పిల్లల పెంపకం

విశాలపుర రాజ్యంలోని అడవుల్లో ఒక ముని తపస్సు చేసుకునేవాడు. ఆ కుటీరానికి దగ్గర్లో జంతువులు, పక్షులు ఉండేవి. వాటితో మచ్చిక ఏర్పడింది మునికి. ఒకరోజు కాలకృత్యాలు తీర్చుకోవడానికి ముని వెళుతుంటే ఎలుగుబంటి పిల్లల ఏడుపు వినబడింది.

Published : 27 Oct 2022 00:09 IST

విశాలపుర రాజ్యంలోని అడవుల్లో ఒక ముని తపస్సు చేసుకునేవాడు. ఆ కుటీరానికి దగ్గర్లో జంతువులు, పక్షులు ఉండేవి. వాటితో మచ్చిక ఏర్పడింది మునికి. ఒకరోజు కాలకృత్యాలు తీర్చుకోవడానికి ముని వెళుతుంటే ఎలుగుబంటి పిల్లల ఏడుపు వినబడింది. వాటికేమైందోనని అటు చూశాడాయన. పెద్ద గంగాళం తిరగబడి ఉంది. అందులోని నీరు బయటకు పారుతోంది. అక్కడకి వచ్చిన ఎలుగుబంటి దాని పిల్లల్ని కర్రతో కొడుతోంది.

‘స్నానం చెయ్యడానికి నీళ్లు పెడితే, అటువెళ్లి వచ్చేసరికి ఆటలాడుకుని నీళ్లు ఒంపేస్తారా? ఇప్పుడు వాగుకు వెళ్లి నీళ్లెవరు తెస్తారు?’ అని తిడుతోంది. పాపం ఎలుగుబంటి పిల్లలు ఏడుస్తున్నాయి. తల్లి కొట్టే దెబ్బలు భరించలేక ‘మేమే తెస్తాం’ అని చెప్పాయి. అక్కడ నుంచి వెళ్లిపోయాడు ముని.

దారిలో ఈసారి కుందేలు పిల్లల నవ్వులు వినబడ్డాయి. ఆగి చూశాడాయన. పిల్లలకు స్నానం చేయిస్తోంది కుందేలు. బుజ్జి బుజ్జి చేతుల్తో నీళ్లను తీసుకొని ఒకదాని మీదకు మరొకటి పోసుకుంటూ నవ్వుతున్నాయి పిల్లలు. వాటిని ప్రేమగా బుజ్జగిస్తూ ముద్దాడుతోంది తల్లి. వాటిని చూసి ముచ్చట పడిన ముని నడక సాగించాడు.

మరోరోజు కందమూలాలు తెచ్చుకోవడం కోసం ముని వెళుతుంటే, మళ్లీ ఎలుగుబంటి పిల్లల ఏడుపు వినిపించింది. ఏమైందోనని చూశాడు. ఒక చెట్టు మొదట్లో నిలబడ్డ ఎలుగు బంటి, పిల్లల్ని చెట్టెక్కి తేనె తియ్యమంటోంది. చెట్టెక్కలేక కిందకు జారిపోతున్నాయి పిల్లలు. కోపం తెచ్చుకున్న తల్లి, ఒక కర్రతో వాటిని కొడుతోంది. దెబ్బలు తట్టుకోలేక ఏడుస్తున్నాయవి.

‘నోటికి తేనె అందిస్తే జుర్రుకుని తాగడం తెలుసు.. కానీ చెట్టెక్కడం రాదా? ఇంకా ఎప్పుడు నేర్చుకుంటారు?’ అంటోంది కోపంగా. పిల్లల్ని కొట్టడం మాత్రమే దీనికి తెలుసనుకున్న ముని అక్కడ నుంచి వెళ్లిపోయాడు. మళ్లీ దారిలో కుందేలు పిల్లల నవ్వులు వినబడ్డాయి. అప్రయత్నంగానే అటు చూశాడు. పక్కనున్న తోటలో దుంపల్ని కనుక్కోవడం, బయటకు తియ్యడం నేర్పుతోంది తల్లి. అచ్చం తనలాగే చేస్తున్న పిల్లలకు ముద్దు పెడుతోంది కుందేలు. మురిసి పోతున్నాయి పిల్లలు. అది చూసి నవ్వుకుంటూ వెళ్లిపోయాడు ముని. ఆహార సేకరణ తర్వాత కుటీరానికి ముని తిరిగొస్తుండగా కుందేలు పిల్లలు చెంగుచెంగున గెంతుతూ కనబడ్డాయి. క్యారెట్లను పిల్లల నోటికి అందిస్తోంది తల్లి. అవి ఆడుకుంటూనే తింటున్నాయి. కింద పడ్డ క్యారెట్‌ ముక్కను ఒక పిల్ల తినబోతుంటే వద్దని వారించి, నీటితో కడిగి ఇచ్చింది తల్లి. ‘ఇప్పుడు ఆకలి తీరింది కదా. ఇక చదువుకోడానికి కోతి మావయ్య ఇంటికి పదండి. తోడు వస్తాను’ అంది పిల్లలతో. ‘అలాగే’ అన్నాయవి. తన కుటీరాన్ని ముని సమీపిస్తుండగా మళ్లీ ఎలుగుబంటి పిల్లల ఏడుపు వినబడింది. ఏమైందని చూస్తుంటే, చెట్టు మీదున్న కాకి.. ‘వాళ్లమ్మ చెంబులో తేనెను పోసి తాగమని పిల్లలకిచ్చి, పని చేసుకోవడానికి అది వెళ్లిపోయింది. అది తిరిగొచ్చి చూసేసరికి తేనె అంతా బయట కనబడడంతో పిల్లల్ని కొట్టింది’ అంది మునితో.

‘అలాగా వాటి తల్లి ఎక్కడుంది?’ అంటూ వాటి దగ్గరకు వెళ్లాడు ముని. ఎలుగుబంటి కనబడగానే.. ‘నీకు పిల్లల పెంపకం రాదు. ఎప్పుడూ కొడుతూ, తిడుతూ నీ పిల్లల్ని ఏడిపిస్తావు’ అన్నాడు ముని. ‘నాకు పిల్లల్ని పెంచడం రాదా? ఇంతకంటే ప్రేమగా ఎవరు పెంచుతారు? క్రమశిక్షణ కోసం ఆ మాత్రం కొట్టకపోతే ఎలా? ముద్దు చేస్తే చెడిపోవూ?’ అంది ఎలుగుబంటి.

‘ఒకసారి కుందేలు దగ్గరకు వెళ్లి చూసొస్తే పిల్లల్ని పెంచడమెలాగో తెలుస్తుంది’ అన్నాడు ముని. ‘దాని వరకు ఎందుకు? నా తప్పేంటో చెప్పండి. అవసరమైతే మారతాను’ అంది ఎలుగుబంటి.

‘కుందేలు తన పిల్లలతో వ్యవహరించడం చూశాక, నీ ప్రతి పనీ తప్పే అనిపించింది. సొంతంగా స్నానం చెయ్యడం పిల్లలకు మొదట్లో తెలీదు. అలవాటయ్యే వరకు దగ్గరుండి అమ్మానాన్నలే చేయించాలి. తరవాత అవసరం ఉండదు. వాటికి నేర్పకుండానే దండిస్తున్నావు నువ్వు. పిల్లల తప్పుల్ని ప్రేమగా కూడా సరిదిద్దవచ్చు. చెట్టెక్కే విషయమూ అంతే. పిల్లలకు ఎప్పుడైనా చెట్టెక్కడం నేర్పావా?’ అనడిగాడు ముని.  ‘ప్రత్యేకంగా నేర్పలేదు. రోజూ నన్ను చూస్తున్నాయి కదా. సరిపోదా?’ అనడిగింది ఎలుగుబంటి గడుసుగా. ‘సరిపోదు. కొత్త విషయమేదైనా తల్లిదండ్రులు పిల్లలకు నేర్పాలి. మొదట్లో పిల్లల వల్ల తప్పులు జరుగుతాయి. అప్పుడు వాటిని సరిదిద్దాలి. చెట్టెక్కడం నేర్పకుండానే పిల్లల్ని కొట్టావు. తేనె తాగే విషయం కూడా అంతే. తల్లో, తండ్రో దగ్గరుండి ఆహారం తినిపించాలి. నేర్పుగా తినడం అలవాటు చెయ్యాలి. ఆహారం వృథా చేయవద్దని, అదెంతో విలువైందని చెప్పాలి. ఒకవేళ పిల్లలు తప్పు చేస్తే సరైనదేమిటో చెబుతూనే.. వాళ్లతో చేయించాలి. అంతేకానీ అయిన దానికి, కాని దానికి దండించకూడదు. అలా పెంచడం క్రమశిక్షణ కాదు. పిల్లలతో కలసి ఉంటూ, వాళ్ల కదలికలను శ్రద్ధగా గమనిస్తూ, వాళ్ల తప్పుల్ని సరిదిద్దుతూ సక్రమ మార్గంలో ఎదిగేలా బాధ్యతను తీసుకోవడం క్రమశిక్షణతో కూడిన పెంపకం అవుతుంది. మనుషుల్లో కొందరు నీలాగే దండించడమే క్రమశిక్షణ అని పొరబడుతుంటారు. ఇక నువ్వు పొరబడడంలో వింతేమి ఉంది. నీ ఆలోచనల్లో మార్పు రావాలి’ అని చెప్పాడు ముని. ఎలుగుబంటికి తన తప్పేమిటో తెలిసొచ్చింది. అప్పటి నుంచి తన పద్ధతి మార్చుకుంది. ఎలుగుబంటి పిల్లలు కూడా పనులన్నీ చక్కగా నేర్చుకున్నాయి.

- నారంశెట్టి ఉమామహేశ్వరరావు


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని