చిలుకా.. ఎక్కడికెళ్లావు?

ఆకాశం నిండా నక్షత్రాలు పరుచుకున్నాయి. చందమామ వెన్నెల వెలుగును పంచుతోంది. పనులన్నీ ముగించుకొని వాకిట్లోకొచ్చి కూర్చుంది పెదరాశి పెద్దమ్మ.

Updated : 09 Sep 2023 00:10 IST

కాశం నిండా నక్షత్రాలు పరుచుకున్నాయి. చందమామ వెన్నెల వెలుగును పంచుతోంది. పనులన్నీ ముగించుకొని వాకిట్లోకొచ్చి కూర్చుంది పెదరాశి పెద్దమ్మ. అంతలోనే పిల్లలంతా తన చుట్టూ చేరి కథ చెప్పమని అడిగారు. సరేనంటూ కథ చెప్పడం ప్రారంభించింది పెద్దమ్మ.
శ్రీరాంపురం అనే గ్రామంలో కాశీ మావయ్య నివసిస్తూ ఉండేవాడు. తను చెప్పే కథలంటే పిల్లలకి చాలా ఇష్టం. చుట్టుపక్కల ఉన్న పిల్లలందరూ ఆయన దగ్గర రోజూ కథలు చెప్పించుకునేవారు. అలా ఒకరోజు కాశీ మావయ్య కథ చెప్తుండగా.. అడవి నుంచి తప్పిపోయి వచ్చిన కీరవాణి అనే చిలుక చెట్టుపై నుంచి కింద పడిపోయింది. అది చూసి, దానికి నీళ్లు పట్టించి సపర్యలు చేశాడాయన. పిల్లలంతా చిలుకని చూసి ముచ్చటపడుతూ.. ‘మావయ్యా.. చిలుకని తీసుకెళ్లి పంజరంలో పెట్టు ఎంచక్కా దాంతో ఆడుకోవచ్చు లేదంటే ఎగిరిపోతుంది’ అన్నారు. ఇది స్వేచ్ఛగా తిరగాల్సిన జీవి బంధించి బాధపెట్టడం సరైంది కాదు’ అన్నాడు కాశీ మావయ్య.
కీరవాణి కోలుకునేంత వరకు పిల్లలు, కాశీ మావయ్య దానికి సేవలు చేస్తూనే ఉన్నారు. ఇక అప్పటి నుంచి అది కూడా పిల్లలతోపాటే రోజూ కథలు వింటూ ఉండేది. అలా మధ్యమధ్యలో పిల్లలు మాట్లాడుతుంటే, ఆ మాటలను మళ్లీ తిరిగి చెప్పేది. కొన్ని రోజులకి దానికి మాటలు బాగా వచ్చాయి. పిల్లలందరినీ చక్కగా పేర్లతో పిలిచేది. అలా చిలుకతో మాట్లాడుతూ పిల్లలంతా సరదాగా గడిపేవారు. చాలా రోజుల నుంచి కీరవాణి కనిపించకపోవడంతో అడవిలోని ఇతర పక్షులన్నీ బాధపడ్డాయి. అడవి చుట్టుపక్కల ఎంత వెతికినా, దాని జాడ మాత్రం తెలియలేదు. కానీ, కొద్దిరోజుల తరవాత కీరవాణి తిరిగి అడవిలోని తన గూటికి చేరుకుంది. దాని రాకతో ఎప్పటిలాగే ఆ చెట్టుపై సందడి మొదలైంది. అక్కడున్న పక్షులన్నీ ‘ఇన్నాళ్లు ఎక్కడికెళ్లావు? ఏం చేశావు? నీ కోసం చాలా చోట్ల వెతికాం’ అంటూ ప్రశ్నల వర్షం కురిపించాయి.  
‘మన అడవికి కాస్త దూరంగా శ్రీరాంపురం అనే ఊరు ఉంది. అక్కడ కాశీ మావయ్య ఇంట్లో ఉన్న జామచెట్టు పండ్లు చాలా రుచిగా ఉన్నాయి. దాంతో వాటి కోసం రోజూ అక్కడికి వెళ్లేదాన్ని. ఆ సమయంలో ఓ వేటగాడు గురి చూసి నావైపు బాణం వదిలాడు. ఆ దెబ్బతో చెట్టు మీద నుంచి కింద పడిపోయాను. అది గమనించిన కాశీ మావయ్య నాకు సపర్యలు చేసి కాపాడాడు. ప్రతిరోజు ఆయన చెప్పిన కథలన్నీ విన్నాను. అక్కడ పిల్లల దగ్గర కొత్త కొత్త పదాలు నేర్చుకున్నాను’ అని సంతోషంగా బదులిచ్చింది.
నిజమే కానీ, ‘మనం పక్షులం కదా..! మనకు కథలు అవసరం అంటావా?’ అని సందేహంగా అడిగిందో పక్షి. ‘కథలు అంత బాగుంటాయా? వాటితో మనకేంటి లాభం?’ అని ఆశ్చర్యంగా అడిగింది మరో పక్షి. ‘కథలు అందరికీ అవసరమే, అవి వింటుంటే మనసుకి హాయిగా ఉంటుంది. అవి మన నిజ జీవితాలకు చాలా దగ్గరగా ఉంటాయి. అంతే కాదు అపాయం నుంచి బయటపడే ఉపాయాలు కూడా తెలుసుకోవచ్చు. సమయస్ఫూర్తితో ఎలా వ్యవహరించాలో నేర్చుకోవచ్చు’ అని జవాబిచ్చిందది. అంతలో చీకటి పడటంతో పక్షులన్నీ వాటి గూళ్లకు వెళ్లిపోయాయి. అది నేర్చుకున్న కథలన్నీ అప్పుడప్పుడు అడవిలోని జీవులకు చెబుతూ ఉండేది. అలా కొన్నిరోజులు గడిచిన తరవాత కొంతమంది వేటగాళ్లు పెద్ద పెద్ద గోతులు తవ్వి జంతువుల కోసం ఉచ్చులు అమర్చారు. వారం రోజుల తర్వాత వచ్చి చూశారు. వారు పన్నిన ఉచ్చులో ఒక్క జంతువు కూడా పడకపోయేసరికి నిరాశగా వెనుదిరిగారు.
ఈ విషయం మృగరాజుకి తెలిసి, వెంటనే అడవిలోని జీవులన్నింటితో అత్యవసర సమావేశం ఏర్పాటు చేసింది. ‘కీరవాణి చెప్పిన కథల్లోని సారాంశం వల్ల సమస్యలను ఎలా ఎదుర్కోవాలో చాలా బాగా తెలిసింది. వాటి వల్లే మనం ఇప్పుడు వేటగాళ్ల ఉచ్చు నుంచి తప్పించుకోగలిగాం. మన ప్రాణాలను రక్షించుకున్నాం. ఈ రోజు నుంచి మన అడవిలో ఉన్న మిగతా జీవులకు కూడా కీరవాణి కథలు చెప్తుంది. అవి విని సమయస్ఫూర్తితో ఉండండి’ అని చిలుకను అభినందించింది మృగరాజు. అది ఆనందంతో రివ్వున ఎగురుకుంటూ వెళ్లి కాశీ మావయ్యకి విషయమంతా చెప్పి ధన్యవాదాలు తెలియజేసింది. ఆరోజు నుంచి అడవిలోని జీవులు చిలుక కథలను ఇంకా శ్రద్ధగా వింటూ ఉండేవని కథ ముగించింది పేదరాశి పెద్దమ్మ.  

 కాశీ విశ్వనాథం పట్రాయుడు


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు