మంచివారికి ఎప్పుడూ మంచే జరుగుతుంది!

నిక్షేపపుర రాజ్యాన్ని విక్రమవర్మ పరిపాలిస్తూ ఉండేవాడు. ఆయన ఒకనాడు మంత్రితో కలిసి దేశ సంచారానికి బయలుదేరాడు. సామాన్య ప్రజల్లా వేషం మార్చుకోవటంతో వీరిని ఎవరూ గుర్తించలేకపోయారు.

Published : 21 Sep 2023 01:49 IST

నిక్షేపపుర రాజ్యాన్ని విక్రమవర్మ పరిపాలిస్తూ ఉండేవాడు. ఆయన ఒకనాడు మంత్రితో కలిసి దేశ సంచారానికి బయలుదేరాడు. సామాన్య ప్రజల్లా వేషం మార్చుకోవటంతో వీరిని ఎవరూ గుర్తించలేకపోయారు. చివరిగా ఓరోజు రామన్నపేట గ్రామం చేరుకుని, అక్కడి ప్రజల కష్టసుఖాలు గమనించారు. తర్వాత ఆలయంలోని శ్రీరాములవారిని దర్శించుకుని నెమ్మదిగా రాజు, మంత్రి మెట్లు దిగుతున్నారు.

గుడిమెట్లకు ఇరుపక్కలా ముష్టివారు కూర్చుని ఉన్నారు. రాజు, మంత్రి తలా ఓ నాణెం దానం చేస్తున్నారు. చివరి మెట్టు మీద కూర్చున్న ముష్టివాడిని చూసి ఆశ్చర్యపోయారు. అతడి వయసు అరవై ఏళ్లకు పైనే ఉంటుంది. అతడి భుజం మీద ఒక కోతి కూర్చుని తలలో పేలు చూస్తోంది. కాళ్ల దగ్గర నల్లటి కుక్క ప్రశాంతంగా నిద్రపోతూ కనిపించింది.

‘తాతా! ఈ కోతి, కుక్క నీకు చెందినవేనా?’ అని ప్రశ్నించాడు రాజు. ‘అవును బాబూ!’ అన్నాడతడు. ‘నీకే తిండికి కష్టంగా ఉంది.. వీటి పోషణ కూడా నువ్వే చూడాలి కదా?’ అని ప్రశ్నించాడు మంత్రి. నవ్వి ఊరుకున్నాడు ఆ వ్యక్తి. రాజు, మంత్రి అతడికి మూడు నాణేలు దానం చేసి ముందుకు కదిలారు.
ఆ వెనకే ముష్టివాడు కూడా మెట్ల మీద నుంచి లేచి, ముందుకు కదిలాడు. కోతి, కుక్క అతడిని అనుసరించాయి. ఆ వెనుకే చుట్టుపక్కల చెట్ల మీదున్న పక్షులు పెద్ద శబ్దం చేస్తూ పైకి ఎగిరి అతడి ముందు వాలాయి. అతడు దగ్గరలో ఉన్న ఒక దుకాణం ముందు ఆగాడు. తన దగ్గరున్న నాణేలతో రెండు రొట్టెలు, కొన్ని తిండి గింజలు కొన్నాడు. కోతి, కుక్క అతడి చుట్టూ ఆనందంగా తిరిగాయి. పక్షులు పెద్దగా శబ్దం చేస్తూ మీద వాలుతున్నాయి. అతడు కోతి, కుక్కకు రొట్టెలు అందించాడు. తిండి గింజల్ని పక్షుల కోసం వెదజల్లాడు. ఆ దృశ్యం చూసిన రాజు, మంత్రి ఆశ్చర్యపోయారు.

అతడి దగ్గరకు వెళ్లి... ‘నీ పేరేంటి?’ అని ప్రశ్నించాడు రాజు. ‘నా పేరు రాములండీ!’ అని చెప్పాడతను. ఆయన, రాములు భుజం మీద చేయి వేసి.. ‘నీ భూతదయ నాకు నచ్చింది. నీలాంటి మంచివారికి మంచే జరుగుతుంది. రేపు ఒకసారి రాజధానికి వెళ్లి విక్రమవర్మను కలువు. ఆయన నీకు సహాయం చేస్తాడు’ అన్నాడు.

‘కోటలోకి నన్ను ఎవరు రానిస్తారు? నిజానికి మా రాజును నేను ఇంతవరకు చూడలేదు. ఆయనకు నాలాంటి వారి గురించి ఆలోచించే తీరిక ఉంటుందా?’ అని ప్రశ్నించాడు రాములు. రాజు చిన్నగా నవ్వి.. ‘రాములు వచ్చాడని, ఏ భటుడికి చెప్పినా నిన్ను లోనికి తీసుకెళతారు. తప్పక వెళ్లు...’ అని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోయాడు.

మరుసటిరోజు తన కుక్క, కోతులతో కలిసి రాజధానికి వెళ్లాడు రాములు. అతడి పేరు చెప్పగానే కోటలోకి అతిథి మర్యాదలతో భటులు తీసుకువెళ్లారు. రాములుకు అంతా ఆశ్చర్యంగా ఉంది. తనలాంటి ముష్టివాడికి రాజుగారు మర్యాద చేయటం ఆశ్చర్యం కలిగించింది. ఎత్తయిన ఆసనం మీద ఎంతో హుందాగా కూర్చున్న రాజును చూసి నమస్కరించాడు రాములు. ఆసనం మీద నుంచి లేచి వెళ్లి... ‘రా.. రాములూ!’ అని పిలవడంతో ఆశ్చర్యపోయాడతను. తన పేరు రాజుకు ఎలా తెలిసిందో అర్థం కాలేదు. సభకు రాముల్ని పరిచయం చేస్తూ... ‘ఎంతోకాలంగా మన జంతు, పక్షుల సంరక్షణశాలకు సరైన పోషకుడు లేక చాలా జీవులను కోల్పోయాం. కానీ, ఈ రాములు తన ఆహారాన్ని కూడా జంతువులు, పక్షులకు పెడుతున్నాడు. తాను మాత్రం చాలీచాలని తిండి తింటూ, పస్తులుంటున్నాడు. అందుకే ఈయన్ను ఆ సంరక్షణశాలకు పరిరక్షకుడిగా నియమిస్తున్నాను’ అన్నాడు.
సభలో ఉన్నవారంతా చప్పట్లు కొట్టారు. రాజు గొంతు విని, నిన్న తనను కలిసింది మారువేషంలో ఉన్న రాజు, మంత్రేనని గ్రహించాడు రాములు. ప్రజలు రాజును చూడకపోయినా, ఏదోరకంగా రాజు ప్రజలను గమనిస్తూనే ఉంటాడని తెలుసుకున్నాడు. రాములు రాకతో జంతు, పక్షుల సంరక్షణశాల తిరిగి కళకళలాడింది. తనతో ఉండే కోతి, కుక్కలతో పాటు, ఇతర జంతువులకూ రాములు దగ్గరయ్యాడు. మంచివారికి ఎప్పుడూ మంచే జరుగుతుందని గ్రహించారు రామన్నపేట గ్రామప్రజలు.

మహంకాళి స్వాతి


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు