదు. ఇలాంటిది నాకెందుకు?’ అని పక్కనపెట్టాడు. చివరగా పూల ఆకృతులు ఉన్న కుండను పట్టుకుని..‘ఇంతకంటే అందమైనవి, పైగా పింగాణివి మా ఇంట్లో బోలెడు ఉన్నాయి. వాటి ముందు ఇదెంత?’ అని దాన్నీ పక్కన పెట్టేశాడు.

‘నిరంజనా.. ఇవేమీ వద్దు. నాకు కావాల్సింది ఈ వేసవిలో చల్లగా నీటిని అందించేది’ అంటూ సన్నటి రంధ్రాలు ఉన్న ఒక కుండను తన వెంట తీసుకెళ్లాడు. దీంతో మూడు కుండలకూ ఆశాభంగమైంది. ‘మనల్ని కోరి కొనుక్కునే వారు కచ్చితంగా వస్తారు. అప్పటిదాకా మనకు ఎదురుచూపులు తప్పవు’ అని మూడూ ఒకేసారి అనుకున్నాయి. కానీ తర్వాత వాటిని ఎవరూ కొనుక్కోలేదు. నిరంజనుడు కూడా మళ్లీ అలాంటి కుండలను అసలు తయారు చేయనేలేదు.

- హర్షిత


Advertisement


మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని