ఈ చారు.. రుచిలో సూపరు..

బీర, బెండ, సొర, దోస.. ఇలా ఏ కూరగాయలతో ఎంత రుచికరంగా వండినా.. ఎప్పుడూ చేసేవేగా అంటూ వంకలు పెట్టేస్తారు పిల్లలు. వాళ్లని సంతృప్తిపరచాలంటే ఏవో చిన్న చిన్న ప్రయోగాలు చేస్తుండాలి.

Published : 17 Dec 2023 00:35 IST

బీర, బెండ, సొర, దోస.. ఇలా ఏ కూరగాయలతో ఎంత రుచికరంగా వండినా.. ఎప్పుడూ చేసేవేగా అంటూ వంకలు పెట్టేస్తారు పిల్లలు. వాళ్లని సంతృప్తిపరచాలంటే ఏవో చిన్న చిన్న ప్రయోగాలు చేస్తుండాలి. అలాంటిదే కలగూర మజ్జిగ చారు. ఇది మా వాళ్లందరికీ చాలా ఇష్టం. ఇందులో వేసేవన్నీ ఇంట్లో అందుబాటులో ఉండేవే. పైగా చాలా సులువైన వంటకం. ఎలా చేయాలంటే.. రెండు కప్పుల చిక్కటి మజ్జిగలో పావు కప్పు శనగపిండి, చెంచా కారం, అర చెంచా పసుపు, తగినంత ఉప్పు వేసి బాగా కలపాలి. దానికి మూడు కప్పుల నీళ్లు జతచేసి పక్కనుంచాలి. ఉల్లి, టొమాటో, చెక్కు తీసిన బంగాళ దుంపలు, బీన్స్‌లను కడిగి, ముక్కలు కోసి ఉడికించాలి. కడాయిలో నూనె వేసి.. కచ్చాపచ్చా దంచిన మిరియాల పొడి, అల్లం ముద్ద, సగానికి చీల్చిన మూడు పచ్చిమిర్చి వేసి వేయించాలి. అందులో కూరగాయ ముక్కలను కాస్త వేయించి.. మజ్జిగ పోసి కలియ తిప్పుతుండాలి. చిక్కగా అయ్యాక కొత్తిమీర తరుగు వేసి దించేసి.. ఆవాలు, శనగపప్పు, మినప్పప్పు, జీలకర్ర, ఎండు మిర్చి, ఇంగువలతో తాలింపు వేస్తే సరి.. ఘుమఘుమలాడే కలగూర మజ్జిగ చారు సిద్ధం. కూరగాయలు నేను చెప్పినవే వాడాలని లేదు. మీకు నచ్చినవి ఏవైనా ఫరవాలేదు. వాటితో పాటు పాలకూర, బచ్చలికూర లాంటి ఆకుకూరలు కూడా ఉడికించి వేసుకోవచ్చు. రొటీన్‌ వంటలకు భిన్నంగా ఇదెంతో రుచిగా ఉంటుంది.

సుబ్రవేటి వరలక్ష్మి, హైదరాబాద్‌


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని