టంకా తోరాణి.. మహా‌ ప్రసాదం!

ఒడిశాలో వేసవి ప్రత్యేక పానీయం.. ఈ టంకా తోరాణి. భగభగమండే ఎండల్లో ఈ పానీయం ఇచ్చే చల్లని ఉపశమనం మాటల్లో చెప్పలేనిది.

Published : 04 Jun 2023 00:47 IST

ఒడిశాలో వేసవి ప్రత్యేక పానీయం.. ఈ టంకా తోరాణి. భగభగమండే ఎండల్లో ఈ పానీయం ఇచ్చే చల్లని ఉపశమనం మాటల్లో చెప్పలేనిది. అందుకే పూరీలో ఈ పానీయాన్ని ప్రసాదంగా పంచుతారు. పూరీ జగన్నాథునికి మహాప్రసాదంగా నివేదిస్తున్న పానీయం ఇది..

స్వామికి ప్రసాదంగా వండిన అన్నంలో రాత్రి నీళ్లుపోసి.. తర్వాత రోజు తోరాణి తయారుచేస్తారు. అన్నాన్ని కుండల్లో రాత్రంతా పులియబెట్టి.. తెల్లారాక చేత్తో చింపిన నిమ్మ ఆకులు, పచ్చిమిర్చి, వేయించిన జీలకర్ర, లేత కరివేపాకు, యాలకులు, మిరియాలు, బెల్లం, మజ్జిగ కలిపి ఈ పానీయాన్ని తయారుచేస్తారు. పదో శతాబ్దం నుంచీ జగన్నాథునికి దీన్ని మహాప్రసాదంగా నివేదిస్తున్నారు. నిమ్మఆకుల సువాసనతో, అద్భుతమైన రుచితో.. ఎంత వేడినయినా పోగొట్టే శక్తి తోరాణికి ఉందని స్థానికులు నమ్ముతారు. ఈ ప్రసాదం ఒక్క వేసవిలోనే కాదు జగన్నాథుని ప్రసాదాలు అమ్మే ఆనంద్‌ బజార్‌లో ఏడాది పొడవునా దొరుకుతుంది. స్థానికులు ఇళ్లలోనూ తయారుచేసుకుంటారు. ఎండనపడొచ్చిన అతిథులకు చల్లగా అందిస్తారు. ఎండవేడి నుండి రక్షించటానికీ, జలుబు, అజీర్తి నుంచి ఉపశమనానికి కూడా ఈ పానీయం తాగుతారు. దీనిలో ప్రొబయాటిక్‌ గుణాలు అధికంగా ఉంటాయి కాబట్టి గట్‌ హెల్త్‌(జీర్ణవ్యవస్థ)కి మంచిదని నిపుణులు అంటారు. టంకా తోరాణిని పోలిన తరవాణి నీళ్లను వేడి నుంచి ఉపశమనంగా ఉత్తరాంధ్ర ప్రాంతాల్లోనూ తయారుచేస్తుంటారు. గంజినీళ్లు వేరుచేసి పులియబెట్టి పసుపు, ఉప్పు వేసి ఇస్తారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని