మెరుగులద్దుతాం కొలువిప్పిస్తాం!

పదివేల మంది విద్యార్థుల భరోసా... 1,800 కంపెనీలకు నమ్మకం... వేలకొద్దీ ఉద్యోగాల కల్పన...  నెక్స్ట్‌వేవ్‌ అంకుర సంస్థ ఘనతలివి. నైపుణ్యం కలిగిన అభ్యర్థుల కోసం ఎదురుచూస్తున్న కంపెనీలకు.. ఉద్యోగం కోసం పరితపిస్తున్న ఔత్సాహికులకు మధ్య వారధిలా పని చేస్తోందీ సంస్థ.

Updated : 16 Mar 2024 00:07 IST

పదివేల మంది విద్యార్థుల భరోసా... 1,800 కంపెనీలకు నమ్మకం... వేలకొద్దీ ఉద్యోగాల కల్పన...  నెక్స్ట్‌వేవ్‌ అంకుర సంస్థ ఘనతలివి. నైపుణ్యం కలిగిన అభ్యర్థుల కోసం ఎదురుచూస్తున్న కంపెనీలకు.. ఉద్యోగం కోసం పరితపిస్తున్న ఔత్సాహికులకు మధ్య వారధిలా పని చేస్తోందీ సంస్థ. అందుకు గుర్తింపుగా చాలా పురస్కారాలే వరించాయి. ఈ స్టార్టప్‌ వ్యవస్థాపకులతో మాట కలిపింది ‘ఈతరం’.

సర్వే ప్రకారం డిగ్రీ పట్టా అందుకునే గ్రాడ్యుయేట్లలో సగానికిపైగా నిరుద్యోగులుగా మారుతున్నారు. రాహుల్‌ అట్టులూరి, శశాంక్‌రెడ్డి గుజ్జుల, అనుపమ్‌ పెదర్లని ఇది తీవ్ర ఆలోచనలో పడేసింది. వాళ్లు ప్రతిష్ఠాత్మక విద్యాసంస్థలైన ట్రిపుల్‌ ఐటీ హైదరాబాద్‌, ఐఐటీ బొంబాయి, ఐఐటీ ఖరగ్‌పూర్‌లలో చదువు పూర్తి చేసినవాళ్లు. సమాజంపై సానుకూల ప్రభావం చూపించే అంకుర సంస్థను ప్రారంభించాలని కలలు కంటున్న నవ యువకులు. ఈ అంతరం వెనక ఉన్న కారణమేంటో కనుక్కోవడానికి ఏడాదిన్నరపాటు పరిశోధన చేశారు. వాళ్ల పరిశీలనలో సంస్థ అవసరాలకు, ఉద్యోగార్థుల అవకాశాలకు మధ్య పెద్ద అగాధం ఉందని తేలింది. దీన్ని ఇంకాస్త లోతుగా అధ్యయనం చేస్తే.. ఉద్యోగం కోరుకుంటున్నవాళ్లలో భాష సమస్యగా మారడం గమనించారు. నేర్చుకోవాలనే తపన, సామర్థ్యం ఉన్నప్పటికీ భాష కారణంగా చాలామంది కోడింగ్‌పై పట్టు సాధించలేకపోవడం గమనించారు. దీంతో ఎలాంటి స్టార్టప్‌ ప్రారంభించాలో వాళ్లకు అర్థమైంది. కోడింగ్‌ లాంగ్వేజ్‌ని సైతం తెలుగువాళ్లకి తెలుగులో.. తమిళులకి తమిళంలో.. ఇలా వేర్వేరు భాషల వాళ్లకి వాళ్ల మాతృభాషలో నేర్పించేలా కోర్సులను రూపొందించారు. దీంతోపాటు ఐటీ, కార్పొరేట్‌ కంపెనీలలో పని చేయాలంటే కమ్యూనికేషన్‌ స్కిల్స్‌ కూడా ముఖ్యమే. దానికి సైతం మరో ప్రత్యేకమైన కోర్సు నేర్పిస్తున్నారు.

తక్షణ ఉద్యోగం

కోర్సు నేర్చుకున్న విద్యార్థి వెంటనే కొలువులో కుదురుకోవాలి. ఇదే నెక్స్ట్‌వేవ్‌ మొదటి ప్రాధాన్యం. అందుకే మార్కెట్లో, భవిష్యత్తులో డిమాండ్‌ ఉండే.. కోర్సులకు రూపకల్పన చేశారు. ఇందులో భాగంగా డేటాసైన్స్‌, మెషిన్‌ లెర్నింగ్‌, పైథాన్‌ లాంగ్వేజ్‌.. ఇలా ఎన్నోరకాల అడ్వాన్స్‌డ్‌ టెక్నాలజీ కోర్సులను ఆన్‌లైన్‌లో నేర్పిస్తున్నారు. మళ్లీ ఇందులో రెండురకాల ప్రోగ్రామ్స్‌ ఉంటాయి. ఇంజినీరింగ్‌తోపాటు సాగే నాలుగేళ్ల కోర్సు ఒకటి. ఇంజినీరింగ్‌ పూర్తైన వాళ్ల కోసం ఐటీ కంపెనీలు కోరుకునే విధంగా నైపుణ్యాలు బోధించే కోర్సు మరోటి. ఇది ఎనిమిది నెలలపాటు కొనసాగుతుంది. ఈ కోర్సుని తెలుగు రాష్ట్రాలతోపాటు తమిళనాడు, కేరళ, కర్ణాటక, మహారాష్ట్ర, ఉత్తర్‌ప్రదేశ్‌, బిహార్‌.. ఇలా మొత్తం ఇరవై రాష్ట్రాలకు చెందినవారు అభ్యసిస్తున్నారు. మూడు వేల విద్యాసంస్థల విద్యార్థులు ఇందులో ఉన్నారు. కోర్సు నేర్చుకున్న ప్రతి ఒక్కరూ ఉద్యోగంలో చేరేలా ప్లేస్‌మెంట్‌ సపోర్ట్‌ ఇస్తున్నారు. ఈ కోర్సులకు నేషనల్‌ స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ గుర్తింపు సైతం ఉంది.

ఎంతో శ్రమకోర్చి

2020 సెప్టెంబరులో 300 మంది విద్యార్థులతో మొదలైంది నెక్స్ట్‌వేవ్‌. ఇక్కడ శిక్షణ పొందిన వారిని 1,800 కంపెనీలు హైర్‌ చేసుకున్నాయి. కేవలం మూడేళ్లలోనే ఈ స్థాయికి చేరడం అంటే మాటలు కాదు. దీని వెనక ఎంతో కృషి ఉంది. దీనికి ముందు రాహుల్‌ అమెజాన్‌లో సాఫ్ట్‌వేర్‌ డెవలపర్‌గా పని చేస్తూ లక్షల జీతం అందుకునేవాడు. ఐఐటీల్లో చదివిన శశాంక్‌, అనుపమ్‌లు భారీ వేతనాల కొలువులు వదిలేశారు. సమాజంపై మంచి ప్రభావం చూపించే స్టార్టప్‌ పెట్టాలనేది ముగ్గురి ఆలోచన. ఒక టెక్‌ ఇంక్యుబేటర్‌ ప్రోగ్రామ్‌లో పరిచయమయ్యారు. అయితే ఈ ఆలోచన ఆచరణలోకి వచ్చేనాటికి చాలా సవాళ్లే ఎదుర్కొన్నారు. స్టార్టప్‌ ప్రారంభించిన కొత్తలో రోజుకి పద్దెనిమిది గంటలు పని చేసేవారు. పెట్టుబడి కోసం చాలామంది ఇన్వెస్టర్ల చుట్టూ తిరిగారు. తమ బిజినెస్‌ మోడల్‌ని వందలమందికి వివరించి చెప్పారు. ఎంతో కష్టపడి జట్టుని తయారు చేశారు. అయితే ఇదంతా ప్యాషన్‌తో చేశాం తప్ప.. ఏనాడూ కష్టంలా భావించలేదు అంటారీ ముగ్గురు మిత్రులు. మొత్తానికి 2021లో చెప్పుకోదగ్గ మొత్తం పెట్టుబడి రావడంతో సంస్థని విస్తరించారు. తర్వాత గ్రేటర్‌ పసిఫిక్‌ క్యాపిటల్‌ అనే సంస్థ రూ.275 కోట్లు పెట్టుబడి పెట్టింది. ఈ నిధులతో రెండేళ్లలో సుమారు పదివేల కంపెనీలతో భాగస్వామ్యం కుదుర్చుకోనున్నారు. వాళ్ల అవసరాలకు అనుగుణంగా ఉద్యోగులను తీర్చిదిద్దనున్నారు.  

అనుభవం అండగా..

ప్రతి సంస్థకి ఓ విజయసూత్రం ఉంటుంది. మా విజయ రహస్యం స్టార్టప్‌ మొదలైన మూడేళ్లలోనే 1,800 కంపెనీలతో భాగస్వామ్యం కుదుర్చుకోవడం.. వాళ్ల అవసరాలకు అనుగుణంగా ఉద్యోగులను తీర్చిదిద్దడమే అంటాడు సీఈవో రాహుల్‌. ఈ సంస్థలో శిక్షణ పొందిన వారిలో మంచి నైపుణ్యాలు ఉండటంతో కంపెనీలు మళ్లీమళ్లీ అవకాశం ఇస్తున్నాయి. మరి అలాంటి మెరికలను తయారు చేయడానికి మంచి బోధకులూ ఉండాలి కదా! అందుకోసం నెక్స్ట్‌వేవ్‌ సంస్థ అనుభవజ్ఞులైన ఉద్యోగులను బోధకులుగా నియమించుకుంటోంది. ఆన్‌లైన్‌లో బోధించేవాళ్లలో ప్రతిష్ఠాత్మక స్టాన్‌ఫర్డ్‌ యూనివర్సిటీ, ఐఐటీలలో పని చేసే టీచర్లతోపాటు.. గూగుల్‌, అమెజాన్‌, మైక్రోసాఫ్ట్‌లాంటి బహుళజాతి సంస్థల్లోని అనుభవజ్ఞులైన ఉద్యోగులూ ఉన్నారు. కొన్ని సాఫ్ట్‌వేర్‌ సంస్థలైతే వాళ్ల ఉద్యోగులనూ నెక్స్ట్‌వేవ్‌లో శిక్షణకు పంపిస్తున్నాయి. వీళ్లు కోడింగ్‌ స్కిల్స్‌, ప్రాక్టికల్‌ స్కిల్స్‌ నేర్చుకుంటున్నారు. ప్రస్తుతం నెక్స్ట్‌వేవ్‌లో బోధన, బోధనేతర సిబ్బంది అంతా కలిసి వెయ్యిమందికి పైగా ఉన్నారు.

గుర్తింపు

వేలమంది విద్యార్థుల్ని ఉద్యోగులుగా మలుస్తున్న ఈ అంకురసంస్థకు మంచి గుర్తింపే దక్కింది. బిజినెస్‌ టైమ్స్‌ ‘బెస్ట్‌ టెక్‌ స్కిల్లింగ్‌ ఎడ్యుటెక్‌ కంపెనీ’గా, జీ బిజినెస్‌ ‘మోస్ట్‌ ప్రిఫర్డ్‌ బ్రాండ్స్‌ 2021’గా, టీ హబ్‌ ‘స్టార్టప్‌ స్పాట్‌లైట్‌ అవార్డు-2023’ గెల్చుకుంది. ఫోర్బ్స్‌ ఇండియా 30 అండర్‌ 30 జాబితాలోనూ చోటు సంపాదించారీ వ్యవస్థాపకులు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని