గోల్డ్‌మెడలిస్ట్‌ ఆడిన భరతనాట్యం

ముందు కుంచె పట్టి చిత్రాలేశాడు. తర్వాత కెమెరా పట్టి ఫొటోలు తీశాడు. ఆనక కలం పట్టి కథలల్లాడు. ఇప్పుడు తెరపై హీరోయిజం చూపించడానికి సిద్ధమవుతున్నాడు ఏలె సూర్యతేజ.

Published : 06 Apr 2024 00:22 IST

ముందు కుంచె పట్టి చిత్రాలేశాడు. తర్వాత కెమెరా పట్టి ఫొటోలు తీశాడు. ఆనక కలం పట్టి కథలల్లాడు. ఇప్పుడు తెరపై హీరోయిజం చూపించడానికి సిద్ధమవుతున్నాడు ఏలె సూర్యతేజ. ‘పని చేయడమే మన పని. ఫలితం విధికి వదిలేయడమే’ అంటున్న ఈ ‘భరతనాట్యం’ హీరో చెబుతున్న ఫటాఫట్‌ కబుర్లు.


ఆసక్తి: పద్దెనిమిదేళ్లు వచ్చేవరకూ నాకు సినిమాలపై ఆసక్తి లేదు. నాన్న ధని ఏలె చాలా చిత్రాలకు గ్రాఫిక్‌ డిజైనర్‌గా పని చేశారు. ఆయనకు సినిమావాళ్లతో మంచి పరిచయాలుండేవి. ఆ ఫంక్షన్లకు పిలిచినా వెళ్లేవాడిని కాదు. నాకేమో చిన్నప్పట్నుంచీ బొమ్మలేయడం అంటే ఇష్టం. అందుకే ఇంటర్‌ అయ్యాక ఫైన్‌ఆర్ట్స్‌ వైపు వెళ్లా. ఆ సమయంలోనే ఫొటోగ్రఫీ నేర్చుకున్నా. ఈ క్రమంలోనే సినిమాలపై ఆసక్తి మొదలైంది. షార్ట్‌ఫిల్మ్‌లు ప్రయత్నించే వాడిని. అప్పుడే నోకియా సంస్థ డబ్బులిచ్చి మరీ ‘క్రియేటివ్‌ టు ఇన్‌స్పైర్‌’ అనే ఫెలోషిప్‌ కింద కొన్ని కార్యక్రమాలు చేయించేవాళ్లు. దీంట్లో భాగంగా కొద్దిమందిని ఫిల్మ్‌మేకింగ్‌ కోర్సుకు ఎంపిక చేస్తే.. అందులో నేను ఒకడినయ్యా. సినిమాటోగ్రఫీ, డైరెక్షన్‌, రైటింగ్‌.. వీటన్నిం టికీ పని చేసి, ఇంకొందరితో కలిసి ఒక షార్ట్‌ఫిల్మ్‌ తీశా. అలా దర్శకత్వం మీద ఇష్టం మొదలైంది. అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా చేరతానంటే.. ‘సినిమాల్లో సక్సెస్‌ రేటు చాలా తక్కువ. వెళ్లిన వాళ్లంతా స్థిరపడతారనే నమ్మకం లేదు. ముందు చదువు పూర్తిచెయ్‌’ అన్నారు అమ్మానాన్నలు. వాళ్ల మాట కాదనలేకపోయా. ప్రయత్నిస్తే.. కోల్‌కతాలోని ప్రతిష్ఠాత్మక శాంతినికేతన్‌ విద్యాసంస్థతోపాటు హైదరాబాద్‌ కేంద్రీయ విశ్వవిద్యాలయంలోనూ ఫైనార్ట్స్‌లో సీటు వచ్చింది. హెచ్‌సీయూలో చేరి గోల్డ్‌మెడల్‌తో 2019లో కోర్సు పూర్తి చేశా.


తెరంగేట్రం: చదువు పూర్తవడంతో పూర్తి స్థాయిలో సినిమాల్లోకి వెళ్లాలనుకొని అనుభవం కోసం ఓ షార్ట్‌ఫిల్మ్‌ తీశా. ముందు ప్రసారం చేస్తానని చెప్పి, తర్వాత ఓ ఛానెల్‌ వాళ్లు చేయలేదు. నా ఇగో దెబ్బతింది. నేరుగా సినిమాల్లో¸ ప్రయత్నించాలనుకున్నా. నాకు రకరకాల ఆలోచనలు ఉండటంతో ముందు సినిమా కథల స్క్రిప్ట్‌ రాయాలనుకున్నా. ఇందులో ఎవరి పెత్తనమూ ఉండదు. మన ఆలోచనను ఎలాగైనా మలచుకోవచ్చు. అలా కొన్ని సినిమాలు, వెబ్‌సిరీస్‌లకు కథలు రాసుకుంటున్నప్పుడే కరోనా విరుచుకుపడింది. దాంతో గ్యాప్‌ వచ్చింది. తర్వాత పరిచయాలు, సర్వైవల్‌ కోసం సినిమాల్లో కొన్ని చిన్నచిన్న పాత్రలు కూడా వేశా.


సినిమా కష్టాలు: నాన్నకున్న పరిచయాలతో దర్శకనిర్మాతలను కలిసే అవకాశం తేలిగ్గానే దొరికినా.. అక్కడికెళ్లి కథ చెప్పాక చాలా మంది చూద్దాం.. చేద్దాం.. అనేవాళ్లు. కొందరిక కథ నచ్చక పోవడం.. బడ్జెట్‌ కుదరకపోవడం.. ఇలా ఏవేవో కారణాలుండేవి. ఇక లాభం లేదనుకొని చివరిగా ఒక నెలరోజులు ప్రయత్నించి, వర్కవుట్‌ కాకపోతే ఉద్యోగంలో చేరదాం అనుకున్నా. అప్పుడే నాకు జిమ్‌లో పరిచయమైన హితేశ్‌ షరాఫ్‌గారు ఏం చేస్తున్నావని అడిగారు. నా ప్రయత్నాల గురించి చెప్పా. వెంటనే ఆయన.. ‘ఎవరి గురించో వెతకడం ఎందుకు? మనమే సినిమా చేద్దాం ఓసారి ఆఫీసుకి రా’ అన్నారు. ముందు నాకు నమ్మకం కలగలేదు. కానీ సీరియస్‌గా స్క్రిప్ట్‌ వినేసరికి ఓకే అనుకున్నా. తర్వాత దర్శకుడు కేవీఆర్‌ మహేంద్ర, ఇతర పాత్రల ఎంపిక పూర్తైంది. మా సినిమా పట్టాలెక్కింది. నేను రచయిత, దర్శకుడు కావాలనుకున్నాగానీ.. అనుకోకుండా హీరోగా అవకాశం ఇవ్వడంతో.. వాళ్ల నమ్మకాన్ని నిలబెట్టాలనే కసితో కష్టపడి పని చేశా. అంతకుముందు నేను వినయ్‌వర్మ, అల్తాఫ్‌గార్ల దగ్గర నటనలో శిష్యరికం చేయడం కలిసొచ్చింది.


కాలేజీలోనే: బీఎఫ్‌ఏ చదువుతున్నప్పుడే నాకు సినిమా పిచ్చి ఎక్కువైంది. ప్రతి శుక్రవారం స్నేహితుల్ని వెంటేసుకొని థియేటర్‌లో వాలిపోయేవాడిని. ఆరోజు విడుదలైన ప్రతి సినిమా చూడాల్సిందే. చదువు, పనిలోనూ మెరిటే కావడంతో తరగతులు ఎన్నిసార్లు బంక్‌ కొట్టినా.. టీచర్లు క్షమించేవాళ్లు.  మా బ్యాచ్‌లో అమ్మాయిలూ చాలా మందే ఉండేవారు. వాళ్లతోనూ సరదాగా బయటికెళ్లేవాళ్లం. మాకు అమ్మాయి,  అబ్బాయి అనే తేడాలేం ఉండేవి కాదు. ఇక ప్రేమలు.. వెంటపడటం.. ప్రపోజ్‌ చేసుకోవడం లాంటి సీన్లేం లేవు. ఒకరకంగా చెప్పాలంటే సమాజాన్ని చదవడం.. అందులోంచే సినిమా కథలు రాసుకోవడం నాకు కాలేజీలోనే మొదలైంది.


విజయసూత్రం: సక్సెస్‌కి ఒక్కొక్కరు ఒక్కోలా నిర్వచనం ఇస్తుంటారు. టాప్‌కి చేరితేనే విజయం అంటారు కొందరు. నేను.. లక్ష్యం చేరే క్రమంలో ప్రతి అడుగునూ సక్సెస్‌గానే భావిస్తాను. గెలవడం కాదు.. ఆడటమే నా సక్సెస్‌. ఈ సూత్రం అందరికీ వర్తిస్తుంది.

  • రోజూ జిమ్‌కెళ్తా. అప్పుడప్పుడు 5కే రన్‌ చేస్తుంటా.
  • నా పెయింటింగ్స్‌తో దిల్లీలో రెండు ఎగ్జిబిషన్లు చేశా.
  • అందరు దర్శకులూ నచ్చుతారు. ఒక్కొక్కరిలో ఒక్కో నేర్చుకునే గుణం ఉంటుంది.
  • సమాజాన్ని బాగా గమనిస్తుంటా. మనసు పెట్టి చూడాలేగానీ మనుషుల్లోంచే చాలా కథలు రాసుకోవచ్చు.
  • వాలీబాల్‌, బ్యాడ్మింటన్‌, స్క్వాష్‌.. ఆడుతుంటా. ఫిట్‌నెస్‌కి  ప్రాధాన్యం ఇస్తా.
  • ఎడిటింగ్‌, డిజైనింగ్‌ వచ్చు. చాలా సినిమాల టైటిళ్లు రాశాను.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు