బ్రెడ్‌ చాట్‌.. భలే!

పిల్లల నుంచి పెద్దలవరకూ ఇష్టపడే వంటకాల్లో ముందుంటుంది చాట్‌.  అలాంటి పదార్థాన్ని కేవలం సెనగలతోనే చేసుకోవాలని లేదు.  ఇతర పదార్థాలతోనూ నోరూరించే చాట్‌ని చేసుకోవచ్చు. ఎలాగంటే...

Published : 26 Jun 2021 14:14 IST

పిల్లల నుంచి పెద్దలవరకూ ఇష్టపడే వంటకాల్లో ముందుంటుంది చాట్‌.  అలాంటి పదార్థాన్ని కేవలం సెనగలతోనే చేసుకోవాలని లేదు.  ఇతర పదార్థాలతోనూ నోరూరించే చాట్‌ని చేసుకోవచ్చు. ఎలాగంటే...


చిల్లీ చట్నీ పనీర్‌చాట్‌

కావాలసినవి
అంగుళం సైజులో తరిగిన పనీర్‌ ముక్కలు: రెండు కప్పులు, పచ్చిమిర్చి: పది, వేయించిన నువ్వులు: అరకప్పు, బెల్లం: అరకప్పు, చింతపండుగుజ్జు: రెండు పెద్ద చెంచాలు, కారం: చెంచా ఉప్పు: తగినంత నూనె: పావుకప్పు, ఉల్లిపాయ, క్యాప్సికమ్‌: ఒక్కోటి చొప్పున, నిమ్మరసం: రెండు పెద్ద చెంచాలు, ఎండుపుదీనా ఆకులు: రెండు చెంచాలు, వేయించిన జీలకర్రపొడి: పావుచెంచా, కొత్తిమీర: పావుకప్పు, పసుపు: పావుచెంచా.

తయారుచేసే విధానం
ముందుగా స్టౌమీద నాన్‌స్టిక్‌ పాన్‌ని పెట్టాలి. అది వేడయ్యాక పనీర్‌ ముక్కల్ని వేసుకుని, నూనె వేస్తూ... ఎర్రగా కాల్చుకుని తీసుకోవాలి. అదేవిధంగా క్యాప్సికమ్‌, ఉల్లిపాయ వేయించు కోవాలి. ఓ గిన్నెలో నువ్వులపొడి, చింతపండు గుజ్జు, బెల్లం తీసుకుని స్టౌమీద పెట్టాలి. రెండు నిమిషాలయ్యాక కారం, పసుపు, సన్నగా తరిగిన పచ్చిమిర్చి, తగినంత ఉప్పు వేసుకుని బాగా కలపాలి. ఇది ఉడికి గ్రేవీలా తయారయ్యాక వేయించి పెట్టుకున్న పనీర్‌ ముక్కలతోపాటు మిగిలిన పదార్థాలూ వేసుకుని రెండు నిమిషాలయ్యాక దింపేయాలి.


నూడుల్స్‌ చాట్‌

కావాలసినవి
సాధారణ నూడుల్స్‌ ప్యాకెట్‌: ఒకటి, మొక్కజొన్నపిండి, మైదా: రెండు టేబుల్‌స్పూన్లు చొప్పున, ఉప్పు: తగినంత, నూనె: వేయించేందుకు సరిపడా, క్యాబేజీ తరుగు: అరకప్పు, క్యారెట్‌తురుము: పావుకప్పు, ఉల్లిపాయలు: రెండు, క్యాప్సికం, టొమాటో: ఒకటి చొప్పున, పచ్చిమిర్చి: మూడు, చిల్లీసాస్‌, సోయాసాస్‌, స్వీట్‌చట్నీ, టొమాటోకెచెప్‌: ఒక్కో టేబుల్‌స్పూను చొప్పున, వేయించిన పల్లీలు: మూడు టేబుల్‌స్పూన్లు, చాట్‌మసాలా, మిరియాలపొడి: రెండు చెంచాలచొప్పున, కారం: చెంచా, కొత్తిమీర తరుగు: పావుకప్పు, నిమ్మరసం: రెండు పెద్ద చెంచాలు, ఉప్పు: తగినంత.

తయారుచేసే విధానం
నూడుల్స్‌ ఉడికించుకుని నీళ్లు వంపేసి కొద్దిగా నూనెవేసి కలిపితే... ఒకదానికి మరొకటి అతుక్కోవు. తరువాత వీటిపై మైదా, మొక్కజొన్నపిండి వేసి బాగా కలపాలి. ఈ నూడుల్స్‌ని కాగుతోన్న నూనెలో వేసి వేయించుకుని ఓ గిన్నెలోకి తీసుకోవాలి. మరో గిన్నెలో సన్నకారప్పూస, పల్లీలు తప్ప మిగిలిన పదార్థాలన్నింటినీ ఒక్కొక్కటిగా వేసుకుని అన్నింటినీ బాగా కలపాలి. తినేముందు నూడుల్స్‌పైన ఈ మిశ్రమం, వేయించిన పల్లీలు, సన్నకారప్పూస వేసుకుంటే చాలు.


బ్రెడ్‌చాట్‌

కావాలసినవి
బ్రెడ్‌స్లైసులు: నాలుగు, వెన్న: రెండు చెంచాలు, ఉడికించిన బంగాళాదుంప ముక్కలు: పావుకప్పు, ఉల్లిపాయ, టొమాటో ముక్కలు: పావుకప్పు చొప్పున, పచ్చిమిర్చి: ఒకటి, గిలకొట్టిన పెరుగు: అరకప్పు, సన్నని కారప్పూస: పావుకప్పు, గ్రీన్‌ చట్నీ, స్వీట్‌ చట్నీ: ఒకటిన్నర చెంచా చొప్పున, నల్ల ఉప్పు: పావుచెంచా, ఉప్పు: తగినంత, వేయించిన జీలకర్రపొడి, చాట్‌మసాలా: అరచెంచా చొప్పున, కారం: పావుచెంచా.

తయారుచేసే విధానం
బ్రెడ్‌స్లైసుల అంచుల్ని తొలగించి ముక్కల్లా కోసుకోవాలి. పొయ్యిమీద బాణలి పెట్టి వెన్న, అరచెంచా చాట్‌మసాలా వేయాలి. ఇందులో బ్రెడ్‌ముక్కల్ని వేసి కరకరలాడేలా వేయించుకుని తీసుకోవాలి. వీటిపైన నల్ల ఉప్పు, కారం, జీలకర్రపొడి, మిగిలిన చాట్‌మసాలా వేసి బాగా కలపాలి. తరువాత పచ్చిమిర్చి ముక్కలు, ఉడికించిన బంగాళాదుంప ముక్కలు, ఉల్లిపాయ, టొమాటో ముక్కలూ వేసి కలపాలి. వడ్డించేముందు పెరుగు, గ్రీన్‌, స్వీట్‌ చట్నీలు, సన్నకారప్పూస వేస్తే చాలు. బ్రెడ్‌ముక్కలు కరకరలాడేలా ఉంటేనే చాట్‌ రుచిగా ఉంటుంది.


ఆలూ చట్నీ చాట్‌

కావాలసినవి
ఉడికించిన బంగాళాదుంపలు: ఆరు, మొక్కజొన్నపిండి: టేబుల్‌స్పూను, నల్ల ఉప్పు: పావుచెంచా, ఉప్పు: తగినంత, కారం: పావు చెంచా, వేయించిన జీలకర్రపొడి: అరచెంచా, మిరియాలపొడి: పావుచెంచా, చాట్‌మసాలా: చెంచా, నిమ్మరసం: చెంచా, నూనె: వేయించేందుకు సరిపడా. గ్రీన్‌ చట్నీకోసం: కొత్తిమీర తరుగు: అరకప్పు, పచ్చిమిర్చి: పది, పెరుగు: పెద్ద చెంచా, ఉప్పు: తగినంత. స్వీట్‌చట్నీకోసం: గింజలు తీసేసిన ఖర్జూరాలు: కప్పు, చింతపండు గుజ్జు: పావుకప్పు, బెల్లంతరుగు: పావుకప్పు, కారం, జీలకర్రపొడి: చెంచా చొప్పున, ఉప్పు: తగినంత.

తయారుచేసే విధానం
ముందుగా స్వీట్‌, గ్రీన్‌ చట్నీలను తయారుచేసుకోవాలి. స్టౌని వెలిగించి పాన్‌ పెట్టాలి. ఇందులో స్వీట్‌చట్నీ కోసం సిద్ధం చేసుకున్న పదార్థాలన్నింటినీ తీసుకుని స్టౌని సిమ్‌లో పెట్టాలి. ఇది గుజ్జులా అయ్యాక వడకట్టుకుని తీసుకుంటే చాలు. అదేవిధంగా గ్రీన్‌చట్నీకోసం పెట్టుకున్న పదార్థాలన్నింటినీ మిక్సీలోకి తీసుకుని మెత్తగా చేసుకోవాలి. బంగాళాదుంపల్ని ముక్కల్లా కోసుకుని ఓ గిన్నెలోకి తీసుకోవాలి. వీటిపై మొక్కజొన్నపిండి, కాసిని నీళ్లు పోసి మొక్కజొన్నపిండి ఆలూ ముక్కలకు పట్టేలా కలపాలి. పొయ్యిమీద బాణలి పెట్టి నూనె వేయాలి. అది వేడయ్యాక బంగాళాంప ముక్కల్ని రెండుచొప్పున వేసి ఎర్రగా వేయించుకుని తీసుకోవాలి. ఇలా వేయించుకున్న వాటన్నింటినీ ఓ కప్పులోకి తీసుకోవాలి. వీటిపై ఉప్పు, నల్ల ఉప్పు, కారం, జీలకర్రపొడి, మిరియాలపొడి, చాట్‌ మసాలా వేయాలి. తరువాత గ్రీన్‌, స్వీట్‌ చట్నీ కూడా వేసుకుని నిమ్మరసం పిండితే సరి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని