కొత్త వంటలతో..పండగ చేసుకుందాం!

లడ్డు...హల్వా ... పాయసం ...ఇవి లేకుండా పండగకి సంపూర్ణత్వం ఎక్కడిది? పాలు...చక్కెర.. కొబ్బరి వీటికి తోడు మీ ప్రేమను కూడా కలపండి. పండగపూట ఈ లడ్డూ మిఠాయిలతోపాటు ఇంటిల్లిపాదికీ ఆప్యాయతలనూ అందివ్వండి..

Published : 02 Oct 2022 00:01 IST

లడ్డు...హల్వా ... పాయసం ...ఇవి లేకుండా పండగకి సంపూర్ణత్వం ఎక్కడిది? పాలు...చక్కెర.. కొబ్బరి వీటికి తోడు మీ ప్రేమను కూడా కలపండి. పండగపూట ఈ లడ్డూ మిఠాయిలతోపాటు ఇంటిల్లిపాదికీ ఆప్యాయతలనూ అందివ్వండి..


ఆటా హల్వా

కావాల్సినవి: గోధుమపిండి- కప్పు, నెయ్యి- కప్పు, పంచదార- 2 కప్పులు, జీడిపప్పులు- ఎనిమిది, నీళ్లు- రెండు కప్పులు
తయారీ: అడుగు మందంగా ఉండే కడాయిని తీసుకుని నెయ్యి వేడి చేసుకోవాలి. అందులో గోధుమ పిండిని వేసి గరిటెతో కలియతిప్పాలి. మరొక పాన్‌ తీసుకుని అందులో పంచదార, నీళ్లు వేసి కరిగేంతవరకూ ఉంచాలి. గోధుమపిండి నుంచి నెయ్యి వేరయ్యేంతవరకూ గరిటెతో తిప్పుతూ మరుగుతున్న పంచదార పాకాన్ని ఇందులో వేయాలి. ముద్దలు లేకుండా ఈ రెండింటినీ కలిపి పూర్తిగా చిక్కబడకుండానే స్టౌ కట్టేయాలి. నేతిలో వేయించిన జీడిపప్పులని వేసుకుంటే ఆటా హల్వా సిద్ధం.


హయగ్రీవ

కావాల్సినవి: సెనగపప్పు- కప్పు, నీళ్లు- మూడు కప్పులు, బెల్లం- కప్పు, లవంగాలు- నాలుగు, నెయ్యి- రెండు చెంచాలు, జీడిపప్పులు- పది, ఎండుద్రాక్షలు- రెండు చెంచాలు, యాలకులపొడి- పావుచెంచా, కొబ్బరి కోరు- అరకప్పు
తయారీ: కుక్కర్‌లో మూడుకప్పుల నీళ్లు పోసి సెనగపప్పుని ఐదు విజిల్స్‌ వచ్చేంతవరకూ ఉడికించుకోవాలి. నీళ్లను వడకట్టుకుని పప్పుని కడాయిలోకి తీసుకోవాలి. ఇందులో బెల్లం, లవంగాలు వేసుకోవాలి. తక్కువ మంట మీద ఉంచి... బెల్లం మొత్తం కరిగి మిశ్రమం చిక్కబడేంతవరకూ గరిటెతో తిప్పాలి. మరొక పాన్‌లో రెండు చెంచాల నెయ్యి వేసుకుని అందులో జీడిపప్పులు, ఎండుద్రాక్షలు వేసి వేయించుకుని వాటిని సెనగపప్పు, బెల్లం మిశ్రమంపై వేసుకోవాలి. గరిటెతో కలిపేటప్పుడు పప్పుని మరీ ఎక్కువ మెదపకుండా జాగ్రత్త తీసుకోవాలి. ఆ తర్వాత యాలకులపొడి, కొబ్బరికోరు వేసి కలిపితే హయగ్రీవ వంటకం సిద్ధం.  


రోజ్‌ లడ్డు

కావాల్సినవి: కొబ్బరికోరు- ఒకటిన్నర కప్పు, రోజ్‌ సిరప్‌- చెంచా, నెయ్యి- రెండు చెంచాలు, కండెన్స్‌డ్‌ మిల్క్‌ లేదా మిల్క్‌మెయిడ్‌- అరకప్పు, రోజ్‌వాటర్‌- రెండు చెంచాలు, జీడిప్పులు, బాదం, పిస్తా పప్పులు అన్నికలిపి- అరకప్పు
తయారీ: స్టౌ వెలిగించి పాన్‌పెట్టి.. చెంచా నెయ్యి వేసి వేడిచేసుకోవాలి. అందులో డ్రైఫ్రూట్స్‌ పలుకులు వేయించి పక్కన పెట్టుకోవాలి. అదే పాన్‌లో మరో చెంచా నెయ్యి వేసి కొబ్బరిని వేయించుకోవాలి. పచ్చివాసన పోయిన తర్వాత  మిల్క్‌మెయిడ్‌, రోజ్‌సిరప్‌, రోజ్‌వాటర్‌ వేసి కలపాలి. చివరిగా వేయించిన డ్రైనట్స్‌ని బరకగా మిక్సీ పట్టుకుని ఈ మిశ్రమంలో వేసి లడ్డూలు చుట్టుకోవడమే.  


నోలెన్‌గుడ్‌ పాయెష్‌ :

కావాల్సినవి: ఫుల్‌క్రీం మిల్క్‌- రెండు లీటర్లు, మిల్క్‌మెయిడ్‌- అరకప్పు, బాదం పప్పులు- గుప్పెడు, తాటిబెల్లం లేదా ఈతబెల్లం- అరకప్పు, బాస్మతి బియ్యం- అరకప్పు
తయారీ: గంట ముందు బియ్యాన్ని నానబెట్టుకుని సిద్ధంగా ఉంచుకోవాలి. అడుగు మందంగా ఉండే కడాయిని తీసుకుని పాలను మరిగించుకోవాలి. ఇందులో నానబెట్టిన బియ్యాన్ని వేసుకుని అడుగు అంటకుండా గరిటెతో కలుపుతూ ఉండాలి. అన్నం ఉడికిన తర్వాత మంట తగ్గించుకుని మిల్క్‌మెయిడ్‌తో పాటు తురిమిన తాటిబెల్లాన్ని కూడా వేసి కలపాలి. కాసేపటికి పాయసం చిక్కబడుతుంది. మరొక పాన్‌ తీసుకుని అందులో చెంచా నెయ్యి వేసుకుని బాదం పలుకుల్ని వేయించుకోవాలి. వీటిని పాయసంలో కలిపి స్టౌ కట్టేయాలి. చల్లగా తింటే చాలా రుచిగా ఉంటుంది. ఇది బెంగాలీలకు ఇష్టమైన పాయసం. దసరా ప్రత్యేకం కూడా.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని