Hyderabad Vs Lucknow: ఆ విధ్వంసమేంటి? ఫస్ట్‌ బ్యాటింగ్‌ చేసుంటే ‘300’ కొట్టేవాళ్లేమో: సచిన్

గత మూడు మ్యాచుల్లో పెద్దగా ఆకట్టుకోని హైదరాబాద్‌ ఓపెనర్లు మళ్లీ విజృంభించారు. ఈసారి లఖ్‌నవూ బౌలర్లు బాధితులయ్యారు.

Updated : 09 May 2024 12:11 IST

ఇంటర్నెట్ డెస్క్: ఐపీఎల్ 17వ సీజన్‌లో హైదరాబాద్‌ ఓపెనర్లు ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ (Abhishek Sharma) మరోసారి భారీ భాగస్వామ్యంతో లఖ్‌నవూను చిత్తు చేశారు. పవర్‌ ప్లేలోనే 100కిపైగా పరుగులు చేయడంతో సన్‌రైజర్స్ అలవోకగా విజయం సాధించింది. లఖ్‌నవూ నుంచి ఐదుగురు బౌలర్లు బంతులేసినా ప్రతి ఒక్కరూ భారీగానే పరుగులు సమర్పించుకున్నారు. వీరి జోరును చూసిన కామెంటేటర్లు కూడా 200+ లక్ష్యమైనా సరిపోదని వ్యాఖ్యలు చేశారు. ఎస్‌ఆర్‌హెచ్‌ బ్యాటర్ల బాదుడును చూసిన భారత క్రికెట్ దిగ్గజం సచిన్ తెందూల్కర్‌ ప్రత్యేకంగా అభినందిస్తూ పోస్టు చేశాడు.

‘‘విధ్వంసకరమైన ఓపెనింగ్‌ భాగస్వామ్యం. ఉప్పల్‌ వేదికగా ఈ మ్యాచ్‌ చూడటం బాగుంది. ఒకవేళ ఈ కుర్రాళ్లు ఫస్ట్‌ బ్యాటింగ్‌ చేసుంటే.. తప్పకుండా ‘300’ స్కోరు చూసేవాళ్లమే’’ అని సచిన్‌ ఎక్స్‌ వేదికగా పోస్టు పెట్టాడు. హైదరాబాద్‌ ఆటను ప్రశంసిస్తూ పలువురు నెటిజన్లు కామెంట్లు చేశారు. ‘ఐపీఎల్‌లోనే అత్యుత్తమ మ్యాచ్‌ చూసిట్లుంది’.. ‘హైదరాబాద్‌ ఛేదనను కేవలం 40 నిమిషాల్లోనే పూర్తి చేసేసింది. కెప్టెన్ కమిన్స్‌కు ఇంతకంటే బెస్ట్‌ బర్త్‌డే గిఫ్ట్‌ ఉండదు’.. అని కామెంట్లు వచ్చాయి. 

అభిషేక్‌ కెరీర్ దూసుకుపోతోంది: టామ్‌ మూడీ

హైదరాబాద్‌ జట్టులో అభిషేక్ శర్మ కెరీర్‌ దూసుకుపోతుందని ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ టామ్‌ మూడీ తెలిపాడు. గతంలో సన్‌రైజర్స్‌కు కోచ్‌గా ఆయన బాధ్యతలు నిర్వర్తించాడు. ‘‘ఎస్‌ఆర్‌హెచ్‌ డీఎన్‌ఏలోనే ఉంది. అభిషేక్ శర్మ ఎమర్జింగ్‌ యంగ్‌ ప్లేయర్‌గా భారత జట్టులోనూ కీలక పాత్ర పోషిస్తాడు. ట్రావిస్ హెడ్‌తో కలిసి ఈ సీజన్‌లో మంచి భాగస్వామ్యాలను నిర్మించాడు. అంతర్జాతీయ క్రికెట్‌ లేదా ఐపీఎల్‌లో అతడి కెరీర్‌ గంటకు మిలియన్‌ మైళ్ల వేగంతో దూసుకుపోవడం ఖాయం. దేశవాళీ క్రికెట్‌లో అత్యుత్తమ ఆటతీరుతో ఐపీఎల్‌లోకి అడుగు పెట్టాడు. దానిని ఇంకా కొనసాగిస్తూ కీలకంగా మారాడు. అతడు సహజసిద్ధంగా బంతిని బలంగా బాదేయగలడు. మరి ఎక్కువగా చేయాల్సిన అవసరం లేదు. సిక్స్‌లను కొట్టడాన్ని ఆస్వాదిస్తాడు. టీ20 క్రికెట్‌ అభిషేక్‌కు బాగా నప్పే ఫార్మాట్’’ అని మూడీ వ్యాఖ్యానించాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు