నువ్వుల లడ్డు.. విరగకుండా!

నువ్వులు, పల్లీలతో చేసిన లడ్డూలు పిల్లలకు బలమని, చేసి పెట్టమని ఇంట్లో అంటున్నారు. వాటిని ఏ పద్ధతిలో చేస్తే మంచిదో చెప్పరూ? 

Updated : 22 Jan 2023 02:51 IST

నువ్వులు, పల్లీలతో చేసిన లడ్డూలు పిల్లలకు బలమని, చేసి పెట్టమని ఇంట్లో అంటున్నారు. వాటిని ఏ పద్ధతిలో చేస్తే మంచిదో చెప్పరూ? 

వర్ణిక, మెదక్‌

ఈ లడ్డూలు చలికాలంలో ఆరోగ్యాన్నీ, రుచినీ కూడా ఇస్తాయి. వీటిల్లో క్యాల్షియం, ఐరన్‌, పొటాషియం, పీచు ఉంటాయి కాబట్టి పిల్లల ఆరోగ్యానికి చాలా మంచిది. వీటి కోసం పావు కప్పు పల్లీలు, మూడోవంతు కప్పు తెల్ల నువ్వులు, పావు కప్పు కొబ్బరిపొడి, అర కప్పు బెల్లం తురుము, పావుచెంచా యాలకులపొడి, రెండు చెంచాల నెయ్యి తీసుకోవాలి. మందపాటి అడుగున్న కడాయిలో మొదట నువ్వులు, తర్వాత పల్లీలు దోరగా వేయించుకోవాలి. వాటిని చల్లారనిచ్చి.. ఈ లోపు కొబ్బరిపొడిని బంగారు రంగు వచ్చేంతవరకూ వేయించుకోవాలి. పల్లీల పొట్టు తీసి బరకగా మిక్సీ పట్టుకోవాలి. ఒక పాత్రలో యాలకుల పొడి, పల్లీల పొడి, నువ్వులు వేసి కలపాలి. స్టౌపై కడాయి పెట్టి దానిలో బెల్లం తురుము వేసి నాలుగు చెంచాల నీళ్లు పోసుకోవాలి. బెల్లం పూర్తిగా కరిగే సమయానికి నువ్వులు, పల్లీలు, కొబ్బరి, యాలకులపొడి వేసుకొని బాగా కలపాలి. చేతికి నెయ్యి రాసుకుని లడ్డూలు చుట్టుకోవడమే. లడ్డూలు పొడిగా రాలిపోతుంటే మరొక్కసారి మొత్తం మిశ్రమాన్ని పొయ్యిమీద పెట్టండి. పాకం ముదిరి చక్కని లడ్డూలు వస్తాయి. నువ్వులు మరీ ఎక్కువ కాకుండా రంగు మారేంతవరకూ వేయిస్తే చాలు. కాసిని వేయించిన జీడిపప్పు పలుకులు కలిపినా కూడా కరకరలాడుతూ రుచిగా ఉంటాయి.

శ్రీదేవి, హోటల్‌ మేనేజ్‌మెంట్‌ నిపుణులు


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని