కళవరమాయే మదిలో!

సరదాలు.. సినిమాలు.. సామాజికమాధ్యమాలు.. కుర్రాళ్లంటే ఇంతేనా? కాదుకాదు.. అప్పుడప్పుడు సంప్రదాయాలకూ జై కొడతారు. కళల్నీ మదిలో నిలుపుకుంటారు. ఐటీ కొలువులు.. అంకురాల పలవరింతలు మాని కళనే కెరియర్‌గా మలచుకుంటారు. తమదైన ప్రతిభతో జనం మనసులు గెలుచుకుంటారు. వాళ్లు కొట్టే చప్పట్లనే నిచ్చెన మెట్లుగా మార్చుకుంటారు.

Published : 09 Mar 2024 00:04 IST

సరదాలు.. సినిమాలు.. సామాజికమాధ్యమాలు.. కుర్రాళ్లంటే ఇంతేనా? కాదుకాదు.. అప్పుడప్పుడు సంప్రదాయాలకూ జై కొడతారు. కళల్నీ మదిలో నిలుపుకుంటారు. ఐటీ కొలువులు.. అంకురాల పలవరింతలు మాని కళనే కెరియర్‌గా మలచుకుంటారు. తమదైన ప్రతిభతో జనం మనసులు గెలుచుకుంటారు. వాళ్లు కొట్టే చప్పట్లనే నిచ్చెన మెట్లుగా మార్చుకుంటారు. శరత్‌చంద్ర, రేణుకుమార్‌, భరత్‌శర్మలు ఆ తరహానే. తమ కళ వరం ముచ్చట్లు ఈతరంతో పంచుకున్నారు.


నాట్యమే.. భవిష్యత్తుగా

నాన్నకు నాటకాలు వేసిన అనుభవం ఉంది. ఆ ప్రేరణతోనే నాట్యంపై మమకారం పెంచుకున్నాడు. కళ కోసం సొంత ఊరినీ వదిలి వచ్చేశాడు. 32ఏళ్ల వయసు వచ్చేసరికి దేశ, విదేశాల్లో 2వేలకు పైగా ప్రదర్శనలు ఇచ్చాడు శరత్‌చంద్ర.

రత్‌ సొంతూరు కర్నూలు. నాన్నకు నాటకాలంటే విపరీతమైన ఇష్టం. గతంలో స్వయంగా కొన్ని డ్రామాలు వేశారు. ఆయన ప్రభావంతోనే తనకీ కళలపై ఆసక్తి మొదలైంది. అలా మూడో తరగతిలోనే భరతనాట్యంలో ప్రవేశించాడు. తర్వాత మెరుగైన శిక్షణ కోసం కుటుంబం తిరుపతికి మారింది. అక్కడ డిప్లొమో పూర్తి చేసిన ఆరు నెలల్లోనే పలు సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొన్నాడు.

‘అబ్బాయి అయ్యుండీ.. అమ్మాయిలా నాట్యం చేయడమేంట’ని మొదట్లో కొందరు అవహేళన చేసేవారు. కానీ కళకు ఆ భేదాలేం ఉండవు కదా! ముందుకే సాగాడు. 2005లో ఈటీవీ ‘ఆంధ్రావాలా డ్యాన్స్‌ షో’లో పాల్గొని తొలి నాట్య ప్రదర్శన ఇచ్చాడు. అక్కడినుంచి తన ప్రస్థానం ఊపందుకుంది. 2012లో దూరదర్శన్‌లో బీ గ్రేడ్‌ డ్యాన్సర్‌గా ఎంపికయ్యాడు. ఆపై జిల్లా, రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయస్థాయులో రెండువేల వరకు ప్రదర్శనలు ఇచ్చాడు. ఏడేళ్ల నుంచి ప్రతి శివరాత్రికి నేపాల్‌లోని పశుపతినాథ్‌ ఆలయంలో తన నాట్య ప్రదర్శన తప్పకుండా ఉంటుంది. ఐదేళ్లనుంచి శ్రీలంకలో వివిధ సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొంటున్నాడు. మలేసియా తెలుగు సంఘం ఉగాది పురస్కారాల కార్యక్రమంలో భాగస్వామి అయ్యాడు. థాయ్‌లాండ్‌లో కృష్ణాష్టమి, వినాయకచవితి వేడుకల్లోనూ సందడి చేశాడు. ఇటీవలే దుబాయ్‌లోని గ్లోబల్‌ విలేజ్‌ సంస్థ నిర్వహంచిన సదస్సులో భరతనాట్యం ప్రదర్శించాడు.

కళలో ప్రావీణ్యం ఉంటే.. గుర్తింపు దానంతటే అదే దక్కుతుంది. 2017లో యూనివర్సిటీ ఆఫ్‌ సౌతాఫ్రికా, అకాడెమీ ఆఫ్‌ యూనివర్సల్‌ గ్లోబల్‌  శరత్‌కి గౌరవ డాక్టరేట్‌లు బహుకరించాయి. కౌలాలంపూర్‌ వాసులు ‘మలేసియన్‌ నాట్య మయూర’ బిరుదుతో సత్కరించారు. ఇవికాకుండా ‘నాకు అత్యంత సంతృప్తి కలిగించిన విషయాలేంటంటే.. ఒకవైపు ప్రదర్శనలు ఇస్తూనే పలువురు విద్యార్థులకు శిక్షణనిస్తున్నాను. ఒకప్పుడు ప్రదర్శనకు వెళ్లినచోటే.. ఆ కార్యక్రమాలకు న్యాయనిర్ణేతగా వ్యవహరిస్తున్నాను. పవిత్రమైన అష్టాదశశక్తి పీఠాలు, ద్వాదశ జ్యోతిర్లింగాలు ఉన్న పుణ్యక్షేత్రాలన్నింటిలో నాట్యప్రదర్శనలు చేయాలనేదే నా కోరిక’ అంటున్నాడు ఈ యువ నాట్యాచార్యుడు.

పిల్లనగోయిన రాజు, తిరుపతి


రేణుగానం

సంగీత నేపథ్య కుటుంబం కాదు.. ప్రోత్సహించేవాళ్లు లేరు. సొంతంగా నేర్చుకుందామనుకుంటే పేదరికం.  అయినా ఎందుకో తెలియదు.. ముందునుంచీ పాడాలనే కోరిక అతడిలో బలంగా ఉండేది.  తిరుమల తిరుపతి దేవస్థానం ఎస్వీ సంగీత నృత్య కళాశాల అతడికి కళాలయంగా కనిపించింది. ఇప్పుడు  సినిమాల్లో పాడేంతగా ఎదిగాడు రేణుకుమార్‌.

బాలకృష్ణ నటించిన ‘వీరసింహారెడ్డి’లో ‘మా బావ మనోభావాలు దెబ్బతిన్నాయ్‌..’ పాట కుర్రకారును బాగా ఊపేసింది. దాన్ని పాడింది రేణునే. తనది పుట్టపర్తి జిల్లా గరుడంపల్లి. చిన్నప్పట్నుంచీ పాట ఏదైనా వినపడితే చెవులు రిక్కించేవాడు. గాయకుల గాత్రాలకు అనుగుణంగా తాళం వేసేవాడు. వయసు పెరిగేకొద్దీ సింగర్‌ కావాలనే కోరిక రేణుకుమార్‌లో బలపడసాగేది. కానీ సంగీతం నేర్పే గురువులు లేరు. శిక్షణ తీసుకుందామంటే పేద కుటుంబం. అయినా తన కోరిక చంపుకోలేదు. దారులు వెతికాడు. తిరుపతిలోని ఎస్వీ సంగీత నృత్య కళాశాల తనకో మార్గంగా కనిపించింది. అందులో చేరిపోయాడు. గాత్ర గురువు వల్లూరి సురేష్‌బాబు శిష్యరికంలో ప్రవీణ, డిప్లొమా కోర్సులు పూర్తిచేశాడు. శ్రీవేంకటేశ్వర విశ్వవిద్యాలయం అంతర్‌ కళాశాలల యువజనోత్సవాల్లో తన గళంతో అలరించాడు. అప్పట్నుంచి వెనుదిరిగి చూసుకోలేదు. 2017లో ‘ఈటీవీ-పాడుతా తీయగా’లోనూ ప్రతిభ చూపాడు. దివంగత దిగ్గజ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ప్రశంసలు అందుకున్నాడు. 2018 నుంచి సినీ, జానపద పాటలు పాడాడు. సొంతంగా ఆల్బమ్స్‌ విడుదల చేశాడు. కొన్నాళ్లకు సినిమా సంగీత దర్శకుల దృష్టిలో పడ్డాడు. తమన్‌, అనూప్‌ రూబెన్స్‌, కోటి తదితరుల సంగీతంలో పాడాడు. పలు ప్రైవేటు సంగీత కార్యక్రమాల్లో ప్రముఖ గాయకులు సునీత, మనో, శ్రీకృష్ణ తదితరులతోనూ కలిసి పాటలు పాడి గుర్తింపు తెచ్చుకున్నాడు.

ఉదయ్‌కుమార్‌, తిరుపతి


వయసు 18.. అవధానాలు 65

డిగ్రీ విద్యార్థి అంటే స్నేహితులతో సరదాల్లో తేలిపోతాడు. మహా అయితే కొలువు కోసం ఇప్పట్నుంచే సిద్ధమవుతాడు. కానీ 18 ఏళ్ల ఉప్పలదడియం భరత్‌శర్మ ఏకంగా 65 అష్టావధానాలు చేశాడు. మృదంగ విద్వాంసుడిగానూ రాణిస్తున్నాడు.

వధానం చేయడం అంటే మాటలు కాదు. భాషపై పట్టుండాలి. విషయ పరిజ్ఞానం దండిగా ఉండాలి. ఏకకాలంలో పలువురు నిపుణులకు సమాధానం ఇవ్వగల నేర్పు కావాలి. అంతటి కఠినమైన ప్రక్రియను 18 ఏళ్ల కుర్రాడు 65సార్లు విజయవంతంగా చేయడం అంటే.. అది ఎన్నో రికార్డుల కిందే లెక్క. తిరుపతి కుర్రాడు భరత్‌శర్మ అంతటి ఘనాపాఠీనే. అందులోనూ ఒక శతావధానం, ఒక సంస్కృత అష్టావధానం, అయిదు ద్విగుణిత అష్టావధానాలున్నాయి. 2021లో కరోనా సమయంలో ఆన్‌లైన్‌ వేదికగా తన తొలి అష్టావధానం చేశాడు. అక్కడ నుంచి వెనుదిరిగి చూడలేదు. తెలుగు రాష్ట్రాలతోపాటు బెంగళూరు, చెన్నై తదితర ప్రాంతాల్లో అష్టావధానాలు చేస్తూ తెలుగు వెలుగు కోసం పాటుపడుతున్నారు. విద్యార్థులకు తనదైన శైలిలో అవగాహన కల్పిస్తున్నారు. చిన్న వయసులోనే అవధాన బాలభాస్కర, అవధాన బాలసరస్వతి, అవధాన కళారంజక, సవ్యసాచి, కేసరి వంటి ఎన్నో పురస్కారాలు అందుకున్నాడు. తల్లిదండ్రుల ప్రేరణతో ఈ ప్రక్రియలోకి దిగాడు. వద్దిపర్తి పద్మాకర్‌, బాల సుబ్రహ్మణ్యశర్మ శిష్యరికంలో  రాటు దేలిపోయాడు. అవధానాల ఆవశ్యకత భరత్‌శర్మ మాటల్లో చెప్పాలంటే.. ‘నేటి విద్యార్థులు చదువుకున్నది గుర్తుపెట్టుకోవటం చాలా కష్టతరంగా మారింది. ఆ గుర్తుపెట్టుకున్న అంశాలను ఎక్కడ ఆచరించాలో తెలియక కష్టపడుతున్నారు. అవధానం ద్వారా ఏకాగ్రతను పెంచుకోవచ్చు. మన మనసు ఏకాగ్రతనే అవధానం అంటారు. పిల్లలు, పెద్దలు ఏకాగ్రతను పెంచుకుని తమ రంగాల్లో ఉన్నత స్థానానికి చేరుకోవచ్చనేది అవధానం నిరూపించింది. ఇది నేర్చుకోవాలంటే మొదట తెలుగు భాషపై అవగాహన, అధికారం ఉండాలి. తొలిగా తల్లి భాషను ప్రేమించాలి. తెలుగు భాషలో ఎప్పుడైతే పరిశోధన చేస్తామో.. వాటిపై మక్కువ పెంచుకుంటామో ఆనాడు పద్యమైనా, చమత్కారమైనా, రసానుభూతి అయినా వాటి ఆనందాన్ని పొందే అవకాశం అవధానం ద్వారా కలుగుతుంది.’ అంటున్నాడు.

సీహెచ్‌ సుబ్రహ్మణయం, రాజమహేంద్రవరం


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని