కర్‌కర్‌.. సూపర్‌!

సినిమాకి వెళ్లామంటే చిప్స్‌ ప్యాకెట్‌ ఖాళీ అయిపోతుంది. చాయ్‌ తాగుతున్నా, చారన్నం తింటున్నా.. ప్లేటులో కొన్ని చిప్స్‌ ఉంటే.. ఆహా అదెంత మజానో!  కరకరలాడే చిప్స్‌.. పిల్లలూ పెద్దలూ అందరికీ నచ్చేస్తాయి.

Updated : 10 Mar 2024 12:34 IST

సినిమాకి వెళ్లామంటే చిప్స్‌ ప్యాకెట్‌ ఖాళీ అయిపోతుంది. చాయ్‌ తాగుతున్నా, చారన్నం తింటున్నా.. ప్లేటులో కొన్ని చిప్స్‌ ఉంటే.. ఆహా అదెంత మజానో!  కరకరలాడే చిప్స్‌.. పిల్లలూ పెద్దలూ అందరికీ నచ్చేస్తాయి. మనం తరచూ తినే ఆలూ, బేండీ ఫ్రిట్టర్స్‌తో పాటు ఇంకెన్నో రకాల చిప్స్‌ ఇంట్లోనే ఎంచక్కా చేసుకోవచ్చు.


అరటి

కావలసినవి: కూర అరటి కాయలు పెద్దవి - 2, ఉప్పు - తగినంత, పసుపు - అర చెంచా, నూనె - వేయించడానికి సరిపడా
తయారీ: ముందుగా కూర అరటి కాయలను తొక్క తీసి, గుండ్రంగా ముక్కలు కోయాలి. చేతులకు నూనె రాసుకుంటే మంచిది. లేదంటే నల్లగా అవుతాయి. ముక్కల్లో 4 కప్పుల నీళ్లు, ఉప్పు, పసుపు వేసి, రెండు మూడు నిమిషాలు అలా ఉంచాలి. ముక్కలకు పసుపు, ఉప్పు పట్టిన తర్వాత నీళ్లను వడకట్టేయాలి. వీటిని కాగుతున్న నూనెలో వేయించి.. టిష్యూ పేపర్‌ మీద వేస్తే అదనంగా ఉన్న నూనెను పీల్చేసుకుంటాయి. ఈ టేస్టీ బనానా చిప్స్‌ గాలి చొరబడని డబ్బాలో భద్రంచేస్తే నెల రోజులు నిలవుంటాయి.


చిలకడదుంప

కావలసినవి: చిలకడదుంపలు - 4, ఉప్పు - తగినంత, కారం - చెంచా, నూనె - వేయించడానికి సరిపడా
తయారీ: చిలకడదుంపలు కడిగి, పీల్‌ చేసి.. స్లైసర్‌తో సన్నగా తరగాలి. వీటిని కాగుతున్న నూనెలో వేయించి, బంగారు రంగులోకి మారగానే తీయాలి. కొద్దిగా చల్లారనిచ్చి కారం, ఉప్పు వేసి కలిపితే సరి.. సూపర్‌ రుచితో చిలకడదుంప చిప్స్‌ తయారైపోతాయి.


లోటస్‌ రూట్‌ చిప్స్‌

కావలసినవి: తామర వేరు (లోటస్‌ రూట్‌) - 2, కారం - చెంచా, ఉప్పు - తగినంత, నూనె - వేయించడానికి సరిపడా
తయారీ: పీల్‌ చేసిన తామరవేరును వీలైనంత సన్నగా స్లైసులుగా కట్‌ చేసి, పేపర్‌ టవల్‌ మీద వేయాలి. చెమ్మ ఇంకిపోయాక కాగుతున్న నూనెలో మూడు నిమిషాలు వేయించాలి. బంగారు రంగులోకి మారగానే తీసి కారం, ఉప్పు చల్లితే.. నోరూరించే లోటస్‌ రూట్‌ చిప్స్‌ సిద్ధం.


యాపిల్‌

కావలసినవి: గ్రీన్‌ యాపిల్స్‌ - రెండు, పంచదార - 2 టేబుల్‌ స్పూన్లు, దాల్చినచెక్క పొడి - చెంచా, డార్క్‌ చాక్లెట్‌, ఫ్రెష్‌ క్రీమ్‌ - అర కప్పు చొప్పున
తయారీ: ముందుగా యాపిల్‌ కోరర్‌ సాయంతో వాటి మధ్యలో గింజలతో పెళుసుగా ఉండే భాగాన్ని తీసేయాలి. తర్వాత గుండ్రంగా స్లైసులుగా కట్‌ చేయాలి. అవి మరీ మందంగా, మరీ సన్నగా లేకుండా మధ్యస్తంగా ఉంటే బాగా వేగుతాయి. ఒక పాత్రలో పంచదార, దాల్చినచెక్క పొడి వేసి కలపాలి. బేకింగ్‌ ట్రేలో సిలికాన్‌ మ్యాట్‌ లేదా బటర్‌ పేపర్‌ పరిచి, కాస్త పంచదార చల్లి, యాపిల్‌ ముక్కలను పేర్చాలి. మిగిలిన పంచదారను ముక్కల మీద చల్లాలి. అవెన్‌ను 130 డిగ్రీల వరకూ ప్రీహీట్‌ చేసి.. పది నుంచి పన్నెండు నిమిషాలు బేక్‌ చేస్తే చిప్స్‌ తయారవుతాయి. ఈలోగా ప్యాన్‌లో ఫ్రెష్‌ క్రీమ్‌ను వేడిచేసి, డార్క్‌ చాక్లెట్‌ ఉన్న బౌల్‌లో వేసి.. కలపాలి. ఆ వేడికి చాక్లెట్‌ కరిగిపోతుంది. ఈ సిరప్‌తో యాపిల్‌ చిప్స్‌ తింటే యమ్మీగా ఉంటాయి.


పనస

కావలసినవి: కాస్త పచ్చిగా ఉన్న పనసపండు తొనలు - 20, ఉప్పు - తగినంత, పసుపు - పావు చెంచా, మిరియాల పొడి - అర చెంచా, నూనె - వేయించడానికి సరిపడా
తయారీ: పనస తొనల్లో గింజలు తీసేసి సన్నగా పొడుగ్గా ముక్కలు కోసుకోవాలి. కడాయిలో నూనె కాగనిచ్చి. పనస ముక్కలను కొన్ని కొన్ని చొప్పున హై ఫ్లేమ్‌లో రెండు నిమిషాలుంచాలి. సెగ తగ్గించి బంగారు రంగులోకి మారేదాకా వేయించి తీయాలి. చల్లారిన తర్వాత ఉప్పు, పసుపు, మిరియాల పొడి వేసి.. అన్నిటికీ పట్టేలా ఎగరేస్తూ కలపాలి. అంతే రుచికరమైన పనస చిప్స్‌ రెడీ.


కాకర

కావలసినవి: కాకరకాయలు - 4, శనగపిండి, మొక్కజొన్న పిండి, బియ్యప్పిండి - 2 టేబుల్‌ స్పూన్ల చొప్పున, ఆమ్‌చూర్‌ పౌడర్‌, పసుపు - చెంచా చొప్పున, కారం - ఒకటిన్నర చెంచా, ఉప్పు - తగినంత, నూనె - వేయించడానికి సరిపడా
తయారీ: ముందుగా కాకరకాయలను కడిగి, తడి లేకుండా ఆరబెట్టాలి. వాటిని గుం‌డ్రంగా లేదా నిలువుగా అన్నీ సమానంగా ఉండేలా కట్‌ చేసుకోవాలి. శనగపిండి, మొక్కజొన్న పిండి, బియ్యప్పిండి, కారం, ఆమ్‌చూర్‌ పౌడర్‌, పసుపు, ఉప్పు.. అన్నీ వేసి బాగా కలపాలి. ముక్కలను పిండితే మెత్తగా అయిపోతాయి. కనుక మెల్లగా, జాగ్రత్తగా కలపాలి. కడాయిలో నూనె కాగిన తర్వాత మీడియం ఫ్లేమ్‌ మీద ఈ ముక్కలను దోరగా వేయిస్తే సరిపోతుంది. చేదు విరిగిపోయి కరకరలాడే కాకర చిప్స్‌ రెడీ. తిని ఆనందించడమే తరువాయి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని