Published : 04 Oct 2022 00:44 IST

వెన్నెల నిజాయతీ!

మ్మా నాన్న పక్క ఊరిలో బంధువుల పెళ్లికి వెళ్లారు. ఇంట్లో అమ్మమ్మతో పాటు ఉండిపోయిన ఆరేళ్ల వెన్నెల.. అప్పుడే బడి నుంచి వచ్చింది. అన్నం తిన్నాక హోం వర్క్‌ పూర్తి చేసింది. చివరిగా కలరింగ్‌ పుస్తకంలోని బొమ్మకి రంగులేయడం మొదలెట్టింది. ఎంత జాగ్రత్తగా వేసినా.. రంగులు బొమ్మ అవుట్‌ లైన్‌ను దాటేస్తున్నాయి. ఎరేజర్‌తో చెరిపితే సరిగా పోవడం లేదు. పైగా బొమ్మ నల్లగా తయారైంది. అమ్మ ఉంటే సాయం అడుగుదామనుకుంది. కానీ, వాళ్లు రావడానికి ఏ అర్ధరాత్రో అవుతుంది. బొమ్మని రేపే బడిలో చూపించాలి. అమ్మమ్మకి అవేమీ తెలీదు. ఇంకేం చెయ్యాలో పాలుపోక, ఆ బొమ్మను చూస్తూ నిద్రపోయింది వెన్నెల.

తమ వల్ల బొమ్మ పాడవటం, దానికి పాప దిగులుపడటాన్ని పెన్సిళ్లు గమనించాయి. బాగా పొద్దుపోయాక అవన్నీ కలిసి మాట్లాడుకున్నాయి. పాపకి సాయం చేయాలని అనుకున్నాయి. వాటికి ఎరేజర్‌ కూడా తోడైంది. ముందుగా పాప వేసిన రంగుల్ని చక్కగా తుడిచేసింది ఎరేజర్‌. ఆ తర్వాత, పెన్సిళ్లు ఒకదాని తర్వాత ఒకటి చక్కగా రంగులద్దాయి. ఇప్పుడు బొమ్మ అద్భుతంగా ఉంది. తాము చేసిన పనికి పెన్సిళ్లు, ఎరేజరూ పరస్పరం అభినందించుకున్నాయి.  

అర్ధరాత్రే వచ్చేసిన అమ్మానాన్న తెల్లవారగానే వెన్నెలని నిద్రలేపారు. దిగులుతోనే లేచిన పాప.. గబగబా తయారై కలరింగ్‌ పుస్తకాన్ని బ్యాగులో పెట్టుకుని బడికి వెళ్లింది. క్లాసుకి టీచర్‌ రాగానే పిల్లల హోంవర్క్‌ చూశారు. తర్వాత కలరింగ్‌ పుస్తకాల్ని తనటేబుల్‌ మీద పెట్టమన్నారు. వెన్నెల భయంభయంగానే తన పుస్తకాన్ని అక్కడ ఉంచింది. ఒక్కోటి చూస్తూ, వెన్నెల పుస్తకాన్ని చేతుల్లోకి తీసుకున్నారు టీచర్‌. బిక్క మొహం వేసుకుని టీచర్‌నే చూడసాగింది వెన్నెల. వెన్నెలని దగ్గరకి రమ్మని పిలిచారు టీచర్‌. చేతులు కట్టుకుని భయంభయంగా వెళ్లింది. తిడతారని వణకసాగింది. కానీ, టీచర్‌ మెరుస్తోన్న కళ్లతో ‘వెరీగుడ్‌’ అంటూ వెన్నెలని మెచ్చుకున్నారు. తనని ఆట పట్టిస్తున్నారని అనుకుంది. వెన్నెల పుస్తకాన్ని తెరిచి పిల్లలందరికీ చూపుతూ ‘చూశారా.. వెన్నెల ఎంత బాగా వేసిందో!’ అన్నారు ప్రశంసగా. వెన్నెల భయంగానే బొమ్మని చూసింది. పక్క పేజీలో ఉన్న ప్రింట్‌ బొమ్మ అంత అందంగా ఉందది. తన కళ్లని తానే నమ్మలేకపోయింది.

‘ఈరోజు మనం ఇంత అందంగా బొమ్మకు రంగులేసిన వెన్నెలకి స్టార్‌ బ్యాడ్జ్‌ పెడదాం’ అన్నారు టీచర్‌ నవ్వుతూ. ఆ మాటకి వెన్నెలకి ఒక్కసారిగా ఏడుపొచ్చింది. బోరున ఏడుస్తూ ‘ప్రామిస్‌ టీచర్‌.. ఆ రంగులు నేను వెయ్యలేదు. అవి ఎలా వచ్చాయో కూడా తెలీదు. ఆ బ్యాడ్జ్‌ నాకు పెట్టవద్దు’ అంది.

ఆ మాటకు టీచర్‌ ఆశ్చర్యపోయింది. ‘సరే సరే.. బ్యాడ్జ్‌ పెడతానని చెప్పినా, ఆ రంగులు తాను వెయ్యలేదన్న సంగతి చెప్పింది వెన్నెల. తను చెప్పకపోతే మనకి తెలిసే అవకాశం లేదు. అయినా.. నిజాయతీగా తను రంగులు వెయ్యలేదని చెప్పింది. అదీ గొప్ప విషయమే. ఆమె నిజాయతీని మనమంతా అభినందిద్దాం’ అంటూ పిల్లలందరితో చప్పట్లు కొట్టించారు టీచర్‌.

సరిగ్గా అదే సమయంలో కారిడార్‌లో నడిచి వెళుతున్న ప్రిన్సిపల్‌ మేడంకి ఆ చప్పట్లు వినిపించి, క్లాసులోకి వచ్చారు. ప్రిన్సిపల్‌కి జరిగిన విషయాన్ని వివరంగా చెప్పింది టీచర్‌. టీచర్‌ దగ్గర్నుంచి ప్రిన్సిపల్‌ మేడమే బ్యాడ్జ్‌ తీసుకుని వెన్నెల యూనిఫాంకి స్వయంగా పెట్టారు. ఎప్పుడూ కోపంగా ఉండే ప్రిన్సిపల్‌ మేడం తనని మెచ్చుకోవడం వెన్నెలకి చాలా సంతోషం కలిగించింది. అమ్నానాన్నలకి బ్యాడ్జ్‌ని చూపించి, జరిగినదంతా చెప్పాలని ఆమె మనసు ఉబలాటపడింది. బడి వదిలే సమయానికి ఎప్పటిలాగానే వెన్నెలని ఇంటికి తీసుకెళ్లడానికి తల్లిదండ్రులు వచ్చారు బండి మీద. వారిని చూడగానే టీచర్‌ పలకరించి, విషయం చెప్పి ప్రిన్సిపల్‌ రూంకి తీసుకెళ్లారు. వెన్నెల కూడా వాళ్లవెంటే వెళ్లింది. ‘గెలుపోటములు కాదు.. ఏ విషయంలోనైనా సత్యానికి కట్టుబడి ఉండటం ప్రధానం. అదే ఉత్తమ లక్షణం. ఈరోజు క్లాసులో జరిగిన సంఘటన.. పాఠాన్ని మించి ఇతర పిల్లలకి ప్రేరణగా నిలుస్తుంది’ అన్నారు ప్రిన్సిపల్‌.

గది బయటికి రాగానే వెన్నెలని అమ్మానాన్న ముద్దులతో ముంచేశారు. అంతా తనని మెచ్చుకోవడానికి కారణం.. తన నిజాయతీ అని వెన్నెలకి అర్థమైంది. ఎప్పుడూ అలాగే ఉండాలని అనుకుంది. దారిలో పాపకి ఇష్టమైన మిఠాయిలు, చాక్లెట్లు కొనిచ్చారు అమ్మానాన్న. ఇంటికి రాగానే చేతులు కడుక్కొని మిఠాయిల పనిపట్టింది వెన్నెల. తర్వాత సంచిలోని పుస్తకాల్ని బయటికి తీసింది. పుస్తకాలతోపాటు రంగు పెన్సిళ్లు, ఎరేజర్‌ కూడా బయట పడ్డాయి. అవి సంచి లోపలే ఉన్నా.. మొదటి నుంచి అన్ని మాటలూ విన్నాయి. తాము చేసిన సాయం వల్లే వెన్నెలకి ఇంత గుర్తింపు లభించిందని తెగ సంతోషపడ్డాయి. వాటి సాయం తెలియకపోయినా, తనకి ఇన్ని ప్రశంసలు లభించడానికి కారణమైన ఆ రంగు పెన్సిళ్లని, ఎరేజర్‌ని ఆప్యాయంగా వేళ్లతో నిమిరింది వెన్నెల.  

- ఎస్‌.హనుమంతరావు


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts