సాధనతోనే పనిలో నేర్పు!

అనగనగా ఒక అడవి. అందులో ఒక నక్క. అది ఓరోజు ఆహారం కోసం వెతుకుతుండగా, ఒక జంతువు చెట్టు చుట్టూ తిరుగుతూ కనిపించింది.

Published : 11 Sep 2023 00:03 IST

నగనగా ఒక అడవి. అందులో ఒక నక్క. అది ఓరోజు ఆహారం కోసం వెతుకుతుండగా, ఒక జంతువు చెట్టు చుట్టూ తిరుగుతూ కనిపించింది. అది నక్కకు వింతగా అనిపించడంతో ఆశ్చర్యంగా అలాగే చూస్తూ ఉండిపోయింది. అది పట్టించుకోక పోవడంతో దాన్ని ఎలాగైనా భయపెట్టాలనుకుంది. ఆ జంతువు ఎదురుగా వెళ్లి, ‘ఎవరు నువ్వు? ఇలా ఎందుకు తిరుగుతున్నావు? పులి ఇక్కడిక్కడే తిరుగుతుంది. అది నిన్ను చూసిందంటే.. అమాంతం మింగేయగలదు’ అంటూ పిరికి మంత్రం వేసింది. ఒక్కసారిగా ఆగిన ఆ జంతువు, నక్కను చూసి ‘ఇక్కడకు దగ్గరలో ఉన్న గ్రామం నాది. ఇలా తిరగడం నాకు అలవాటు. ఈ పనిని నాకంటే గొప్పగా ఎవరూ చేయలేరు. ఇక పులి అంటావా? నాకా భయం లేదు. నాతోపాటు నా తోబుట్టువు కూడా వచ్చింది. ఐకమత్యమే మహాబలమని నమ్మినవాళ్లం’ అని సమాధానమిచ్చింది. ‘ఎక్కడా తోబుట్టువు?’ అని ఆత్రుతగా అడిగింది నక్క.
‘అదిగో.. ఆ గుట్ట మీద ఉంది’ అంటూ చూపించిందా జంతువు. అటుగా చూస్తే, అక్కడా అలాంటి జంతువే ఉంది. అది రకరకాల విన్యాసాలు చేస్తూ కనిపించింది. ‘మీరిద్దరూ తోబుట్టువులు అంటున్నావు. నువ్వు ఇలా? అది అలా?’ అంటూ అయోమయంగా అడిగింది నక్క. ‘ఒకే తల్లి కడుపులో పుట్టినా వేర్వేరు యజమానుల దగ్గర పెరిగాం. అందుకే ఈ తేడా?’ అని జవాబిచ్చిందది. ‘మరి ఈ అడవికి ఎందుకొచ్చినట్టో?’ అని ఆరా తీసినట్టు అడిగింది నక్క. ‘మా ఇద్దరినీ ఇప్పుడు వేరే వ్యక్తి కొనుక్కున్నాడు. అతడు మమ్మల్ని ఇదివరకెప్పుడూ చేయని పనులకు వినియోగిస్తున్నాడు. అలవాటు పడ్డ పని చకాచకా చేసుకుపోగలం కానీ, కొత్త పని కాస్త ఇబ్బందిగా ఉంది. అందుకే ఇలా వచ్చేశాం’ అందా జంతువు.
‘అలాగని ఇలా తప్పించుకొని రావడం సరికాదు కదా..?’ అంది నక్క. ‘అంటే.. ఇబ్బందులు పడుతూ అక్కడే ఉండమంటావా?’ అని తిరిగి ప్రశ్నించిందా జంతువు. ఇంతలో గుట్ట మీదున్న జంతువూ అక్కడికి వచ్చింది. ‘మీ ఇద్దరూ ముందు మృగరాజుని కలిసి ఇక్కడ ఉండేందుకు అనుమతి తీసుకోండి’ అని లొట్టలేసుకుంటూ సలహా ఇచ్చింది నక్క. ‘నువ్వు దారి చూపించు. మేమిద్దరం నీ వెంట వస్తాం’ అన్నాయవి అమాయకంగా. ముందు నక్క నడుస్తుండగా.. వెనక ఈ రెండూ అనుసరించసాగాయి. నక్క మాత్రం వారం పాటు ఆహారానికి కొరత లేదని లోలోపలే ఆనందపడింది. ఇంతలో గుహ రానే వచ్చింది. మృగరాజును కలుద్దాం పదండంటూ వాటిని లోపలికి తీసుకువెళ్లింది. మృగరాజు తీరికగా కూర్చుని ఉంది.
‘జయము జయము.. మృగరాజా’ అంటూ నమస్కరించింది నక్క. వచ్చిన రెండు జంతువుల్లో ఒకటి, నక్క నమస్కారం చూసి.. మృగరాజుకి వంగి వంగి దండం పెట్టింది. దాని వినయానికి సింహం ముగ్ధురాలైంది. ‘ఇవి అడవి జంతువులు కానట్టున్నాయి’ అని నక్కను అడిగింది.  ‘యజమాని కళ్లుగప్పి అడవికి వచ్చాయి. నమ్మకద్రోహాన్ని సహించని మీ ద్వారా గుణపాఠం నేర్పించాలని ఇక్కడకు తీసుకువచ్చాను’ అని బదులిచ్చింది నక్క. ఆ మాటకు ఆ రెండు జంతువులు గతుక్కుమన్నాయి. ‘చిన్నప్పటి నుంచి మాకు తెలిసిన విద్యతోనే బతుకుతున్నాం. ఇప్పుడు యజమాని మారగానే, కొత్త విద్య నేర్చుకోమంటే ఎలా?’ అంటూ గడుసుగా అడిగింది మొదటి జంతువు. ‘నీకు వచ్చిన విద్య ఏమిటో?’ అని సింహం అడగ్గానే.. అది వెంటనే కళ్లు మూసుకుని సింహం చుట్టూ తిరగడం ప్రారంభించింది. అది చూసి ‘గుడిలో దేవుడి చుట్టూ ప్రదక్షిణలు చేసే భక్తుడిలా నువ్వు నా చుట్టూ తిరుగుతూ ప్రదర్శిస్తున్న ప్రభుభక్తిని మెచ్చుకోకుండా ఉండలేకపోతున్నాను’ అంటూ కితాబిచ్చింది సింహం.
‘మృగరాజా.. కండబట్టిన వాటిని కరకరలాడించకుండా ఏమిటా ప్రశంసలు?’ అని అసహనం వ్యక్తం చేసింది నక్క. ‘వీటి వినయ విధేయతలు చూస్తుంటే చాలా ముచ్చటేస్తుంది. అలాంటి వాటిని చంపడం నాకు ఇష్టం లేదు. మిత్రులారా.. మీరు ఇవన్నీ ఎక్కడ నేర్చుకున్నారు?’ అని అడిగింది సింహం. ‘ఇవే మా యజమానులు మాకు నేర్పిన విద్యలు. నేను గానుగెద్దును.. నా తోబుట్టువు గంగిరెద్దు..’ అంటూ అసలు విషయం చెప్పిందా జంతువు. ‘ఇప్పుడు కొత్త యజమానితో వచ్చిన ఇబ్బందేమిటి?’ అని మళ్లీ అడిగింది సింహం. ‘అతనొక వ్యాపారి. ప్రతిరోజూ వివిధ రకాల సామగ్రిని బండి మీద ఊరూరా తిప్పాలి. బరువులు మోయడం ఇంతవరకు మాకు తెలియదు. ఇప్పుడది కష్టమౌతుంది’ అంటూ తమ ఇబ్బందిని చెప్పింది గంగిరెద్దు.
‘ఏ విద్య నేర్చుకోవాలనుకున్నా, మొదట్లో కష్టంగానే ఉంటుంది. అలవాటయ్యే కొద్దీ అందులో మెలకువలు తెలిసి, పని సులువు అవుతుంది. ఇష్టం పెంచుకుంటే ఈ భూమి మీద కష్టమైన విద్య ఏదీ లేదు. పెంపుడు జంతువులకు ఈ అడవి అంత శ్రేయస్కరం కాదు’ అంటూ హితబోధ చేసింది సింహం. నిరాశతో బిక్కమొహం వేసింది నక్క. మృగరాజు మాటలతో ఏకీభవించిన ఆ రెండు ఎద్దులూ గ్రామం బాట పట్టాయి.

 బి.వి.పట్నాయక్‌


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని