వినూత్నం.. విజయం!

ఆలోచన, ఆచరణ అద్భుతంగా ఉంటే ఏమవుతుంది? వ్యాపారం పరుగులు పెడుతుంది! పరిశోధనల్లో ప్రతిభ చూపిస్తే ఏముంటుంది? పట్టం కట్టేంత గుర్తింపు దక్కుతుంది! వీటితోపాటు అప్పుడప్పుడూ భారీ నజరానాలూ అందుతాయి. గుంటూరు, కడప యువకులు అలాగే రూ.కోటిన్నర ఉపకార వేతనం, రూ.లక్షల గ్రాంట్‌ అందుకున్నారు... వారితో మాట కలిపింది ఈతరం.

Updated : 06 Jan 2024 05:05 IST

 ‘నానాటికీ పెరిగిపోతున్న అధిక ఉష్ణోగ్రతలతో మానవాళికి పొంచి ఉన్న ముప్పుపై గడిచిన కొన్నేళ్లుగా అంతర్జాతీయంగా పెద్ద చర్చ జరుగుతోంది. కానీ సమస్య అపరిష్కృతంగానే ఉంది. అమెరికా, కెనడా, ఆస్ట్రేలియా, యూరోపియన్‌ దేశాలు ఈ రంగంలో విస్తృత పరిశోధనలు చేస్తున్నాయి. ఆ దేశాలతో పోలిస్తే ఎండలు ఎక్కువగా ఉండే భారత్‌తోపాటు ఆసియా, ఆఫ్రికన్‌ దేశాలు ఈ అంశాన్ని విస్మరిస్తున్నాయి. ఈ పరిస్థితి మారాల్సిన అవసరం ఉంది. సహజ వనరుల్ని ఇష్టానుసారం ధ్వంసం చేయటంతోనే వాతావరణ సమతౌల్యం దెబ్బతిని, భూగోళం మండుతోంది. సముద్ర ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. జీవరాశులు చనిపోతున్నాయి. ఈ సమస్యలకు పరిష్కారం చూపించే పరిశోధనలు మరింత పెరగాలి’.

ఆలోచన, ఆచరణ అద్భుతంగా ఉంటే ఏమవుతుంది? వ్యాపారం పరుగులు పెడుతుంది! పరిశోధనల్లో ప్రతిభ చూపిస్తే ఏముంటుంది? పట్టం కట్టేంత గుర్తింపు దక్కుతుంది! వీటితోపాటు అప్పుడప్పుడూ భారీ నజరానాలూ అందుతాయి. గుంటూరు, కడప యువకులు అలాగే రూ.కోటిన్నర ఉపకార వేతనం, రూ.లక్షల గ్రాంట్‌ అందుకున్నారు... వారితో మాట కలిపింది ఈతరం.

పరిశోధనవంతుడు

రవుర్కేలా ఎన్‌ఐటీలో బీటెక్‌... హైదరాబాద్‌ ఐఐటీ నుంచి ఎంటెక్‌...రాజకీయశాస్త్రంలో పీజీ...ఈ విద్యార్హతలతో లక్షల జీతమిచ్చే కొలువులు స్వాగతం పలికాయి... కానీ సాయి వెంకట శరత్‌చంద్ర లక్ష్యం సమాజహితం... ముందు సివిల్స్‌కి ప్రయత్నించాడు... ఆ కల నెరవేరకపోవడంతో వాతావరణ మార్పులపై పరిశోధనలకు నడుం బిగించాడు... ఈ ప్రయత్నంలో వేలమందితో పోటీపడి రూ.కోటిన్నర ఉపకార వేతనం అందుకున్నాడు.

శరత్‌చంద్రది గుంటూరు జిల్లా నాగార్జునకొండ. మొదట్నుంచీ చదువులో చురుకే. 2014లో ఎన్‌ఐటీ నుంచి బీటెక్‌ పూర్తైంది. వెంటనే కార్పొరేట్‌ కొలువులో కుదురుకునే అవకాశం వచ్చింది. అయినా దాన్ని కాదనుకొని ప్రజలకు నేరుగా మంచి చేసే అవకాశం ఉంటుందనే ఉద్దేశంతో సివిల్స్‌ రాశాడు. ఫలితం సానుకూలంగా రాలేదు. అయినా నిరాశ చెందకుండా.. ఐఐటీ-హైదరాబాద్‌ నుంచి క్లైమేట్‌ ఛేంజెస్‌ సబ్జెక్ట్‌తో పీజీ పూర్తి చేశాడు. వాతావరణంలో చోటుచేసుకుంటున్న మార్పులు, మానవాళి ఆరోగ్యంపై అవి చూపుతున్న తీవ్ర ప్రభావం.. వీటిపై ముందు నుంచీ ఆసక్తి, అవగాహన ఉండేది. పీజీ పూర్తవగానే ఈ అంశాలపై విస్తృతస్థాయిలో పరిశోధనలు చేయాలనుకున్నాడు. ఈ రంగంలో పరిశోధనలకు అవకాశం కల్పిస్తున్న విద్యాసంస్థల గురించి ఆరా తీశాడు. ఆస్ట్రేలియాలోని గ్రిఫిత్‌ యూనివర్సిటీ పెద్దఎత్తున అధ్యయనం చేయడమే కాకుండా పరిశోధకులను బాగా ప్రోత్సహిస్తుందని తెలుసుకున్నాడు. ఎంటెక్‌ చదువుతూనే వాతావరణ మార్పుల పరిస్థితులపై పోరాడుతున్న రెండు హైదరాబాద్‌ సంస్థలతో కలిసి పని చేశాడు. ఈ నేపథ్యంలో హీట్‌వేవ్స్‌, క్లైమేట్‌ హెల్త్‌ ఇన్‌ ఇండియా అనే అంశాలపై రాసిన పరిశోధక వ్యాసాలు ప్రఖ్యాత ది జర్నల్‌ ఆఫ్‌ క్లైమేట్‌ ఛేంజ్‌ అండ్‌ హెల్త్‌లో ప్రచురితం అయ్యాయి. ఆ పరిశోధనా పత్రాలతో పాటు తన ప్రొఫైల్‌ను జత చేసి, గ్రిఫిత్‌ విశ్వవిద్యాలయానికి పంపాడు. మరింతగా పరిశోధనలు చేయడానికి అవకాశం కల్పించమని కోరాడు. ప్రపంచవ్యాప్తంగా వచ్చిన దరఖాస్తులన్నింటినీ పరిశీలించిన త్రిసభ్య కమిటీ అనేక వడపోతల అనంతరం శరత్‌చంద్రను ఎంపిక చేసింది. ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే ఆ విశ్వవిద్యాలయం స్వదేశీ విద్యార్థులను కాదని దేశం వెలుపలి విద్యార్థికి అంత
స్టైఫండ్‌ ఇవ్వడం విశేషం. ఈ నిధులతో మూడేళ్లపాటు గ్లోబల్‌ వార్మింగ్‌, క్లైమేట్‌ ఛేంజ్‌ అంశాలపై అధ్యయనం చేయనున్నాడు. అందులో భాగంగా అంతర్జాతీయంగా పేరున్న నిపుణులు, శాస్త్రవేత్తలతో కలిసి పని చేయనున్నాడు. ఇక్కడ పని చేసిన చాలామంది ప్రపంచ ఆరోగ్య సంస్థలో శాస్త్రవేత్తలుగా స్థిరపడ్డారు.
- కాకర్ల వాసుదేవరావు, గుంటూరు


సృజనాత్మకతకు గుర్తింపు

పట్టణాలు, నగరాల్లో బోలెడన్ని షాపింగ్‌ మాల్స్‌ ఉంటాయి. క్షణాల్లో కోరుకున్నది కొనవచ్చు. ఆన్‌లైన్‌లో కొనుగోలు చేసి ప్రతీదీ ఇంటికి తెప్పించుకోవచ్చు. మరి గ్రామీణ ప్రాంతాల మాటేంటి? వాళ్ల అవసరాలు తీరేదెలా? దానికి పరిష్కారంగానే ‘మీ బడ్డీ’ అనే యాప్‌ రూపొందించాడు మలిరెడ్డి రాజశేఖర్‌రెడ్డి. ఈ వినూత్న ఆలోచన విస్తరణకు కేంద్ర వ్యవసాయ మంత్రిత్వశాఖ నుంచి రూ.21లక్షల గ్రాంటు గెల్చుకుంది.
మీ బడ్డీ.. మండల కేంద్రాలు, గ్రామీణ ప్రాంతాల్లో సేవలు అందిస్తోంది. దీని ద్వారా తాజా పండ్లు, కూరగాయలు, నిత్యావసరాల నుంచి వ్యవసాయ పరికరాలు, ఆహార పదార్థాలు, వ్యవసాయ ఉత్పత్తులను ఆర్డర్‌ చేయొచ్చు. ప్లంబింగ్‌, ఎలక్ట్రికల్‌, కార్పెంటింగ్‌, బైక్‌ మరమ్మతుల అవసరాలూ తీర్చేలా ఉంటుంది. ఇందులో పాత ఎలక్ట్రానిక్‌, గ్యాడ్జెట్లూ అమ్ముకోవచ్చు. ఒక్క మాటలో చెప్పాలంటే విక్రేతలు- కొనుగోలుదారులు.. నిపుణులు-వినియోగదారుల మధ్య వారధిలా ఉంటుందీ యాప్‌. ఈ లావాదేవీల కోసం మీ బడ్డీ స్టోర్‌లూ ఏర్పాటు చేశాడు రాజశేఖర్‌. దీనికోసం రాష్ట్రవ్యాప్తంగా నిరుద్యోగ యువతనను నియమించుకున్నాడు. ఫ్రాంఛైజీలు అప్పగించాడు. ఇలా ప్రత్యక్షంగా పరోక్షంగా ఐదువేల మందికి ఉపాధి కల్పిస్తున్నాడు. ఈ యాప్‌ని లక్ష మందికిపైగా మంది డౌన్‌లోడ్‌ చేసుకున్నారు.
రాజశేఖర్‌రెడ్డిది నెల్లూరు జిల్లా సున్నంవారిపల్లె చింతల. పదోతరగతి పూర్తయ్యాక నూజివీడులోని ట్రిపుల్‌ఐటీలో సీటు సంపాదించాడు. ఇంజినీరింగ్‌ పూర్తయ్యేలోపే విద్యార్థుల సెలవులు, వసతిగృహం నిర్వహణ, ఫిర్యాదులు, కళాశాల సమాచారం.. ఇలా సమస్తం ఆన్‌లైన్‌లో నిర్వహించేలా కంప్యూటర్‌ ప్రోగ్రామ్స్‌ తయారు చేశాడు. ఆ ప్రతిభకు గుర్తింపుగా స్టార్‌ యూత్‌ ఐకాన్‌ అనే పురస్కారం గెల్చుకున్నాడు. మంచి ప్రతిభావంతుడు కావడంతో బీటెక్‌ పూర్తవగానే ఒక ప్రభుత్వ సంస్థలో సాఫ్ట్‌వేర్‌ డెవలపర్‌గా అవకాశం వచ్చింది. అయితే ఒకరి దగ్గర ఉద్యోగం చేయడం కన్నా.. ఉద్యోగాలు ఇచ్చే స్థాయికి ఎదగాలన్నది అతడి ఆశయం. ముఖ్యంగా గ్రామీణ ప్రాంత యువతకు ఉపాధి కల్పించడమే లక్ష్యంగా పెట్టుకున్నాడు. నూజివీడు ట్రిపుల్‌ ఐటీనే కార్యక్షేత్రంగా మలచుకున్నాడు. యాప్‌ రూపొందించే క్రమంలో మొదట్లో ఆర్థిక ఇబ్బందులు ఎదురయ్యాయి. వెనక్కి తగ్గలేదు. ఎలాగోలా వాటిని అధిగమిస్తే కరోనా విరుచుకుపడి పని మొత్తం ఆగిపోయింది. వాటినీ దాటుకొని రెండేళ్లు కష్టపడి మీబడ్డీ యాప్‌ ఆవిష్కరించాడు. దీన్ని విస్తరించడం అసలు సమస్యగా మారింది. ఇదే సమయంలో ఆచార్య ఎన్జీరంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం.. వ్యవసాయ, వ్యవసాయ అనుబంధ రంగాల్లో వినూత్న ఆవిష్కరణలను ప్రోత్సహించే ఉద్దేశంతో దేశంలోని ఉత్తమ అంకుర సంస్థలకు ఆర్థిక సాయం అందజేయాలనుకుంది. దీనికి దరఖాస్తు చేసుకున్నాడు. వందలమందితో జాతీయస్థాయిలో పోటీ పడి రూ.21 లక్షల గ్రాంటు దక్కించుకున్నాడు. కేంద్ర వ్యవసాయ మంత్రిత్వశాఖ ఇచ్చే ఈ నిధులు తిరిగి చెల్లించాల్సిన అవసరం ఉండదు. ఈ ప్రోత్సాహంతో కష్టపడి పని చేసి, మరిన్ని మెరుగైన సేవలు అందిస్తానంటున్నాడు.

పసుపులేటి వేణు గోపాల్, తిరుపతి 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని