ఆకాశమే హద్దుగా..!

చిన్నప్పట్నుంచీ ఆ కుర్రాడికి అంబరాన్ని చూస్తే సంబరం. ఎప్పటికైనా అంతరిక్షాన్ని అందుకోవాలనే జిజ్ఞాస... అబ్దుల్‌కలాం, కల్పనా చావ్లాల గురించి విన్నప్పుడు వాళ్లలా గొప్పవాడిగా కావాలని కలలు కన్నాడు. సీన్‌ కట్‌ చేస్తే... ఆకాశంలో విహరించే డ్రోన్ల తయారీసంస్థ ‘ఎండ్యూర్‌ఎయిర్‌’కి ఇప్పుడు సహ వ్యవస్థాపకుడు.

Updated : 24 Feb 2024 01:46 IST

చిన్నప్పట్నుంచీ ఆ కుర్రాడికి అంబరాన్ని చూస్తే సంబరం. ఎప్పటికైనా అంతరిక్షాన్ని అందుకోవాలనే జిజ్ఞాస... అబ్దుల్‌కలాం, కల్పనా చావ్లాల గురించి విన్నప్పుడు వాళ్లలా గొప్పవాడిగా కావాలని కలలు కన్నాడు. సీన్‌ కట్‌ చేస్తే... ఆకాశంలో విహరించే డ్రోన్ల తయారీసంస్థ ‘ఎండ్యూర్‌ఎయిర్‌’కి ఇప్పుడు సహ వ్యవస్థాపకుడు. భారత సైన్యానికే సేవలందిస్తున్న ఔత్సాహికుడు. ఫోర్బ్స్‌ ఇండియా 30 అండర్‌ 30 జాబితాలో చోటు సాధించిన విజేత. తనే బాపట్ల జిల్లా రేపల్లె యువకుడు మెండు రామకృష్ణ. అతడితో మాట కలిపింది ఈతరం. 

  • 2021లో వరదల కారణంగా ఉత్తరాఖండ్‌లోని జోషీమఠ్‌ అతలాకుతలమైంది. అక్కడే ఒక డ్యామ్‌ బద్దలైంది. అప్పుడు ప్రధానమంత్రి కార్యాలయం నుంచి పిలుపు అందుకున్న ఎండ్యూర్‌ఎయిర్‌ తన నానో డ్రోన్స్‌ని రంగంలోకి దించింది. అవి సహాయక చర్యల్లో చురుగ్గా పాల్గొన్నాయి. 
  • గతేడాది ఉత్తర కాశీలో ఓ సొరంగం కుప్పకూలిపోయింది. అందులో చిక్కుకుపోయిన కూలీల కోసం దేశమంతా ఉత్కంఠగా ఎదురుచూసినప్పుడు.. వాళ్లను సురక్షితంగా బయటికి తీసుకురావడంలో ఎండ్యూర్‌ఎయిర్‌ డ్రోన్లు కీలక పాత్ర పోషించాయి.

ఇవేకాదు.. సియాచిన్‌లాంటి అత్యంత ఎత్తైన ప్రదేశాల్లో భారత సైనికులకు అత్యవసరాలు అందించడం.. ప్రకృతి వైపరీత్యాలప్పుడు ఎనలేని సాయం చేయడం.. సరిహద్దుల్లో శత్రువు పహారా.. నగరాల్లో ట్రాఫిక్‌ పర్యవేక్షణ.. పొడవైన గ్యాస్‌పైప్‌లైన్‌ పర్యవేక్షణ.. ఇలా ఎన్నోరకాల నమ్మకమైన సేవలు అందిస్తోందీ సంస్థ. ఈ నమ్మకమైన సర్వీసులు.. కంపెనీకి ఉన్న భవిష్యత్తు.. వేగంగా ఎదుగుతున్న వైనం.. వీటన్నింటినీ సమీక్షించి ఫోర్బ్స్‌ పత్రిక దేశగతిని మార్చగల 30 అండర్‌ 30 యువత జాబితాలో రామకృష్ణకూ చోటు కల్పించింది.

ప్రారంభం..

దిల్లీ సమీపంలోని నోయిడా కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న రామకృష్ణ అచ్చ తెలుగు యువకుడు. తనది బాపట్ల జిల్లా రేపల్లె. చిన్నప్పట్నుంచీ చదువులో చురుకు. ఎందుకోగానీ ఆకాశం, చుక్కలు.. అంటే మహా ఆసక్తి. అబ్దుల్‌ కలాం, కల్పనా చావ్లాల గురించి తెలుసుకున్నాక ఫిజిక్స్‌పై మక్కువ పెంచుకున్నాడు. జేఈఈలో మంచి ర్యాంకుతో ఐఐటీ కాన్పూర్‌లో ప్రవేశం పొందాడు. ఏరోస్పేస్‌కి ఐఐటీ కాన్పూర్‌ ఉత్తమ విద్యాసంస్థ కావడంతో ఐఐటీ ముంబయిని కాదనుకొని అందులో చేరాడు. అక్కడే చిరాగ్‌ జైన్‌తో పరిచయమైంది. డా.అభిషేక్‌ అనే ప్రొఫెసర్‌ సాయంతో 2018లో ఇంక్యుబేటర్‌ స్టార్టప్‌ ప్రారంభించారు. తన కల ఏరోస్పేస్‌ విభాగం కావడంతో.. ఆ అంకుర సంస్థను డ్రోన్ల తయారీ కంపెనీగా మలచాలనుకున్నాడు. పైగా ప్రాజెక్ట్‌వర్క్‌లో భాగంగా నమూనా డ్రోన్లు తయారు చేసిన అనుభవం ఉంది. అక్కడ మూడేళ్లు పరిశోధనలు చేసి సరుకు రవాణా, నిఘాలకు పనికొచ్చేలా డ్రోన్లు తయారు చేశారు. తర్వాత 2020 మేలో ‘ఎండ్యూర్‌ఎయిర్‌’ పురుడు పోసుకుంది.

భిన్నమైన సేవలు..

ఐఐటీ కాన్పూర్‌లో మొదలైన కలలకు నోయిడాలో రెక్కలొచ్చాయి. పరిశోధన, డిజైన్‌, ఆపరేషన్‌.. అన్నిరకాల కార్యకలాపాలతో పూర్తిస్థాయి సంస్థగా మొదలైంది ఎండ్యూర్‌ఎయిర్‌. ప్రస్తుతం ఈ సంస్థ అత్యధికంగా భారత సైన్యానికి సేవలు అందిస్తోంది. బీఎస్‌ఎఫ్‌, సీఐఎస్‌ఎఫ్‌, ఎన్‌డీఆర్‌ఎఫ్‌, కోస్ట్‌గార్డ్‌, మెరైన్‌ స్పెషల్‌ కమాండోస్‌, డీఆర్‌డీవో వీళ్లంతా ఈ సంస్థ వినియోగదారులే. దేశ సరిహద్దులు, రహదారులు సరిగా లేని చోట సైన్యానికి మంచినీళ్లు, పెట్రోల్‌, ఔషధాలు, కిరోసిన్‌.. ఇలాంటి అత్యవసర వస్తువులు సరఫరా చేస్తున్నారు. ఈ డ్రోన్లు ఇరవై కిలోల బరువుని పది కిలోమీటర్ల వరకు చేరవేస్తున్నాయి. నిఘా రకానివి యాభై కిలోమీటర్ల వరకూ వెళ్లి లైవ్‌ వీడియో ఫీడ్‌ అందిస్తున్నాయి. ఇవిగాక కొన్ని ఆయిల్‌ అండ్‌ గ్యాస్‌ పరిశ్రమలు, రవాణాసంస్థలు.. వీళ్ల డ్రోన్స్‌ని వాడుతున్నాయి. ముగ్గురితో మొదలైన సంస్థలో ప్రస్తుతం 110మంది ఉద్యోగులున్నారు. దాదాపు రూ.15కోట్ల రెవెన్యూకి చేరువైంది. భారత సైన్యంతో కలిసి జపాన్‌, ఫ్రెంచ్‌, అమెరికన్‌ సైనిక విన్యాసాల్లో కూడా వీళ్లు తయారు చేసిన డ్రోన్లు పాల్గొన్నాయి.

సవాళ్లు దాటి..

ఈ స్థాయికి చేరడం వెనక పదేళ్ల కష్టం ఉందంటాడు రామకృష్ణ. భారత సైన్యాన్ని సంప్రదించినప్పుడు కఠిన పరిస్థితులనైనా తట్టుకునే దృఢమైన ప్రోడక్ట్‌ కావాలన్నారు. అత్యంత ఎత్తైన ప్రదేశాలు, మైనస్‌ డిగ్రీల చలి.. బాగా గాలి వీచే చోట.. ఎలాంటి వాతావరణంలో అయినా అవి పని చేయాలన్నారు. అలా చేస్తున్నాయో, లేదో తెలుసుకోవడానికి తాము రూపొందించిన వాటిని సియాచిన్‌, లద్దాఖ్‌, పోఖ్రాన్‌.. ఇలా వేర్వేరు ప్రదేశాలు, వాతావరణ పరిస్థితుల్లో పరీక్షించి చూశారు. ముంబయి తీరంలోనూ ప్రయోగాలు చేశారు. ఈ క్రమంలో చిన్న సమస్య తలెత్తినా డ్రోన్‌ కుప్పకూలిపోయేది. దాంతో పరిశోధన మొదటికొచ్చేది. ఇలాంటి వైఫల్యాలు పదులసార్లు ఎదుర్కొన్నాడు. తర్వాత భారత సైన్యాధికారులను ఒప్పించడానికి ఒక్కొక్కరి దగ్గరకు వెళ్లి పదులకొద్దీ డెమోలు ఇచ్చేవాడు. అంతా ఓకే అనుకున్నాక పెద్దఎత్తున తయారు చేయడానికి డబ్బు సమస్య వచ్చింది. దానికోసం చాలామంది ఇన్వెస్టర్ల చుట్టూ తిరిగాడు. చివరికి ఏషియన్‌ పెయింట్స్‌ సహ ప్రమోటర్‌ జలజ్‌ దానీ వీళ్ల సామర్థ్యంపై నమ్మకంతో కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టడానికి ముందుకొచ్చారు. తర్వాతే సంస్థ కార్యకలాపాలకు నోయిడాను కార్యక్షేత్రంగా ఎంచుకున్నారు. ఆపై టెక్నికల్‌ టీంని సమకూర్చుకోవడం సమస్యగా మారింది. దాన్నీ అధిగమించారు. అదృష్టవశాత్తు అదేసమయంలో మేక్‌ ఇన్‌ ఇండియా నినాదం ఊపందుకోవడం.. టెండర్ల ప్రక్రియ పారదర్శకంగా ఉండటంతో మాది చిన్న కంపెనీ అయినా.. మా సామర్థ్యం నచ్చడంతో భారత సైన్యంతో భాగస్వాములం కాగలిగాం అంటున్నాడు రామకృష్ణ.

  నేను సవాళ్లను బాగా ఇష్టపడతా. నా చదువు పూర్తయ్యాక భారీ వేతనంతో ఉద్యోగాలొచ్చాయి. కానీ నా కల తీరేలా, దేశానికి ఉపయోగపడేలా.. ఒక దారి కనిపిస్తుంటే నాలుగు గోడల మధ్య కూర్చొని చేసే కొలువు నాకెందుకు? మేం ఎంచుకున్న రంగంలో మంచి భవిష్యత్తు ఉంది. మా ప్రయాణం మొదలై ఐదేళ్లే అయ్యింది. ఇంకా ప్రయాణించాల్సిన దూరం చాలా ఉంది. మా సంస్థ వ్యవసాయం, ఔషధ రంగాల్లోనూ సర్వీసులందించే డ్రోన్లను వచ్చే ఏడాది నుంచి తయారు చేస్తుంది. మా ఉత్పత్తులను విదేశాలకూ ఎగుమతి చేసే ఆలోచనలో ఉన్నాం.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని