తెలివితేటలతో కొలువులు!

పల్లవరాజు శూరవర్మ తన ఆస్థానంలోని కొన్ని శాఖలకు పర్యవేక్షకులుగా కొందరిని నియమించాలని అనుకున్నాడు. రాఘవపురంలో గురుకులం నడిపించే సుధాముడి వద్దకు మంత్రి కేశవుణ్ని పంపించాడు.

Updated : 02 Aug 2023 05:02 IST

ల్లవరాజు శూరవర్మ తన ఆస్థానంలోని కొన్ని శాఖలకు పర్యవేక్షకులుగా కొందరిని నియమించాలని అనుకున్నాడు. రాఘవపురంలో గురుకులం నడిపించే సుధాముడి వద్దకు మంత్రి కేశవుణ్ని పంపించాడు. సుధాముడికి విషయం వివరించి.. ‘మీ దగ్గర సకల విద్యలూ పూర్తి చేసిన తెలివి గల విద్యార్థులెవరో చెప్పండి’ అన్నాడు మంత్రి.

‘మంత్రివర్యా! నాకు విద్యార్థులందరూ సమానమే ప్రస్తుతం విద్య పూర్తి చేసుకున్నవారు తొమ్మిది మంది ఉన్నారు. మీరు మారు వేషంలో వచ్చి వారిలో తెలివైనవారిని కనిపెట్టండి’ అని చెప్పాడు. మరుసటి రోజు మంత్రి మారువేషంలో గురుకులానికి వెళ్లాడు.

‘ఈయన పేరు కేశవుడు. మన గురుకులం విషయాలు తెలుసుకోవడానికి పొరుగు రాజ్యం నుంచి వచ్చారు’ అని కొత్త, పాత విద్యార్థులందరినీ పరిచయం చేశాడు సుధాముడు. విద్యార్థులందరూ కేశవుడికి వందనం చేశారు. ఆయన కూడా వారికి ప్రతి నమస్కారం చేశాడు.

ముందుగా కేశవుణ్ని గోశాలకు వెళ్లమన్నాడు సుధాముడు. అక్కడ ముగ్గురు విద్యార్థులు విజయుడు, శివుడు, శేఖరుడు ఆవు పాలను పిండడానికి సిద్ధమయ్యారు. వారిలో విజయుడు ఆవుకు నమస్కరించి ‘అమ్మా! బాగున్నావా?’ అని తలతో పాటు ఒళ్లంతా బాగా నిమిరాడు. తర్వాత దానికి పచ్చగడ్డిని వేశాడు. పొదుగు శుభ్రం చేసి ఇత్తడి బిందెలో  పాలు పితికాడు.

శివుణ్ని, శేఖరుణ్ని కూడా కేశవుడు పరిశీలించాడు. వారు ఆవులకు మామూలుగా పచ్చగడ్డి వేశారు. పొదుగులను శుభ్రం చేశామంటే చేశామని, పాలు పితికామంటే పితికామన్నట్లు ప్రవర్తించారు. విజయుడు పిండిన పాలలో సగం కూడా వారి బిందెల్లో లేవు.

మరుసటి రోజు గురుకులానికి కావాల్సిన సరకులు కొని తెమ్మని ఒక్కొక్కరికీ తలా కొన్ని చొప్పున సరకులు చీటిలో రాసి రామయ్య, చిన్నయ్య, సూరయ్యకు ఇచ్చాడు సుధాముడు. వారితో పాటు కేశవుడు కూడా సంతకు వెళ్లాడు. ఒకరి తరువాత ఒకరిని కనిపెట్టాలని చిన్నయ్య, సూరయ్యను ఒకచోట కూర్చోమన్నాడు. ముందుగా రామయ్యను పరిశీలించాడు. అతడు కొన్ని అంగళ్లలో వంటకు కావలసిన సరకుల ధరలను తెలుసుకున్నాడు. తర్వాత తక్కువ ధరకు నాణ్యమైనవి కొన్నాడు. చిన్నయ్య, సూరయ్యను కూడా కేశవుడు కనిపెట్టాడు. వారు అంగళ్లలో నాణ్యమైన సరకును కొనకపోగా, అధిక ధర చెల్లించారు.

మరుసటి రోజు మధ్యాహ్నం విద్యార్థులతో సహా అందరూ భోజనం చేశాక ఒక మనిషి సుధాముణ్ని కలసి... ‘అయ్యా! తమ గురుకులం చూడడానికి మన గ్రామాధికారి పది మందిని పంపిస్తున్నారు. వారికి కాస్త భోజనం అదీ చూడమన్నారు’ అని చెప్పి వెళ్లాడు. వంటశాలను చూసుకునే భీమయ్య, పోలయ్య, ధర్మయ్యను ‘ఎంత అన్నం మిగిలి ఉంది. మిగతా పదార్థాలు సరిపోతాయా?’ అని సుధాముడు అడిగాడు.

‘అన్నం కొద్దికొద్దిగా వడ్డిస్తే అయిదుగురికి మాత్రమే సరిపోతుంది. కానీ కూరలు లేవు’ అని పోలయ్య, ధర్మయ్య అన్నారు. భీమయ్య మాత్రం.. ‘ఫర్లేదు.. వారిని రానీయండి’ అన్నాడు. భీమయ్య ఒక నల్ల ఫలకం తీసుకుని దానిపై సుద్ద ముక్కతో.. ‘నేటి సుభాషితాలు’ అని రాశాడు. దాని కింద.. ‘మంచి ఆరోగ్యానికి రెండు సూత్రాలు... 1.తక్కువగా మాట్లాడడం 2.మితంగా భోజనం చేయడం’ అని రాసి, భోజనశాల బయట గోడకు వేలాడదీశాడు.

తర్వాత ఆ పది మంది కూర్చోవడానికి బల్లలు వేయించాడు. కాసేపటికి వారు రానే వచ్చారు. ఆ పదిమందికి భీమయ్య కాచిన ఆవు పాలలో బెల్లం వేసి ఇచ్చాడు. ‘ఇంత కమ్మటి పాలను ఎన్నడూ తాగి ఎరుగం’ అన్నారు వారు. ‘కాసేపు ఆగి భోజనం చేద్దురు గానీ’ అన్నాడు భీమయ్య. ఆ వచ్చిన వారు గురుకులం అంతా తిరిగి వచ్చే లోపల భీమయ్య ఆ మిగిలిన అన్నంతో పులిహోర చేశాడు.
వారంతా తిరిగి వచ్చాక పోలయ్య, ధర్మయ్య వారికి కంచాలు చేతికి ఇచ్చారు. ‘కమ్మని పాలు తాగాం. ఏదైనా కొద్దిగానే వడ్డించండి’ అన్నారు వారు. భీమయ్య ఒక్కొక్కరికి కొద్దికొద్దిగా పులిహోర వడ్డించాడు. ‘ఈ పులిహోర కూడా చాలా రుచిగా ఉంది’ అని, ఆ వడ్డించిన దానితోనే వారు సరిపెట్టుకున్నారు. తర్వాత వారు వెళ్లి వస్తామని విద్యార్థులకు, సుధాముడికి చెప్పి వెళ్లారు. కాసేపటికి కేశవుడు కూడా కోటకు చేరుకొన్నాడు. రాజుతో గురుకులంలోని తెలివిగల విద్యార్థుల వివరాలు చెప్పాడు.

పశువులశాలకు విజయుణ్ని, సంతలో సరకులు తేవడానికి రామయ్యను, వంటశాలకు భీమయ్యను పర్యవేక్షకులుగా నియమిస్తూ రాజు ఉత్తర్వులను సుధాముడి గురుకులానికి పంపాడు. మంత్రి కేశవుడు మారువేషంలో వచ్చిన సంగతి కొలువులు వచ్చిన ఆ ముగ్గురికీ సుధాముడు చెప్పాడు. ‘గురువు గారూ.. ఇకపై మేము కూడా తెలివితో మెలుగుతాం’ అన్నారు మిగతా విద్యార్థులు.

యు.విజయశేఖర రెడ్డి


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు