ప్రపంచ నెంబర్‌వన్‌ పాఠాలు

ఇరవై మూడేళ్ల సుదీర్ఘ నిరీక్షణ... సగర్వంగా గ్రాండ్‌స్లామ్‌ని ముద్దాడిన క్షణం... టెన్నిస్‌లో ఆ ఘనత సాధించిన అతిపెద్ద వయస్కుడిగా చరిత్ర... డబుల్స్‌లో ప్రపంచ నెంబర్‌వన్‌ అయిన వైనం...నలభై మూడేళ్ల రోహన్‌ బోపన్నఘనతలివి

Updated : 03 Feb 2024 01:19 IST

ఇరవై మూడేళ్ల సుదీర్ఘ నిరీక్షణ... సగర్వంగా గ్రాండ్‌స్లామ్‌ని ముద్దాడిన క్షణం... టెన్నిస్‌లో ఆ ఘనత సాధించిన అతిపెద్ద వయస్కుడిగా చరిత్ర... డబుల్స్‌లో ప్రపంచ నెంబర్‌వన్‌ అయిన వైనం...నలభై మూడేళ్ల రోహన్‌ బోపన్నఘనతలివి. పట్టుదల నీఆయుధమైతే.. శ్రమనే మార్గంగా మలచుకుంటే.. కాస్త ఆలస్యమైనా..విజయం వశమవుతుందని నిరూపించిన అతడి జీవితం యువతకు పాఠం కాక మరేంటి?


పాఠం 1: పట్టు వదలక ప్రయత్నిస్తే.. కాస్త ఆలస్యమైనా విజయం దక్కుతుంది.
కౌమారంలో మొదలు పెట్టి.. ముప్ఫై, ముప్ఫైఐదేళ్లకే చాలామంది క్రీడాకారులు టెన్నిస్‌ ఆటకి గుడ్‌బై చెబుతుంటారు. ఏం సాధించినా ఆ వయసులోనే అని నమ్ముతారు. అది వాస్తవం కూడా. కానీ వయసు అనేది ఒక నెంబర్‌ మాత్రమే అంటాడు రోహన్‌ బోపన్న. పదకొండేళ్లకే రాకెట్‌ పట్టాడు. ఇరవై ఒక్కటికి ప్రొఫెషనల్‌గా మారాడు. ఆపై ఇరవై ఏళ్లకి గానీ మిక్స్‌డ్‌ గ్రాండ్‌స్లామ్‌ నెగ్గలేదు. వయసు పైబడుతున్నా ఓపికగా ఎదురు చూశాడు. విజయాలు అరుదుగా వస్తున్నా ఆట వదల్లేదు. అత్యంత పెద్ద వయసులో గ్రాండ్‌స్లామ్‌ డబుల్స్‌ నెగ్గిన క్రీడాకారుడిగా చరిత్ర సృష్టించాడు. ప్రపంచ నెంబర్‌వన్‌ అయ్యాడు. ఇది దాదాపు అసాధ్యం అనుకున్నారు. కానీ ఆట పట్ల అంకిత భావం.. ఓటమిని ఒప్పుకోని పట్టుదలే అతడ్ని ఈ స్థాయికి చేర్చాయి. బోపన్నే కాదు.. ఆలస్యంగా విజయాలు దక్కించు కున్న ఎందరో చరిత్రలో మనకు కన బడతారు. కుర్రకారు ఎంతో ఇష్టపడే కేఎఫ్‌సీని కల్నల్‌ హార్లండ్‌ శాండర్స్‌ 62ఏళ్ల వయసులో ప్రారంభించారు. మెక్‌డొనాల్డ్స్‌ అధినేత రే క్రాక్‌ 59 ఏళ్ల వయసులో ఫుడ్‌ పరిశ్రమలోకి వచ్చి విజయం సాధించారు.


పాఠం 2: బరిలో దిగాలంటే నిత్యం శ్రమించాల్సిందే. సంసిద్ధతే గెలుపునకు తొలి అడుగు.

నాకు ఓపిక ఉంది. జీవితాంతం ఆడతాను అంటే టెన్నిస్‌లో కుదరదు. గ్రాండ్‌స్లామ్‌లో పోటీ పడాలంటే మెరుగైన ర్యాంకింగ్‌లో ఉండాలి. గాయాలు కాకుండా చూసుకోవాలి. ఫిట్‌నెస్‌తో ఉండాలి. దీనికి రోజూ శ్రమించాల్సిందే. సుదీర్ఘ కెరియర్‌లో ఎన్నోసార్లు గాయాలపాలయ్యాడు రోహన్‌. చాలాసార్లు అతడి పని అయిపోయిందనే అనుకున్నారంతా. కానీ నేలకు కొట్టిన బంతిలా పైకి లేచాడు. ఫిట్‌నెస్‌లేమితో ఒక్కోసారి కోర్టులో చురుగ్గా కదల్లేకపోతుంటే.. రిటైర్‌మెంట్‌ తీసుకోవాల్సిన సమయం వచ్చిందంటూ వేళాకోళమాడారు. ఒకానొక సమయంలో ఐదునెలల పాటు ఒక్క విజయం లేదు. 2019లో అయితే మోకాలి మృదులాస్థి అరిగిపోయిందన్నారు. కోర్టులో పరుగెత్తడం కాదుకదా.. కనీసం నడవడమే కష్టం అన్నారు వైద్యులు. ఆ సమయంలో యోగా బాట పట్టాడు. ప్రత్యేకంగా ట్రైనర్లను నియమించుకున్నాడు. మళ్లీ ఫిట్‌నెస్‌ సంతరించుకొని ఆటకు సంసిద్ధమయ్యాడు.


పాఠం 3: విజేతగా నువ్వొక్కడివే తెర ముందు కనబడొచ్చు. కానీ అతడ్ని సంసిద్ధం చేయడంలో ఎంతోమంది పాత్ర ఉంటుంది.

ఆట ఏదైనా అదొక టీంవర్క్‌. అందరి సహకారం ఉంటేనే ఒక విజేత ప్రపంచం ముందుకొస్తాడు. కానీ బోపన్న తెర వెనక ఉండి నడిపించిన నా కోచ్‌, ఫిజియో, నా జట్టు అందరికీ విజయంలో భాగం ఉందంటాడు. అందుకే అందరితో సొంత మనుషుల్లా అనుబంధం కొనసాగిస్తుంటాడు. గడ్డు కాలంలో తన భార్య సుప్రియ ఎన్నోసార్లు అండగా నిలబడింది. అందుకే తనూ విజయాల భాగస్వామే. ఇక డబుల్స్‌ ఆడుతున్నప్పుడు టీం వర్క్‌ మరింత ముఖ్యం. పార్ట్‌నర్‌తో సమన్వయం కుదిరినప్పుడే విజయం సాధ్యమవుతుంది. మాథ్యూ ఎబ్డెన్‌ రూపంలో తనకి ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌లో చక్కని భాగస్వామి దొరికాడు. ఏడాదిన్నర కిందట జట్టు కట్టారు. అప్పట్నుంచే మంచి లయ కుదిరింది. రెండు ఏటీపీ టైటిళ్లు గెలిచారు. ఆరింట్లో ఫైనల్స్‌ వరకు వెళ్లారు. సర్వ్‌, బేస్‌లైన్‌లో రోహన్‌ ఉత్తమ ఆట ప్రదర్శిస్తే.. నెట్‌ప్లేలో ఎబ్డెన్‌ టాపర్‌. పైగా మైదానంలో చురుగ్గా కదులుతాడు.


పాఠం 4: విజేతగా నిలిస్తే డబ్బు, పేరు అన్నీ వస్తాయి. సమాజానికి తిరిగి ఇచ్చినప్పుడే దానికి సార్థకత.  

రోహన్‌ది కర్ణాటకలోని కూర్గ్‌. తన నాన్న కాఫీ తోటల్లో పని చేసేవారు. దిగువ మధ్యతరగతి కుటుంబం. రోహన్‌ స్టార్‌ ఆటగాడయ్యాక సంపాదనకు ఢోకా లేదు. ఇప్పుడు ప్రపంచ నెంబర్‌వన్‌ అయ్యాక పేరూ మార్మోగిపోతోంది. అయితే ఆటే నన్ను ఈ స్థాయికి చేర్చింది అని చెప్పడానికి రోహన్‌ ఎప్పుడూ వెనకాడడు. అంత ఇచ్చిన ఆటకు తిరిగి ఇవ్వడానికి బెంగళూరులో టెన్నిస్‌ అకాడెమీ ప్రారంభించాడు. పేదరికం కారణంగా తను పడ్డ ఇబ్బందులు మరే క్రీడాకారుడు పడొద్దని సకల సౌకర్యాలతో దాన్ని తీర్చిదిద్దాడు. అక్కడే క్రీడాకారుల చదువూ కొనసాగే ఏర్పాట్లు చేశాడు. ‘గో స్పోర్ట్స్‌ ఫౌండేషన్‌’ అనే స్వచ్ఛంద సంస్థకు తన సంపాదనలో కొంతభాగం అందిస్తున్నాడు. సొంతూరు కూర్గ్‌లో దివ్యాంగుల కోసం నడుస్తున్న విద్యాసంస్థకు విరాళాలు సేకరిస్తాడు. ‘కూర్గ్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ డెంటల్‌ సైన్సెన్‌’ అనే సంస్థ ద్వారా పేదలకు అతి తక్కువ వ్యయంతో వైద్యం అందేలా సాయం చేస్తున్నాడు.


పాఠం 5: మనం ఏస్థాయికి చేరినా మూలాలు మరవొద్దు. ఆ స్థాయికి చేరడంలో తోడ్పడిన మార్గాన్ని విడవొద్దు.

టెన్నిస్‌ అంటేనే మైదానంలో చిరుతలా పరుగెత్తాలి. ఈ ఆటకు ఫిట్‌నెస్‌ ప్రాణం. 43ఏళ్ల వయసులోనూ చురుగ్గా ఉండటం అంటే మాటలు కాదు. అయితే దీనికి బోపన్న ముందునుంచీ ఎంతో కష్టపడ్డాడు. చిన్నప్పుడు వాళ్ల ఇల్లు, జిమ్‌, స్కూలుకి నాలుగు కిలోమీటర్ల చొప్పున దూరం ఉండేది. రోజూ ఇంటి నుంచి జిమ్‌కి.. తిరిగి ఇంటికి, అక్కడ్నుంచి బడికి.. తిరిగి ఇంటికొచ్చాక ఆట సాధనకి.. ఇలా రోజుకి పదహారు కిలోమీటర్లు సైకిల్‌పైనే వెళ్లొచ్చేవాడు. మొదట్లో అయితే జిమ్‌కి వెళ్లడానికీ డబ్బులు ఉండేవి కావు. ఒక పెద్ద చెక్క మొద్దు ఇచ్చి.. గొడ్డలితో దాన్ని రోజూ కొట్టమనేవారు నాన్న. అలా చేస్తే ఫిట్‌గా ఉంటారని ఆయన అభిప్రాయం. అలాగే చేసేవాడు బోపన్న. ఇది రాకెట్‌ పట్టిన కొత్తలో మాట. తర్వాత ప్రొఫెషనల్‌ క్రీడాకారుడిగా ఎదిగి మంచి విజయాలు సాధిస్తున్నా జిమ్‌కెళ్లడం ఆపేవాడు కాదు. కరోనా సమ యంలో ఇంటికే పరిమితం అయినప్పుడు యోగా బాట పట్టాడు. ఇప్పటికీ డైట్‌ని పక్కాగా ఫాలో అవుతుంటాడు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని