సూప్‌ సూపరః

చెమటలు పట్టించే ఎండల్లేవు. చిత్తడి చిత్తడి వానల్లేవు. చల్లచల్లటి గాలులతో  ఆహ్లాదం కలిగించే వాతావరణం. ఇలాంటప్పుడు వేడి వేడిగా సూప్‌ తాగితే భలే మజా వస్తుంది కదూ! అందుకే ఈ కాలంలో చాలా మంది టొమాటో సూప్‌ చేస్తుంటారు.

Published : 03 Dec 2023 00:21 IST

చెమటలు పట్టించే ఎండల్లేవు. చిత్తడి చిత్తడి వానల్లేవు. చల్లచల్లటి గాలులతో  ఆహ్లాదం కలిగించే వాతావరణం. ఇలాంటప్పుడు వేడి వేడిగా సూప్‌ తాగితే భలే మజా వస్తుంది కదూ! అందుకే ఈ కాలంలో చాలా మంది టొమాటో సూప్‌ చేస్తుంటారు. మరిన్ని రుచులు ఆస్వాదించాలంటే.. ఈ ప్రత్యేకమైన సూప్స్‌ ప్రయత్నించండి..

 

క్యారెట్‌ కొబ్బరి

కావలసినవి

క్యారెట్‌ తురుము - మూడు కప్పులు, అల్లం తరుగు, వెన్న - ఒక టేబుల్‌ స్పూన్‌ చొప్పున, ఉల్లి తరుగు - అర కప్పు, ఉప్పు - తగినంత, కొత్తిమీర, ఉల్లికాడల తరుగు - చారెడు, మిరియాల పొడి - చెంచా, బిర్యానీ ఆకు - 1, చిక్కటి కొబ్బరి పాలు - అర కప్పు

తయారీ

కడాయిలో నెయ్యి వేడయ్యాక బిర్యానీ ఆకు, అల్లం, ఉల్లి తరుగు వేసి వేయించాలి. అవి వేగాక.. క్యారెట్‌ తురుము, ఉప్పు, మిరియాల పొడి, 4 కప్పుల నీళ్లు పోసి మరిగించాలి. గరిటెతో మెదిపి మెత్తగా చేయాలి. ఆరేడు నిమిషాల తర్వాత కొబ్బరి పాలు పోసి కలియ తిప్పాలి. సన్న సెగ మీద ఇంకో రెండు నిమిషాలుంచి దించేసి, కొత్తిమీర, ఉల్లికాడల తరుగు వేస్తే.. ఘుమఘుమలాడే క్యారెట్‌ కొబ్బరి సూప్‌ సిద్ధమైపోతుంది.

ముల్లంగి టోఫూ

కావలసినవి

ముల్లంగి - 2 దుంపలు, ముల్లంగి కాడల తరుగు - పావు కప్పు, ఉల్లికాడలు - 2, నూనె - 1 టేబుల్‌ స్పూన్‌, కొత్తిమీర తరుగు - చారెడు, అల్లం తరుగు - చెంచా, వెల్లుల్లి ముద్ద - అర చెంచా, టోఫూ - 50 గ్రాములు, సోయా సాస్‌ - అర చెంచా, నిమ్మరసం, మిరియాల పొడి - చెంచా చొప్పున, పచ్చి బఠాణీలు - పావు కప్పు, ఉప్పు - తగినంత

తయారీ

ముల్లంగి దుంపలు, ముల్లంగి కాడలు, ఉల్లికాడలను కడిగి, సన్నగా తరగాలి. కడాయిలో నూనె వేడయ్యాక.. వీటిని దోరగా వేయించాలి. అందులో పచ్చి బఠాణీలు, అల్లం తరుగు వేసి.. వేయించి, అర లీటరు నీళ్లు పోసి మరిగించాలి.

టోఫూను గ్రైండ్‌ చేసి, సూప్‌లో వేయాలి. దానికి సోయా సాస్‌, ఉప్పు, మిరియాల పొడి, కొత్తిమీర తరుగు జతచేయాలి. సన్న సెగ మీద ఇంకో రెండు నిమిషాలుంచి నిమ్మరసం వేసి దించేయాలి. అంతే.. ముల్లంగి టోఫూ సూప్‌ రెడీ! వేడి వేడిగా తాగి ఆనందించడమే తరువాయి.

పాలక్‌ బచ్చలి

కావలసినవి

క్యాలీఫ్లవర్‌ తరుగు - కప్పు, బచ్చలి ఆకుల తరుగు - 3 కప్పులు, పాలకూర తరుగు - కప్పు, ఆలివ్‌ నూనె - ఒక టేబుల్‌ స్పూన్‌, ఉల్లి తరుగు - అర కప్పు, సన్నగా తరిగిన అల్లం - టేబుల్‌ స్పూన్‌, బంగాళదుంప - 1, క్యాలీఫ్లవర్‌ కాడల తరుగు - అర కప్పు, ఉప్పు - తగినంత, మిరియాల పొడి, నిమ్మరసం - చెంచా చొప్పున

తయారీ

కడాయిలో నూనె వేడయ్యాక ఉల్లి, అల్లం తరుగు, ఉప్పు వేసి వేయించాలి. అందులో బంగాళదుంప ముక్కలు, క్యాలీఫ్లవర్‌ తరుగు వేయాలి. అవి కాస్త వేగాక.. బచ్చలి, పాలకూర తరుగులను వేయించి, సెగ తీసేయాలి. చల్లారాక ఈ మిశ్రమాన్ని గ్రైండ్‌ చేసి.. అదే కడాయిలో వేయాలి. ఉప్పు, మిరియాల పొడి జతచేసి.. ఐదు కప్పుల నీళ్లు పోసి మరిగించాలి. కాస్త చిక్కగా అయ్యాక, నిమ్మరసం వేసి దించేయాలి. అంతే.. పాలక్‌ బచ్చలి సూప్‌ తయార్‌.

పుదీనా బఠాణీ

కావలసినవి

పచ్చి బఠాణీలు - మూడున్నర కప్పులు, పుదీనా ఆకులు - కప్పు, ఆలివ్‌ నూనె - టేబుల్‌ స్పూన్‌, వెన్న - రెండు టేబుల్‌ స్పూన్లు, ఉల్లి తరుగు - అర కప్పు, వెల్లుల్లి ముద్ద - అర చెంచా, ఉప్పు - తగినంత, మిరియాల పొడి - చెంచా, చీజ్‌ - అర కప్పు

తయారీ

కడాయిలో వెన్న వేసి ఉల్లి తరుగును  వేయించాలి. అది గోధుమ రంగులోకి మారాక.. వెల్లుల్లి ముద్ద వేసి అర నిమిషం తర్వాత బఠాణీలు, పుదీనా ఆకులు, మూడు కప్పుల నీళ్లు పోసి మూత పెట్టి ఉడికించాలి. పది నిమిషాల తర్వాత స్టవ్వు కట్టేయాలి. చల్లారాక బ్లెండర్‌లో వేసి.. ఆ ప్యూరీని మళ్లీ అదే కడాయిలో వేసి, ఉప్పు, మిరియాల పొడి, ఇంకో రెండు కప్పుల నీళ్లు పోసి.. ఐదు నిమిషాలు ఉడికించి దించేయాలి. చీజ్‌ను తురిమి వేడి సూప్‌ మధ్యలో వేసి, ఆలివ్‌ నూనె కూడా వేసి కలియ తిప్పాలి.. అంతే నోరూరించే పుదీనా బఠాణీ సూప్‌ రెడీ! ఆస్వాదించి.. ఆనందించండి.

బాదం మష్రూమ్‌

కావలసినవి

తరిగిన బటన్‌ మష్రూమ్స్‌ - 400 గ్రాములు, ఉల్లి తరుగు - పావు కప్పు, నానబెట్టి పొట్టు తీసిన బాదం పప్పులు - 12, వెన్న - టేబుల్‌ స్పూన్‌, మిరియాల పొడి - చెంచా, ఉప్పు - తగినంత, పాలు - 5 కప్పులు, గార్నిష్‌ చేసేందుకు కచ్చాపచ్చా దంచిన మిరియాలు - అర చెంచా, బాదం పలుకులు - కొద్దిగా

తయారీ

కడాయిలో వెన్నను కరగనిచ్చి.. ఉల్లి, మష్రూమ్స్‌లను వేయించాలి. ఈ మిశ్రమం చల్లారాక గ్రైండ్‌ చేసి.. అదే కడాయిలో మరోసారి వేయించి, పాలు పోయాలి. అందులో బాదం పప్పులను నూరి వేయాలి. మధ్యలో కలియ తిప్పుతూ ఉడకనివ్వాలి. కాస్త దగ్గరగా అయ్యాక ఉప్పు, మిరియాల పొడి వేసి.. ఇంకాస్త మరిగించి దించేయాలి. పైన కచ్చాపచ్చా దంచిన మిరియాలు, బాదం పలుకులు చల్లితే సరిపోతుంది. ఇది రుచికి రుచి, బలానికి బలం.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని