సృజనాత్మకం.. సమాజహితం.. చేజిక్కిన విజయం!

ప్రతి వ్యాపారం పరమావధి లాభమే అయ్యుండొచ్చు! కానీ దానికి సృజనాత్మకత జోడిస్తే పదుగురి నోళ్లలో నానొచ్చు... ఆ వ్యాపారానికి సమాజహితమూ తోడైతే.. అందరితో ప్రశంసలు పొందొచ్చు...

Updated : 17 Feb 2024 03:24 IST

ప్రతి వ్యాపారం పరమావధి లాభమే అయ్యుండొచ్చు! కానీ దానికి సృజనాత్మకత జోడిస్తే పదుగురి నోళ్లలో నానొచ్చు... ఆ వ్యాపారానికి సమాజహితమూ తోడైతే.. అందరితో ప్రశంసలు పొందొచ్చు... సేవనూ కలిపితే భావితరాలకు మార్గదర్శకులుగా నిలవొచ్చు... ఈ ముగ్గురు యువతరంగాలు చేస్తోంది అదే.


రుచి‘ఖర’మైన పాలతో..

ఆ తల్లిదండ్రులకు ముగ్గురూ కుమార్తెలే. తమ కోసం కన్నవాళ్లు పడుతున్న కష్టాలు, బాధ్యతల్ని మోసేలా వ్యాపారం చేయాలనుకుంది పెద్ద కూతురు పగిళ్ల భూమిక రెడ్డి. మార్కెట్‌లో పోటీ తక్కువగా ఉండి, జనాలకు ఆరోగ్యం అందించే గాడిద పాల ఉత్పత్తి కేంద్రాన్ని ప్రారంభించింది.

భూమికది యాదాద్రి భువనగిరి జిల్లా సింగరాయచెర్వు. అగ్రికల్చర్‌ బీఎస్సీ పూర్తి చేసింది. ‘అంత చదువు చదివీ గాడిద పాల వ్యాపారం చేస్తావా?’, ‘ఇది చాలా శ్రమతో కూడిన పని. అమ్మాయివి.. నువ్వు చేయగలవా?’ వెనక్కి లాగే ఇలాంటి మాటలెన్నో వింది మొదట్లో. అయినా అడుగు ముందుకే వేసింది. వ్యాపారం ప్రారంభించే ముందు కొన్నాళ్లు పరిశోధన చేసింది. గూగుల్‌లో గాలించింది. అనుభవజ్ఞులను కలిసింది. ఈ క్రమంలో గాడిద పాలతో అనేక రకాల అనారోగ్య సమస్యలు నయమవుతాయని తెలుసుకుంది. సౌందర్య ఉత్పత్తులు, సబ్బుల తయారీలోనూ పాలని ఉపయోగిస్తారని గ్రహించింది. పైగా డిమాండ్‌కు తగ్గట్టుగా ఉత్పత్తి లేకపోవడంతో.. పోటీ తక్కువగా ఉంటుందని భావించింది. వాళ్లకున్న మూడెకరాల స్థలంలోనే షెడ్డు నిర్మాణం చేశారు. మహారాష్ట్రకు వెళ్లి మేలుజాతి గాడిదలు తీసుకొచ్చారు. గాడిదలకు ఆహారం కోసం 15 ఎకరాల భూమిని కౌలుకు తీసుకుని పచ్చిగడ్డిని పెంచుతున్నారు. వీటిద్వారా వచ్చిన పాలను తమిళనాడులోని ఓ ప్రైవేటు సౌందర్య సాధనాల ఉత్పత్తి కంపెనీకి సరఫరా చేసేలా ముందే ఒప్పందం కుదుర్చుకున్నారు. పేడ, మూత్రాలను సేంద్రియ పంటల సాగుకు ఉపయోగిస్తున్నారు. మొదట్లో నిర్వహణపరమైన ఇబ్బందులు వచ్చినా.. వాటిని అధిగమిస్తూ వెళ్లింది భూమిక. ‘గాడిద పాలు తాగితే రోగనిరోధకశక్తి పెరుగుతుంది. శ్వాస, చర్మ సంబంధ సమస్యలు తగ్గుతాయి. కీళ్లనొప్పులకు ఈ పాలు చక్కని పరిష్కారం. ఇది ఆయుర్వేద వైద్య నిపుణులు చెబుతున్న మాట. మాకు ఆర్థికంగా ఉపయోగం.. జనాలకు ఆరోగ్యం మేలు కలుగుతుంది కాబట్టే.. ఈ ఫామ్‌ ప్రారంభించా’ అంటోంది భూమిక. అన్నట్టు తన బిజినెస్‌ టర్నోవరు ఇప్పుడు కోట్లలోకి చేరింది.

గోపగాని మనోజ్‌


ప్లాస్టిక్‌ని పునర్వినియోగించేలా..

బీటెక్‌ పూర్తైంది. మంచి వేతనంతో ఉద్యోగాలు ఊరిస్తున్నాయి. అయినా సొంత వ్యాపారం బాట పట్టాడు బొంకూరి శ్రీకాంత్‌. పైగా పర్యావరణ హితమైంది ఎంచుకున్నాడు. అదే ఆశయంతో 2022లో ప్లాస్టిక్‌ని పునర్వినియోగించే ముడిసరుకు తయారీ పరిశ్రమ ప్రారంభించాడు. పదిమందికి ఉపాధీ కల్పిస్తున్నాడు.

శ్రీకాంత్‌ది పెద్దపల్లి మండలం కాసులపల్లి. మెకానికల్‌ ఇంజినీరింగ్‌ చదివేటప్పుడే ప్లాస్టిక్‌ సైన్స్‌పై అవగాహన ఏర్పడింది. అప్పుడే ప్లాస్టిక్‌ వ్యర్థాల నుంచి ముడిసరుకు తయారు చేసే పరిశ్రమ ఏర్పాటు చేయాలనుకున్నాడు. తర్వాత సీపెట్‌, ఎంఎస్‌ఎంఈలో ప్లాస్టిక్‌ సైన్స్‌పై శిక్షణ పొందాడు. ఆపై స్నేహితుడు హరీశ్‌తో కలిసి సుల్తానాబాద్‌ మండలం భూపతిపూర్‌లో రెండెకరాల స్థలం లీజుకు తీసుకొని ‘బ్రహ్మోత్సవ్‌ ఇండస్ట్రీస్‌’ పేరుతో అంకుర సంస్థ ఏర్పాటు చేశాడు. చట్టుపక్కల గ్రామాల్లో సేకరించిన ప్లాస్టిక్‌ కుర్చీలు, పైపులు, డ్రమ్ములు తదితర వ్యర్థాల నుంచి యంత్రాల సాయంతో ప్లాస్టిక్‌ సామగ్రి తయారీలో ఉపయోగించే ముడి సరకును తయారు చేస్తున్నారు. మొదట్లో నిర్వహణ, టెక్నాలజీ పరమైన ఇబ్బందులు వచ్చాయి. వాటిని అధిగమించడానికి దాదాపు రెండేళ్లు పట్టింది. వ్యర్థాలను కూలీల ద్వారా సేకరిస్తున్నారు. ప్రస్తుతం నెలకు 50 టన్నుల ముడిసరుకు తయారు చేసి హైదరాబాద్‌, బెంగళూరు, ముంబయి నగరాల్లోని ప్లాస్టిక్‌ వస్తువుల తయారీ కేంద్రాలకు ఎగుమతి చేస్తున్నారు. విద్యుత్తు బిల్లులు, కూలీల జీతభత్యాలు, నిర్వహణ ఖర్చులు పోగా నెలకు రూ.5 లక్షల వరకు ఆదాయం వస్తుందంటున్నాడు శ్రీకాంత్‌. ప్రత్యక్షంగా 20 మందికి, పరోక్షంగా ఎంతోమందికి ఉపాధి కల్పించడమే కాదు.. ఈ స్టార్టప్‌ ద్వారా ప్లాస్టిక్‌ వ్యర్థాలను పునఃవినియోగించి పర్యావరణానికి మేలు చేస్తున్నామన్న సంతృప్తి మిగులుతోంది అంటున్నాడు.

బొగిరి అశోక్‌కుమార్‌, సుల్తానాబాద్‌


ప్రతిభే నిలబెట్టింది..

ఐదేళ్ల వయసున్నప్పుడు పోలియో బారిన పడ్డాడు. చదువుకోవడానికి చాలా ఇబ్బందులు పడ్డాడు. ఒకానొక సమయంలో తనువే చాలిద్దామనుకున్నాడు. తర్వాత తనకు తానే ఓదార్పు చెప్పుకొని సొంత కంపెనీకి యజమాని అయ్యాడు. ఇతరులకు ఉపాధి కల్పించేస్థాయికి ఎదిగాడు గాడి భాస్కర్‌రెడ్డి.

భాస్కర్‌ సొంతూరు నెల్లూరు జిల్లాలోని ఉదయగిరి పక్కన వడ్లమూడిపల్లి. వైద్య సౌకర్యాలు పెద్దగా ఉండేవి కావు. చిన్న వయసులోనే పోలియో సోకింది. కుమారుడిని బాగు చేయించడానికి కన్నవాళ్లు అన్ని ప్రయత్నాలూ చేశారు. ఆఖరికి జీవనాధారం అయిన గేదెల్నీ అమ్మేశారు. కొంచెం ఫలితం కనిపించిందిగానీ పూర్తిగా కోలుకోలేకపోయాడు భాస్కర్‌. కుటుంబ సభ్యుల సహకారంతోనే డిగ్రీ వరకు పూర్తి చేశాడు. తర్వాత ఉస్మానియా యూనివర్సిటీ నుంచి 2015లో ఎంబీఏ పూర్తి చేశాడు. ఈ సమయంలోనే ఓ చేదు సంఘటన ఎదురైంది. అన్ని అర్హతలు ఉన్నా.. తనకున్న వైకల్యం కారణంగా అతడికి ఉద్యోగం ఇవ్వడానికి నిరాకరించింది ఓ కంపెనీ. తీవ్ర నిరాశలో కూరుకుపోయాడు. అందరికీ భారం అవుతానేమోనని భావించి.. ఒకానొక సమయంలో తన జీవితమే వ్యర్థం అనుకున్నాడు. అయితే కాలం ఎలాంటి గాయాలనైనా మాన్పుతుంది కదా! మరింత కసితో ప్రయత్నించి బెంగళూరులో ఒక ఐటీ కంపెనీలో ఉద్యోగం సంపాదించాడు. తర్వాత చెన్నైలో పని చేశాడు. మంచి జీతం వస్తున్నా.. తనలాంటి చేదు అనుభవం మరెవరికీ ఎదురు కాకూడదని 2020లో ‘బీగాడి బిజినెస్‌ సొల్యూషన్స్‌’ పేరుతో సొంత కంపెనీ ప్రారంభించాడు. ఇది కృత్రిమ మేధ టెక్నాలజీ ద్వారా వెబ్‌ అప్లికేషన్లు, మొబైల్‌ అప్లికేషన్లు, బ్యాంకింగ్‌ అప్లికేషన్లు తయారు చేసి అందిస్తుంది. అమెరికాలోని కొన్ని కంపెనీలకు మార్టిగేజ్‌, బ్యాంకింగ్‌ అప్లికేషన్లూ తయారు చేస్తోంది. మొదట్లో ఈ కంపెనీలను ఒప్పించి ప్రాజెక్టులు రప్పించేందుకు చాలానే కష్టపడ్డాడు భాస్కర్‌. నా అవకరాన్ని కాదు.. నా ప్రతిభను చూసి ప్రాజెక్టులు ఇవ్వమని బతిమాలాడు. కంపెనీ ప్రారంభించిన కొత్తలో సీనియర్లు లేకపోవడంతో అన్నీ తానై నడిపించాడు. ప్రస్తుతం ప్రతిభ ఉంటే చాలు దివ్యాంగులకైనా ఉద్యోగాలిస్తున్నాడు. సంస్థ పనితీరుకు అనుగుణంగా శిక్షణ కొనసాగిస్తున్నాడు. అన్నట్టు ఈ సంస్థ పూర్తిస్థాయిలో అందరికీ వర్క్‌ ఫ్రం హోం పద్ధతిలో కొనసాగుతోంది. వైకల్యం ఉన్నవారికి ప్రయాణాలు చేయడం ఇబ్బందిగా ఉంటుందనే ఈ వెసులుబాటు. ఈ సంస్థ స్టార్టప్‌ ఇండియా డీపీఐఐటీ గుర్తింపు పొందిన స్టార్టప్‌గా ఎంపికైంది. దీనికింద పన్ను మినహాయింపు పొందుతున్నాడు. ఒకప్పుడు బతుకే వ్యర్థం అనుకున్న వ్యక్తి ప్రత్యక్షంగా, పరోక్షంగా యాభై మందికి ఉపాధి కల్పిస్తున్నాడు. అదీగాక ఉద్యోగం కొనసాగిస్తూనే.. సంస్థనూ నిర్వహిస్తున్నాడు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని