సెలవుల్లో చిరుతిండి..!

ఎన్ని రకాల స్నాక్స్‌ ఉన్నా ఇంట్లో అమ్మ చేసే చిరుతిండి అంటేనే పిల్లలకి ఆరోగ్యం. అందులోనూ కరకరలాడే చెగోడీలూ రిబ్బన్‌ పకోడీల్లాంటివయితే ఎంతో ఇష్టంగా తింటారు. మరి చేసి చూద్దామా..!

Published : 27 Jun 2021 15:16 IST

మార్కెట్లో ఎన్ని రకాల స్నాక్స్‌ ఉన్నా ఇంట్లో అమ్మ చేసే చిరుతిండి అంటేనే పిల్లలకి ఆరోగ్యం. అందులోనూ కరకరలాడే చెగోడీలూ రిబ్బన్‌ పకోడీల్లాంటివయితే ఎంతో ఇష్టంగా తింటారు. మరి చేసి చూద్దామా..!

మిఠాయి కొమ్ములు

కావలసినవి
సెనగపిండి: 2 కప్పులు, బియ్యప్పిండి: కప్పు, వెన్న: 2 టేబుల్‌స్పూన్లు, ఉప్పు: చిటికెడు, నీళ్లు: కలపడానికి సరిపడా. పాకం కోసం: బెల్లం తురుము: 3 కప్పులు, నీళ్లు: సుమారుగా కప్పు, శొంఠిపొడి: పావుటీస్పూను, యాలకులపొడి: టీస్పూను, నూనె: వేయించడానికి సరిపడా

తయారుచేసే విధానం
* వెడల్పాటి బేసిన్‌లో సెనగపిండి, బియ్యప్పిండి, ఉప్పు, వెన్న వేసి కలపాలి. నీళ్లు కొంచెంకొంచెంగా వేస్తూ కలపాలి.
* బాణలిలో నూనె వేసి కాగనివ్వాలి.
* వెడల్పాటి చిల్లులు ఉన్న చక్కిడాల గిద్ద లోపల కూడా నెయ్యి రాసి పిండి మిశ్రమాన్ని కొంచెంకొంచెంగా పెట్టి చక్కిడాలు వత్తినట్లుగానే వత్తాలి. వేగిన తరవాత పళ్లెంలో వేసి ఆరనివ్వాలి. అలాగే అన్నీ వత్తాక వాటిని చిన్న చిన్న కొమ్ముల్లా వచ్చేలా చిదమాలి.
* విడిగా మందపాటి గిన్నెలో బెల్లం తురుము, నీళ్లు పోసి మరిగించాలి. పాకాన్ని చల్లటి నీళ్లలో వేస్తే ఉండలా వచ్చే వరకూ ఉడికించాలి. చివరగా యాలకులపొడి, శొంఠిపొడి కూడా వేసి కలిపి దించాలి. ఇప్పడు పాకాన్ని చిదిమి ఉంచిన కొమ్ములమీద పోసి బాగా తిప్పాలి. ఆరాక దేనికది విడిపడేలా కొమ్ముల్ని విడదీసి గాలిచొరని డబ్బాలో పెట్టుకుంటే పదిరోజుల వరకూ నిల్వ ఉంటాయి.

చెగోడీలు

కావలసినవి
పెసరపప్పు: 3 టేబుల్‌స్పూన్లు, బియ్యప్పిండి: కప్పు, నెయ్యి లేదా నూనె: 2 టేబుల్‌స్పూన్లు, జీలకర్ర: 2 టీస్పూన్లు, నువ్వులు: 2 టీస్పూన్లు, కారం: ఒకటిన్నర టీస్పూన్లు, నూనె: వేయించడానికి సరిపడా

తయారుచేసే విధానం
* పెసరపప్పుని ఓ గంట నానబెట్టాలి. తరవాత నీళ్లు వంపేసి పక్కన ఉంచాలి.
* గిన్నెలో రెండు కప్పుల నీళ్లు పోసి వేడిచేయాలి. అందులోనే ఉప్పు, నెయ్యి లేదా నూనె, నానబెట్టిన పెసరపప్పు వేసి ఓ నిమిషం కలియతిప్పాలి. నీళ్లు మరగడం మొదలవగానే బియ్యప్పిండి, జీలకర్ర, నువ్వులు వేసి బాగా కలిపి స్టవ్‌ ఆఫ్‌ చేయాలి. పిండి బాగా కలిసిన తరవాత మూతపెట్టి పది నిమిషాలు ఉంచాలి.
* ఇప్పుడు కొంచెంకొంచెంగా పిండిని తీసుకుని గుండ్రని ఉండలా చేసి దాన్ని రెండు చేతులతో నలుపుతూ సన్నగా పాములా చేయాలి. ఇప్పుడు దాన్ని కావలసిన సైజులో చేసి చేగోడీల్లా చేత్తోనే చుట్టి అంచుల్ని అతికించాలి. ఇలాగే అన్నీ చేసుకుని కాగిన నూనెలో వేయించి తీయాలి.

రిబ్బన్‌ పకోడా

కావలసినవి
సెనగపిండి: కప్పు, పుట్నాలపిండి: కప్పు, బియ్యప్పిండి: 4 కప్పులు, కారం: టీస్పూను, జీలకర్ర: 2 టీస్పూన్లు, నువ్వులు: 6 టేబుల్‌స్పూన్లు, పచ్చిమిర్చి తురుము: 2 టీస్పూన్లు, అల్లం తురుము: టీస్పూను, కాగిన నూనె: 3 టేబుల్‌స్పూన్లు, ఉప్పు: తగినంత, నూనె: వేయించడానికి సరిపడా

తయారుచేసే విధానం
* బియ్యప్పిండిలో సెనగపిండి, పుట్నాలపిండి, కారం, జీలకర్ర, నువ్వులు, పచ్చిమిర్చి తురుము, అల్లం తురుము, ఉప్పు వేసి కలపాలి. తరవాత కాగిన నూనె కూడా వేసి బాగా కలపాలి. ఇప్పుడు తగినన్ని నీళ్లు పోసి చక్కిడాల పిండిలా కలపాలి.
* బాణలిలో నూనె పోసి కాగనివ్వాలి. ఇప్పుడు చక్కిడాలు వత్తే మౌల్డ్‌లో రిబ్బన్‌ పకోడా వత్తే ప్లేటు వేసి, పిండి మిశ్రమాన్ని పెట్టి బాణలి నిండుగా వత్తి ఎర్రగా వేయించి తీయాలి. ఇలాగే మొత్తం పిండి మిశ్రమాన్ని చేసుకోవాలి.

నిప్పట్లు

కావలసినవి
బియ్యప్పిండి: 2 కప్పులు, వెన్న: 2 టేబుల్‌స్పూన్లు, మినప్పప్పు: 3 టీస్పూన్లు, పల్లీలు: 3 టీస్పూన్లు, వేయించిన సెనగపప్పు: 4 టేబుల్‌స్పూన్లు, నువ్వులు: 2 టేబుల్‌స్పూన్లు, కారం: టీస్పూను, ఉప్పు: తగినంత, కరివేపాకు: 4 రెబ్బలు, నీళ్లు: తగినన్ని, నూనె: వేయించడానికి సరిపడా

తయారుచేసే విధానం
* సెనగపప్పు కడిగి ఓ గంట నాననివ్వాలి. నీళ్లు వంపేసి పక్కన ఉంచాలి.
* మినప్పప్పు, పల్లీలు వేయించి పక్కన ఉంచాలి. పల్లీల పొట్టు తీయాలి. తరవాత మినప్పప్పు, పుట్నాలపప్పు రెండూ మెత్తగా పొడి చేయాలి. పల్లీలు కచ్చాపచ్చాగా నలగనివ్వాలి.
* వెడల్పాటి బేసిన్‌లో బియ్యప్పిండి, మిక్సీ పట్టిన మినప్పిండి మిశ్రమం, వెన్న, కారం, ఉప్పు, నువ్వులు, నీళ్లు వంపేసి ఆరబెట్టిన సెనగపప్పు, కచ్చాపచ్చాగా రుబ్బిన పల్లీలు వేసి కలపాలి. తరవాత కొంచెం నీళ్లు కూడా పోసి చెక్కల పిండిలా కలుపుకోవాలి. ఇప్పుడు పిండి మిశ్రమాన్ని చిన్న ఉండల్లా చేసి వాటిని ప్లాస్టిక్‌ కాగితం మీద వెడల్పాటి చెక్కల్లా వత్తి కాగిన నూనెలో మీడియం మంటమీద వేయించి తీయాలి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని