రక్తదానానికి.. చేయూత్‌

సినిమాలు చూడొద్దు...చాటింగ్‌ తగ్గించాలి..సరదాలు మానేయాలి...ఇలా చేయమని ఎవరైనా యూత్‌కి చెప్పండి. చూపులతోనే కాల్చేస్తారు. కోపమొచ్చి కొట్టినా కొట్టేస్తారు. కానీ ఓ నలుగురు కుర్రాళ్లు మాత్రం వారికి వారిగానే ఇవన్నీ చేస్తున్నారు.

Updated : 20 Jan 2024 05:23 IST

సినిమాలు చూడొద్దు...చాటింగ్‌ తగ్గించాలి..సరదాలు మానేయాలి...ఇలా చేయమని ఎవరైనా యూత్‌కి చెప్పండి. చూపులతోనే కాల్చేస్తారు. కోపమొచ్చి కొట్టినా కొట్టేస్తారు. కానీ ఓ నలుగురు కుర్రాళ్లు మాత్రం వారికి వారిగానే ఇవన్నీ చేస్తున్నారు. తాము స్వయంగా రక్తదానం చేస్తూ.. సరదాలన్నీ మానుకొని ఎందరినో ఆ మార్గంలోకి రప్పిస్తున్నారు. ఆపదల్లో ఆదుకుంటూ ప్రాణదాతలుగా నిలుస్తున్నారు.


ఉపాధ్యాయుడి ప్రేరణతో..

రక్తదానం.. చూడటానికి చిన్న సేవే. కానీ సమయానికి దాతలు దొరకకపోతే ప్రాణమే పోతుంది. ఈ విషయం మంచి మనసున్న వాళ్లకి తెలుసు. ఒక సంఘటన.. ఒక సందర్భం.. ఎవరో ఒకరు చెప్పిన మాట.. ఒక మనిషి వాళ్లలో సేవా స్ఫూర్తి రగిలిస్తారు. నంద్యాల కుర్రాడు ఠాగూర్‌ ఫణీంద్ర కుమార్‌కి చదువుకునే రోజుల్లోనే ఉపాధ్యాయుడు బాపూజీనాయక్‌ అలా ప్రేరణ కలిగించాడు. ఆ స్ఫూర్తితో స్నేహితులతో కలిసి ప్రతి ఆదివారం వృద్ధులు, దివ్యాంగులు, అనాథలకు ఆశ్రమాల్లో ఆహారాన్ని పంపిణీ చేయడం ప్రారంభించాడు. బీటెక్‌లో 20 మంది స్నేహితులతో కలిసి ‘ఫ్రెండ్స్‌ ఫర్‌ సేవా’ అనే సంస్థ ప్రారంభించాడు. సొంతంగా పైసాపైసా కూడబెట్టడమే కాదు.. తోటి విద్యార్థుల నుంచి రూ.లక్షల చందాలు పోగు చేశాడు. ఎంబీబీఎస్‌, ఇతర పేద విద్యార్థుల చదువుకు సాయం చేశాడు. రక్తదానం ఓ నిండు ప్రాణాన్ని నిలబెడుతుందనే ఉద్దేశంతో ఇప్పటికి 84సార్లు రక్తదానం చేశాడు. తన సంస్థ ద్వారా 1,600 మందితో చేయించాడు. అతడి వివాహ సమయంలో శిబిరాన్ని ఏర్పాటు చేసి భార్యతో కలిసి రక్తదానం చేశాడు. ఇతడి సేవా కార్యక్రమాలను గుర్తించిన కర్ణాటక ప్రభుత్వ ఆరోగ్య శాఖ సన్మానం చేసి, ప్రశంసా పత్రంతో అభినందించింది. ఆసుపత్రులు, బస్టాండ్‌ ప్రాంతాల్లో అన్నార్థుల కోసం ‘హంగర్‌ ఫ్రీ నంద్యాల’ అనే కార్యక్రమాన్ని కూడా ప్రారంభించాడు ఫణీంద్ర.
- కె ప్రేమ్‌కుమార్‌


తల్లి ప్రాణాపాయం నుంచి..

తన తల్లికి శస్త్రచికిత్స చేయాలని, అందుకు రక్తం అవసరమని వైద్యులు సూచించారు. ఎవరిని అడిగినా ముందుకు రాలేదు. తనదీ అదే బ్లడ్‌ గ్రూప్‌ కావడంతో తల్లికి రక్తదానం చేసి శస్త్రచికిత్స చేయించాడు. ఆరోజు నిశ్చయించుకొని, బలమైన సంకల్పంతో సమాజ సేవకు ముందడుగు వేశాడు సూర్యాపేట జిల్లా జగన్నాథపురానికి చెందిన షేక్‌ జానీ. తర్వాత నలుగురు స్నేహితులతో కలిసి ‘మదర్‌ థెరిస్సా ట్రస్ట్‌’ అనే వాట్సప్‌ గ్రూప్‌ను ప్రారంభించి తమని సంప్రదించిన వారికి రక్తదానం చేస్తున్నాడు. ఇప్పటి వరకు స్నేహితుల సహకారంతో తెలుగు రాష్ట్రాల్లో సుమారు 2వేల మందికి పైగా రక్తం అందించినట్లు చెబుతున్నాడు. ఇతడి సేవలకు గుర్తింపుగా భారత్‌ సేవారత్న, తెలుగువెలుగు స్ఫూర్తి నంది పురస్కారం... తదితర అవార్డులు అందుకున్నాడు. ‘ప్రకృతిలో కృత్రిమంగా తయారు చేయలేనిది రక్తం. పైసా ఖర్చు లేకుండా ప్రాణాలు నిలబెట్టే ఈ మహత్కార్యానికి అందరూ అర్హులే. ముఖ్యంగా యువత పెద్దఎత్తున ముందుకు రావాలి. సామాజిక మాధ్యమాల ద్వారా ఎన్నో అనవసర విషయాలు వైరల్‌ అవుతున్నాయి. ఆ మాధ్యమాన్ని ఉపయోగించుకొని సేవకు మనం కదలాలి’ అంటున్నాడు జానీ.
- మనోజ్‌ గోపగాని


సంఘటనలే మార్చాయి

సొంతవాళ్లే ప్రాణాపాయ స్థితిలో ఉన్నా రక్తం ఇవ్వడానికి చాలామంది వెనకాడతారు. కానీ ముక్కూమొహం తెలియని ఎవరైనా సరే.. రక్తం అవసరం ఉంది అని ఒక్క ఫోన్‌ కాల్‌ చేస్తే చాలు.. క్షణాల్లో వాలిపోతూ ఆపన్నులను ఆదుకుంటున్నారు ప్రదీప్‌కుమార్‌, గొడుగు రాజులు. ప్రదీప్‌ కళ్ల ముందే ఓ ప్రమాదం జరిగింది. ఆ సమయంలో రక్తం దొరక్క ఓ పెద్దావిడ చనిపోవడం తనని కదిలించింది. అప్పుడే రక్తం అవసరమైన ప్రతీ ఒక్కరికీ శక్తి మేరకు దానం చేయాలనే నిర్ణయం తీసుకున్నాడు. పద్నాలుగేళ్ల నుంచి 65 సార్లు రక్తదానం చేసి, ఎందరినో ఈ క్రతువులో భాగస్వాములను చేశాడు. మరోవైపు అవయవదానం అవసరాన్ని గుర్తించి అవయవదాతగానూ మారాడు. ఇదిగాక రహదారి పక్కన ఉండే అన్నార్థులకు అన్నదానం చేస్తున్నాడు. తను కూడబెట్టిన మొత్తాన్ని ఆర్నెళ్లకోసారి ‘సర్వ్‌ నీడీ’ అనే స్వచ్ఛంద సంస్థకు అందిస్తున్నాడు. ఇతడి సేవలను గుర్తించిన చిరంజీవి బ్లడ్‌ బ్యాంక్‌ ప్రశంసాపత్రంతోపాటు.. రూ.లక్షల విలువైన ప్రమాద బీమాను ఉచితంగా చేయించారు. ‘మనం చేసేది మనకు చిన్న సాయంగానే అనిపించొచ్చు. బాధిత కుటుంబాలకు అది ఎంతో పెద్దది. అమ్మ జన్మనిస్తే.. రక్తదానంతో ఇంకొకరికి పునర్జన్మనివ్వొచ్చు’ అంటాడు ప్రదీప్‌.

తండ్రి ప్రాణాపాయస్థితి రాజుని దాతగా మార్చింది. అతడిది సిద్దిపేట జిల్లా గజ్వేల్‌. 2006లో అనారోగ్య సమస్యలతో అతడి నాన్నని ఆసుపత్రిలో చేర్చారు. అవసరమైన రక్తం ఇవ్వడానికి ఎవరూ ముందుకు రాలేదు. తనదీ అదే బ్లడ్‌గ్రూప్‌ కావడంతో స్వయంగా ఇచ్చాడు. అప్పట్నుంచి ఫలానా వారికి అవసరం ఉందని తెలిస్తే చాలు.. జిల్లాలు, రాష్ట్రమైనా దాటిపోయి రక్తం, ప్లేట్‌లెట్స్‌ ఇస్తున్నాడు. అలా ఇప్పటికి 38 సార్లు దానం చేశాడు. స్థానికంగా సామాజిక సేవా కార్యక్రమాల్లోనూ చురుగ్గా పాల్గొంటాడు.
- మంత్రి భాస్కర్‌


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని