30వేల కిలోమీటర్ల ప్రేమ!

‘నువ్వంటే నాకెంతో ఇష్టం’ అంది స్మృతీ బదౌరియా... ‘నువ్వైతే నా ప్రాణం’ అన్నాడు కార్తీక్‌ వాసన్‌. ఈ పడుచు జంట ఇలా లెక్కలేనన్నిసార్లు చెప్పుకున్నారు.

Updated : 10 Feb 2024 17:37 IST

‘నువ్వంటే నాకెంతో ఇష్టం’ అంది స్మృతీ బదౌరియా... ‘నువ్వైతే నా ప్రాణం’ అన్నాడు కార్తీక్‌ వాసన్‌. ఈ పడుచు జంట ఇలా లెక్కలేనన్నిసార్లు చెప్పుకున్నారు. ఆ ప్రేమను వ్యక్తం చేయడానికి ఈసారేదైనా కొత్తగా ప్రయత్నిద్దాం అనుకున్నారు మూడున్నరేళ్ల కిందట. వాళ్లదైన ప్రపంచంలో.. వాళ్లే ఉండేలా ప్రపంచంలోనే అత్యంత పొడవైన 30 వేల కిలోమీటర్ల పొడవైన ఓ రోడ్‌ ట్రిప్‌నకు బయల్దేరారు. ఈ వాలంటైన్స్‌ డే కి ఆ ప్రయాణం ముగించబోతున్నారు. ఈ జంట ప్రయాణం ఇప్పుడు అంతర్జాలంలో వైరల్‌ అవుతోంది.

స్మృతి డిజిటల్‌ మార్కెటింగ్‌ కన్సల్టెంట్‌. వాసన్‌ ఐటీ ఉద్యోగి. వాళ్లది ప్రేమ పెళ్లి. సరదాగా ఉండటం, సాహసాలు చేయడం ఇద్దరి నైజం. అన్ని సౌకర్యాలూ ఉన్నప్పుడు ఒకరిపై ఒకరు ప్రేమ చూపించడం తేలిక.. నువ్వూనేనూ ఏకాంతంగా ఉన్నప్పుడే మన ప్రేమ ఎలా ఉంటుందో పరీక్షించి చూద్దాం అనుకున్నారు. రోడ్‌ ట్రిప్‌నకు వెళ్లడమే అసలైన టెస్ట్‌ అనుకున్నారు. వెంటనే రంగంలోకి దిగారు. వాళ్లు మొదలు పెట్టింది చిన్నాచితకదేం కాదు! పాన్‌-అమెరికన్‌ హైవే రోడ్డు ప్రయాణం. ఇది ప్రపంచంలోనే అతి పొడవైన జాతీయ రహదారి. పదిహేను దేశాల గుండా 30 వేల కిలోమీటర్లపైనే సాగుతుంది. ఉత్తర అమెరికా ఖండం కెనడాలోని ఒంటారియోలో మొదలై, దక్షిణ అమెరికా అర్జెంటీనాలో ముగుస్తుంది. అసలు ఎందుకింత సాహసం అంటే.. ప్రేమ పరీక్షతోపాటు కదిలించే కథలూ చెబుతారు. కరోనా సమయంలో కొందరు సన్నిహితులు, బంధువులను కోల్పోయారట. చనిపోయినవారు ఆ సమయంలో ఎంతో ప్రేమరాహిత్యం బారినపడటం గమనించారట. చావు ఎప్పుడెలా ముంచుకొస్తుందో చెప్పలేం.. ఈ ప్రపంచం నుంచి నిష్క్రమించకముందే ప్రపంచాన్ని ఒక్కసారి ప్రేమగా చుట్టి రావాలనే నిర్ణయానికొచ్చారు. అన్నట్టు ఈ ఇద్దరూ యాత్ర కోసం చేస్తున్న ఉద్యోగాలనేం వదిలేయలేదు. పని, ప్రయాణం రెండూ కొనసాగేలా.. తమతమ బాస్‌లను ఒప్పించారు.

మంచి కండిషన్‌లో ఉన్న ఓ వ్యాను కొని దాన్ని ఒక హోటల్‌లా మార్చేశారు. కిచెన్‌, పడకగదీ ఏర్పాటు చేసుకున్నారు. ఆగస్టు 15, 2020న యాత్ర మొదలైంది. అప్పట్నుంచి జర్నీలో తమకెదురైన ప్రతి దృశ్యం, సంఘటన, వింతలు, ప్రత్యేకతలు.. ప్రతీదీ ఒడిసిపట్టి తమ ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలో పంచుకుంటున్నారు. ముఖ్యంగా ప్రేమకు ప్రతిరూపమైన ఏ కట్టడాన్నీ వదలకుండా సందర్శించారు. ప్రస్తుతం వీళ్లని దాదాపు తొంభై వేల మంది అనుసరిస్తున్నారు. ఈ జంట యాత్ర చివరికొచ్చేసింది. ప్రస్తుతం అర్జెంటీనాలో ఉన్నారు. మూడున్నరేళ్లుగా సాగుతున్న ఈ యాత్రలో వీళ్లకి రకరకాల అనుభవాలు ఎదురయ్యాయి. సమస్యలూ తక్కువేం కాదు. మంచు తుఫాన్లలో చిక్కుకున్నారు. దారి తప్పి వేల కిలోమీటర్లు ప్రయాణించారు. పని చేసేటప్పుడు ఒక్కోసారి ఇంటర్నెట్‌ ఉండకపోయేది. రెస్టరంట్‌, హోటల్‌ ఎక్కడో ఓ చోట ఆపి, వైఫై ద్వారా ఆఫీసు పనులు చక్కబెట్టేవారు. రాత్రిపూట సోలార్‌ రూఫ్‌ పని చేయక కొన్నిసార్లు చీకట్లోనే మగ్గిపోయేవారు. ఎన్ని ఆటంకాలు ఎదురైనా తమ యాత్రను మధ్యలోనే విరమిద్దామనే ఆలోచన మాత్రం చేయలేదు. ‘ప్రయాణం జీవితంలాంటిదే. ఎన్నో తీయటి అనుభవాలు, ఇబ్బందులూ ఉంటాయి. అయినా ముందుకెళ్లాం. ఒకరికొకరం మరింత దగ్గరయ్యాం. ఈ ప్రయాణంలో ఎన్నో కొత్త విషయాలు తెలుసుకున్నాం. మా సాహస యాత్రతో ప్రపంచ ప్రేమికుల పుస్తకంలో మాకంటూ ఓ పేరా దక్కినా చాలు’ అంటోందీ ప్రేమజంట.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని