కొత్త బంగారు లోకం..మనకు కావాలి సొంతం!

ఫ్యాషన్‌ విషయానికొస్తే.. మిలన్‌ మెరుపులు.. ప్యారిస్‌ సొగసులకు కాలేజీ క్యాంపస్‌లు కేంద్రాలయ్యాయి. ఫ్రెషర్‌ పార్టీలు.. కళాశాల ఉత్సవాలు.. వీడ్కోలు కార్యక్రమాల్లో క్యాట్‌వాక్‌లు పరిపాటిగా మారాయి.

Updated : 30 Dec 2023 10:02 IST

ఏడాది పేజీని తిరగేస్తే ఎన్నెన్ని జ్ఞాపకాలో. మనసుని కేరింతలు కొట్టించేవి కొన్నైతే.. మదిని మెలిపెట్టేవి మరిన్ని. అన్నీ మంచి శకునములే అన్నట్టుగా.. సంవత్సరం సవ్యంగానే మొదలైంది. రోజులు గడిచేకొద్దీ కాలం తన మహిమలు చూపించడం ప్రారంభించింది. కరోనా కాలం నుంచి వర్క్‌ ఫ్రం హోంని ఎంజాయ్‌ చేస్తున్న కుర్ర ఉద్యోగులకు ‘ఆఫీసులకు రావాల్సిందే’ అని హుకుం జారీ చేశాయి కంపెనీలు. మరోవైపు అధిక వేతనాలు వెనకేసుకుంటున్న ఉద్యోగుల్ని బ్యాక్‌డోర్‌ నుంచి సాగనంపే కార్యక్రమాలూ కొనసాగాయి. అందుకే ‘ప్రైవేటు మేనేజర్‌ కన్నా.. సర్కారీ గుమాస్తా నయం’ అనుకున్నారంతా. వాళ్ల ఆశల్ని మోస్తూ ఆంధ్రాలో అడపాదడపా ప్రకటనలు వెలువడ్డాయి. తెలంగాణలో వరుసపెట్టి నోటిఫికేషన్లు వచ్చేశాయి. కానీ పేపరు లీకేజీలతో అసలుకే ఎసరొచ్చింది. గ్రూప్స్‌ కొలువులు కాదు కదా.. గుమాస్తా ఉద్యోగాలూ గగనమయ్యాయి. మరోవైపు ‘ఆర్థిక వ్యవస్థ రంకెలు వేస్తోంది.. దేశవ్యాప్తంగా ఈ ఏడాది ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో కలిపి ఏకంగా 5 కోట్ల కొత్త ఉద్యోగాలు పుట్టుకొచ్చాయి’ అంది స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా అధ్యయనం. అందులో 47శాతం మొదటిసారి కొలువు గడప తొక్కినవారేనట. ఉద్యోగ కల్పనలో ఐటీ, ఆటోమొబైల్‌, హెల్త్‌కేర్‌, ఆతిథ్యం, ఫైనాన్షియల్‌ టెక్నాలజీ, సైబర్‌ సెక్యూరిటీ, ఆటోమేషన్‌, క్లౌడ్‌ కంప్యూటింగ్‌ రంగాలు ముందున్నాయి. కృత్రిమ మేథ, రెన్యువబుల్‌ ఎనర్జీలకు సైతం మంచి భవిష్యత్తు ఉందంటున్నారు నిపుణులు. ఇలా కొలువుల్ని నమ్ముకోకుండా ఉద్యోగాలిచ్చే స్థాయికి ఎదగాలనుకునే ఔత్సాహికులు అంకురాల బాట పట్టారు. సృజనాత్మకత ఆలోచనలతో కదం తొక్కారు. జెప్టో, బ్లూస్మార్ట్‌, పాకెట్‌ ఎఫ్‌ఎం, స్కైరూట్‌ ఏరోస్పేస్‌, షిఫ్ట్‌, జార్‌, స్ప్రింట్‌.. లాంటి స్టార్టప్‌లు వందల కోట్ల పెట్టుబడులు రాబట్టాయి. ఇంత జోరులోనూ గతేడాదితో పోలిస్తే ప్రాంగణ నియామకాలు 45శాతం తగ్గిపోయాయని అమిటీ యూనివర్సిటీ అధ్యయనం విస్తుపోయే వాస్తవం చెప్పింది. ఇందులో గడ్డు పరిస్థితి ఎదుర్కొంది ఐటీ రంగానికి చెందిన వాళ్లేనట.

వీధిలో అడుగు పెట్టకుండా.. అన్నింటినీ నట్టింట్లోకి రప్పించుకునే యువత.. ఈ ఏడాదీ ఈ-కామర్స్‌ కంపెనీలను పెంచి పోషించారు. పాల ప్యాకెట్‌ నుంచి.. ఐఫోన్‌ కొత్త మోడల్‌ దాకా ఆన్‌లైన్‌లోనే ఎడాపెడా కొనేశారు. ఫ్లిప్‌కార్ట్‌ బిగ్‌ బిలియన్‌ డేలు.. అమెజాన్‌ గ్రేట్‌ ఇండియన్‌ సేల్‌ అమ్మకాల్లో రికార్డులు సృష్టించడమే అందుకు నిదర్శనం. యంగిస్థాన్‌ల పుణ్యమా అని స్విగ్గీ, జొమాటోలాంటి ఫుడ్‌ యాగ్రిగేటర్‌ యాప్‌లు సైతం అమ్మకాలను అమాంతం పెంచేసుకున్నాయి. ఈ ఒక్క ఏడాదిలోనే ఏకంగా 10.10కోట్ల బిర్యానీ ఆర్డర్లు వచ్చాయంటే వాళ్ల వ్యాపారం ఏ రేంజ్‌కి వెళ్లిందో అర్థం చేసుకోవచ్చు.

ఫిట్‌గా ఉంటేనే జిందగీ హిట్‌ అని యువత ఈ ఏడాది బలంగా నమ్మారు. ఆచరించారు కూడా. ఈ సంవత్సరం ప్రత్యేకత ఏంటంటే.. మనోళ్లు డిజిటల్‌ బాట పట్టి వర్కవుట్‌లలో భాగం చేసుకున్నారు. పని గట్టుకొని జిమ్‌లకు వెళ్లడం ఎందుకు అనుకునేవాళ్లు బాడీ వెయిట్‌ ట్రైనింగ్‌లపై దృష్టి పెట్టారు. తక్కువ స్థలంలోనే ఎక్కువ ఫలితాలు రాబట్టే అవకాశం ఉండటంతో దీనివైపు మొగ్గు చూపారు. ఒంట్లో అత్యధికంగా ఉన్న కేలరీలు కరిగించడమే దీని అసలు ఉద్దేశం. ఆరోగ్యాన్ని తరచూ బేరీజు వేసుకునే ఫిట్‌నెస్‌ ట్రాకర్ల వాడకం ఎక్కువే అయ్యింది. వీటితోపాటు ఇన్‌స్టాగ్రామ్‌ రీల్స్‌.. యూట్యూబ్‌ షార్ట్స్‌లా మినీ వర్కవుట్స్‌కి కుర్రజనం ఎగబడ్డారు. ముఖ్యంగా పనిలో తీరికలేని యువ ఉద్యోగులు ఈ ఐదు, పది నిమిషాల వర్కవుట్‌ సెషన్స్‌ని ఆచరించారు. కండలు పెంచాలి.. కదం తొక్కాలి అనుకునేవాళ్లు భారీ కసరత్తుల ఫంక్షనల్‌ ఫిట్‌నెస్‌ల వైపు మళ్లారు. ఆడుతూపాడుతూ వ్యాయామం చేయాలనుకునే స్నేహితులు, సహోద్యోగులు.. గ్రూప్‌ ఎక్సర్‌సైజుల బాట పట్టారు. హృతిక్‌ రోషన్‌, టైగర్‌ ష్రాఫ్‌లాంటి హీరోలు చొక్కాలు విప్పేసి కండలు ప్రదర్శిస్తే.. ఫిట్‌నెస్‌ ఫ్రీక్‌లు వారికే మాత్రం తీసిపోకుండా ఆరు పలకల దేహాలు, టోన్డ్‌ బాడీలతో అలరించారు. అడపాదడపా అక్కడక్కడా కొన్ని చేదు సంఘటనల మరకలు ఉన్నా.. యువత మెరుపులే ఎక్కువ కనపడ్డాయి ఈ ఏడాదిలో..

ఫ్యాషన్‌ విషయానికొస్తే.. మిలన్‌ మెరుపులు.. ప్యారిస్‌ సొగసులకు కాలేజీ క్యాంపస్‌లు కేంద్రాలయ్యాయి. ఫ్రెషర్‌ పార్టీలు.. కళాశాల ఉత్సవాలు.. వీడ్కోలు కార్యక్రమాల్లో క్యాట్‌వాక్‌లు పరిపాటిగా మారాయి. మోడళ్లకు తీసిపోకుండా అమ్మాయిలు, అబ్బాయిలు వీధుల్లో సందడి చేశారు. ఇక కుర్రకారు ఒంట్లో భాగమైన స్మార్ట్‌ఫోన్లు, గ్యాడ్జెట్లు నట్టింట్లో నుంచి పడగ్గదికీ వచ్చేశాయి. మన మిలీనియల్స్‌, జనరేషన్‌ జడ్‌.. సామాజిక మాధ్యమాల్లో గడిపే కాలం రోజుకి సగటున ఆరున్నర గంటలకు చేరిందని గణాంకాలు తెలిపాయి. పొట్టి సందేశాల ట్విటర్‌ పేరు మార్చుకొని ‘ఎక్స్‌’గా మారినా.. దాన్ని ఎక్స్‌ ఫ్రెండ్‌లా ఎవరూ ట్రీట్‌ చేయలేదు. కొత్తగా చేర్చిన వాణిజ్య ప్రకటనలు కాస్త చిరాకు తెచ్చిపెట్టినా.. దాన్నీ ఆమోదించారు. అన్నింటినీ దాటుకుంటూ ఇన్‌స్టాగ్రామ్‌ టాప్‌గేర్‌లో యువతను చుట్టేస్తోంది. బ్రేక్‌ఫాస్ట్‌ చేస్తూ ఫేస్‌బుక్‌లో పోస్టులు చూడటం.. వాట్సప్‌లో వలపు సందేశాలు విసరడం యువతకు పరిపాటిగా మారింది. ఈ సంవత్సరం అయితే ఓటీటీల విప్లవం యువతని మరింతగా కమ్మేసింది. క్రైం సిరీస్‌లు యువతకు ఇష్ట వ్యాపకంగా మారాయి. దీంతో అగ్ర నటులు సైతం ఓటీటీ బాట పట్టక తప్పలేదు. టెక్నాలజీ ఊహించనన్ని మార్పులు తెస్తున్నా.. ‘డీప్‌ ఫేక్‌’తో దాంట్లోని వెర్రితలల కోణమూ బయటికొచ్చింది ఈ సంవత్సరమే. కృత్రిమ మేధతో.. ప్రముఖ తారల్ని అశ్లీలంగా చూపించడంతో సమాజంలో కల్లోలం రేగింది. ఇది ఎంతవరకు వెళ్తుందో అనే కొత్త గుబులు అందరిలో మొదలైంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని