ఇది చేపనే... కానీ!

హాయ్‌ ఫ్రెండ్స్‌! ఈ జీవి మూతి, అచ్చం మొసలిలాంటి జీవైన ఎలిగేటర్‌లా ఉంది కదూ! మరి ఇంతకీ ఇది చేపనా? ఎలిగేటరా? తెలుసుకోవాలని ఆసక్తిగా ఉంది కదా! అయితే ఇంకెందుకాలస్యం ఈ కథనం చదివేయండి. మీకే తెలుస్తుంది అసలు విషయం!

Published : 27 Feb 2023 00:38 IST

హాయ్‌ ఫ్రెండ్స్‌! ఈ జీవి మూతి, అచ్చం మొసలిలాంటి జీవైన ఎలిగేటర్‌లా ఉంది కదూ! మరి ఇంతకీ ఇది చేపనా? ఎలిగేటరా? తెలుసుకోవాలని ఆసక్తిగా ఉంది కదా! అయితే ఇంకెందుకాలస్యం ఈ కథనం చదివేయండి. మీకే తెలుస్తుంది అసలు విషయం!

చేప పేరు ఎలిగేటర్‌ గార్‌. దీని స్వస్థలం ఉత్తరఅమెరికా. అక్కడ అతి పెద్ద మంచినీటి చేపల జాతుల్లో ఇదీ ఒకటి. ఇది చాలా ప్రాచీన జీవి. కొన్ని వేల సంవత్సరాల క్రితం నుంచే ఈ జాతి మనుగడ సాగిస్తోందని శాస్త్రవేత్తలు వీటి శిలాజాల ఆధారంగా తేల్చారు. ఈ ఎలిగేటర్‌ గార్‌లకు ఓ ప్రత్యేకత ఉంది. అదేంటంటే... ఇవి నీటితోపాటు బయట కూడా శ్వాసించగలవు. నీటిలో ఆక్సిజన్‌ శాతం తగ్గితే మిగతా చేపలు చనిపోతాయి. కానీ ఈ ఎలిగేటర్‌ గార్‌లు మాత్రం ఎంచక్కా బయట గాలి నుంచి సైతం ఆక్సిజన్‌ను స్వీకరించగలవు.

పే...ద్ద చేపలు!

ఇవి చాలా పెద్ద చేపలు. సాధారణంగా ఆరడుగుల పొడవు, 45 కిలోల వరకు బరువుంటాయి. కొన్నైతే ఏకంగా పది అడుగుల పొడవు వరకూ పెరగగలవు. 125 కిలోల వరకూ బరువు తూగగలవు. వీటి జీవితకాలం కూడా చాలా ఎక్కువ. 95 సంవత్సరాలు జీవించిన వాటినీ శాస్త్రవేత్తలు గుర్తించారు. ఈ చేపలు చాలా వరకు బూడిద రంగులో ఉంటాయి. కొన్ని నలుపు రంగులోనూ ఉంటాయి. వీటికి పొడవైన మూతి ఉండి, చాలా పదునైన దంతాలుంటాయి.

చిక్కితే కరకరే!

ఇవి చిన్న చిన్న చేపలు, రొయ్యలు, కప్పలను ఆహారంగా తీసుకుంటాయి. కొంగలు, పావురాల్లాంటి పక్షులను తినేస్తాయి. ఇంకా నేల మీద బతికే చిన్న చిన్న జీవులనూ నీటికోసం వచ్చినప్పుడు దాడి చేసి ఆరగించేస్తాయట. స్వతహాగా ఇవి మనుషులకు హాని చేయవు కానీ... వీటిని వేటాడే సమయంలో వీటి పదునైన దంతాలతో ప్రమాదం జరిగే అవకాశం ఉంది. వీటి గుడ్లు మాత్రం విషపూరితం. వీటి వల్ల మనుషులకు హాని జరుగుతుంది. కానీ ఎలిగేటర్‌ గార్‌ మాత్రం విషపూరితం కాదు. దీని మాంసాన్ని తిన్నా ఏ ప్రమాదమూ ఉండదు. వీటికి మొసళ్లు, ఎలిగేటర్లు ప్రధాన శత్రువులు. నేస్తాలూ.. మొత్తానికి ఇవీ ఎలిగేటర్‌ గార్‌ విశేషాలు. భలే ఉన్నాయి కదూ!


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు