జవాన్లే హీరోలు

నలుగురిలో ఒకడిగా ఉండాలనుకోలేదు..అందరిలా ఉద్యోగం చేయాలనుకోలేదు..అలాగని చదువునీ అశ్రద్ధ చేయలేదు..ఇంజినీరింగ్‌ డిగ్రీ చదివి యాక్టర్‌ అయ్యాడు..‘ఉరీ’ చిత్రం గురించి ఎవరైనా మాట్లాడితే తనే గుర్తొస్తాడు..అందుకు ఉత్తమ నటుడిగా జాతీయ అవార్డు అందుకున్నాడు..తన నటతోనే కాదు.. ఫ్యాషన్‌ ఐకాన్‌గానూ యువతకి దగ్గరయ్యాడు విక్కీ కౌశల్‌.. ఇన్నేళ్ల తన సినీ కెరీర్‌.. ఫ్యాషన్‌ ముచ్చట్లు.. ఫిట్‌నెస్‌ సంగతుల్ని ‘ఈతరం’తో పంచుకున్నాడిలా...

Published : 29 Feb 2020 00:48 IST

విక్కీమార్క్‌

నలుగురిలో ఒకడిగా ఉండాలనుకోలేదు..

అందరిలా ఉద్యోగం చేయాలనుకోలేదు..

అలాగని చదువునీ అశ్రద్ధ చేయలేదు..

ఇంజినీరింగ్‌ డిగ్రీ చదివి యాక్టర్‌ అయ్యాడు..

‘ఉరీ’ చిత్రం గురించి ఎవరైనా మాట్లాడితే తనే గుర్తొస్తాడు..

అందుకు ఉత్తమ నటుడిగా జాతీయ అవార్డు అందుకున్నాడు..

తన నటతోనే కాదు.. ఫ్యాషన్‌ ఐకాన్‌గానూ యువతకి దగ్గరయ్యాడు విక్కీ కౌశల్‌.. ఇన్నేళ్ల తన సినీ కెరీర్‌.. ఫ్యాషన్‌ ముచ్చట్లు.. ఫిట్‌నెస్‌ సంగతుల్ని ‘ఈతరం’తో పంచుకున్నాడిలా..

నాకు ముందే తెలుసు..

మొదట్నుంచీ సినిమాలంటే పిచ్ఛి డిగ్రీ చదివేటప్పుడే నిర్ణయించుకున్నా నటుడినవ్వాలని. పైగా.. ఉదయం లేచింది మొదలు రాత్రి పడుకునే వరకూ.. ఉరుకుల పరుగుల జీవితం నాకు నచ్చదు. ముఖ్యంగా 9 టూ 5 ఉద్యోగం. రోజూ నాకు ఛాలెంజింగ్‌గా అనిపించాలి. అందుకు సరైన వేదిక సినిమా. దాంట్లోనే నన్ను నిరూపించుకోవచ్చని నమ్మా. ప్రయత్నాలు మొదలుపెట్టా. ఎన్నో కష్టాలు పడ్ఢా చాలా ఆడిషన్స్‌కి వెళ్లా.. అలా 2012లో మొదటి సినిమాలో అవకాశం వచ్చింది. అప్పటి నుంచి నా నటనకి సాన పెట్టుకుంటూ జర్నీ కొనసాగిస్తున్నా. నేను ఇప్పటి వరకూ ఎక్కింది నాలుగు మెట్లే! ఇంకా చాలా దూరం వెళ్లాలి.

ప్రేక్షకుల ప్రశంసలే ఆస్కార్‌

ఉరీ: ది సర్జికల్‌ స్ట్రైక్‌ సినిమాలో సైనిక అధికారి పాత్రకి బాగా నప్పానని అందరూ అన్నారు. అందుకు కావాల్సిన ఫిట్‌నెస్‌ కోసం చాలా కష్టపడ్ఢా వీర సైనికుడిగా కనిపించాలంటే నటన మాత్రమే సరిపోదు. జీవించాలి. అందుకు రియల్‌ హీరోలైన మన జవాన్లే నాకు ప్రేరణ. అనుక్షణం వారి త్యాగాల్ని గుర్తు చేసుకుంటూ నేనూ ఓ జవాన్‌లా వెండితెరపై నటించా. దానికి ప్రేక్షకుల నుంచి వచ్చిన ప్రశంసలు ఎప్పటికీ గుర్తుండిపోతాయి. వారిని మెప్పిస్తే చాలు నాకు ఆస్కార్‌ వచ్చినట్టే.

కొత్తదనం వెదకాలి..

చేసిన పాత్రల్నే మళ్లీ మళ్లీ చేయడం నాకు నచ్చదు. మనల్ని మనం ఎప్పటికప్పుడు నిరూపించుకోవాలంటే కొత్తదనాన్ని వెదకాలి. నటనా రంగం కావొచ్ఛు. ఉద్యోగ రంగం.. ఎంచుకున్న కెరీర్‌ ఏదైనా. ఒకే కోణంలో ఆలోచించొద్ధు మన పరిధిలో.. మనకున్న సామర్థ్యాన్ని అంచనా వేసుకుంటూ.. ఏ మేరకు సక్సెస్‌ కాగలమో లెక్కలేసుకుంటూ.. ప్రతి ప్రయత్నంలో నిత్య నూతనంగా మనల్ని మనం ఆవిష్కరించుకోవాలి. దాంట్లోనే మనదైన సక్సెస్‌ ఫార్ములా దొరుకుతుంది. నా దగ్గరికి వచ్చే స్క్రిప్ట్‌లను ఇదే కోణంలో నుంచి చూసే ఎంపిక చేసుకుంటా.

నా ఫ్యాషన్‌..

వ్యక్తిగతంగా ఫ్యాషన్‌ని నిర్వచించమంటే.. నాకు సౌకర్యంగా ఉన్నవే నా ఫ్యాషన్‌గా భావిస్తా. మనలోని భావజాలాల్ని మనం ఫాలో అయ్యే ఫ్యాషన్స్‌ ప్రతిబింబిస్తాయి. సందర్భం ఏదైనా ఎక్కువ శాతం నాకు సౌకర్యంగా అనిపించే వాటినే ధరించడానికి ఇష్టపడతా. అలాగే, నాకు ఇష్టమైన వారిని వారికి నచ్చేలా ఉండమంటా. అప్పుడేగా.. ఎదుటివారికి వారెలా ఉంటే బాగుంటామో తెలుస్తుంది. ఇంకా.. ఫ్యాషన్స్‌ నిత్య నూతనం. నా సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా యువతని ఆకట్టుకునేందుకు ట్రెండీ క్యాజువల్స్‌ని ప్రయత్నిస్తుంటా. గ్రాఫిక్‌ టీఫర్టులు, వాటిపై రంగు రంగుల జాకెట్‌లూ వేస్తా.

బాక్సర్‌గా నటించాలి. అదే నా డ్రీమ్‌ రోల్‌.

ఖాళీ సమయాల్లో టీవీ షోలు, సినిమాలు చూస్తుంటా.

జయాపజయాలను సీరియస్‌గా తీసుకోను.

సోషల్‌ మీడియాలో చురుగ్గా ఉంటా!

దయ్యాలంటే భయం..

నాకు హారర్‌ సినిమాలంటే చాలా భయం. ఒక్కడినే అసలు చూడను. ఫ్రెండ్స్‌తో కలిసి తప్పదనుకుంటేనే చూస్తా. ఒక్కోసారి హోటల్‌ గదిలోనూ ఒక్కడినే ఉండాలంటే భయం. లైట్స్‌ ఆన్‌లోనే ఉంచుకుంటా. అయినా అందర్ని భయపెట్టాలని భూత్‌ సినిమా చేశా. ఆ స్క్రిప్ట్‌ చాలా నచ్చింది.

నేను బాగా లాగిస్తా..

నచ్చిన ఆహారం ఏదైనా వెనకా ముందూ చూడకుండా లాగించేస్తా. నేనో పెద్ద ఫుడీని. అయితే, నాకు ఉన్న మరో మంచి లక్షణం ఏంటంటే.. తిన్నది అరిగేదాకా వర్క్‌ అవుట్స్‌ చేయడం. స్ట్రెచెస్‌ ఎక్కువగా చేస్తా. ఛాతీ కింది భాగం, పొట్టకి సంబంధించిన వర్క్‌ అవుట్స్‌పై ఎక్కువ శ్రద్ధ తీసుకుంటా. ఇలా బరువు పెరగకుండా నిత్యం జాగ్రత్త పడతా. ఒక రకంగా నా శరీరతత్వం కూడా స్లిమ్మే. ఎప్పుడూ పెద్దగా లావు కాను. కానీ, నేను నటించే సినిమాలకు అనుగుణంగా బరువు పెరగడం తగ్గడం వంటివి చేస్తుంటా.

తెలుగు నేర్చుకుంటా..

దేనికైనా భాష ముఖ్యం. ఇప్పటికైతే తెలుగు పదాలు పలకడమే రాదు. కానీ తెలుగు నేర్చుకోవాలనుంది. సినిమాలు చూస్తుంటా. ఈ మధ్యే అల.. వైకుంఠపురములో.. చూశా. తెలుగులో నచ్చిన నటుడు ప్రభాస్‌. చాలా నెమ్మదస్తుడు. వెండి తెరపై డైనమిక్‌గా కనిపిస్తారు. బాహుబలి చాలా సార్లు చూశా.

కాలేజీ రోజుల్లో ప్రపోజల్స్‌ అంటే..

కాలేజీ రోజుల్లో ప్రపోజల్స్‌ అమ్మాయిల నుంచైతే ఎప్పుడూ రాలేదు. కానీ, ఎక్కువగా మా ప్రిన్సిపల్‌ నుంచి వచ్చేవి. అటెండెన్స్‌ కోసం ప్రిన్సిపల్‌ ఆఫీస్‌కి రమ్మని పిలిచేవారు. అలాంటి సీరియస్‌ స్టడీ ప్రపోజల్స్‌ వచ్చేవి.●


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని