ఇనుములో హృదయం మొలుచునే..!

అమ్మడికి పానీపూరీ అంటే ప్రాణం... కుర్రాడికీ సేమ్‌ టూ సేమ్‌! అబ్బాయి టామ్‌ క్రూజ్‌కి పెద్ద ఫ్యాన్‌... ఆమెకీ ఆ హీరో సాహసాలంటే పిచ్చి!  ఆన్‌లైన్‌ చోరుల భరతం పట్టేలా ఎథికల్‌ హ్యాకర్‌ కావాలన్నది అతడి కోరిక... అర్రే... ఆ చిన్నదీ అదే బాటలో ఉంది!

Updated : 27 Jan 2024 10:08 IST

అమ్మడికి పానీపూరీ అంటే ప్రాణం... కుర్రాడికీ సేమ్‌ టూ సేమ్‌! అబ్బాయి టామ్‌ క్రూజ్‌కి పెద్ద ఫ్యాన్‌... ఆమెకీ ఆ హీరో సాహసాలంటే పిచ్చి!  ఆన్‌లైన్‌ చోరుల భరతం పట్టేలా ఎథికల్‌ హ్యాకర్‌ కావాలన్నది అతడి కోరిక... అర్రే... ఆ చిన్నదీ అదే బాటలో ఉంది! వాళ్లిద్దరూ ఇప్పుడు ప్రేమికులు!  జస్ట్‌.. రెండ్రోజుల పరిచయంలోనే మనసులు ఇచ్చిపుచ్చుకున్నారు. అదెలా అంటే.. అంతా ఏఐ మహిమ! వాళ్ల మనసులోని మాటల్ని ఒకరికొకరికి తెలియజేసి వలపునకు రాయబారం నడిపింది కృత్రిమ మేధస్సు.  భవిష్యత్తులో ఇలాంటి ప్రేమలే అత్యధికం అన్నది లవ్‌ గురూల మాట.

 చూపులు కలుసుకోవడం.. ఊసులు చెప్పుకోవడం.. అభిప్రాయాలు కలబోసుకోవడం.. ఆ తర్వాతే ప్రేమలో పడిపోవడం సాధారణంగా జరిగేది ఇదే. దీనికి నెలలు.. ఒక్కోసారి ఏళ్లూ పట్టొచ్చు. అరుదుగా కొందరు తొలిచూపులోనే ప్రేమలో పడిపోతారనుకోండి. కానీ ఈ జనరేషన్‌ జడ్‌ యుగంలో అన్నింటిలాగే ప్రేమా.. ఇన్‌స్టంట్‌గా మారిపోతోందంటున్నారు మనస్తత్వ నిపుణులు. మిలీనియల్స్‌, జనరేషన్‌ జడ్‌ అభిరుచులకు తగ్గట్టే.. టెక్నాలజీ వాళ్లకు దారులు చూపిస్తోంది. బాగా పాత రోజుల్లో పావురాలతో వలపు సందేశాలు పంపుకునేవారట. తర్వాత ఉత్తరాలు.. సామాజిక మాధ్యమాలు.. సెల్‌ఫోన్లు.. రాయబారాలు నడిపాయి. ఇప్పుడు మరో అడుగు ముందుకేసి, డేటింగ్‌ యాప్‌లను వలపు కేంద్రాలుగా మలచుకున్నారు. ఒక అధ్యయనం ప్రకారం భారత్‌లోని మెట్రో నగరాలు, పట్టణాల్లోని 38శాతం యువత టిండర్‌, బంబుల్‌లాంటి డేటింగ్‌ యాప్స్‌లోనే ప్రేమను వెతుక్కుంటున్నారు.

రిలేషన్‌షిప్‌ 2.0

తమ ఆసక్తులు, అభిరుచులు, ఇష్టాయిష్టాలు, ఉద్యోగం, సంపాదన.. తదితర వివరాలు నమోదు చేస్తే చాలు. సరైన జోడీని వెతికిపెడతాయి డేటింగ్‌ యాప్స్‌. ఒకరకంగా చెప్పాలంటే.. ఏఐకి ఇవి మొదటి అడుగుగా పని చేస్తున్నాయి. ఆ యాప్‌లో పేరు, వివరాలు నమోదు చేసుకోగానే.. వాళ్ల అభిరుచులకు అనుగుణంగానే అలాంటి జంటల్ని వెతికి పెడుతుంటాయి. అయితే ఇది ఇంతటితోనే ఆగిపోవడం లేదు. టెక్నాలజిస్టుల అంచనా ప్రకారం... జంటల్ని వెతుక్కోవడానికే కాదు.. డేటింగ్‌, రొమాన్స్‌ చేయడానికీ కృత్రిమ మేధ సాయం తీసుకొనే రోజులు తొందర్లేనే ఉన్నాయట. ఆసక్తులు, అలవాట్లు, ఇష్టాలు, పొలిటికల్‌ ఇంటరెస్ట్‌లు ముందే చెప్పేసి.. వెనువెంటనే జోడీగా మారడం ఒకటైతే.. చాట్‌జీపీటీలాంటి చాట్‌బోట్‌ల ద్వారా జవరాలి మనసు గెలుచుకునేలా ప్రేమలేఖలు రాయించుకుంటున్నారు ఇంకొందరు. దీనికి మరింత అడ్వాన్స్‌డ్‌ ప్రేమాయణం వర్చువల్‌ రియాలిటీలో కొనసాగుతోంది. ఈ ఆగ్మెంటెడ్‌ రియాలిటీ, వర్చువల్‌ రియాలిటీ గ్యాడ్జెట్ల ద్వారా మనసుకు నచ్చిన అమ్మాయి లేదా అబ్బాయి కళ్లముందే ఉన్న భావన కలుగుతుంది. వీఆర్‌ హెడ్‌సెట్‌ వాడుతున్నప్పుడు ఎక్కడో మైళ్ల దూరంలో ఉన్న ఒకమ్మాయి, అబ్బాయి కలిసి ఏ ఈఫిల్‌ టవర్‌ దగ్గరో ప్రేమగా కబుర్లు చెప్పుకుంటున్నట్టు.. ఏ హవాయ్‌ దీవుల్లోనో సరసాలాడుకుంటున్నట్టుగా అనుభూతిని కలిగిస్తాయి. దీనికి మరో మెట్టు పైనుండేది మెటావర్స్‌. దీని వాడకంతో జంట భౌతికంగా పక్కపక్కనే ఉన్న అనుభూతి కలుగుతుంది.


ఊహలు గుసగుసలాడె..  

వీటన్నింటికీ బామ్మలా ప్రేమికుల మధ్య కీలకం కాబోతున్న సాంకేతిక విప్లవం బ్రెయిన్‌ కంప్యూటర్‌ ఇంటర్ఫేస్‌ (బీసీఐ). దీని ద్వారా ఏకంగా వర్చువల్‌ ప్రేమికులనే సృష్టిస్తుంది ఏఐ. ఇది డిజిటల్‌ ప్రపంచం, మనుషుల మధ్య ఒక వారధిలా పని చేస్తుంది. ఈ పరికరం ద్వారా నేరుగా ప్రేమికుల మెదళ్లను నియంత్రించవచ్చు. ఒకవైపు డిజిటల్‌ యంత్రం.. మరోవైపు ప్రేమ వెతుక్కునే అమ్మాయి, అబ్బాయి. అప్పటికప్పుడే మాటలు కలిపేసుకొని సోల్‌మేట్‌ని తేల్చేసుకోవచ్చు. భావోద్వేగాలూ పంచుకోవచ్చు. ‘మనుషులు, యంత్రాల మధ్య రాయబారం నడిపే ఈ జనరేటివ్‌ మోడల్స్‌ రూపు దాల్చితే మనుషులు, యంత్రాలు మధ్య ప్రేమ పుడుతుంది. అవతలివారి భావోద్వేగాలకు అనుగుణంగా ఈ జనరేటివ్‌ ఏఐ మోడల్స్‌ పని చేస్తాయి. ముఖ్యంగా డేటింగ్‌ యాప్స్‌ ఈ టెక్నాలజీని విపరీతంగా వాడతాయి. భవిష్యత్తులో ఇదొక సాధారణ విషయంగా మారే అవకాశం ఉంది’ అంటున్నారు మైక్రోసాఫ్ట్‌ స్టార్టప్‌ సీటీఓ అదైర్‌ ర్యాన్‌. ఒకవైపు ఊహకందని ఆ టెక్నాలజీ రాక అనివార్యం అవుతుంటే.. మరోవైపు ఏఐ యువత మధ్య ప్రేమలు పండేందుకు సలహాలిస్తూనే ఉంది. ‘ఈ-హార్మోనీ’, ‘మీనూ’లాంటి డేటింగ్‌ ప్లాట్‌ఫాంలు  కుర్రకారుని జంటలుగా మార్చేందుకు ఎప్పటికప్పుడు కొత్తకొత్త అల్గారిథమ్స్‌ రూపొందిస్తున్నాయి. ఇంకొన్ని డేటింగ్‌ సైట్లు అయితే ఏకంగా ఔత్సాహికుల డీఎన్‌ఏ సమాచారాన్ని సైతం అందుబాటులో ఉంచి.. ‘మ్యాచ్‌ మేకింగ్‌’ చేస్తున్నాయి. ప్రేమ అంటేనే అదొక భావోద్వేగాల ఖజానా. రెండు మనసుల మధ్య సాగాల్సిన ఈ యవ్వారంలో తలదూర్చి కృత్రిమ మేధస్సు యంత్రాలు మనసులు, మనుషుల్ని తమ గుప్పిట్లోకి తెచ్చుకుంటున్నాయి. ఈ యాంత్రిక ప్రేమ భవిష్యత్తులో ఏ తీరానికి చేరుతుందో చూడాలి.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని