ఆలోచించాకే అడుగు వేయాలి!

అనగనగా ఒక అడవి. ఒకప్పుడు అందులో చెట్లు దట్టంగా ఉండేవి. వంట చెరకు, కలప.. ఇలా తదితర అవసరాల కోసం కొట్టేస్తుండటంతో చెట్ల సంఖ్య బాగా తగ్గిపోయింది.

Updated : 17 Sep 2023 07:15 IST

అనగనగా ఒక అడవి. ఒకప్పుడు అందులో చెట్లు దట్టంగా ఉండేవి. వంట చెరకు, కలప.. ఇలా తదితర అవసరాల కోసం కొట్టేస్తుండటంతో చెట్ల సంఖ్య బాగా తగ్గిపోయింది. దాంతో అక్కడ నివసించే జీవుల సంఖ్య కూడా తక్కువ కాసాగింది. ఫలితంగా ఆ అడవిలో కరవు పరిస్థితులు నెలకొన్నాయి. పచ్చదనం తరిగిపోవడంతో కాయలు, పండ్లు లేక సాధు జీవులు ఒక్కొక్కటిగా వలస బాట పట్టాయి. సాధు జీవులు లేకపోవడంతో క్రూర జంతువులన్నీ ఆకలితో అలమటించసాగాయి. పెద్ద జంతువులకు ఆకలి బాధ మాత్రమే ఉంటే, చిన్నవాటికి ప్రాణ భయమూ ఉండేది. అంతకుముందు వరకూ కేవలం వేటగాళ్లు వచ్చినప్పుడే అడవిలోని జంతువులు భయపడేవి.

రోజురోజుకు పరిస్థితి చేయి దాటిపోతుండటంతో చిన్న జంతువులన్నీ కలిసి మృగరాజు వద్దకు వెళ్లాయి. అవన్నీ జట్టుగా తమ మీద ఏం చెబుతాయోనని పెద్దవీ సింహం వద్దకు చేరాయి. ఆ జీవులన్నీ తమ సమస్యలను మృగరాజుకు విన్నవించాయి. సింహం బాగా ఆలోచించిన తర్వాత.. ‘మొదట అన్ని జంతువులకూ ఆకలి బాధ తీరాలి. అప్పుడు సమస్య కొంత తగ్గుతుంది. అందుకే ఇకనుంచి ఏ జంతువు వేటాడినా, లేక ఆహారం సంపాదించినా ముందు నా వద్దకు తీసుకురావాలి. అది ఎంతున్నా, అన్ని జీవులకూ సమానంగా పంచుతా. అప్పుడు ఆకలి బాధ కాస్తయినా తీరుతుంది. వృద్ధ జంతువులకీ తిండి దొరుకుతుంది. వయసులో ఉన్నవి.. బలమైన జంతువులు సమీప అడవులకు, పక్క గ్రామాలకు వెళ్లైనా ఆహారం తీసుకురావాలి’ అని ఆదేశించింది.

ఆరోజు నుంచి అడవిలోని జీవులన్నింటికీ ఎంతో కొంత ఆహారం దక్కసాగింది. అయితే.. పెద్ద జంతువులన్నీ ‘మాకు శ్రమ ఎక్కువ.. ఫలితం తక్కువ’ అనుకోసాగాయి. ‘అవును.. మనం కష్టపడి మిగతా జీవుల కడుపు నింపాల్సి వస్తోంది’ అంటూ బలమైన జీవులూ వాటికి వంతపాడాయి. కానీ, ఈ విషయం మృగరాజు దృష్టికి తీసుకెళ్లే సాహసం చేయలేకపోయాయి. ఒకరోజు అలాంటి అవకాశం ఎలుగుబంటికి దక్కింది. ప్రాణం లేని ఒక పెద్ద అడవి కోడిని కోతి చెట్టు తొర్రలో దాచిపెట్టడం చూసింది. దాంతో ‘మేం తెచ్చినదాంట్లో వాటా ఇవ్వాలి.. ఈ అల్ప జీవులు మాత్రం దాచుకొని తింటున్నాయా?’ అని మనసులోనే అనుకొని కోపంతో ఊగిపోయిందా ఎలుగుబంటి.

వెంటనే మృగరాజు వద్దకు వెళ్లి విషయం చెప్పింది. సింహంతోపాటు మిగతా జంతువులనూ ఆ చెట్టు దగ్గరకు తీసుకొచ్చింది. అక్కడ తొర్రలో కోతి దాచిన కోడిని బయటకు తీసి, వాటన్నింటికీ చూపించింది. ‘ప్రభూ.. మేమంతా మీ ఆజ్ఞ ప్రకారం నడుచుకుంటుంటే.. ఈ చిన్న జీవులు మాత్రం ఇలా స్వార్థంగా వ్యవహరిస్తున్నాయి. ఇకనుంచి ఆహారాన్ని అందరికీ పంచాలనే నిబంధనను తొలగించండి’ అని మృగరాజును కోరింది ఎలుగు. సింహానికి కూడా కోపం రావడంతో ‘ఇకముందు ఆహారాన్ని పంచడం అవసరం లేదు. ఆ కోడితోపాటు ఈ కోతినీ ఆహారంగా చేసుకోవచ్చు’ అంది. అప్పుడు కోతి.. ‘ప్రభూ.. నన్ను ఆహారం చేసుకోమనండి కానీ, ఈ కోడిని వద్దు’ అని ప్రాధేయపడింది. ‘ఎందుకు?’ అంటూ దానివైపు గుర్రుగా చూసింది సింహం.

‘ఆ కోడిని ఒక విషసర్పం కరిచింది. దాంతో దాని శరీరం రంగు మారి, ప్రాణాలు కోల్పోవడం నేను చూశాను. ఆ కోడిని అక్కడే వదిలేస్తే వేరే జంతువులు తినే ప్రమాదం ఉందని, ఎవరికీ కనబడకుండా ఈ చెట్టు తొర్రలో దాచాను’ అంది కోతి. ఆ మాటలతో సింహంతో సహా అక్కడి జీవులన్నీ ఒకదాని ముఖం మరొకటి చూసుకున్నాయి. ఎలుగుబంటి ముందుకొచ్చి.. ‘నన్ను క్షమించు మిత్రమా.. ముందూవెనకా ఆలోచించకుండా నీపైన నింద వేశాను. మరోసారి ఇలాంటి పొరపాటు జరగదు’ అని కోతితో దిగులుగా చెప్పింది. కోతి మంచితనాన్ని, ముందుచూపును మృగరాజుతోపాటు మిగతావీ అభినందించాయి.

 ఆకెళ్ల వెంకట సుబ్బలక్ష్మి


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని