తప్పిపోయిన పాలపిట్ట!

నల్లమల అడవుల్లో జమ్మిచెట్టుపై వాసంతి అనే ఓ పాలపిట్ట నివసిస్తూ ఉండేది. దానికి గ్రీష్మ అనే చిన్న పిల్ల ఉండేది. గ్రీష్మకు ఇప్పుడిప్పుడే ఎగరడం నేర్పుతోంది వాసంతి. ఆ రోజు ఎగరడం పూర్తిగా వచ్చింది.

Updated : 04 Aug 2023 05:07 IST

ల్లమల అడవుల్లో జమ్మిచెట్టుపై వాసంతి అనే ఓ పాలపిట్ట నివసిస్తూ ఉండేది. దానికి గ్రీష్మ అనే చిన్న పిల్ల ఉండేది. గ్రీష్మకు ఇప్పుడిప్పుడే ఎగరడం నేర్పుతోంది వాసంతి. ఆ రోజు ఎగరడం పూర్తిగా వచ్చింది. ఆ సంతోషంలో హుషారుగా ఉన్న గ్రీష్మ, తల్లిని తన వెంట ఎగరడానికి రమ్మని అడిగింది. తాను బాగా అలసిపోవడం వల్ల రాలేనని చెప్పింది వాసంతి. అయితే తానే ఒంటరిగా ఎగురుతానని వెళ్లబోయింది గ్రీష్మ.

దానికి వాసంతి... ‘గ్రీష్మా! నీ ఉత్సాహాన్ని నేను కాదనలేను. నువ్వే ఒంటరిగా ఎగురు. కానీ ఈ పరిసరాలు దాటి వెళ్లకు సుమా! ఎందుకంటే నువ్వు గూటిని గుర్తుంచుకొని తిరిగి రావడం కష్టమౌతుంది’ అంది.

‘అలాగేనమ్మా! గూటికి దూరంగా వెళ్లను. సరేనా?’ అంటూ అక్కడి నుంచి వెళ్లింది గ్రీష్మ. కొంచెం దూరం వెళ్లగానే దానికి ఓ చెరువు కనిపించింది. దానిలో నీళ్లు తాగి ఆ తర్వాత ఇంటికెళ్లాలనుకొని, కింద వాలింది. చెరువులోని తీయటి నీళ్లు తాగి బయలుదేరింది. దానికి కొంచెం దూరంలోని మైదానంలో లేడి పిల్లలు ఆడుకుంటూ కనిపించాయి. అక్కడ లేడి పిల్లలతో కాసేపు ఆడుకుంది.

అప్పుడు ఆ లేడి పిల్లలు గ్రీష్మతో... ‘ఆ కనపడే లోయకు అవతల అందమైన జలపాతం ఉందట. అక్కడకు కొండలు గుట్టలు దాటి వెళ్లడం కష్టం. నీలా మాకూ రెక్కలుంటే మేం వెళ్లేవాళ్లం. కానీ మాకు ఆ అదృష్టం లేదు. అక్కడకు వెళ్లాలంటే మేము ఇంకా పెరగాలి’ అని నిరుత్సాహపడ్డాయి.

కాసేపటికి గ్రీష్మ అక్కడి నుంచి బయలుదేరింది. దానికి జలపాతం మీదకే మనసు లాగింది. దారి గుర్తుంచుకుంటూ వెళ్లాలని నిర్ణయించుకుంది. అలా వెళ్తూ ఉంటే దారిలో ఒక కొంగ ఎదురైంది. దాన్ని జలపాతానికి దారి అడిగింది. అక్కడ నుంచి పక్కకు తిరిగి వెళ్లాలని కొంగ చెప్పింది. అలా కొన్ని కిలోమీటర్ల దూరం ప్రయాణించగా అందమైన జలపాతం కనిపించింది. సాయంకాలం దాకా అక్కడ ఆనందంగా గడిపిన తర్వాత, దానికి అమ్మ తన కోసం ఎదురు చూస్తూ ఉంటుందన్న విషయం గుర్తుకు వచ్చింది. అమ్మ తనను గూటికి దగ్గరగా ఎగరమని చెబితే, తాను అది వినకుండా చాలా దూరం వచ్చానని గ్రహించి ఎంతో భయపడింది. వెంటనే వేగంగా ఎగురుతూ గూటికి బయలుదేరింది.

పాపం.. అది ఆ కంగారులో వెళ్లాల్సిన దిక్కు మరిచి వ్యతిరేక దిశలో వెళ్లింది. ఎంత సేపు ఎగిరినా దానికి తాను దారిలో దాటి వచ్చిన స్థలాలు కనిపించలేదు. ఇక చీకటి పడుతుండగా ఒక నారింజ చెట్టు మీద వాలింది. ఏం చేయాలో తోచక అది బిగ్గరగా ఏడవసాగింది. ఆ చెట్టు మీద ఉన్న వడ్రంగి పిట్ట దాన్ని చూసి ప్రేమగా పలకరించి విషయం తెలుసుకుంది. కానీ దానికి గ్రీష్మను గూటికి చేర్చడం ఎలాగో అర్థం కాలేదు. ఆ రాత్రి నారింజ చెట్టు మీద ఉండమని చెప్పింది. కానీ చలికి బాగా వణికిపోయింది. వడ్రంగి పిట్టకు భయమేసింది. తన ముక్కుతో చెట్టు కాండం తొలిచి గూడు కట్టింది. దాంట్లో గ్రీష్మను కూర్చోపెట్టి చుట్టూ ఆకులు కప్పింది. అయినా చలి ఆగలేదు.

పక్క చెట్టు మీద ఉన్న గిజిగాడు పిట్ట నిమిషాల్లో పాలపిట్ట కోసం గూడు అల్లింది. గూటిలో బూరుగు దూది పరుపుగా పరిచి గ్రీష్మను అందులో పడుకోబెట్టింది. అయినా చలి ఆగలేదు. ఏం చేయాలో తోచక చివరికి వైద్యం తెలిసిన పావురాన్ని పిల్చుకొచ్చింది వడ్రంగి పిట్ట.

పావురం, గ్రీష్మను పరీక్షించి నీటిలో తడవడం, భయం వల్ల దానికి చలిజ్వరం వచ్చిందని చెప్పింది. తల్లి ఒడే తప్ప దానికి వెచ్చదనం ఎక్కడా లభించదని, తల్లి వద్దకు చేరిస్తేనే దాని జబ్బు నయమౌతుందని చెప్పింది. దాంతో పక్షులన్నీ తెల్లారగానే దాని గూటిని వెతికి తల్లి దగ్గరకు చేర్చాలని నిర్ణయించుకున్నాయి.

సూర్యోదయం అయిన వెంటనే అన్ని పక్షులు తలోదిక్కుకు వెళ్లి.. తల్లి పాలపిట్ట కోసం వెతికాయి. కానీ వాటి ప్రయత్నం ఫలించలేదు. పక్షుల్లో తెలివైన చిలుక అడిగింది. ‘నీ పేరేంటి’ అని. దానికి పిల్ల పాలపిట్ట తెలియదని అమాయకంగా చెప్పింది. ‘అయితే మీ అమ్మ నిన్ను ఏమని పిలుస్తుంది బంగారం’ అనునయంగా అడిగింది చిలుక. ‘గ్రీష్మ’ అని పిలుస్తుంది అని సమాధానం ఇచ్చిందది. ‘అదే నీ పేరు గుర్తుంచుకో. ఇంతకీ మీ అమ్మ పేరేంటి?’ అని అడిగింది చిలుక.

‘అమ్మ’ అని అమాయకంగా చెప్పింది గ్రీష్మ. ‘అలా కాదు చిట్టితల్లీ! మీ అమ్మను మిగతా పక్షులు ఏమని పిలుస్తాయి?’అని ఆరా తీస్తూ అడిగింది చిలుక. ‘వాసంతి’ అని పిలుస్తాయి అని సమాధానం ఇచ్చింది గ్రీష్మ. ‘ఓహో.. అయితే వాసంతి అన్నమాట మీ అమ్మ పేరు. మీ గూటి ఆనవాలు ఏమైనా తెలుసా నీకు? మీ గూడు ఏ చెట్టు మీద ఉంది? చుట్టూ ఏ ఏ చెట్లు ఉంటాయో గుర్తు తెచ్చుకో’ అని అడిగింది చిలుక. ‘మేం ఉండే చెట్టు పేరు తెలీదు కానీ, పక్కన నిండా ఎర్రటి పూలుండే పెద్ద చెట్టు ఒకటి ఉంది. దాని మీద కూర్చుని కోకిల రోజూ పాటలు పాడి నాకు వినిపిస్తుంది’ అంది గ్రీష్మ.

‘అయితే అది అగ్నిపూల చెట్టు అయి ఉంటుంది’ అంది చిలుక. మిగతా పక్షులను ఉద్దేశించి.. ‘చూడండి మిత్రులారా! ఈ అడవిలో అగ్నిపూల చెట్లను వెదకండి. అందులో ఒకటి పిల్ల పాలపిట్ట గూడు ఉన్న చెట్టు. దాని పేరు గ్రీష్మ. తల్లి పేరు వాసంతి. ఈ వివరాలు అడుగుతూ ముందుకు సాగిపోదాం’ అంది. దానికి అన్ని పక్షులు సరేనన్నాయి.

అక్కడ గ్రీష్మ ఎంతకూ గూటికి చేరుకోలేకపోయే సరికి వాసంతి కంగారు పడింది. కోకిల అన్నయ్య దగ్గరకు వెళ్లి విషయం చెప్పింది. రాత్రంతా గ్రీష్మ ఎక్కడుందోనని దిగులుతో ఉంది వాసంతి. గ్రీష్మకు దారి తెలిసేలా తన పాటతో సంకేతాన్ని అందిస్తానని కోకిల సిద్ధపడింది. అడవిలో పాట ఓ కిలోమీటరు దాకా వినపడేలా పిచ్చుక కొబ్బరి ఆకుతో బూర తయారు చేసి ఇచ్చింది.

పక్షులన్నీ గ్రీష్మను వెంటబెట్టుకుని ఆకాశంలో ఎత్తున ఎగురుతూ అగ్ని పూల చెట్టు కోసం వెదికాయి. ఎగురుతూ ఉన్న వాటికి దారిలో బాతు ఎదురైంది. దాన్ని వాసంతి ఆచూకీ అడిగాయి. ఏ దిశలో ప్రయాణిస్తే అక్కడకు చేరుకుంటారో అది చెప్పింది. పక్షులన్నీ ఆ దిశలో చాలా దూరం వెళ్లాయి. కానీ వాటికి వాసంతి జాడ ఇంకా తెలియలేదు. అప్పుడే దూరం నుంచి పాట వినబడసాగింది. ‘గ్రీష్మా.. బంగారం! త్వరగా రావమ్మా! మీ అమ్మ నీ తలపులతోనే గడుపుతోందమ్మా! నువ్వు లేకుంటే అన్నపానీయాలు ముట్టనంటుందమ్మా!’ అని కోకిల శ్రావ్యంగా పాడుతోంది.

పక్షుల్లో ఎక్కడాలేని ఉత్సాహం వచ్చింది. అవి పాట వినిపించే వైపు వెళ్లాయి. చివరికి అవి అగ్ని పూల చెట్టు పక్కన ఉన్న జమ్మిచెట్టుపై వాసంతిని కనుగొన్నాయి. గ్రీష్మను చూసిన సంతోషంలో వాసంతి, తన బిడ్డను దగ్గరకు లాక్కొని ముద్దులతో ముంచెత్తింది. గ్రీష్మ ఇకపై తాను ఎన్నడూ తల్లి మాటను జవదాటనంది. తల్లిని క్షమాపణ అడిగింది. ఎంతో కష్టపడి తన బిడ్డను తన దగ్గరకు చేర్చిన పక్షులకు వాసంతి కృతజ్ఞతలు చెప్పింది. ఆరోజు ఆ పక్షులన్నింటికీ జమ్మిచెట్టుపై విందు ఏర్పాటు చేసింది వాసంతి.

గేరపాటి భానువర్ధన్‌


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని