మోరుండలు ఏడాదిలో రెండు నెల్లే దొరుకుతాయ్‌!

మోరుండ లడ్డూలంటే నారాయణఖేడ్‌ ప్రజలు ప్రాణం పెడతారు. ఏడాదిలో రెండు నెలలు.

Published : 29 Jan 2023 00:04 IST

మోరుండ లడ్డూలంటే నారాయణఖేడ్‌ ప్రజలు ప్రాణం పెడతారు. ఏడాదిలో రెండు నెలలు... వారానికొక్కసారి మాత్రమే దొరికే ఈ లడ్డూలు చాలా ప్రత్యేకమైనవి. ఎందుకంటే..

సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్‌లో చిన్నాపెద్దా ఎవరినడిగినా ఈ మోరుండ లడ్డూల రుచి గురించీ, వాటి గొప్పతనం గురించీ చెబుతారు. ఈ ప్రాంతానికి మాత్రమే పరిమితమైన ఈ లడ్డూలు ఏడాదిలో చలికాలంలో రెండు నెలలు మాత్రమే దొరుకుతాయి. అది కూడా సంత జరిగే మంగళవారం నాడు మాత్రమే తోపుడుబళ్లపై పెట్టి వీటిని అమ్ముతారు. జొన్నగడక, పిస్తా పప్పులు, బెల్లం పాకం, నువ్వులు, సెనగపిండి, పల్లీలు, యాలకులు, లవంగాలు, బాదం, జీడిపప్పు, పుట్నాలు, కొబ్బరిపొడి వేసి వీటిని తయారు చేస్తారు. ఇవి స్థానికంగా తయారుకావు. కర్ణాటకలోని బీదర్‌ ప్రాంతంలో తయారై మంగళవారాలు నారాయణఖేడ్‌ సంతకు చేరుకుంటాయి. చలికాలంలో బలాన్నిస్తాయనీ, వ్యాధినిరోధకశక్తిని పెంచుతాయని, రక్తాన్ని శుద్ధి చేస్తాయనీ, రక్తహీనతని నివారిస్తాయని స్థానికుల నమ్మకం. అందుకే కొన్ని తరాలుగా వీటిని సంతలో ఇష్టంగా కొనుక్కొని తింటూ ఉంటారు. వీటి ధర రూ.30 నుంచి 40 వరకూ ఉంటుంది.

జీవన్‌రావ్‌, నారాయణఖేడ్‌


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని